ఉత్తర కొరియా: తొలిసారి ‘అణ్వాయుధాలు’ ప్రదర్శించిన కిమ్ జోంగ్ ఉన్

ఫొటో సోర్స్, RODONG SINMUN
- రచయిత, జీన్ మెకెంజీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఉత్తర కొరియా తమ వద్ద ఉన్న చిన్న న్యూక్లియర్ వార్ హెడ్స్‌ను బయటి ప్రపంచానికి చూపించింది.
వాటిని షార్ట్ రేంజ్ మిసైల్స్‌లో ఉంచొచ్చని భావిస్తున్నారు.
దక్షిణ కొరియాను లక్ష్యంగా చేసుకోగల అణ్వాయుధాలు తమ వద్ద ఉన్నాయని ఉత్తర కొరియా చెబుతూ వస్తోంది. అయితే తొలిసారి ఆ దేశం వాటిని ప్రదర్శించింది.
కానీ వాటిని పరీక్షించే వరకు అవి నిజమైనవో కాదో మనకు తెలిసే అవకాశం లేదు.
ఈ రోజుల్లో ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలను ట్రాక్ చేయడం చాలా కష్టం. గత 15 రోజులుగా మనం పరిశీలిస్తే వారు ప్రతి రోజు ఒక ఆయుధాన్ని వాడుతున్నారు. తాజా పరీక్షలను చూస్తే మనం చాలా నేర్చుకోవచ్చు.
కొన్నేళ్లుగా మిలిటరీ డ్రిల్‌లను నిర్వహించినందుకు అమెరికా, దక్షిణ కొరియాలను శిక్షిస్తున్నట్లు ఉత్తర కొరియా తెలిపింది.
ఇది సాధారణ నిరసన కాదు. గతంలో ఇది చిన్న, మధ్యస్థ, దీర్ఘ-శ్రేణి క్షిపణులను, బహుశా కొన్ని ఫిరంగి గుండ్లను పేల్చుతూ ఇటువంటి కసరత్తులకు ధీటుగా బదులిచ్చింది.
ఈ దఫా రెండు వారాల వ్యవధిలో ప్యోంగ్యాంగ్ దాని అత్యంత శక్తివంతమైన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. ఇది 'అమెరికా భూభాగంలో ఎక్కడికైనా చేరుకోగలదు' అని చెబుతున్నారు.
ఇది జలాంతర్గామి నుంచి క్షిపణులను ప్రయోగించింది. ఉత్తర కొరియా సైన్యం దక్షిణ కొరియా ఎయిర్‌ఫీల్డ్‌పై అణు దాడి చేస్తున్న భావన కలిగేలా చేసింది.
కిమ్ జోంగ్ ఉన్ నీటి అడుగున కొత్త డ్రోన్‌ను ఆవిష్కరించారు. దీనికి శత్రు యుద్ధనౌకలను నాశనం చేసి, సముద్రం కింద అణ్వాయుధాలను ధ్వంసం చేసే సామర్థ్యం ఉందని కిమ్ వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, KCNA

ఫొటో సోర్స్, KCNA
ఆయుధ సామర్థ్యాన్ని ఎందుకు పెంచుకుంటోంది?
సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్‌లో విశ్లేషకుడు ఎల్లెన్ కిమ్ మాట్లాడుతూ ఇది "ఉత్తరకొరియా ఫ్యాషన్ షోకి సమానం" అని అభివర్ణించారు.
డియోర్-స్టైల్ జాకెట్ ధరించిన కిమ్ కుమార్తె అక్కడ కనిపించారు. ఈ సీజన్‌లో పరేడ్ క్షిపణులపై ఎల్లెన్ కిమ్‌తో సహా విశ్లేషకులు ఆందోళన చెందుతున్నారు.
ప్యోంగ్యాంగ్ కొత్త, మరింత అధునాతనమైన ఆయుధాలను ఆవిష్కరించింది. వీటిని అమెరికా, దక్షిణకొరియా, జపాన్‌లను లక్ష్యంగా చేసుకోవడానికి సముద్రం, భూమి నుంచి ప్రయోగించొచ్చు.
"అంతకుముందు ఉత్తరకొరియా జలాంతర్గాముల నుంచి క్రూయిజ్ క్షిపణులను, భూగర్భం నుంచి క్షిపణులను ప్రయోగించగలదని తెలియదు.
దాని ఆయుధాలను ట్రాక్ చేయడం, అడ్డగించడం చాలా కష్టంగా మారుతోంది" అని ఎల్లెన్ కిమ్ అంటున్నారు. ఇది ఉత్తరకొరియా నుంచి అణు ముప్పు పొంచి ఉందని చెబుతోంది.
ఉదాహరణకు జలాంతర్గామి నుంచి ప్రయోగించిన క్రూయిజ్ క్షిపణులను తీసుకోండి.
ఈ క్షిపణులపై సియోల్‌లోని అసన్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన ఆయుధాల నిపుణుడు యాంగ్ ఉక్ స్పందిస్తూ ''నీటి కింద నుంచి క్షిపణిని ప్రయోగించడం వలన ముందు గుర్తించడం కష్టం'' అంటున్నారు.
ప్రయోగించిన తర్వాత క్రూయిజ్ క్షిపణులు తక్కువ ఎత్తుకు ఎగురుతాయి.
అమెరికా తన దేశంపై దాడి చేస్తుందని కిమ్ జోంగ్ ఉన్ ఎప్పుడూ భయపడుతూనే ఉండేవారు. తమ ఆయుధాలను ఉపయోగించే అవకాశం రాకముందే వాటిని అమెరికా తుడిచిపెట్టేస్తుందని భావించేవారు.
ఈ పరీక్షలతో కిమ్ ''తమ దేశం ఇప్పుడు తిరిగి దాడిచేసే సామర్థ్యాన్ని కలిగి ఉందని, ముందుగానే ఆయుధాలు ప్రయోగించగలదనే'' సందేశం పంపుతున్నట్లుగా ఉంది.
భూగర్భంలో లేదా నీటి అడుగున దాగి ఉన్న ఆయుధాలను నాశనం చేయడం కష్టం. మరో మాటలో చెప్పాలంటే "మాపై దాడి చేయడం గురించి ఆలోచించవద్దు" అని కిమ్ హెచ్చరిస్తున్నారు.
అయితే మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కిమ్ తన సైనిక సామర్థ్యాలపై అతిశయోక్తికి వెళ్లే ప్రమాదం ఉండవచ్చు.

