ఆంధ్రప్రదేశ్: కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎందుకు ఆందోళన చెందుతున్నారు, జగన్ ఎన్నికల హామీ ఏమైంది?

ఫొటో సోర్స్, @YSJAGAN/TWITTER
- రచయిత, వడిశెట్టి శంకర్
- హోదా, బీబీసీ కోసం
"కాంట్రాక్ట్ ఉద్యోగులను చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. మేం అధికారంలోకి వస్తే అందరికీ న్యాయం చేస్తాం."- ఓదార్పు యాత్రలో తనను కలిసిన విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులతో జగన్ అన్న మాటలివి.
'అన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను వారి అర్హత, సర్వీసును పరిగణనలోకి తీసుకుని వీలయినంత ఎక్కువ మందిని రెగ్యులరైజ్ చేస్తాం' అని 2019 నాటి ఎన్నికల మ్యానిఫెస్టోలో వైఎస్సార్సీపీ పేర్కొంది.
"2 జూన్ 2014 నాటికి ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న కాంట్రాక్ట్ సిబ్బందిని రెగ్యులరైజ్ చేయాలని మంత్రివర్గం తీర్మానం చేసింది. ఇది చరిత్రాత్మక నిర్ణయం" అని 2023 జూలైలో జరిగిన క్యాబినెట్ తర్వాత ప్రభుత్వం ప్రకటన చేసింది.
'ఐదేళ్ల సర్వీసు నిబంధన తొలగించారు. 2014 జూన్ నాటికి ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు.అందరికీ న్యాయం జరుగుతుంది' అని ఆగస్టులో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతలు ప్రకటించారు.
అధికారిక ఉత్తర్వులు ఇంకా వెల్లడి కాలేదు. ఎవరిని పరిగణనలోకి తీసుకుంటారు, ఎంతమందిని రెగ్యులర్ చేస్తారన్నది స్పష్టత రాలేదు.
తొలుత క్యాబినెట్ భేటీ తర్వాత కొందరు సంతృప్తి వ్యక్తం చేయగా, ఆ తర్వాత ప్రకటనతో మరింత మంది ఊరట దక్కిందని చెబుతున్నారు.
రాష్ట్ర విభజన తర్వాత విధుల్లో చేరి సుమారు పదేళ్ల సర్వీసు పూర్తి చేసుకుంటున్న ఉద్యోగుల పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది.
ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అధికారులు అంటున్నారు.

ఫొటో సోర్స్, UGC
రిటైర్మెంట్ కి చేరువలో..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1990ల చివరి నుంచి కాంట్రాక్ట్ సిబ్బంది నియామకాలు విస్తృతం చేసింది.
దాదాపుగా అన్ని శాఖల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులున్నారు. వారిలో రెండు దశాబ్దాలుగా కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తున్న వారున్నారు.
23 ఏళ్ల సర్వీసు పూర్తిచేసుకుని రిటైర్మెంట్‌కి చేరువలో ఉన్న వారు సైతం కొనసాగుతున్నారు.
ఈకాలంలో ఆర్టీసీ, విద్యుత్ సంస్థల్లో కొద్దిమందికి రెగ్యులరైజేషన్‌కు అవకాశం వచ్చింది.
కానీ వివిధ శాఖల్లో అసలు రెగ్యులరైజ్ చేసిన దాఖలాలే లేవు. అందులో కాంట్రాక్ట్ లెక్చరర్లు సహా వివిధ శాఖల సిబ్బంది ఉన్నారు.
"నేను పద్దెనిమిదేళ్లుగా కాంట్రాక్ట్ లెక్చరర్‌గా విధులు నిర్వహిస్తున్నాను. రూ. 12వేల జీతానికి చేరాం. మాతో పాటు పనిచేసిన వారు కార్పోరేట్ కాలేజీల్లో కొందరు లక్షల జీతం తెచ్చుకుంటున్నారు. మాకు మాత్రం తక్కువ వేతనాలే.
ఇప్పుడు ఐదేళ్ల సర్వీసు నిబంధన ఉన్నా లేకున్నా రెగ్యులరైజ్ అవుతాం. ఆ ప్రక్రియ త్వరగా పూర్తవుతుందని ఆశిస్తున్నాం. చట్టపరమైన నిబంధనలను తొలగించి రెగ్యులరైజ్ చేస్తే మా కుటుంబాలకు ఊరట దక్కుతుంది. ఇన్నేళ్లుగా ప్రభుత్వ సేవలో ఉన్నందుకు ప్రతిఫలంగా భావిస్తాం" అంటూ బాపట్ల జిల్లా చీరాలకు చెందిన కాంట్రాక్ట్ లెక్చరర్ ఆర్.అరుణ్ కుమార్ అన్నారు.
