చైనా కమ్యూనిస్టు పార్టీ నిబంధనావళిలో షీ సిద్ధాంతాలకు పెద్దపీట

ఫొటో సోర్స్, Reuters
చైనాలో అధికార పార్టీ అయిన చైనా కమ్యూనిస్టు పార్టీ షీ జిన్‌పింగ్ ఆలోచనా విధానాన్ని (థాట్‌ను) పార్టీ నిబంధనావళిలో భాగం చేయాలనే నిర్ణయం తీసుకుంది.
ఆ రకంగా చైనా కమ్యూనిస్టు పార్టీ తొలి తరం నాయకుడైన మావో జెడాంగ్‌తో సమానంగా పార్టీ నిబంధనావళిలో షీకి హోదా కల్పించారని చెప్పొచ్చు. 2012లో అధ్యక్షుడిగా అధికారం చేపట్టినప్పటి నుంచి చైనా అధికారపీఠంపై షీ జిన్‌పింగ్ పట్టు రోజురోజుకూ బలపడుతూ ఉంది.
పార్టీ నిబంధనావళిలో 'షీ జిన్‌పింగ్ ఆలోచనా విధానాన్ని' లిఖితపూర్వకంగా చేర్చాలనే నిర్ణయాన్ని పార్టీ ఏకగ్రీవంగా తీసుకుంది.
బీజింగ్‌లో జరిగిన చైనా కమ్యూనిస్టు పార్టీ అత్యున్నత ఆంతరంగిక సమావేశంలో రెండు వేలకు పైగా ప్రతినిధులు పాల్గొన్నారు. చైనాకు సంబంధించి ఇది అత్యంక కీలకమైన రాజకీయ సమావేశం. కాంగ్రెస్ అని పిలిచే ఈ సమావేశంలోనే రానున్న ఐదేళ్లలో దేశ అధికార పగ్గాలు ఎవరి చేతిలో ఉంటాయనేది నిర్ణయమవుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
'షీ జిన్‌పింగ్ ఆలోచనా విధానం'
చైనా కమ్యూనిస్టు పార్టీ కాంగ్రెస్ అక్టోబర్ 18న ప్రారంభమయ్యాయి. ఈ అత్యున్నత స్థాయి సమావేశంలో జీ జిన్‌పింగ్ దాదాపు మూడు గంటల పాటు ప్రసంగించారు. ఈ సందర్భంగా "కొత్త శకంలో అత్యాధునిక సోషలిస్టు చైనా నిర్మాణం" అనే అంశంపై ఆయన పార్టీ నాయకత్వానికి మార్గనిర్దేశనం చేశారు.
జిన్‌పింగ్ ప్రసంగం తర్వాత కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం, మీడియా ఆయనను ప్రశంసల్లో ముంచెత్తింది. ఆయన ప్రసంగాన్ని షీ జిన్‌పింగ్ ఆలోచనా విధానం అని అందరూ అభివర్ణించారు. అప్పుడే పార్టీపై జిన్‌పింగ్ ప్రభావం బాగా ఉందనే విషయం స్పష్టమైంది.
షీ జిన్‌పింగ్ ఆలోచనా విధానాన్ని కమ్యూనిస్టు పార్టీ నిబంధనావళిలో భాగం చేయడం అంటే, ప్రత్యర్థులు ఆయనను అంత సులభంగా ఎదుర్కోలేరని బీబీసీ చైనా ప్రతినిధి కేరి గ్రేసీ అంటున్నారు. పార్టీ నిబంధనలకు లోబడే వారు షీ జిన్‌పింగ్‌ను సవాలు చేయగలరని ఆయనన్నారు.
గతంలో కూడా కమ్యూనిస్టు పార్టీ నాయకులకు వారి సొంత సిద్ధాంతాలుండేవి. అయినా కేవలం మావో జెడాంగ్ సిద్ధాంతానికి మాత్రమే ఆ పార్టీ నిబంధనావళిలో చోటిచ్చారు. ఆయనతో పాటు డెంగ్ షియావోపింగ్ పేరుకు కూడా ఆయన పార్టీ నిబంధనావళిలో చోటు దక్కింది.

ఫొటో సోర్స్, Getty Images
ఈ నిర్ణయంతో స్కూల్‌లలో, కాలేజీల్లో చదివే విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు, 9 కోట్ల కమ్యూనిస్టు పార్టీ సభ్యులతో కలిసి షీ జిన్‌పింగ్ సిద్ధాంతాలను చదవబోతున్నారు. ఇప్పుడు షీ జిన్‌పింగ్ సిద్ధాంతాలతో చైనాలో కొత్త సోషలిస్టు శకం ప్రారంభమౌతుందని కమ్యూనిస్టు పార్టీ పేర్కొంది. కమ్యూనిస్టు పార్టీ దీనిని ఆధునిక చైనాలో మూడో అధ్యాయమని అభివర్ణించింది.
మొదటి అధ్యాయంలో అంతర్గత యుద్ధంతో సతమవుతున్న చైనా పౌరులను ఛైర్మన్ మావో ఒక్క తాటిపై నిలిచేలా చేశారు. రెండో అధ్యాయంగా చెప్పే డెంగ్ షియావోపింగ్ పాలనా కాలంలో చైనా పౌరులను మరింతగా ఐక్యం చేశారని కమ్యూనిస్టు పార్టీ పేర్కొంది. డెంగ్ కాలంలో చైనా అభివృద్ధి పథంలో నడుస్తూ విదేశాల్లో పేరు ప్రతిష్టలను పెంచుకోగలిగింది.
ఇప్పుడు మూడో అధ్యాయం మొదలయ్యింది. ఇప్పుడు షీ జిన్‌పింగ్ పేరును కమ్యూనిస్టు పార్టీ నిబంధనావళిలో చేర్చారు. ఇప్పడు జిన్‌పింగ్‌ను ఎదుర్కోవాలంటే కమ్యూనిస్టు పార్టీ నిబంధనలకు లోబడే, వాటికి ఏ మాత్రం భంగం కలిగించకుండా ఎదుర్కోవాల్సి ఉంటుంది.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








