అయతొల్లా అలీ ఖమేనీ: ఈ ఇరాన్ సుప్రీం లీడర్ ముందున్న మార్గాలేంటి?

- రచయిత, కాస్రా నాజి
- హోదా, స్పెషల్ కరస్పాండెంట్, బీబీసీ పర్షియన్
ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారు. తాను ప్రమాదంలో ఉన్నానని ఆయనకి తెలుసు. ఇకపై ప్రశాంతంగా బయటతిరిగే పరిస్థితి ఆయనకు లేదు.
ఇరాన్‌లోని నిరసనకారులకు సాయం చేయడానికి అమెరికా నెక్ట్స్ ఏం చేయవచ్చో చర్చిస్తున్నప్పుడు, ఖాసిం సులేమానీ, అబూ బకర్ అల్-బాగ్దాదీ గురించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రస్తావించారు.
ఖాసిం సులేమానీ మిడిల్ ఈస్ట్‌లో ఇరాన్‌కు అత్యంత కీలక సైనిక వ్యూహకర్త. అమెరికా అధ్యక్షుడి ఆదేశాలపై జరిగిన డ్రోన్ దాడిలో 2020 జనవరి 3న బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయం దగ్గర ఆయన చనిపోయారు.
అబూ బకర్ అల్-బాగ్దాదీ ఐఎస్ నాయకుడు. అమెరికా అధ్యక్షుడి అనుమతితో ఉత్తర సిరియాలో ఆయన రహస్య స్థావరంపై అమెరికా దళాలు దాడి చేసినప్పుడు, 2019 అక్టోబర్ 27న ఆత్మాహుతి బాంబును పేల్చుకుని తన ఇద్దరు పిల్లలతో సహా చనిపోయారు.
మరో నేత హిజ్బొల్లా నాయకుడు హసన్ నస్రల్లా. ఇక్కడ అయతొల్లా ఖమేనీ పరిస్థితి కూడా ఆయన పరిస్థితిలాగే ఉందని గుర్తుపెట్టుకోవాలి.
2024 సెప్టెంబర్ 27న బేరూత్ లోని ఒక ఎత్తైన నివాస భవనం కింద, సుమారు 60 అడుగుల లోతులో తన ముఖ్య నేతలతో సమావేశం జరుపుతుండగా, ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసి ఆయన్ను చంపగలిగింది.


ఫొటో సోర్స్, Anadolu Agency/Getty Images
ఇటీవల కారకస్‌లో వెనెజ్వెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా దళాలు కమాండో తరహా దాడిచేసి పట్టుకున్న విషయం అయతొల్లా మర్చిపోయారనుకోలేం.
అయితే, ఇరాన్ నాయకుడిని నిజంగా అధికారం నుంచి తొలగించడం ఇరాన్ నిరసనల మీదా, లేదా ఇస్లామిక్ రిపబ్లిక్ భవిష్యత్తు మీదా ఎలాంటి ప్రభావం ఉంటుందో స్పష్టంగా తెలియడం లేదు.
అధ్యక్షుడు ట్రంప్ ఇప్పుడు తన ముందున్న ఆప్షన్లను బేరీజు వేసుకుంటున్నారు. మరి, ఇరాన్ సుప్రీమ్ లీడర్, ఆయన ప్రభుత్వం ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కొంటుందన్నది ప్రశ్న.

ఫొటో సోర్స్, AFP via Getty Images
ఇరానియన్లు ద్వేషించే వ్యక్తి
86 ఏళ్ల అయతొల్లా ఖమేనీ చాలా మంది ఇరానియన్లు ద్వేషించే వ్యక్తి.
చాలా ఏళ్లుగా, దేశవ్యాప్తంగా నిరసనకారులు ఆయన గద్దే దిగాలని కోరుకుంటున్నారు. ఆయన భయంకరమైన నాయకుడని స్పష్టమైంది. ఆయన పాలన ప్రపంచంలోనే అత్యంత అణచివేత పాలనల్లో ఒకటిగా పేరు సంపాదించింది.
ఇస్లాం పేరుతో తన 36 ఏళ్ల పాలనలో ఖమేనీ నిరంతరాయంగా అమెరికా వ్యతిరేక, పాశ్చాత్య వ్యతిరేక విధానాలను అనుసరించారు. అదే సమయంలో మనుగడ కోసం రష్యా, చైనాలపై ఆధారపడ్డారు. స్పష్టతలేని ఆయన అణువిధానం, రష్యా తర్వాత రికార్డ్ స్థాయిలో అంతర్జాతీయ ఆంక్షలు ఎదుర్కొంటున్న దేశంగా ఇరాన్‌ను నిలిపింది.
