రైటర్ పద్మభూషణ్ రివ్యూ: అతను రైటరా లేక చీటరా

ఫొటో సోర్స్, Chai Bisket/Facebook
- రచయిత, సాహితి
- హోదా, బీబీసీ కోసం
ఓ ప్రశ్నలోంచి ఓ కథ పుట్టుకొస్తుంది.
ఓ కథ నుంచే.. ఓ సినిమా ఉద్భవిస్తుంది.
ఆ సినిమా ఆలోచనకు బీజం వేస్తే... అంతకంటే పరమావధి ఏముంటుంది..? ప్రతి సినిమాకీ అంకురార్పణ ప్రశ్న నుంచే జరిగిందా? అనేది చెప్పలేం.
కానీ కొన్ని కథలు.. ప్రశ్నల నుంచి పుడతాయి. ఇంకొన్ని కొత్త ప్రశ్నల్ని సంధిస్తాయి. `స్కూల్లో పిల్లల్ని నువ్వేం అవ్వాలనుకొంటున్నావ్? అని అడిగినట్టు... ఇంట్లో ఆడపిల్లని తండ్రి... భార్యని భర్త అడిగి ఉంటే... అద్భుతమైన, ఊహకందని సమాధానాలు వినే వాళ్లు` అనే మాట `రైటర్ పద్మభూషణ్`లో ఉంది.
బహుశా.. ఈ కథకు అంకురార్పణ ఆ ప్రశ్నే కావొచ్చు. కాకపోయినా నష్టం లేదు. ఈ సినిమా చూశాక.. కచ్చితంగా ఆ ప్రశ్నే ఉద్భవిస్తుంది.
ఆ రకంగా... `రైటర్ పద్మభూషణ్` ఓ కొత్త ఆలోచనని, ప్రశ్నని రేకెత్తించాడు.

ఫొటో సోర్స్, Lahari Films/Facebook
ఇంతకీ ఎవరీ రైటర్?
అతని పేరు పద్మభూషణ్ (సుహాస్). ఓ పురాతన లైబ్రరీలో.. లైబ్రేరియన్‌గా పని చేస్తుంటాడు. తనకు రైటర్ పద్మభూషణ్ అని పిలిపించుకోవాలని కోరిక. అందుకే... `తొలి అడుగు` పేరుతో ఓ పుస్తకం కూడా రాస్తాడు.
ఈ విషయం ఇంట్లో వాళ్లకీ, స్నేహితులకి కూడా చెప్పడు. ఈ పుస్తకం కోసం 4 లక్షల రూపాయలు అప్పు చేస్తాడు. కానీ.. ఆ పుస్తకం ఎవరూ.. కొనరు, చదవరు. చదివినా `ఇదేం రాత?` అంటూ నిలదీస్తారు. ఆ పుస్తకాల్ని బలవంతంగా అంటగట్టే ప్రయత్నాలూ బెడసికొడుతుంటాయి.
అయితే... రైటర్ పద్మభూషణ్ పేరుతో ఓ నవల వచ్చి పాపులర్ అయిపోతుంది. దాన్ని పద్మభూషణే రాశాడని నమ్మి... మేనమావ తన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయడానికి రెడీ అయిపోతాడు. కొన్ని కారణాల రీత్యా.. ఎవరో రాసిన పుస్తకానికి వచ్చిన క్రెడిట్ తన పేరుమీద వేసుకోవడానికి సిద్ధ పడతాడు. మరి... ఈ రహస్యం దాగిందా? అసలు రైటర్ పద్మభూషణ్ పేరుతో రచనలు చేస్తోంది ఎవరు? ఆ చిక్కుముడి ఎలా వీడింది? అనేది మిగిలిన కథ.

