ఆంధ్రప్రదేశ్: చంద్రబాబు జైలుకెళ్లిన స్కిల్‌ స్కాం కేసును కొట్టేసిన ఏసీబీ కోర్టు, అసలేమిటీ కేసు? విపక్ష వైసీపీ ఏమంటోంది?

చంద్రబాబు, స్కిల్ డెవలప్‌మెంట్, ఆంధ్రప్రదేశ్, టీడీపీ, వైసీపీ

ఫొటో సోర్స్, ugc

    • రచయిత, గరికిపాటి ఉమాకాంత్
    • హోదా, బీబీసీ కోసం

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో, స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌లో నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై అప్పట్లో నమోదైన కేసును ఏసీబీ న్యాయస్థానం కొట్టేసింది.

చంద్రబాబు 53 రోజుల పాటు జైలు జీవితం గడిపిన ఈ కేసులో వచ్చిన ఆరోపణలు వాస్తవం కాదంటూ (మిస్టేక్‌ ఆఫ్‌ ఫ్యాక్ట్‌) సీఐడీ ఇచ్చిన తుది నివేదికను న్యాయస్థానం ఆమోదించింది.

ఈ మేరకు చంద్రబాబు సహా 37 మందిపై విచారణను మూసివేస్తున్నట్టు విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం 2026 జనవరి 12వ తేదీన తీర్పు వెలువరించింది.

మిస్టేక్‌ ఆఫ్‌ ఫ్యాక్ట్స్‌ పేరుతో తన మీదున్న కేసులను తానే ఎత్తేయించుకున్న చంద్రబాబు తీరు ప్రజాస్వామ్య మనుగడకు ప్రమాదమంటూ విపక్ష వైసీపీ విమర్శిస్తోంది.

అసలు ఏమిటీ కేసు? ఇప్పటివరకూ ఏం జరిగింది?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
చంద్రబాబు, స్కిల్ డెవలప్‌మెంట్, ఆంధ్రప్రదేశ్, టీడీపీ, వైసీపీ

ఫొటో సోర్స్, ugc

ఫొటో క్యాప్షన్, ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ లోగో

2014లో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సంస్థ ఏర్పాటు

ఆంధ్రప్రదేశ్‌లో 2014లో తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత.. అదే ఏడాది అక్టోబర్‌లో ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఎస్‌ఎస్‌డీసీ)ను ఏర్పాటు చేశారు.

రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు, విద్యార్థులకు వివిధ రంగాల్లో నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలను మెరుగుపరచడమే లక్ష్యంగా ఏపీఎస్‌ఎస్‌డీసీని స్థాపించారు.

ఇందుకోసం సీమెన్స్‌ కంపెనీతో ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంది. మొత్తం 3,356 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులో సీమెన్స్‌ వాటా 90 శాతం, మిగతా పది శాతం ప్రభుత్వ వాటాగా పేర్కొన్నారు.

చంద్రబాబు, స్కిల్ డెవలప్‌మెంట్, ఆంధ్రప్రదేశ్, టీడీపీ, వైసీపీ

ఫొటో సోర్స్, TDP

ఫొటో క్యాప్షన్, నోటీసులపై సంతకం పెడుతున్న చంద్రబాబు నాయుడు(ఫైల్ ఫోటో)

నిధుల దుర్వినియోగమంటూ వైసీపీ ప్రభుత్వంలో కేసు

2019లో వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ కార్పొరేషన్‌ నిధులు దుర్వినియోగమయ్యాయంటూ 2021లో కేసు (క్రైం నంబరు 29/2021) నమోదు చేసింది.

సీమెన్స్‌ రాష్ట్రంలో ఎలాంటి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించకున్నా, దాని నుంచి నిధులు రాకపోయినా టీడీపీ ప్రభుత్వం ఆ సంస్థకు 371 కోట్ల రూపాయలు విడుదల చేసిందని, ఆ డబ్బులను చంద్రబాబు డొల్ల కంపెనీలకు మళ్లించారని అప్పట్లో సీఐడీ అభియోగాలు నమోదు చేసింది.

ఈ కేసులో మొత్తం 37 మందిపై కేసు నమోదు కాగా, చంద్రబాబు 37వ నిందితుడిగా ఉన్నారు.