‘‘ప్రభుత్వం మూడు నెలలుగా ఊరిస్తోంది. మాతో పాటు పనిచేస్తున్న కొందరు రిటైర్మెంట్‌కు చేరువలో ఉన్నారు. వీలయినంత త్వరగా ఈ ప్రక్రియ పూర్తి చేస్తారని ఆశిస్తున్నాం’’ అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, UGC
అర్హులు ఎంత మంది?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ మీద నియమించిన వర్కింగ్ కమిటీ ప్రతిపాదనల్లో అర్హుల జాబితా క్రమంగా తగ్గుతూ రావడంతో చివరకు ఎంతమందిని క్రమబద్ధీకరిస్తారన్నది ఉద్యోగులకు అంతుబట్టకుండా ఉంది.
తొలుత 2022 మే నాటికి అర్హుల సంఖ్య 12,255 మందిగా గుర్తించారు. వారిని రెగ్యులరైజ్ చేస్తే ఆర్థికశాఖ మీద అదనంగా రూ. 431 కోట్ల భారం పడుతుందని అంచనా వేశారు.
తదుపరి అర్హుల జాబితాలో మరిన్ని కోతలు పెట్టారు. జూన్ నాటికి అర్హుల సంఖ్య 10,117కి తగ్గించారు.
సీఎఫ్ఎంఎస్‌లో నమోదైన జాబితాను బట్టి ఈ సంఖ్య లెక్కించినట్టు క్యాబినెట్ సబ్ కమిటీ చెబుతోంది.
కాంట్రాక్ట్ సిబ్బంది నియామకాలకు కూడా ప్రకటన ఇచ్చి, రిజర్వేషన్ ప్రాతిపదికన ఆర్థిక శాఖ మంజూరు చేసిన ఉద్యోగాలను మాత్రమే రెగ్యులరైజేషన్ చేసే ప్రక్రియలో పరిగణలోకి తీసుకుంటున్నారు.
దాంతో 2014 జూన్ నాటికి 11,062గా ఉండగా, ఆ తర్వాత 9,017 మంది చేరినట్టు లెక్కలు చెబుతున్నాయి.
తాజాగా ఏపీఎన్జీజీవోల మహాసభలో ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చెబుతున్న లెక్కల ప్రకారం 10వేల మంది సర్వీస్ రెగ్యులర్ అవుతుంది.
చివరకు ఈ లెక్క ఎంతవరకు వస్తుందనేది ఇప్పుడు ఉద్యోగుల్లో ఆందోళనకు కారణమైంది.

ఫొటో సోర్స్, UGC
‘అందరినీ పర్మినెంట్ చేస్తామని చెప్పి...’
ఆంధ్రప్రదేశ్ లో గడిచిన కొన్నేళ్లుగా రెగ్యులర్ ఉద్యోగుల సంఖ్య తగ్గుతోంది. కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఖ్య పెరుగుతోంది.
ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన తర్వాత సచివాలయాలు ఏర్పాటు చేసి కొత్త సిబ్బందిని రెగ్యులర్ ప్రాతిపదికన నియమించడంతో రెగ్యులర్ ఉద్యోగుల సంఖ్య కొంత ఎక్కువగా కనిపిస్తోంది.
రాష్ట్రంలో ప్రస్తుతం రెగ్యులర్ ఉద్యోగుల సంఖ్య సుమారుగా 5 లక్షలు.
కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ సిబ్బందితో పాటు స్కీమ్ వర్కర్లను కూడా కలుపుకుంటే మరో 3.1 లక్షల మంది ఉన్నారు.
అందులో కేవలం కాంట్రాక్ట్ సిబ్బంది సంఖ్య 80వేల వరకూ ఉంటుందని ఏపీ కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి ఏవీ నాగేశ్వర రావు అన్నారు.
"అధికారంలోకి వస్తే అందరినీ పర్మినెంట్ చేస్తామని అన్నారు. ఇప్పుడు సర్వీస్ కండీషన్ తగదు. గత ప్రభుత్వం కూడా క్యాబినెట్ సబ్ కమిటీ పేరుతో తాత్సారం చేసింది.
వారి వల్ల అన్యాయం జరిగిందని జగన్ మీద ఆశ పెట్టుకుంటే నాలుగున్నరేళ్ల పాటు ఆలస్యం చేసి ఆఖరి నిమిషంలో నిబంధనలు పెట్టడం న్యాయం కాదు.
కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాలి. ప్రభుత్వంలో శాశ్వత ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వాటిలో నియామకాలు చేయవచ్చు" అని నాగేశ్వర రావు అన్నారు.
కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ ప్రక్రియలో జాప్యం చేయకూడదని ఆయన కోరారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
విద్యుత్ ఉద్యోగుల పరిస్థితి ఏమిటీ
రెగ్యులరైజేషన్ ప్రక్రియలో ప్రస్తుతం యూనివర్సిటీలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులు, సొసైటీలు, ప్రాజెక్టులు, కార్పోరేషన్ల పరిధిలో పనిచేస్తున్న వారిని పక్కనబెడుతున్నారు. దీంతో, విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు తమ పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు.
