ఇరాన్: ఇజ్రాయెల్, అమెరికా దాడులపై రష్యా ఏమంది, భారత్ స్పందనేంటి?

ఫొటో సోర్స్, Reuters
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు.. పొరుగు దేశాలపై ఇరాన్ ప్రతిదాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్తత నెలకొంది. ఈ పరిణామాలపై ప్రపంచ దేశాలు స్పందించాయి.
ఇరాన్, గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై భారత్ స్పందిచింది. ఈ మేరకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది.
ఇరాన్, గల్ఫ్ ప్రాంతంలో చోటుచేసుకున్న పరిణామాలపై తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది.
"అన్ని పక్షాలు శాంతియుతంగా ఉండి, ఉద్రిక్తతలు పెరగకుండా చూడాలని, పౌరుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నాం. చర్చలు, దౌత్యమార్గాల ద్వారా సమస్యల పరిష్కానికి కృషి చేయాలి. అన్ని దేశాల సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతను గౌరవించాలి" అని అందులో పేర్కొంది.
ఆ ప్రాంతంలోని భారత రాయబార కార్యాలయాలు అక్కడి భారతీయ పౌరులతో సంప్రదింపులు కొనసాగిస్తున్నాయని, అక్కడి వారు అప్రమత్తంగా ఉండాలని, స్థానిక భద్రతా మార్గదర్శకాలను పాటించాలని సూచించింది.


ఫొటో సోర్స్, Getty Images
'ఇరాన్ ప్రజలకు మద్దతుగా నిలుస్తాం'
ఇరాన్ ప్రజలకు మద్దతుగా నిలుస్తున్నట్టు ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ కార్యాలయం తెలిపింది. ప్రజల, రాజకీయ హక్కులను గౌరవించాలని డిమాండ్ చేస్తున్నామని పేర్కొంది. ఉద్రిక్తతలు తగ్గించేందుకు తీసుకునే ప్రయత్నాలకు మద్దతుగా నిలిచేందుకు మిత్రపక్షాలతో మాట్లాడతామని తెలిపింది.
''అణచివేతకు వ్యతిరేకంగా పోరాడుతున్న ధైర్యవంతులైన ఇరాన్ ప్రజలకు అండగా ఉన్నామని'' ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథోనీ అల్బనీస్ చెప్పారు. అణ్వాయుధాలు పొందకుండా ఇరాన్‌ను నిరోధించే అమెరికా ప్రయత్నాలకు మద్దతిస్తున్నామని తెలిపారు.
ఇరాన్‌లో ‘హత్యాకాండ సాగిస్తున్న ప్రభుత్వం’పై యూరోపియన్ యూనియన్ ఇప్పటికే విస్తృత ఆంక్షలు అమలు చేసిందని యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ అన్నారు.
''ప్రజల ప్రాణరక్షణకు అన్ని పక్షాలు సహనంతో వ్యవహరించాలని, అంతర్జాతీయ చట్టాలను గౌరవించాలని'' ఆమె కోరారు.
అయితే, ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడులను చట్టాల ఉల్లంఘనగా రష్యా పేర్కొంది.
అమెరికా, ఇజ్రాయెల్ అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తున్నాయని రష్యా ఆరోపించింది. దాడులను 'లెక్కలేనితనం''గా రష్యా విదేశాంగ శాఖ అభివర్ణించింది. రాజకీయ, దౌత్యపరమైన పరిష్కారానికి ప్రయత్నించాలని డిమాండ్ చేసింది.

ఫొటో సోర్స్, PA Media
ఇరాన్ దాడులను ఖండించిన యూకే, జర్మనీ, ఫ్రాన్స్
అమెరికా, ఇజ్రాయెల్ దాడుల తర్వాత పొరుగుదేశాలపై ఇరాన్ చేసిన ప్రతిదాడులను ఖండిస్తున్నట్టు యూకే, ఫ్రాన్స్, జర్మనీ ఖండించాయి.
