పుతిన్, కిమ్ జోంగ్ ఉన్: వీరిద్దరూ కలవడం ప్రపంచానికి ఆందోళనకరమా?

పుతిన్, కిమ్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, జార్జ్ రైట్, జీన్ మెకెంజీ
    • హోదా, లండన్, సియోల్

ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సమావేశమయ్యేందుకు ఈ నెలలో మాస్కో వెళ్తున్నట్లు అమెరికా అధికారులు బీబీసీ యూఎస్ భాగస్వామి సీబీఎస్‌తో చెప్పారు.

యుక్రెయిన్‌తో జరిగే యుద్ధంలో మద్దతు ఇచ్చేందుకు మాస్కోకు కావాల్సిన ఆయుధాలను ఉత్తర కొరియా సరఫరా చేసే అవకాశాలపై ఈ ఇరువురు నేతలు చర్చించనున్నారని అధికారులు తెలిపారు.

కానీ, చర్చలు ఎక్కడ జరగబోతున్నాయన్న దానిపై స్పష్టత లేదు.

ఈ రిపోర్ట్‌లపై చెప్పడానికి ఏం లేదని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి అన్నారు. ఉత్తర కొరియా నుంచి కూడా వెనువెంటనే స్పందన రాలేదు.

విశ్వసనీయ వర్గాలు న్యూయార్క్ టైమ్స్‌కి చెప్పిన సమాచారం ప్రకారం, భారీ భద్రత ఉండే రైలులో కిమ్ రష్యాకు వెళ్లనున్నారని తెలిసింది.

ఇరు దేశాల మధ్య ఆయుధాల చర్చలు చురుకుగా ముందుకు సాగుతున్నాయని తమకు సమాచారం అందినట్లు వైట్‌హౌస్ చెప్పిన వెంటనే ఈ సమావేశం వార్త వెలుగులోకి వచ్చింది.

రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు ఇటీవల ఉత్తర కొరియా వెళ్లినప్పుడు ఫిరంగి మందుగుండు సామాగ్రిని తమకు అమ్మేలా ప్యాంగ్యాంగ్‌ను ఒప్పించేందుకు ప్రయత్నం చేశారని జాతీయ భద్రతా మండలి అధికార ప్రతినిధి జాన్ కిర్బీ చెప్పారు.

రష్యాకు ప్రస్తుతం 122 ఎంఎం, 152 ఎంఎం షెల్స్ కావాల్సి ఉంది. ఎందుకంటే, వీటి నిల్వలు ఆ దేశంలో అడుగంటిపోయాయి.

ఉత్తర కొరియా వద్ద మందుగుండు సామాగ్రి నిల్వలు ఏ మేర ఉన్నాయో గుర్తించడం అంత తేలికైన విషయం కాదు. ఎందుకంటే, ఉత్తర కొరియా తన ఆయుధాలు, మందుగుండు సామాగ్రి నిల్వల విషయంలో చాలా రహస్యంగా వ్యవహరిస్తోంది.

కిమ్, షోయిగు మధ్య జూలైలో జరిగిన సమావేశంలో ఆయుధాలను ప్రదర్శించారు. దీనిలో హ్వాసాంగ్ ఖండాతర బాలిస్టిక్ క్షిపణులు కూడా ఉన్నాయి.

కరోనా మహమ్మారి తర్వాత విదేశీ అతిథులను కిమ్ తమ దేశంలోకి ఆహ్వానించడం ఇదే తొలిసారి.

ఉత్తర కొరియాను సందర్శించిన రష్యా రక్షణ మంత్రి

ఫొటో సోర్స్, REUTERS

ఫొటో క్యాప్షన్, ఉత్తర కొరియాను సందర్శించిన రష్యా రక్షణ మంత్రి

కిమ్, పుతిన్‌లు తమ దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని పెంచుకుంటామని వాగ్ధానం చేసుకుంటూ ఒప్పందాలు కుదుర్చుకున్నారని కిర్బీ చెప్పారు.

‘‘రష్యాతో ఆయుధ చర్చలు జరపడం ఆపేయాలని డెమొక్రాటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా(డీపీఆర్‌కే)ను మేం కోరుతున్నాం. ప్రజాప్రయోజనాలకు కట్టుబడి ఉండాలని, రష్యాకు ఎలాంటి ఆయుధాలను అందించడం కానీ, అమ్మడం కానీ ప్యాంగ్యాంగ్ చేయొద్దని అభ్యర్థిస్తున్నాం’’ అని ఆయన తెలిపారు.

రష్యాకు ఉత్తరకొరియా ఆయుధాలను సరఫరా చేస్తే ఆంక్షలు విధించడంతో పాటు అమెరికా చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని కిర్బీ హెచ్చరించారు.

పుతిన్, కిమ్‌లు ఇద్దరూ చివరిసారి 2019లో కలిశారు. ఆ సమయంలో కిమ్ రష్యాలోని వ్లాదివొస్టొక్‌ నగరానికి రైలులో వచ్చారు.

ఆయనకు అధికారులు రొట్టె, ఉప్పుతో సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ఇదే చివరిసారి కిమ్ విదేశాలకు ప్రయాణించడం.