ఫలితంగా ఆ దేశం పేదరికం, కష్టాల్లో కూరుకుపోతోంది.
మధ్యప్రాచ్యంలో అధికారాన్ని ప్రదర్శించడానికి ఖమేనీ చేసిన ప్రయత్నాలు ఆ ప్రాంతాన్ని అగ్నికి ఆహుతి చేశాయి. ఇజ్రాయెల్ నాశనం కోసం ఆయన ఇచ్చిన పిలుపు ఇజ్రాయెల్‌తో యుద్ధాలకు దారితీసింది.
ఇటీవలి నిరసనలలో, నిరసనకారులను ఊచకోత కోయడానికి అయతొల్లా ఖమేనీ భద్రతా దళాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఇరాన్‌లో ఇంటర్నెట్ షట్‌డౌన్‌ల వల్ల హింస ఎంత విస్తారంగా ఉందో స్పష్టంగా అర్థం చేసుకోవడం కష్టమవుతోంది. పట్టణాలు, నగరాల్లోనే కాకుండా గ్రామాల్లో కూడా భద్రతా దళాల చేతిలో వేలమంది మరణించారు. దీనినిబట్టి నిరసనలు ఎంత విస్తారంగా జరిగాయో అర్ధమవుతోంది.
సర్జికల్ స్ట్రైక్స్ ద్వారా లేదా కమాండో దాడి ద్వారా ఖమేనీని తొలగిస్తే కచ్చితంగా పాలనలో మార్పును చూపించాల్సి ఉంటుంది. అలాగే, దేశం తీసుకునే విధానాలు, దిశలో మార్పులకు కూడా మార్గం సుగమమవుతుంది.
ఖమేనీ స్థానంలో ఎవరు లేదా ఏం వస్తుంది అన్నది అస్పష్టంగా ఉంది. గందరగోళం, అరాచక పరిస్థితులు ఏర్పడవచ్చు. కానీ ఈ గ్యాప్‌ను భర్తీ చేయడానికి రివల్యూషనరీ గార్డ్స్ సైనిక పాలనను స్థాపించడానికి ప్రయత్నించే అవకాశం ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
"అయతొల్లా ఖమేనీని అధికారం నుంచి తొలగించడాన్ని ప్రభుత్వంలోని కొందరు స్వాగతించవచ్చు" అని యేల్ విశ్వవిద్యాలయంలో లెక్చరర్, "వాట్ ఇరానియన్స్ వాంట్" పుస్తక రచయిత అరష్ అజీజీ అన్నారు.
"ఇరాన్ ప్రభుత్వంలోని ఒక ముఖ్యమైన వర్గం కొన్ని మార్పులు చేయడానికి సిద్ధంగా ఉంది. ఖమేనీని తొలగించాలని, ఇస్లామిక్ రిపబ్లిక్ కొన్ని ప్రధాన విధానాలు, ప్రధాన సంస్థలను రద్దు చేయాలని కోరుకుంటోంది. కాబట్టి వారు ఆ ప్రక్రియను వేగవంతం చేయడానికి అమెరికా దాడులను ఒక అవకాశంగా కూడా భావించవచ్చు" అని ఆయన అన్నారు.

మొహమ్మద్-బాఘెర్ ఘాలిబాఫ్
ఇరాన్ పార్లమెంట్ ప్రస్తుత స్పీకర్, 64 ఏళ్ల మొహమ్మద్-బాఘెర్ ఘాలిబాఫ్, నిరంకుశుడిగా పేరున్న రివల్యూషనరీ గార్డ్ మెంబర్. ఆయన యూనిఫామ్‌ను వదిలేసి రాజకీయ నాయకుల దుస్తులు ధరించారు. ప్రభుత్వానికి గట్టి మద్దతుదారు.
కానీ, అయతొల్లా ఖమేనీ ఆయన్ని ఎప్పుడూ పూర్తిగా నమ్మలేదు. పాలనా యంత్రాంగంలోని వ్యక్తులు ఆయన్ని గొర్రె తోలు కప్పుకున్న తోడేలుగా అనుమానించారు. సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నారని అనుకున్నారు.
అలాగే ఇరాన్‌లో కాస్త మితవాదులు అనుకున్నవారంతా పైస్థాయికి చేరే అవకాశం ఉంది.
