చంద్రబాబు అరెస్ట్: జైళ్లలో ‘వీఐపీ’ కేటగిరీ ఉంటుందా, ఖైదీలకు నంబర్ ఎలా కేటాయిస్తారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
స్కిల్ డెవెలప్‌మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును అరెస్టు చేసిన ఏపీ ప్రభుత్వం, ఆయన్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించింది.
జైలుకు ప్రత్యేకంగా ఇంటి నుంచి భోజనం, మందులు తెప్పించుకునేందుకు చంద్రబాబుకు ఏసీబీ కోర్టు అనుమతిచ్చింది. స్పెషల్ క్లాస్ కేటగిరీ కల్పించాలని జైళ్ల శాఖను ఆదేశించింది.
ఈ నేపథ్యంలో, ప్రముఖులు అరెస్టైనప్పుడు వారిని జైలులో ‘వీఐపీ’లుగా పరిగణిస్తారా?
అలా చేస్తే వారికి ఏం సౌకర్యాలు కల్పిస్తారనేది ఒక్కసారి చూద్దాం..

ఫొటో సోర్స్, Getty Images
ఖైదీల్లో వీఐపీ కేటగిరీ ఉంటుందా?
దేశంలో 1894లో ప్రిజన్స్ యాక్టు (జైళ్ల చట్టం) అమల్లోకి వచ్చింది. ఆ తర్వాత వివిధ సందర్భాల్లో ఆ చట్టానికి సవరణలు జరిగాయి.
జైళ్ల శాఖ నిబంధనల మాన్యువల్‌లో ఎక్కడా ‘వీఐపీ ఖైదీ’ అని ఉండదని చెబుతున్నారు జైళ్ల శాఖ మాజీ ఐజీ సైదయ్య.
సైదయ్య చంచలగూడ సహా వివిధ జైళ్లకు సూపరింటెండెంట్‌గా పనిచేశారు. తర్వాత పదోన్నతిపై తెలంగాణలో ఐజీ హోదాలో పనిచేసి రిటైర్ అయ్యారు.
‘‘జైళ్ల మాన్యువల్‌లో ఎక్కడా వీఐపీ అని ఉండదు. ఖైదీకి ఉన్న ఆర్థిక స్థాయి, స్థోమత, జీవనశైలి, హోదాను పరిశీలించి స్పెషల్ క్లాస్ ప్రిజనర్ (ప్రత్యేక శ్రేణి ఖైదీ)గా పరిగణిస్తారు. అందుకు సదరు వ్యక్తి ముందుగా న్యాయస్థానం నుంచి ప్రత్యేక అనుమతి తెచ్చుకోవాలి.
కోర్టు స్పెషల్ క్లాస్ కింద పరిగణిస్తే.. జైలులో ప్రత్యేక రూం, బెడ్, రీడింగ్ టేబుల్, కబోర్డు, ఏసీ, ఫ్రిడ్జ్, టీవీ వంటి సౌకర్యాలు కల్పిస్తారు.
ఇంటి నుంచి సరుకులు తెప్పించుకుని జైలులో వండించుకుని తినొచ్చు. వంట వండే వ్యక్తిని జైలు తరపున ఇస్తారు. లేదా న్యాయస్థానం అనుమతితో ఇంటి నుంచి భోజనం తెప్పించుకోవచ్చు’’ అని చెప్పారు.
జైళ్లలో ప్రముఖుల కోసం ప్రత్యేక బ్యారక్‌లు ఉంటాయి. వాటిల్లో ఉండే ప్రత్యేక గదులను వారికి కేటాయిస్తారు.
ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలనే నిబంధన జైళ్ల శాఖ పరిధిలోని అంశం కాదని చెప్పారు తెలంగాణ జైళ్ల శాఖ మాజీ ఐజీ నర్సింహ.
‘‘కోర్టు అనుమతి మేరకే ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తారు. గదులకు అనుసంధానంగా మరుగుదొడ్లు ఉంటాయి. బట్టలు ఉతకడానికి ప్రత్యేకంగా మనిషిని ఇస్తారు’’ అని ఆయన చెప్పారు.
అయితే.. స్పెషల్ క్లాస్ అనేది ఎవరికి పడితే వాళ్లకు ఇవ్వకపోవచ్చని జైళ్లశాఖాధికారులు చెబుతున్నారు.