ఈ మూడు దేశాలూ కలిసి సంయుక్త ప్రకటన విడుదల చేశాయి.
‘‘అణు కార్యక్రమాన్ని నిలిపివేయాలని, బాలిస్టిక్ మిస్సైల్ కార్యక్రమాన్ని ఆపివేయాలని, ఆ ప్రాంతంలో, మా దేశాల్లో అస్థిరత కలిగించే చర్యలు చేపట్టవద్దని, సొంత ప్రజలపై భయంకరమైన హింసను, అణచివేతను నిలిపివేయాలని" ఇరాన్ ప్రభుత్వాన్ని ఫ్రాన్స్, జర్మనీ, యూకే నిరంతరం కోరాయి.
"ఈ దాడుల్లో మేం పాల్గొనలేదు. అమెరికా, ఇజ్రాయెల్, ఆ ప్రాంతంలోని మా భాగస్వాములు సహా మా అంతర్జాతీయ భాగస్వాములతో మేం కాంటాక్ట్‌లో ఉన్నాం. ప్రాంతీయ స్థిరత్వానికి, ప్రజల ప్రాణాల రక్షణకు కట్టుబడి ఉన్నాం."
"పొరుగు దేశాలపై ఇరాన్ చేసిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం. విచక్షణలేని సైనిక దాడులను ఇరాన్ నిలిపివేయాలి. చర్చల ద్వారా పరిష్కారం కోసం ప్రయత్నించాలని ఇరాన్ నాయకత్వాన్నికోరుతున్నాం. ఇరాన్ ప్రజలే తమ భవిష్యత్తును నిర్ణయించుకునే అవకాశాన్ని పొందాలి’’ అని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్, జర్మనీ చాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్‌తో కలిసి విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో యూకే ప్రధాని కీర్ స్టార్మర్ వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Getty Images
అగ్రనేతలు, భద్రతాధికారులే లక్ష్యంగా దాడులు : ఇజ్రాయెల్
ఇరాన్ సీనియర్ నాయకులు, భద్రతాధికారులు సమావేశమైన ప్రదేశాలే లక్ష్యంగా దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) తెలిపింది.
ఇరాన్ ప్రభుత్వ వర్గాలు ఒకచోటకు చేరినప్పుడు, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం గురించి ఎప్పటి నుంచో తమ సైన్యం నిఘా పెట్టిందని, నెలల నుంచి ఈ ఆపరేషన్‌ను ప్లాన్ చేస్లున్నట్లు ఐడీఎఫ్ ఒక ప్రకటనలో తెలిపింది.
రాత్రివేళ కాకుండా పగటిపూట దాడి చేయడం ప్రయోజనం కలిగించిందని కూడా ఐడీఎఫ్ పేర్కొంది. ప్రస్తుతం, సైన్యం ఆ దాడిని అంచనా వేస్తోందని తెలిపింది.
తెహ్రాన్ సహా ఇరాన్‌లోని అనేక నగరాల్లో అనేక పేలుళ్ల శబ్దాలు వినిపించాయి.
తెహ్రాన్‌లోని ఇరాన్ సుప్రీం లీడర్ కార్యాలయం, అధ్యక్ష కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకున్నట్టు సమాచారం.
కర్మాన్‌షా, కోమ్, లోరెస్తాన్, కరాజ్, తబ్రీజ్‌తో పాటు ఇరాన్ దక్షిణభాగంలోని కెనారక్‌లో ఉన్న ఇరాన్ నౌకాదళకేంద్రాలపైనా దాడులు జరిగాయి.
మిలిటరీ ప్రాంతాలు, స్థావరాల దగ్గర ఉండే ఇరాన్ ప్రజలు అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ రక్షణ బలగాలు హెచ్చరించాయి.

ఫొటో సోర్స్, Reuters
దాడులపై ఇరాన్ ఏమందంటే...