ఇక్కడ మాజీ అధ్యక్షుడు హసన్ రౌహానీ గుర్తుకొస్తారు. ప్రస్తుత నాయకుడిని పదవి నుంచి తప్పించిన పక్షంలో, ఆయన తనను తాను సీరియస్ అభ్యర్ధిగా మితవాదులు, ఇస్లామిస్టులు, సంస్కరణవాదుల ముందు నిలబెట్టుకుంటున్నారు.
సెయింట్ ఆండ్రూస్ విశ్వవిద్యాలయంలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇరానియన్ స్టడీస్ వ్యవస్థాపక డైరెక్టర్ అలీ అన్సారి, సంస్కరణవాదులకు పెద్దగా ప్రాముఖ్యతలేదని నమ్ముతున్నారు.
"సంస్కరణవాదులు నిజంగా ఉనికిలో లేరు. వారు అక్కడ ఒకరకంగా అలంకార ప్రాయంగా మారారు. వారిని పూర్తిగా అణగదొక్కారు" అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, AFP via Getty Images
కానీ ఇరానియన్ పట్టణాలు, నగరాల వీధుల్లో చాలామంది ప్రజలు నినదిస్తున్న పేరు ఇరాన్ మాజీ షా కుమారుడు, క్రౌన్ ప్రిన్స్ రెజా పహ్లావి. ఆయన వయసు 65 ఏళ్లు. తన జీవితంలో ఎక్కువ భాగం వాషింగ్టన్‌లోనే ఉన్నారు.
ఇటీవలి కాలంలో రెజా పహ్లావి ఇరాన్‌లో ప్రజాదరణ పొందారు. అక్కడ చాలామంది షా శకాన్ని, ముఖ్యంగా 1970లను, ఒక నోస్టాల్జియాగా చూస్తారు. ఇరానీయులు అత్యంత సంపన్న దేశాల్లో ఒకరుగా ఉన్న యుగం అది. అయితే, వారు రాజకీయాల గురించి మాట్లాడకుండా ఉన్నప్పుడే ఇది జరిగింది.
కానీ రెజా పహ్లావి ఏ విధంగానూ ఏకీకృత నేతగా ఉండరు. నిజానికి, ఆయన విభజించాలని చూస్తారని చాలామంది వాదిస్తున్నారు. విదేశాల్లోని ఇరానీ ప్రతిపక్షాలను ఏకం చేయడంలో విఫలమైన ఆయన ఒంటరిగా ముందుకెళ్లాలనుకుంటున్నారు. దేశం తన వెనుకే ఉందని అంటున్నారు.
రెజా పహ్లాని దేశంలో ఇరానియన్లు కోరుకునే ఏకైక నాయకుడైనప్పటికీ, ఆయన అధికారం చేపట్టడం అసాధ్యమే. అధికారంలోకి రావడానికి ఆధారపడగల బేస్ ఇరాన్‌లో ఆయనకు లేదు.
ఇటీవలి నిరసనల సమయంలో ఇరాన్‌లో ఆయనకు ప్రజాదరణ ఎందుకు వచ్చింది అంటే, నిరసనకారులు ద్వేషించే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడటానికి ఏకైక పోటీదారుగా చాలామంది నిరసనకారులు ఆయనను చూసినందువల్లే అని చాలామంది వాదిస్తున్నారు.
ప్రభుత్వంతో ఎలాంటి సంబంధం లేని, పశ్చిమ దేశాలతో మెరుగైన సంబంధాలను కోరుకునే వ్యక్తిని ఈ నిరసనకారులు ఇష్టపడే అవకాశం ఉంది.
"ప్రస్తుతం, ఈ నిరసనకారులను ఆలోచనలు, ఆశయాలు చాలా భారీగా ఉన్నాయి" అని చాథమ్ హౌస్‌లోని మిడిల్ ఈస్ట్, నార్త్ ఆఫ్రికా ప్రోగ్రామ్ డైరెక్టర్ డాక్టర్ సనమ్ వకీల్ అన్నారు.
"ఇది సుమారు ఐదు దశాబ్దాలుగా వ్యక్తులు, వ్యవస్థల నడిపిస్తున్న పాలన నుంచి ఇరాన్‌ను పూర్తిగా దూరం చేసే వ్యవహారం" అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, WANA/Reuters
బంకర్‌లో ఎక్కువ సమయం గడుపుతూ, గత మూడు వారాలుగా ఏమి జరుగుతుందో, ఆయన ఈ స్థితికి ఎలా వచ్చారో అయతొల్లా ఖమేనీ తన మనస్సులో ఆలోచిస్తుండవచ్చు.