ఫొటో సోర్స్, KCNA
భద్రతా మండలిలో ఉత్తర కొరియాను సమర్థిస్తున్న దేశాలేంటి?
ఇటీవల ప్రయోగించిన అన్ని క్షిపణులు అణు వార్‌హెడ్‌లను మోసుకెళ్లగలవని ఉత్తర ప్రాంతం ప్రగల్భాలు పలుకుతోంది.
అయినప్పటికీ చాలా వరకు చిన్న, తక్కువ బరువున్న అణు వార్‌హెడ్‌లను మాత్రమే మోసుకెళ్లగలవు. వీటిని ఉత్పత్తి చేయగలదని ప్యోంగ్యాంగ్ ఇంకా నిరూపించలేదు.
అది ఒకదాన్ని పరీక్షించే వరకు మనం చీకట్లో ఉన్నట్లే. అందుకే అణుపరీక్షల కోసం నిఘా వర్గాలు చాలా రోజులుగా ఊపిరి బిగబట్టి ఎదురుచూస్తున్నాయి.
ఉత్తర కొరియా భారీ స్థాయిలో సూక్ష్మీకరించిన వార్‌హెడ్‌లను తయారు చేయగలిగిన క్షణాన దాని బెదిరింపులు నిజమవుతాయి.
ఈ అణు పరీక్షలను నిరోధించడానికి, ఉత్తర కొరియాను తిరిగి చర్చలకు తీసుకురావడానికి అమెరికా, అంతర్జాతీయ సమాజం మరింత కృషి చేయాలని వాదించేవారూ ఉన్నారు.
నాలుగేళ్లకు పైగా ఇరువర్గాల మధ్య చర్చలు నిలిచిపోయాయి. ప్యోంగ్యాంగ్ చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు ఎలాంటి సంకేతాలూ ఇవ్వలేదు. అది తనకు ఎక్కువ లాభం ఉందని భావించే క్షణాన్ని ఎంచుకుంటుంది.
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఉత్తర కొరియాను శిక్షించడానికి చైనా, రష్యా నిరాకరిస్తుండటంతో అది ఎటువంటి పరిణామాలు లేకుండా ఆయుధాలను అభివృద్ధి చేయడం కొనసాగించవచ్చు.
'మరిన్ని పరీక్షలు రాబోతున్నాయి'
ఇప్పుడు ఎందుకు ఆపాలి? దాని ఆయుధాలు ఎంత మెరుగ్గా ఉంటే, దాని చేయి అంత బలంగా ఉంటుంది, నిరూపించడానికి ఇంకా చాలా ఉంది.
సూక్ష్మీకరించిన వార్‌హెడ్‌లతో పాటు దాని సాధారణ వార్‌హెడ్‌లు పూర్తి ఖండాంతర విమానాన్ని తట్టుకోగలవని ఇంకా నిరూపించలేదు.
ప్రస్తుతం ఉత్తరకొరియా సుదూర క్షిపణులను అంతరిక్షంలోకి పరీక్షిస్తోంది. ఇది మరింత అధునాతనమైన ఐసీబీఎంని కూడా అభివృద్ధి చేయాలనుకుంటోంది.
దేశంలోని పరిస్థితుల కారణంగానే కిమ్ జోంగ్ ఉన్ చర్యలుంటున్నాయని యాంగ్ ఉక్ అభిప్రాయపడ్డారు.
ఆర్థిక వ్యవస్థ మందగమనం, ప్రజలు ఆకలితో అలమటిస్తున్న నేపథ్యంలో అణ్వాయుధ కార్యక్రమం "ఆయన ఆడటానికి మిగిలి ఉన్న ఏకైక కార్డు" అని యాంగ్ అంటున్నారు.
అందువల్ల ఉత్తర కొరియా మరింత వైవిధ్యమైన, ప్రాణాంతకమైన ఆయుధాలను అభివృద్ధి చేస్తూ ముందుకు సాగడానికి సిద్ధంగా ఉంది.
"మరిన్ని పరీక్షలు రాబోతున్నాయి" అని ఎల్లెన్ కిమ్ కచ్చితంగా చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- రాహుల్ గాంధీ: ‘‘అదానీ మీద మళ్లీ నేను ఏం మాట్లాడతానోనని మోదీ భయపడ్డారు’’
- ‘కులదురహంకారమే’ కాకినాడలో దళిత యువకుని ప్రాణాలు తీసిందా?
- రాహుల్ గాంధీ: కాంగ్రెస్ నేత ముందున్న మార్గాలు ఏంటి?
- పగలు క్లర్క్... రాత్రి ఆటో డ్రైవర్... ఆదివారం బట్టల వ్యాపారి... ఒక వ్యక్తి మూడు పనులు
- పాకిస్తాన్: అహ్మదీయులు ముస్లింలు కారా... వారి మీద దాడులు ఎందుకు జరుగుతున్నాయ్...
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