ఇరాన్ స్వీయ రక్షణకు తనకున్న అన్ని సైనిక మార్గాలను ఉపయోగిస్తుందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి అన్నారు.
సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, కువైట్, బహ్రెయిన్, ఇరాక్ వంటి దేశాలలోని తన సహచరులకు అరాఘ్చి ఫోన్ చేసినట్టు ఒక ప్రకటన విడుదలైంది.
ఇరాన్ తన సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి "ఆత్మరక్షణకు చట్టబద్ధమైన హక్కు కింద తన రక్షణ సైనిక సామర్థ్యాలన్నింటినీ" ఉపయోగిస్తుందని అరాఘ్చి స్పష్టం చేసినట్లు ఆ ప్రకటనలో ఉంది.
ఆయా దేశాలు తమ స్థావరాలను, భూభాగాలను ఇరాన్‌పై దాడుల కోసం అమెరికా, ఇజ్రాయెల్ దుర్వినియోగం చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత వాటిదేనని కూడా అరాఘ్చి చెప్పినట్టు ఆ ప్రకటనలో ఉంది.
డోనల్డ్ ట్రంప్ 'అమెరికా ఫస్ట్‌ను, ఇజ్రాయెల్ ఫస్ట్'గా మార్చారని, దీనర్థం అమెరికా ఎప్పుడూ చివరిలో ఉండడమేనని'' ఎక్స్‌లో చేసిన పోస్టులో ఆయన వ్యాఖ్యానించారు.
ఇరాన్ శక్తివంతమైన సాయుధ దళాలు "ఇప్పటికీ సిద్దంగా ఉన్నాయని, దాడి చేసిన వారికి తగిన గుణపాఠం చెబుతాయి'' అని అన్నారు.
అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేస్తాయని ఇరాన్ ప్రజలు ముందే ఊహించారని ఇరాన్ విదేశాంగ విధానంపై పనిచేసే థింక్‌ట్యాంక్ డిప్లో హౌస్ డైరెక్టర్ హమీద్‌రెజా ఘోలమ్‌జదేహ్ అన్నారు.
దాడులను అమెరికా ధ్రువీకరించకముందే తాను ఫైటర్ జెట్లు, రెండు పేలుళ్ల శబ్దాలు విన్నానని ఆయన చెప్పారు.
వారాంతంలో పెట్రోల్ బంకుల దగ్గర పొడవాటి క్యూ లైన్లు కనిపించాయని, ప్రజలు ఆహార పదార్థాలు కొనుక్కుని నిల్వ చేసుకున్నారని అన్నారు.
ఇరాన్‌తో ఒప్పందం కోరుకుంటున్నానని ట్రంప్ చెప్పినట్లు వార్తలొచ్చినప్పుడే ప్రమాదకరంగా అనిపించిందని, ఇరాన్‌పై దాడికి అవకాశాలున్నట్లు అనిపించిందని హమీద్‌రెజా తెలిపారు.
అమెరికా విషయంలో ఇరాన్ ప్రజల సిక్త్ సెన్స్ సరైనదని తేలిందని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
‘స్కూల్‌పై దాడిలో 53 మంది మృతి’
ఓ బాలికల పాఠశాలను లక్ష్యంగా చేసుకుని జరిపిన మూడు క్షిపణి దాడుల్లో 53 మంది చనిపోయినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా ఇస్లామిక్ రిపబ్లిక్ న్యూస్ ఏజెన్సీ(ఐఆర్ఎన్ఏ)తెలిపింది. ఇరాన్ విద్యాశాఖ ప్రతినిధి ఈ విషయం చెప్పినట్టు ఐఆర్ఎన్‌ఏ పేర్కొంది. దాడుల్లో మరో 63 మంది గాయపడినట్లు తెలిపింది.
అయితే, ఈ దాడిని బీబీసీ స్వతంత్రంగా ధ్రువీకరించలేకపోయింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