ఆయుధాల డీల్ విషయంలో ఉత్తర కొరియా ప్రతిఫలంగా ఏం ఆశించనుందనే విషయంపై వాషింగ్టన్, సియోల్ రెండూ తీవ్ర ఆందోళనను వ్యక్తం చేస్తున్నాయి.

ఆసియాలో రెండు దేశాల మధ్య మిలటరీ సహకారాన్ని ఈ డీల్ పెంచనుంది.

అమెరికా, దక్షిణ కొరియా, జపాన్ నిర్వహించిన మాదిరి.. రష్యా, చైనా, ఉత్తర కొరియాలు సంయుక్తంగా నావల్ డ్రిల్స్‌ను చేపట్టాలని రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు ప్రతిపాదించారని సోమవారం దక్షిణ కొరియా ఇంటెలిజెన్స్ సర్వీసు చెప్పింది.

ప్యాంగ్యాంగ్‌కు అత్యంత అవసరమైన సమయంలో భవిష్యత్‌లో ఉత్తర కొరియాకు రష్యా ఆయుధాలను సరఫరా చేస్తే ఎలా అనే భయాందోళనలు కూడా నెలకొన్నాయి.

తమ అణు ఆయుధాల కార్యక్రమంలో పురోగతి సాధించడం కోసం అధునాతన ఆయుధాల సాంకేతికతను లేదా పరిజ్ఞానాన్ని అందించాలని రష్యా అధ్యక్షుడిని కిమ్ జోంగ్ ఉన్ కోరవచ్చనే ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి.

ఉత్తర కొరియా ఇప్పటికే హైపర్‌సోనిక్ క్షిపణులను పరీక్షించింది. ధ్వని కంటే అనేక రెట్ల వేగంతో, రాడార్ గుర్తింపు తప్పించుకుంటూ తక్కువ ఎత్తులో ఇవి ఎగురుతాయి. అలాగే, ఇతర సబ్‌మెరైన్ల నుంచి వీటిని ప్రయోగించవచ్చు.

ఉత్తర కొరియా వద్దనున్న క్షిపణుల వివరాలు

ఫొటో సోర్స్, BBC Sport

అది వ్యూహాత్మక ఒప్పందం కాకపోయినప్పటికీ ఒక లావాదేవీ తరహాలో అది పూర్తవుతుందని భావిస్తున్నారు.

ఇప్పుడు రష్యాకు ఆయుధాలు అవసరం. అలాగే, ఆకలి బాధలతో అల్లాడుతున్న ఉత్తర కొరియాకు నిధులు, ఆహారం అవసరం.

రష్యా తూర్పు తీరప్రాంతంలోని ఓడరేవు నగరం వ్లాదివొస్టొక్‌లో పుతిన్ - కిమ్ భేటీ జరిగే అవకాశం ఉందని ది న్యూయార్క్ టైమ్స్ తెలిపింది.

గత నెల చివర్లోనే ఉత్తర కొరియా అధికారులు మాస్కోతో పాటు వ్లాదివొస్టొక్‌ నగరంలో పర్యటించారని ఆ పత్రిక డిప్లొమాటిక్ కరస్పాండెంట్ ఎడ్వర్డ్ వాంగ్ బీబీసీతో చెప్పారు.

''వారిలో అధినేతల ప్రోటోకాల్ బాధ్యతలు చూసే అధికారులు కూడా ఉన్నారు. కాబట్టి అధికారులకు స్పష్టంగా సంకేతాలు ఉన్నాయి'' అని వాంగ్ అన్నారు.

యుక్రెయిన్ యుద్ధంలో వాడేందుకు నార్త్ కొరియా ఆయుధాలు సరఫరా చేస్తుందన్న వాదనలను గతంలో ఇరుదేశాలు తోసిపుచ్చాయి.

''కిమ్ తన భద్రత విషయంలో ఎప్పుడు ఎలా ఆలోచిస్తాడో అతనికే తెలియదు. కాబట్టి ఈ పర్యటన జరుగుతుందని కచ్చితంగా చెప్పలేం'' అని 2006 నుంచి 2008 వరకు నార్త్ కొరియాకి యూకే అంబాసిడర్‌గా పనిచేసిన జాన్ ఎవెరార్డ్ అభిప్రాయపడ్డారు.

''ఉత్తర కొరియా వద్ద రష్యాకు అవసరమైన ఆయుధాల నిల్వలు ఉన్నాయి. అయితే, అవి సోవియట్ యూనియన్ కాలం నాటివి. ఇప్పుడవి పేలవమైన స్థితిలో ఉంటాయి'' అని ఎవెరార్డ్ అన్నారు.

2019లో వ్లాదివొస్టొక్‌‌లో జరిగిన భేటీ తర్వాత, కిమ్ తన అణు కార్యకలాపాలను ఉపసంహరించుకునేందుకు భద్రతా పరమైన హామీలు అవసరమని పుతిన్ వ్యాఖ్యానించారు.

కొరియాలో అణునిరాయుధీకరణపై అప్పటి అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌, కిమ్ మధ్య వియత్నాంలో జరిగిన చర్చలు విఫలమైన కొద్ది నెలల తర్వాత ఆ సమావేశం జరిగింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)