అందుకు తగ్గట్లుగా కోర్టు అడిగిన అన్ని రకాల పత్రాలు సమర్పించాలన్నారు. ఐటీ రిటర్న్స్ సహా వివిధ డాక్యుమెంట్లు ఇవ్వాలి.
కొందరు తెలిసిన ప్రముఖుల విషయంలో న్యాయవాదుల వినతి మేరకు కూడా స్పెషల్ క్లాస్ కేటగిరీ ఇస్తారు.
భద్రతా సిబ్బందికి అనుమతి లేదు
ప్రముఖులు జైలులో ఖైదీలుగా ఉన్నప్పుడు వారికి భద్రత విషయంలో ఆందోళన ఉంటుంది. కానీ, ఒకసారి జైలులోకి ప్రవేశించిన తర్వాత వారి భద్రత పూర్తిగా జైళ్ల శాఖపైనే ఉంటుంది.
వారికి కేటాయించిన, లేదా వారి వ్యక్తిగత భద్రతా సిబ్బందిని లోనికి రానివ్వరు. ఆయుధాలతో జైలులోకి రావడం చట్ట విరుద్ధం కావడంతో భద్రత సిబ్బందిని రానివ్వరు.
చంద్రబాబును రిమాండ్‌కు తరలించినప్పుడు ఎన్ఎస్‌జీ కమాండోలు లోపలికి వెళ్లే వీలుండదని అధికారులు చెప్పారు.
ఒక ఖైదీకి నంబర్ ఎలా ఇస్తారు?
ఒక వ్యక్తిని రిమాండ్ చేయడం లేదా శిక్ష విధించిన తర్వాత జైలుకు తరలిస్తారు. జైలులో ఖైదీకి నంబరు కేటాయించే విధానం వరుస క్రమ సంఖ్య ప్రకారమే ఉంటుంది.
ప్రధానంగా ఖైదీలను నాలుగు రకాలుగా విభజిస్తారు.
- రిమాండ్ ప్రిజనర్స్ (రికార్డులో ఆర్.పి. అక్షరాల తర్వాత నంబర్ ఉంటుంది.)
- కన్విక్టెడ్ ప్రిజనర్స్(సి.పి. అక్షరాల తర్వాత నంబర్)
- డిటెన్యూ ప్రిజనర్స్ (కలెక్టర్ లేదా ఆర్డీవో, తహసీల్దార్ రిమాండ్ చేసిన వారిని ఈ విధంగా పిలుస్తారు.)
- విమెన్ ప్రిజనర్స్ (మహిళా ఖైదీలు).
రిమాండ్ అంటే, ''నేరారోపణ ఎదుర్కొంటున్న వ్యక్తిపై కచ్చితమైన ఆధారం దొరికితే పోలీసులు అతన్ని అరెస్టు చేసి మేజిస్ట్రేట్ లేదా కోర్టులో ప్రవేశ పెడతారు. దానిని రిమాండ్ చేయడం అంటారు. అక్కడ న్యాయమూర్తి జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తే జైలుకు తరలిస్తారు. అలాగే, పోలీసులు విచారణ కోసం కస్టడీకి ఇవ్వాలని అడిగితే పోలీసు కస్టడీకి ఇవ్వొచ్చు'' అని తెలంగాణ హైకోర్టు సీనియర్ న్యాయవాది చింతపల్లి లక్ష్మీనారాయణ బీబీసీతో చెప్పారు.
‘‘గతంలో నక్సలైట్లు ఉన్నప్పుడు ఎన్ఎక్స్ ప్రిజనర్స్ కేటగిరీ ఉండేది. ఇప్పుడు వారిని పైన చెప్పిన నాలుగు కేటగిరీల కిందనే నంబర్లు కేటాయిస్తున్నారు.
జైలు ఏర్పాటు చేసినప్పటి నుంచి వస్తున్న ఖైదీల క్రమసంఖ్య ఆధారంగా ఆయా కేటగిరీల కింద నంబర్ కేటాయిస్తారు’’ అని తెలంగాణ జైళ్ల శాఖ మాజీ డీఐజీ ఒకరు చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఏ శిక్ష పడితే.. ఏ జైలు..?
సాధారణంగా జైళ్లు మూడు రకాలుగా ఉంటాయని చెప్పారు జైళ్ల శాఖ మాజీ ఐజీ నర్సింహ. అవి..