ఫొటో సోర్స్, Suhas/Twitter
రచయిత బాధలు
రైటర్ పద్మభూషణ్ రెండు విషయాల్ని, రెండు నిజాల్నీ తెరపై చూపించింది. ఈరోజుల్లో రైటర్‌కున్న బాధలు అన్నీఇన్నీ కావు. కష్టపడి, ఇష్టపడి ఓ పుస్తకాన్ని పబ్లిష్ చేస్తే కొనే నాథుడు లేడు. కాపీలన్నీ ఉచితంగా పంచిపెట్టుకోవాలి. అలా ఫ్రీగా ఇచ్చినా చదివే ఓపిక ఎవరికీ ఉండడం లేదు.
`ఫలానా పుస్తకం నేనే రాశాను..` అని గొంతు చించుకొన్నా ఎవరూ వినడం లేదు. ఇది రచయితల సైడు బాధలు. ఇవన్నీ.. రైటర్ పద్మభూషణ్‌లో కనిపిస్తాయి.
ఈ సినిమా చర్చించిన మరో కీలకమైన విషయం. ఇంట్లో పిలల్ని, ముఖ్యంగా ఆడపిల్లల్ని `నువ్వేం కావాలనుకొంటున్నావ్` అని అడిగేవాళ్లు లేరు. డాక్టరూ, ఇంజనీరూ, లాయరు, కలెక్టరు మినహాయిస్తే... రచయిత కావాలని ఎవరూ కోరుకోరు. కోరుకొన్నా.. ప్రోత్సహించేవాళ్లు లేరు. ఈ రెండు విషయాల్నీ చాలా సున్నితంగా, వినోదాత్మకంగా చెప్పే ప్రయత్నం ఈ కథలో కనిపించింది.
నిజంగానే ఇది కొత్త పాయింట్. ఈ పాయింట్‌తో సినిమా చేయాలన్న దర్శక నిర్మాతల ఆలోచనల్ని మెచ్చుకోవాలి. సుహాస్‌కి ఇమేజ్ లేకపోవడం.. పద్మభూషణ్ పాత్రకు ప్లస్ అయ్యింది.
ఈ పాత్రతో ఏమైనా చేయించొచ్చు. ఓ ఫెయిల్యూర్ రచయితగా తనని పరిచయం చేసిన తీరు, ఓ రచయిత బాధల్ని ఆ పాత్రతో చెప్పించిన విధానం బాగా నచ్చుతాయి. అందులో ఫన్ ఉంది. రచయితల కోణంలో.. వాళ్లు పడుతున్నవేదన ఉంది. సినిమా అంతా ఇదే పాయింట్ తో నడుస్తుందా? అని అనుకొంటున్న తరుణంలో.. ఓ చిన్న ట్విస్ట్ వస్తుంది. తన పేరుతో మరో రచయిత నవల రాయడం, ఆ క్రెడిట్ ని తన ఖాతాలో వేసుకొని.. మనస్సాక్షిని చంపుకోలేక, ప్రేమని వదులుకోలేక సతమతమవ్వడం.. ఈ విషయాల్ని దర్శకుడు బాగా డీల్ చేశాడు.
సినిమా చూస్తున్నంత సేపూ.. పెదాలపై ఓ నవ్వు ఉంటుంది. పైగా ఓ క్యూరియాసిటీ ఏర్పడుతుంది. పద్మభూషణ్ పేరుతో రచన చేస్తున్న మరో రచయిత ఎవరో తెలుసుకోవాలన్న ఆత్రుత, ఈ నిజం బయటపడిపోతుందా? అనే టెన్షన్ రెండూ ఉంటాయి. ఇంట్రవెల్ బ్యాంగ్ కూడా ఆకట్టుకొనేదే.

ఫొటో సోర్స్, Suhas/Twitter
స్లో...అండ్ స్టడీ!
ప్రథమార్థంలో దర్శకుడు ఎక్కువగా నమ్ముకొంది.. ఫన్. దాన్ని చాలా చోట్ల వర్కవుట్ చేశాడు. పుస్తకాన్ని బలవతంగా అంటగట్టడం... సెలూన్‌లో సీను... ఇవన్నీ ఓకే అనిపిస్తాయి. థియేటర్లో సీన్.. యువతరానికి నచ్చుతుంది. అక్కడ పద్మభూషణ్ అమాయకత్వానికి మార్కులు పడతాయి.