అప్పటి కార్పొరేషన్‌ ఎండీ గంటా సుబ్బారావు, సీమెన్స్‌ ఇండస్ట్రీ సాఫ్ట్‌వేర్‌ ఇండియా లిమిటెడ్‌ ఎండీ సౌమ్యాద్రి శేఖర్‌ బోస్‌ తదితరులపై కేసు నమోదు చేసింది సీఐడీ.

చంద్రబాబు, స్కిల్ డెవలప్‌మెంట్, ఆంధ్రప్రదేశ్, టీడీపీ, వైసీపీ

ఫొటో సోర్స్, ugc

ఫొటో క్యాప్షన్, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్టై రాజమండ్రి జైలులోకి వెళ్తున్న చంద్రబాబు (ఫైల్‌ ఫొటో)

2023 సెప్టెంబర్ 9న చంద్రబాబు అరెస్ట్

ఈ కేసు విచారణలో భాగంగా, అప్పట్లో టీడీపీ ప్రజాగళం యాత్రలో భాగంగా కర్నూలు జిల్లా నంద్యాలలో ఉన్న చంద్రబాబును 2023 సెప్టెంబర్ 9న సీఐడీ అధికారులు అరెస్టు చేశారు.

విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబును హాజరుపరచగా, న్యాయస్థానం రిమాండ్‌ విధించింది. దీంతో ఆయన్ను రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తరలించారు. అప్పట్లో బాబు అరెస్టు సంచలనం రేపింది.

2023 అక్టోబర్ 31 వరకు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్‌ ఖైదీగా ఉన్న చంద్రబాబు అనారోగ్య కారణాలతో బెయిల్‌కి దరఖాస్తు చేసుకోగా, హైకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది.

దీంతో 53 రోజుల తర్వాత ఆయన జైలు నుంచి విడుదలయ్యారు.

ఆ ఆరోపణలు అబద్ధమన్న ఇప్పటి సీఐడీ..

2024లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఈ కేసు విచారణ తెరపైకి వచ్చింది.

ఈ కేసులో దర్యాప్తు పూర్తయిందని, చంద్రబాబుపై ఆరోపణల్లో నిజం లేదంటూ సీఐడీ అధికారులు ఏసీబీ కోర్టుకు ఇటీవల నివేదిక సమర్పించారు.

దీనిని పరిగణనలోకి తీసుకున్న కోర్టు చంద్రబాబుతోపాటు మొత్తం 37 మంది నిందితులపై కేసులను కొట్టివేసింది.

ఈ విషయంపై సీఐడీ ఉన్నతాధికారులను సంప్రదించేందుకు బీబీసీ యత్నించింది. అయితే, సీఐడీ అధికారులు అందుబాటులోకి రాలేదు. రాగానే వారి వివరణ ఈ కథనంలో అప్‌డేట్‌ చేస్తాం.

చంద్రబాబు, స్కిల్ డెవలప్‌మెంట్, ఆంధ్రప్రదేశ్, టీడీపీ, వైసీపీ

ఫొటో సోర్స్, ugc

ఫొటో క్యాప్షన్, టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి

కేవలం కక్షపూరితంగానే తప్పుడు కేసు: టీడీపీ

2014–19 మధ్య టీడీపీ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా 40 స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేంద్రాలు ఏర్పాటైనట్లు.. రెండున్నర లక్షల మంది విద్యార్థులు ఈ కేంద్రాల్లో శిక్షణ పొందినట్టు రుజువులు ఉన్నప్పటికీ.. వైసీపీ ప్రభుత్వంలో కేవలం చంద్రబాబుపై కక్షపూరితంగానే తప్పుడు కేసులు పెట్టారని టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు.

అప్పట్లో కేవలం వైసీపీ ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో కేసులు పెట్టారని, ఇప్పుడు సీఐడీ అధికారులు స్వతంత్రంగా విచారణ చేపడితే అది వందశాతం తప్పుడు కేసు అని రుజువైందని ఆయన బీబీసీతో అన్నారు.

షెల్‌ కంపెనీలకు నిధులు మళ్లించారని వైసీపీ హయాంలో ఆరోపణలు చేసినా.. ఇప్పుడు ఏసీబీ విచారణలో ఒక్క షెల్‌ కంపెనీ కూడా ఉన్నట్టు సాక్ష్యాలు దొరకలేదని ఆయన చెప్పుకొచ్చారు. అందుకే మిస్టేక్‌ ఆఫ్‌ ఫ్యాక్ట్స్‌ పేరిట కోర్టుకు నివేదిక ఇచ్చారని సోమిరెడ్డి వ్యాఖ్యానించారు.