ఇప్పటివరకు ప్రభుత్వం తనకు విధేయంగా ఉండటం పట్ల ఆయన సంతృప్తి చెందవచ్చు. పాలనను కాపాడటానికి సృష్టించిన రివల్యూషనరీ గార్డ్‌లో గణనీయమైన అసమ్మతి లేదా అవిశ్వాసం సంబంధిత సంకేతాలు లేవు.
రివల్యూషనరీ గార్డ్, ఇతర భద్రతా దళాల స్థావరాలపై అమెరికా దాడులు జరిగితే అవి బలహీనపడి, విచ్ఛిన్నం కావచ్చు. ఇలాంటి పరిణామాల వల్ల నిరసనకారులు మరింత పెద్ద సంఖ్యలో వచ్చి ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు అవకాశం కల్పిస్తుందనే భావన అమెరికా అధ్యక్షుడి మాటల్లో ధ్వనించింది.
నిరసనకారులు ప్రభుత్వ భవనాలను ఆక్రమించుకుని, తమ నిరసనలను కొనసాగించేలా ఆయన రెచ్చగొట్టారు. "సాయం వస్తోంది" అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, AFP via Getty Images
భద్రతా దళాలు కాల్చి చంపుతున్న కారణంగా భయపడి, వీధుల నుంచి చాలావరకు వెనక్కి తగ్గిన నిరసనకారులు... అధ్యక్షుడు ట్రంప్ ప్రోద్బలంతో మళ్ళీ బయటకు వచ్చే అవకాశం ఉంది.
వారిలో చాలామంది ఖమేనీ పాలనను అంతం చేయాలంటే విదేశీ జోక్యం అవసరమని నమ్ముతున్నారు.
కానీ సహాయం అందకపోయినా, ఇటీవలి నిరసనల నుంచి కొన్ని పాఠాలు నేర్చుకున్న ఇరానియన్లు త్వరలోనే మళ్ళీ రోడ్లమీదకొస్తారని తెలుసు.

ఫొటో సోర్స్, NurPhoto via Getty Images
గత 16 ఏళ్లలో ఇరానియన్లు అనేకసార్లు అయతొల్లా ఖమేనీకి వ్యతిరేకంగా నిరసన తెలిపారు.
చివరిసారి 2022లో మహసా అమిని అనే యువతి హిజాబ్ సరిగ్గా ధరించనందుకు మోరల్ పోలీసులు అరెస్ట్ చేయగా, ఆమె పోలీసు కస్టడీలో మరణించడంతో నిరసనలు చెలరేగాయి.
మహిళా జీవిత స్వేచ్ఛ అనే నినాదంతో దేశవ్యాప్తంగా నిరసనల వెల్లువెత్తాయి. ఇవి కొన్ని వారాలపాటు కొనసాగాయి. చివరికి భద్రతా దళాలు వాటిని అణచివేశాయి.
అప్పట్లో, ఇస్లామిస్టుల నుంచి మహిళలపై వచ్చిన ఒత్తిడి వల్లే ప్రజలు వీధుల్లోకి వచ్చారు. చాలామంది ఇక భరించిందిచాలు అనుకుని నిరసన తెలిపారు.
కానీ ఈసారి నిరసనలు ప్రధానంగా ఆర్థిక వ్యవస్థ గురించి, ఆహారం గురించే. కరెన్సీ విలువ పడిపోవడంతో వ్యాపారులు పనిచేయలేకపోతున్నారు. చాలామంది జీవనోపాధి పొందలేకపోతున్నారు. అంతర్జాతీయ ఆంక్షలు, నిర్వహణ లోపాల వల్ల పేదరికం వేగంగా వ్యాపిస్తోంది.
మరోవైపు నీరు, విద్యుత్, ముఖ్యంగా ప్రపంచంలో రెండో అతిపెద్ద సహజ వాయువు నిల్వలు ఇరాన్‌లో ఉన్నాయి. కానీ, గ్యాస్ కొరతను ఎదుర్కొంటోంది. అలాగే నిర్లక్ష్యం వల్ల పర్యావరణం విపరీతంగా నష్టపోయింది. ఇది శాశ్వతంగా కొనసాగే అవకాశం ఉంది.
గత నెల చివర్లో నిరసనలు ప్రారంభించిన వ్యాపారులు, దుకాణదారులకు సమస్య ఉందని సుప్రీం లీడర్ అంగీకరించారు. కరెన్సీ విలువ నిరంతరం పడిపోవడం వల్ల వారు వ్యాపారం చేయడం అసాధ్యమని చెప్పారు.
అధికారులు సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నారని అయతొల్లా అన్నారు. అలాగే ఈ సమస్యను శత్రువులు సృష్టించారని కూడా ఆయన అన్నారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