`తప్పు చేయడం కూడా సరిగా రాదంటే.. మంచితనానికి దగ్గరగా ఉన్నడనే అర్థం` అంటూ.. పద్మభూషణ్ పాత్రని ఒక్క ముక్కలో చెప్పేశాడు దర్శకుడు. అదేంటో.. ఈ థియేటర్ సీన్‌లో అర్థం అవుతుంది.
తన పేరుతో రచన చేస్తున్న రచయిత ఎవరో తెలుసుకోవడం కోసం డిటెక్టీవ్‌లా మారి, పరిశోధన చేయాలనుకోవడం ఫన్ పుట్టిస్తుంది. ద్వితీయార్థం మాత్రం.. కథ, కథనాలు నెమ్మదిస్తాయి. మరీ సినిమా అంతా ఒకే పాయింట్ పై నడుస్తోందన్న ఫీలింగ్ కలిగిస్తుంది. కథ.. ముక్కోణపు ప్రేమకథలా టర్నింగ్ తీసుకొందా? అనిపిస్తుంది. ఆయా సన్నివేశాల్లో ఫన్ కూడా మిస్సయ్యింది.
ప్రీ క్లైమాక్స్ దగ్గర మళ్లీ కథ అందుకొన్నాడు దర్శకుడు. అక్కడ ఈ సినిమాకి `ఆత్మ`లాంటి పాయింట్ తెరపైకి వస్తుంది. ఆ పాయింట్ బాగుంది. కానీ.. డీల్ చేసే విధానం మరీ టీవీ సీరియల్‌లా అనిపిస్తుంది. ఒకరి తరవాత ఒకరు స్పీచులు దంచి కొట్టారు. ఆ టేకింగ్ చూస్తే... ఇది వెబ్ సిరీసా? లేక సినిమానా? అనే డౌటు వస్తుంది. పైగా చాలా చోట్ల దర్శకుడు లాజిక్కులు వదిలేశాడు. చాలా సన్నివేశాలు తనకు అనుకూలంగా రాసుకొన్నాడు. ఎక్కడ ఎలాంటి మలుపు కావాలో తనకు తెలుసు కాబట్టి, తనకు అనుకూలంగా కథని మార్చేశాడు.
స్టీరింగ్ తన చేతిలోనే ఉండొచ్చు. కానీ... ఇదంతా తప్పుడు డ్రైవింగ్ అనే సంగతి ప్రేక్షకులకు తెలీదా? కొన్ని లాజిక్కులు మరీ సిల్లీగా అనిపిస్తాయి. అజ్ఞాత రచయిత ఎవరో తెలుసుకోవడం ఈ కథకు ప్రాణం లాంటి పాయింట్. దాన్ని సింబాలిక్ షాట్స్‌తో.. దర్శకుడు ముందే చెప్పేస్తుంటాడు. ఈ తరహా స్క్రీన్ ప్లే.. ఇలాంటి సినిమాలకు పనికి రాదు. కొన్ని చోట్ల.. నేరుగా క్లూ ఇచ్చేస్తుంటాడు. ఇవన్నీ కథకి రావాల్సిన బిగిని తగ్గిస్తాయి.

ఫొటో సోర్స్, LahariFilms/Facebook
మధ్యతరగతి మందహాసాలు
మధ్యతరగతి ఇళ్లలోని సరదాలు, సంతోషాలు... తెరపై చూపిస్తే ఎంత బాగుంటాయో..? ఈ సినిమాలో ఆశిష్ విద్యార్థి పాత్రలో అదే కనిపించింది. నెలకి 8 వేల రూపాయలు మిగిలిపోతే.. తాను గొప్పోడ్ని అయిపోయానన్న ఫీలింగ్.. ఆ పాత్రలో కనిపిస్తుంది. మధ్య తరగతి.. మెంటాలిటీని దర్శకుడు పట్టేశాడు అని చెప్పడానికి ఆ పాత్రే గొప్ప ఉదాహరణ.
