కె-డ్రామా: కొరియన్ సీరియళ్లు బాలీవుడ్‌ సినిమాలను మరపిస్తున్నాయా, ఎందుకీ క్రేజ్?

కె డ్రామా

ఫొటో సోర్స్, CJ ENM

ఫొటో క్యాప్షన్, క్రాష్ ల్యాండింగ్ ఆన్ యూ అనే కొరియన్ డ్రామాకు భారత్‌లో విపరీత ఆదరణ దక్కింది
    • రచయిత, జోయా మతీన్, మెరిల్ సెబాస్టియన్
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

ఒక ప్రమాదం కారణంగా ఒక యువతి శత్రుదేశంలో చిక్కుకుంటుంది. అక్కడ అందగాడైన ఒక ఆర్మీ ఆఫీసర్ ఆమెను కాపాడతాడు.

వారిద్దరూ ప్రేమలో పడతారు. కానీ, వారిద్దరూ కలిసి ఉండాలంటే, ముందు వారి దేశాలను విభజించే రేఖతో సహా అనేక అడ్డంకులను దాటాల్సి ఉంటుంది.

మీరు ఈ కథను కొన్నేళ్ల క్రితం ఒక భారతీయునికి వివరించినట్లయితే, వారికి వెంటనే 2004లో వచ్చిన బాలీవుడ్ చిత్రం వీర్‌ జారా గుర్తుకు వస్తుంది.

ఈ చిత్రంలో భారత్, పాకిస్తాన్ దేశాలకు చెందిన ప్రేమికులుగా షారుఖ్ ఖాన్, ప్రీతి జింటా నటించారు.

ఇదే కథాంశంతో 2019లో క్రాష్ ల్యాండింగ్ ఆన్ యూ (సీఎల్ఓవై) అనే కొరియన్ డ్రామా వచ్చింది. పొరుగు శత్రుదేశాలైన దక్షిణ కొరియా, ఉత్తర కొరియాల నేపథ్యంలో ఈ డ్రామా నడుస్తుంది.

‘‘సీఎల్ఓవై డ్రామాను ప్రపంచం ఇష్టపడింది. ఎందుకంటే, ఈ డ్రామాలో ఇరు దేశాలు పంచుకున్న వేదనను చాలా స్పష్టంగా చూపించారు. కానీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న దక్షిణాసియా ప్రజలకు ఈ కొరియన్ డ్రామా భిన్నంగా అనిపించి ఉండొచ్చు’’ అని ‘డ్రామా ఓవర్ ఫ్లవర్స్’ అనే కె-డ్రామా (కొరియన్ డ్రామా) పాడ్‌కాస్ట్ సహ వ్యాఖ్యాత పరోమా చక్రవర్తి అన్నారు.

భారత్‌లో కె-డ్రామాలు ఎంత ప్రజాదరణ పొందుతున్నాయో ఈ పాడ్‌కాస్ట్ వివరిస్తుంది.

వేర్పాటువాద తిరుగుబాటుదారులు 2000లో బాలీవుడ్ సినిమాలపై నిషేధం విధించిన తర్వాత మణిపూర్‌లో మొదటగా ‘కె-డ్రామా’ సినిమాలపై ప్రేమ మొదలైంది.

తర్వాత అది దేశంలోని మిగతా ప్రాంతాలకు విస్తరించింది.

కరోనా మహమ్మారి కారణంగా 2020లో ప్రజలంతా ఇళ్లకే పరిమితమైన సమయంలో ఈ డ్రామాలను ప్రజలు విపరీతంగా ఆదరించారు.

ఆ సమయంలో నెట్‌ఫ్లిక్స్‌ ఇండియాలో కొరియన్ డ్రామా వీక్షకుల సంఖ్య, అంతకుముందు ఏడాది కంటే 370 శాతం పెరిగింది.

కె-డ్రామాల పట్ల పెరుగుతున్న ప్రేమను, బాలీవుడ్ వ్యూయర్‌షిప్ పోకడల్లో వస్తోన్న మార్పులను పోల్చి చూడటం ఆసక్తికరంగా ఉంటుంది.

కె-డ్రామాలు కథాకథనంలో అత్యంత వాస్తవికంగా, కొత్తగా ఉంటున్నాయి. మరోవైపు కరోనా పూర్వపు స్థితిని అందుకోవడానికి బాలీవుడ్ అష్టకష్టాలు పడుతోంది.

ఈ నేపథ్యంలో ఈ రెండింటిని పోల్చి చూడటం చాలా కష్టమని ‘ఫిఫ్టీ టూ’ అనే వారపత్రిక ఎడిటర్, కె-డ్రామా అభిమాని సుప్రియ నాయర్ అన్నారు.

‘‘హిందీ సినిమాలాగే, కొరియన్ సినిమా కూడా ప్రాథమికంగా పురుష ప్రేక్షకుల కోసం రూపొందించారు. అలాగే కొరియన్ టీవీని, హిందీ టీవీలాగే మహిళల కోసం తయారు చేశారు’’ అని ఆమె చెప్పారు.