చంద్రబాబు, స్కిల్ డెవలప్‌మెంట్, ఆంధ్రప్రదేశ్, టీడీపీ, వైసీపీ

ఫొటో సోర్స్, FACEBOOK

ఫొటో క్యాప్షన్, వైఎస్ జగన్

కేసుల మాఫీ రాజ్యాంగ విరుద్ధం: వైసీపీ

స్కిల్ స్కాం కేసు కొట్టివేయడంపై వైసీపీ నేత, మాజీ మంత్రి శైలజానాథ్ స్పందించారు.

ఆయన బీబీసీతో మాట్లాడుతూ, "చంద్రబాబు కేసుల మాఫీపై వైసీపీ న్యాయపోరాటం చేస్తుంది. ఆ కేసుల మాఫీ రాజ్యాంగ విరుద్ధం" అని ఆయన అన్నారు.

ఈ విషయంలో రాష్ట్ర గవర్నర్‌తో పాటు, హైకోర్టు కూడా జోక్యం చేసుకోవాలని శైలజానాథ్ విజ్ఞప్తి చేశారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం చంద్రబాబు అధికారం అండతో సొంత కేసుల మూసివేత ప్రక్రియ కొనసాగిస్తున్నారని శైలజానాథ్‌ ఆక్షేపించారు. ఇప్పటికే ఫైబర్‌నెట్‌ కేసు, లిక్కర్‌ కేసు మూసివేయించుకున్న చంద్రబాబు, ఇప్పుడు స్కిల్‌ కేసు కూడా క్లోజ్‌ చేయించుకున్నారని విమర్శలు చేశారు.

డొల్ల కంపెనీలకు 371 కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులు మళ్లించి, అక్కణ్నుంచి వాటిని తన ఖాతాలో వేసుకున్న చంద్రబాబు.. అన్ని ఆధారాలతో సహా దొరికి, జ్యుడీషియల్‌ రిమాండ్‌లో జైలుకి కూడా వెళ్లారని చెప్పారు.

ఇప్పుడు ఏసీబీ అధికారులపై ఒత్తిడి తెచ్చి, సాక్ష్యాలు మార్పించి, నేరాలను మాఫీ చేయించుకుంటున్నారని ఆయన అన్నారు.

చంద్రబాబు, స్కిల్ డెవలప్‌మెంట్, ఆంధ్రప్రదేశ్, టీడీపీ, వైసీపీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చంద్రబాబుపై పెట్టిన కేసు కక్షపూరితమని టీడీపీ నేతలు అంటున్నారు.

'అప్పుడు దోషి అని చెప్పలేం.. ఇప్పుడు నిర్దోషి అనలేం'

'' వైసీపీ ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబుపై ఏసీబీ కేసు పెట్టినప్పుడు ఆయన్ను దోషిగా చెప్పలేం. అలాగే ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వంలో సీఐడీ బాబుపై పెట్టిన కేసులు ఉపసంహరించుకున్నప్పుడు నిర్దోషిగా చెప్పలేం'' అని సీనియర్‌ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు గాలి నాగరాజు వ్యాఖ్యానించారు.

ఈ కేసు విషయమై ఆయన బీబీసీతో మాట్లాడుతూ ''కొన్నేళ్లుగా ప్రతీకార రాజకీయాలకు నెలవుగా మారిన ఏపీలో ఇలాంటి కేసుల్లో ఎవరినీ దోషిగా చెప్పలేం. అలాగని నిర్దోషిగానూ చెప్పలేం. పరిస్థితులు అలా ఉంటున్నాయి" అని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో పనిచేసే సీఐడీ ప్రభుత్వాధినేతపై ఉన్న కేసులను వెనక్కి తీసుకోవడంలో పెద్ద విశేషం ఏముందని ప్రశ్నించారు.

‘‘అదే చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏసీబీ ఇలాంటి నిర్ణయం తీసుకుంటే అది విశేషం. ఆ నిర్ణయానికి క్రెడిబులిటీ ఉంటుంది. ఇప్పుడు ఏముంటుందీ.. అంతా అధికారపక్షం ప్రభావమే ఉంటుంది’’ అని నాగరాజు వ్యాఖ్యానించారు.

‘‘టీడీపీ అనే కాదు.. వైసీపీ అయినా ఇంతే. రాష్ట్రంలోని రాజకీయాల్లో విపరిణామాలే ఎక్కువవుతున్నాయి'' అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)