సినిమాలో చాలా వరకూ ఉదాత్తమైన పాత్రలే ఉంటాయి. ముఖ్యంగా ఆశిష్ విద్యార్థిని ఇంత పాజిటీవ్ పాత్రలో ఇంకెప్పుడూ చూసి ఉండరు. కరుడుగట్టిన విలన్ పాత్రలు చేసిన ఆశిష్‌ని ఈ తరహా పాత్రలో చూడడం ఉపశమనం కలిగిస్తుంది.
సుహాస్ పక్కింటి కుర్రాడిలా, ఆమాటకొస్తే మనింటి కుర్రాడిలా ఉన్నాడు. తనకు మేకప్ వేయాలి. అనే ఆలోచన పక్కన పెట్టినందుకు అభినందించాలి. దాంతో ఇంకాస్త సహజత్వం అబ్బింది. తన పాత్రని చాలా చురుగ్గా, సహజంగా చేసుకొంటూ వెళ్లిపోయాడు. తన బలం ఫన్, ఎమోషన్. ఇవి రెండూ బలంగా పండించాడు.
కథానాయిక టీనా శిల్పరాజ్ కూడా బాగా చేసింది. కాకపోతే.. ఆ స్థానంలో తెలిసిన హీరోయిన్ ఉంటే.. ఇంకా బాగుండేది. రోహిణి పాత్రని డిజైన్ చేసిన విధానం బాగుంది. ఈ సినిమా ఆమె సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్. గోపరాజు మరోసారి తన పాత్రలో అల్లుకుపోయారు. మిగిలిన వాళ్లంతా పాత్రోచితంగా నటించారు.
చిన్న సినిమా అయినా సరే... టెక్నికల్‌గా బాగుంది. పాటలు కథతో పాటు ప్రయాణం చేస్తాయి. టైటిల్ సాంగ్ తమాషాగా సాగింది. ఆ పాటలో... కథంతా చెప్పేశారు. మాటలు అక్కడక్కడ నవ్విస్తాయి. కొన్నింటికి ఎమోషన్ టచ్ ఇచ్చారు.
డైలాగ్ రూపంలో కామెడీ కంటే.. సందర్భానుసారంగా వచ్చే వినోదానికే ఎక్కువ వాలిడిటీ ఉంటుంది. అలాంటి సన్నివేశాలు ఈ సినిమాలో ఉన్నాయి. సుహాస్‌ని ఎలాంటి ఇమేజ్ లేదు. ఈ సినిమాలో స్టార్లు కూడా లేరు. అందుకే.. ఎలాంటి అంచనాలూ లేకుండా ఈ సినిమా చూస్తే నచ్చుతుంది. అయితే.. అక్కడక్కడ ఫోర్డ్స్ మెలోడ్రామాలు, స్పీచులూ ఉంటాయి. లాజిక్కులు దూరం అవుతాయి. వాటిని ఓపిగ్గా భరించాల్సిందే.
ఇవి కూడా చదవండి:
- కల్పనా చావ్లా: కొలంబియా స్పేస్ క్రాఫ్ట్ కూలిపోతుందని నాసాకు ముందే తెలుసా... ఆ రోజు ఏం జరిగింది
- అదానీ గ్రూప్: ఎల్ఐసీ పెట్టుబడులపై ప్రశ్నలు ఎందుకు వినిపిస్తున్నాయి
- నిన్న ఆనం, నేడు కోటంరెడ్డి... నెల్లూరు వైసీపీ నేతల్లో అసంతృప్తి పెరుగుతోందా
- దావూద్ ఇబ్రహీం: మాఫియా డాన్ హైదరాబాద్ గుట్కా కంపెనీ కథ ఏమిటి? మాణిక్ చంద్, జేఎం జోషి వివాదంలో దావూద్ పాత్ర ఏమిటి?
- పాకిస్తాన్: కిలో ఉల్లిపాయలు రూ.250... ‘కోయకుండానే కళ్లల్లో నీళ్లు’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