అయితే, ఈ రెండు వినోద పరిశ్రమల మధ్య చాలా సారుప్యతలు ఉన్నాయి. ఈ రెండూ మెలోడ్రామా, రొమాన్స్ కథలకు ఫేమస్.

వీర్ జారా

ఫొటో సోర్స్, YASH RAJ FILMS

ఫొటో క్యాప్షన్, వీర్ జారా చిత్రంలోని ఓ సన్నివేశం

బాలీవుడ్ లాగే, కొరియన్ డ్రామాలు కూడా ప్రేక్షకులు తమలో లీనమయ్యేలా చేస్తాయి. ఈ రెండు పరిశ్రమలకు లక్షల సంఖ్యలో వీక్షకులు, విపరీతమైన అభిమానగణం ఉంది.

కుటుంబ, సామాజిక పరిస్థితులను చూపే విధానంలో ఈ రెండు సినీ పరిశ్రమల మధ్య చాలా సారుప్యత ఉంటుంది.

‘‘మనలాగే పిల్లలపై తల్లిదండ్రులకు ఉండే పట్టు కొరియన్ డ్రామాల్లో కూడా కనబడుతుంది. మరే ఇతర పాశ్చాత్య దేశాల్లో ఇది కనిపించదు. పాశ్చాత్యులు దీన్ని అర్థం చేసుకోలేరు. కానీ, కొరియన్ డ్రామాలో ఇది కనబడుతుంది’’ అని నాయర్ అన్నారు.

కొరియన్ సినిమాలు, బాలీవుడ్ చిత్రాల్లో కథాంశాలు తరచుగా కథానాయకులు ఎదుర్కొనే సమస్యల చుట్టూ తిరుగుతాయి.

అంటే కథానాయకుడు ఎవరిని ప్రేమించాలి? ఎలాంటి కెరీర్‌ను ఎంచుకోవాలి? మహిళలు, సమాజం పట్ల, కుటుంబం పట్ల ఎలా ఎలా నడుచుకోవాలి? అనే కథాంశాల చుట్టూ తిరుగుతాయి.

తెరపై ప్రేమను ప్రదర్శించే విషయానికొస్తే, రెండు పరిశ్రమలు ఒక్కోసారి ఓవర్‌లాప్ అవుతాయి

‘‘రొమాంటిక్ లవ్, ఆదర్శవంతంగా ఉంటుంది. దాని అన్వేషణ మధురంగా, అమాయకంగా ఉంటుంది. గత కొన్నేళ్లుగా ప్రేమలో ఈ కోణం నుంచి బాలీవుడ్ దూరంగా జరుగుతోంది. కాబట్టి చాలామంది భారతీయ ప్రేక్షకులు, కొరియన్ డ్రామావైపు మొగ్గుతున్నారు’’ అని చక్రవర్తి అన్నారు.

ఉదాహరణకు తమిళం, మలయాళం, తెలుగు సినిమాల అభిమానులకు ‘హోమ్ టౌన్ చ- చ-చ’ అనే కొరియా డ్రామా కూడా నచ్చుతుందని నాయర్ చెప్పారు.

"దక్షిణ భారత చిత్రనిర్మాతలు దశాబ్దాలుగా ఇష్టపడే కథాంశాన్ని ఇది అనుసరిస్తుంది. సిటీలో ఆధునికంగా పెరిగిన ఒక అమ్మాయి, పల్లెటూరికి వెళ్లడం, అక్కడ ఒక అబ్బాయితో ప్రేమలో పడటం లాంటి కథాంశాన్నే ఇది కూడా నమ్ముకుంది’’ అని తెలిపారు.

కొరియన్ డ్రామా

ఫొటో సోర్స్, CONTENT K

ఫొటో క్యాప్షన్, మహిళల ఇతివృత్తంలో వచ్చిన అనేక కె-డ్రామాల్లో ‘సమ్‌థింగ్ ఇన్ ద రైన్’ కూడా ఒకటి

అయితే, ఈ సారుప్యతలు రెండు పరిశ్రమలు ఒకే తప్పు చేస్తున్నట్లు తెలుపుతున్నాయి. ముఖ్యంగా రొమాంటిక్ ప్రేమ విషయంలో.

ప్రేమ పేరుతో వేధించడాన్ని, మహిళల్ని శారీరకంగా బలవంతం చేయడం, హీరోయిన్లను తక్కువగా చూడటం వంటి వారిని రొమాంటిక్ ప్రేమలో భాగంగా ఇవి చూపుతున్నాయి.

‘‘అసూయను కూడా ప్రేమకు చిహ్నంగా చూపుతున్నారు. భార్యపై, స్నేహితురాలిపై పురుషుల గుత్తాధిపత్యం కూడా చాలా కామన్ విషయం అన్నట్లు చూపిస్తారు’’ అని చక్రవర్తి అన్నారు.