విద్యుత్ పంపిణీ, ఉత్పత్తి సంస్థల్లో సుమారు 27వేల మంది కాంట్రాక్ట్ కార్మికులున్నారు.
ముఖ్యంగా డిస్కమ్‌లు సహా వివిధ సంస్థల ఆధ్వర్యంలో జరిగిన నియామకాలను ప్రస్తుతం రెగ్యులరైజేషన్‌లో పరిగణనలోకి తీసుకోవడం లేదనే సమాచారంతో విద్యుత్ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల విద్యుత్ ఉద్యోగుల సమ్మె సందర్భంగా పీఆర్సీకి అనుగుణంగా వేతనాలతో పాటుగా కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలు కూడా ప్రధానంగా ముందుకొచ్చాయి.
చివరి నిమిషంలో సమ్మె విరమణ మీద కాంట్రాక్ట్ ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
హైకోర్టు అనుమతి తీసుకుని విజయవాడలో ఆందోళనకు సిద్ధమవుతున్నాయి.
"కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ న్యాయం చేస్తామని చెప్పారు. మేం కూడా అందులో భాగమే. మా సర్వీసు కూడా రెగ్యులరైజేషన్ చేయాలని ప్రభుత్వానికి అనేకమార్లు విన్నవించాం.
రెగ్యులరైజ్ అవుతుందని ఆశించాం. కానీ ఇప్పుడు డిస్కమ్‌లలో పనిచేస్తున్న వారు ప్రభుత్వ సిబ్బంది కాదన్నట్టుగా సూత్రీకరణలు చేయడం తగదు.
రెగ్యులరైజ్ చేస్తామని అసెంబ్లీలో చెప్పిన మాటను జగన్ నిలబెట్టుకోవాలి" అని విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘం నాయకుడు ఆర్.మణిగోపాల్ అన్నారు.
ఈ విషయంలో ప్రభుత్వం అలసత్వం వహించవద్దని ఆయన కోరారు.

ఫొటో సోర్స్, UGC
కార్మికుల పక్షపాతి కాబట్టే...
కాంట్రాక్ట్ సిబ్బంది రెగ్యులరైజేషన్ ప్రక్రియకు సంబంధించిన తుది ఉత్తర్వులు ఎప్పటికీ అన్నది అధికారుల్లో ఇంకా స్పష్టత లేదు. దాని మీద కసరత్తులు జరుగుతున్నాయని, ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా త్వరలోనే ఆదేశాలు విడుదల చేస్తామని కార్మిక శాఖ అధికారులు బీబీసీకి తెలిపారు
గత ప్రభుత్వం హామీ ఇచ్చి విస్మరిస్తే, జగన్ మాత్రం అవకాశం ఉన్నంత మేరకు సర్వీసుని పరిగణనలోకి తీసుకుని పర్మినెంట్ చేస్తామన్న మాటను నిలబెట్టుకుంటున్నారని వైఎస్సార్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గౌతమ్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
"అవుట్ సోర్సింగ్ సిబ్బందికి కార్పోరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించాం. ఇప్పుడు కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తున్నాం. ఈ ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌దే.
నిబంధనలకు లోబడి ఈ ప్రక్రియ జరుగుతోంది. కార్మికులందరికీ న్యాయం జరుగుతుంది. రెండు దశాబ్దాలుగా సేవలందిస్తున్న వారికి పర్మినెంట్ అవుతుండటం అత్యంత ఆనందదాయకం. వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ కార్మికుల తరఫున ధన్యవాదాలు చెబుతోంది." అంటూ ఆయన బీబీసీతో అన్నారు.
ఉద్యోగులకు న్యాయం చేసే ప్రభుత్వం కాబట్టే ఆర్థికంగా భారమవుతున్నా పర్మినెంట్ చేస్తున్నారని, అవకాశం మేరకు ఎక్కువ మందికి న్యాయం జరుగుతుందని ఆయన తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- శ్రీకృష్ణుడి ద్వారక కోసం సముద్రం అడుగుకి వెళ్లిన సబ్‌మెరైన్స్, అక్కడ ఏముంది?
- చంద్రయాన్-3: నాసా కెమెరాతో తీసిన ‘విక్రమ్’ ల్యాండర్ ఫోటోలు ఎలా ఉన్నాయంటే....
- కుంభమేళా: యాంటీబయాటిక్స్ వల్ల ప్రపంచవ్యాప్తంగా కోటి మంది చనిపోతారా, డబ్ల్యూహెచ్‌వో ఎందుకు హెచ్చరించింది?
- పుతిన్, కిమ్ జోంగ్ ఉన్: వీరిద్దరూ కలవడం ప్రపంచానికి ఆందోళనకరమా?
- భారత్ అనే పేరు ఎలా వచ్చింది... దీని వెనుక దాగిన నీరు, నిప్పుల కథేంటి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