- సబ్ జైలు
- జిల్లా జైలు (జిల్లా కారాగారం)
- సెంట్రల్ జైలు (కేంద్ర కారాగారం)
ఇవి కాకుండా ఓపెన్ జైలు, స్పెషల్ జైలు, విమెన్ జైలు, బోర్సటల్ స్కూల్, ఇతర జైళ్లూ దేశంలో ఉన్నాయని చెప్పారు.
నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి పడే శిక్షలు, రిమాండ్ ఆధారంగా ఆయా జైళ్లకు పంపిస్తారు.
సబ్ జైలు: సాధారణంగా సబ్ జైలులో రిమాండ్ ఖైదీలను ఉంచుతారు. నెల రోజుల్లోపు శిక్ష పడిన ఖైదీలను ఈ జైళ్లలో ఉంచుతారు.
జిల్లా జైలు: నెల రోజుల కంటే పైన, రెండేళ్లలోపు శిక్ష పడిన ఖైదీలను ఇక్కడ ఉంచుతారు. అలాగే జిల్లా జైలు లేదా సెషన్స్ కోర్టులో ట్రయల్స్ నడుస్తున్నప్పుడు రిమాండ్ ఖైదీలను జిల్లా జైలులో ఉంచుతారు.
సెంట్రల్ జైలు: రెండేళ్లకు పైగా శిక్ష పడిన ఖైదీలను సెంట్రల్ జైలులో ఉంచుతారు.
‘‘కొన్నిసార్లు ప్రముఖులు వివిధ కేసుల్లో రిమాండ్ ఖైదీలుగా ఉంటారు. అలాంటప్పుడు భద్రత దృష్ట్యా వారిని సబ్ జైలు, జిల్లా జైళ్లలో ఉంచడం సాధ్యం కాదు. అందుకే భద్రత ఎక్కువగా ఉన్న సెంట్రల్ జైలుకు తరలిస్తారు.
చంద్రబాబు విషయంలోనూ కోర్టు విజయవాడలో ఉన్నప్పటికీ, రిమాండ్ విధించిన తర్వాత అందుకే రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపించారు’’ అని తెలంగాణ జైళ్ల శాఖలో డీఐజీ గా పనిచేసి రిటైర్ అయిన అధికారి ఒకరు బీబీసీతో అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రత్యేకంగా కల్పించే సౌకర్యాలేంటి?
సబ్ జైలు, జిల్లా జైలు, సెంట్రల్ జైళ్లలో ఖైదీల విభజన పరంగానే కాకుండా వసతుల పరంగానూ కొన్ని తేడాలను గమనించవచ్చని అధికారులు చెబుతున్నారు.
జిల్లా జైలు, సెంట్రల్ జైళ్లలో లైబ్రరీ, ప్లే ఏరియా, యోగా, వ్యాయామ సాధన శిబిరం వంటివి ఉంటాయి. ఇలాంటి సౌకర్యాలు సబ్ జైళ్లలో ఉండవు.
‘‘సబ్ జైలు అనేది రెండు లేదా మూడు బ్యారక్‌లతో ఉంటుంది. ఇక్కడ 20 లేదా 30 మంది వరకు ఖైదీలు ఉంటారు. జిల్లా జైలులో 200 నుంచి 400 మందికి సరిపడా బ్యారక్‌లు ఉంటాయి. ఇక సెంట్రల్ జైల్లో బ్యారక్‌లు 1000 నుంచి 2000 మంది పట్టేలా ఉంటాయి’’ అని మాజీ ఐజీ సైదయ్య చెప్పారు.
‘‘జిల్లా జైలులో ప్రత్యేకంగా వైద్యులు ఉంటారు. జైలులోనే హాస్పిటల్ ఉంటుంది. కొన్ని వృత్తి శిక్షణ పరిశ్రమలు ఉంటాయి. సబ్ జైలులో ఈ తరహా సౌకర్యాలు ఉండవు.
ఇక భోజనం, ములాఖత్ వంటి విషయంలో అన్ని జైళ్లలో, ఖైదీలందరికీ ఒకే తరహా నిబంధనలు ఉంటాయి’’ అని అన్నారు సైదయ్య.
అలాగే, బ్యారక్‌ల సైజును బట్టి కొన్నింటిలో నలుగురు ఖైదీలే ఉంటారు. మరికొన్నింటిలో 20 నుంచి 25మంది వరకు ఉంచుతారు.

ఫొటో సోర్స్, Getty Images
ములాఖత్..