భారతీయ సినిమాల్లాగే కొరియన్ డ్రామాల్లో కూడా కుటుంబంలోని చెడు వ్యక్తులను చివరిలో క్షమిస్తారు. రెండు పరిశ్రమల్లో కూడా గృహ హింసకు సంబంధించిన కథలను సక్రమంగా తీయలేరు. చాలా అరుదుగా మాత్రమే ఇలాంటి కథలకు న్యాయం జరుగుతుందని చక్రవర్తి చెప్పారు.

కానీ, కొరియన్ షోలలో హీరోయిన్లను చూపించే విధానమే భారతీయ మహిళలు ఎక్కువగా వాటి పట్ల ఆకర్షితులయ్యేలా చేస్తుంది.

జానర్‌తో సంబంధం లేకుండా ఈ కొరియన్ డ్రామాల్లోని హీరోయిన్లు తెలివైన వారిగా, దృఢమైన వారిగా కనిపిస్తారు. రొమాన్స్‌కు మాత్రమే పరిమితం కాకుండా ఉంటాయి వారి పాత్రలు.

ఉదాహరణకు బాలీవుడ్ సూపర్‌హిట్ సినిమా దంగల్, వెయిట్ లిఫ్టింగ్ నేపథ్యంలో వచ్చిన కొరియన్ డ్రామా ‘కిమ్ బొక్ జో’ సినిమాలను చూద్దాం.

ఈ రెండూ మహిళా అథ్లెట్ల నేపథ్యంలో వచ్చిన సినిమాలు. 2016లోనే రెండూ విడుదలయ్యాయి.

దంగల్ సినిమాలో సూపర్‌స్టార్ అమీర్ ఖాన్ నటించారు. సినిమాలో ఆయన పాత్రకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. కూతుర్లను విజయవంతమైన రెజ్లర్లుగా తయారుచేసేందుకు ఒక తండ్రి చేసిన త్యాగాలను ఈ సినిమా ప్రధానంగా చూపుతుంది

మరోవైపు ‘కిమ్ బొక్ జో’ చిత్రం కథ అంతా యువ మహిళా వెయిట్‌లిఫ్టర్ చుట్టూనే తిరుగుతుంది.

ఈ రెండు సినిమాలు ధైర్యం, తిరుగుబాటు, త్యాగాల గురించి చెబుతాయి. కానీ, దంగల్ సినిమాలో అంతిమంగా కూతుర్లు, తమ తండ్రి నిర్ణయానికి తలొగ్గాల్సి ఉంటుంది. కానీ, కొరియన్ డ్రామా మాత్రం వెయిట్‌లిఫ్టింగ్, యువ అథ్లెట్ అంతర్గత పోరాటాలపై దృష్టి సారిస్తుంది.

చివరకు దంగల్ సినిమలో తండ్రి పోరాటం కారణంగా ఒక అద్భుతం జరిగినట్లుగా అనిపిస్తుంది. వెయిట్‌లిఫ్టింగ్ స్టోరీ మొత్తం కథానాయిక, ఆమె ఎదుగుదలపైనే సాగుతుంది.

దంగల్

ఫొటో సోర్స్, AAMIR KHAN PRODUCTIONS

కొరియన్ డ్రామా కథలు సాధారణంగా 16 ఎపిసోడ్ల పాటు సాగుతాయి.

కొరియన్ డ్రామాలలో మహిళలకు లభించే స్వేచ్ఛను చూడటం చాలా ఉత్సాహంగా ఉంటుందని నాయర్ అన్నారు.

‘‘భారత పాప్ సంస్కృతిలో ఇలాంటి స్వేచ్ఛను ఎన్నటికీ తయారు చేయలేం. ఎందుకంటే కలలో కూడా కుల, మతపరమైన నిబంధనలను దాటుకొని స్త్రీ స్వేచ్ఛగా ప్రవర్తించడాన్ని అనుమతించరు’’ అని ఆమె వ్యాఖ్యానించారు.

20వ శతాబ్ధంలో కొరియా, చైనా, తూర్పు ఆసియాలోని ఇతర ప్రాంతాలలో సంభవించిన మతపరమైన, సామాజిక మార్పుల వల్ల లభించిన స్వేచ్ఛ కూడా ఇందుకు ఒక కారణం కావొచ్చని ఆమె భావించారు.

కొరియన్ డ్రామాల్లోని కథాకథనాల క్రెడిట్‌ను స్క్రిప్ట్ రైటర్లకే ఆపాదిస్తారు. అక్కడ ఎక్కువమంది మహిళలే స్క్రిప్ట్ రైటర్లుగా ఉన్నారు.

స్క్రిప్ట్ రైటర్ పని తనానికి ఇలాంటి గౌరవాన్ని అందిస్తే బాలీవుడ్‌లో కూడా కథలు మారుతాయని వారు అంటున్నారు.

కష్టమైన కథలను సున్నితంగా, ఆసక్తికరంగా ఎలా చెప్పొచ్చు అనే దానికి ‘క్రాష్ ల్యాండింగ్ ఆన్ యు’ అనేది మంచి ఉదాహరణ.

వీడియో క్యాప్షన్, బాయ్‌కాట్ బాలీవుడ్ కథేంటి? అసలీ ట్రెండ్ ఎందుకు మొదలైంది?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)