ములాఖత్ అంటే జైలులో రిమాండ్ లేదా శిక్ష పడిన వ్యక్తిని కుటుంబ సభ్యులు, బంధువులు లేదా న్యాయవాదులు కలవడం.
ములాఖత్ విషయంలో ముందుగా ఖైదీగా ఉన్న వ్యక్తి అంగీకారం అడుగుతారు. ములాఖత్ ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య ఉంటుంది. ములాఖత్‌కు అనుమతించే విషయం కొన్ని సందర్భాల్లో జైలు సూపరింటెండెంట్‌పై ఆధారపడి ఉంటుందని కొందరు అధికారులు చెబుతున్నారు.
ఈ విషయంపై సైదయ్య బీబీసీతో మాట్లాడుతూ.. ‘‘రిమాండ్ ఖైదీకి వారానికి రెండుసార్లు, శిక్ష పడిన ఖైదీకి వారానికొకసారి ములాఖత్‌కు అవకాశం ఉంటుంది. న్యాయవాదులు ఎప్పుడైనా రావొచ్చు'' అన్నారు.
జైలు పరిమాణాన్ని బట్టి సెక్యురిటీ ఆధారపడి ఉంటుంది. సబ్ జైలుకు భద్రతగా పది మంది వరకూ సిబ్బంది ఉంటారు. ఇక్కడ ఎస్సై లేదా సీఐ స్థాయి అధికారి పర్యవేక్షణ ఉంటుంది.
జిల్లా జైలుకు 50-60 మందితో భద్రత ఉంటుంది. దీనికి డీఎస్పీ లేదా ఏఎస్పీ స్థాయి అధికారి సూపరింటెండెంట్ గా ఉంటారు.
సెంట్రల్ జైలులో 150 నుంచి 200 వరకు భద్రతా సిబ్బంది ఉంటారు. ఇక్కడ ఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షణ ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
దేశంలో జైళ్ల వివరాలు
జాతీయ క్రైం రికార్డుల బ్యూరో (ఎన్సీఆర్బీ), 2021 గణాంకాల ప్రకారం, దేశవ్యాప్తంగా 1319 జైళ్లు ఉన్నాయి. ఇందులో అత్యధికంగా రాజస్థాన్‌లో 144 జైళ్లు ఉన్నాయి. అతి తక్కువగా గోవా, చండీగఢ్‌లో ఒక్కోటి చొప్పున ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో 106 జైళ్లు ఉండగా.. తెలంగాణలో 37 జైళ్లు ఉన్నాయి.
దేశవ్యాప్తంగా ఉన్న జైళ్లలో 4,25,609 మంది ఖైదీలను ఉంచే సామర్థ్యం ఉండగా, ప్రస్తుతం 5,54,034 మంది ఖైదీలు ఉన్నట్లు ఎన్సీఆర్బీ గణాంకాలు చెబుతున్నాయి.
ఇందులో అత్యధికంగా ఉత్తర్‌ప్రదేశ్‌లో జైళ్లలో 63,751 మంది సామర్థ్యం ఉండగా.. ఏకంగా 1,17,789 మంది ఖైదీలు ఉన్నారు. ఇక్కడ 75 జైళ్లు మాత్రమే ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. తెలంగాణలో జైళ్ల సామర్థ్యం 7,997 మంది కాగా, 7,316 మంది ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో 8,761 మంది ఖైదీల సామర్థ్యం ఉండగా 7,950 మంది ఖైదీలు ఉన్నారు.
ఇవి కూడా చదవండి:
- పవన్ కల్యాణ్: జనసేన అధినేత ఫ్లైట్‌కు అనుమతి నిరాకరణ, ఎందుకంటే..
- ఆంధ్రప్రదేశ్: కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎందుకు ఆందోళన చెందుతున్నారు, జగన్ ఎన్నికల హామీ ఏమైంది?
- పూడిలంక: మా ఊరి కష్టాలు మరెవరికీ రాకూడదని ఈ గ్రామస్థులు ఎందుకు అంటున్నారు?
- చంద్రబాబుపై నమోదు చేసిన సెక్షన్లు ఏంటి, వాటికి ఎలాంటి శిక్షలుంటాయి?
- ఆంధ్రప్రదేశ్: ఓ గిరిజన వర్సిటీ రైతులను ఎలా రోడ్డున పడేసిందంటే....
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















