ఆంధ్రప్రదేశ్: మంత్రి అంబటి రాంబాబు చుట్టూ వివాదం ఎందుకు? కొడుకుని కోల్పోయిన కుటుంబానికి దక్కాల్సిన పరిహారం చెక్ ఏమయ్యింది?

అంబటి రాంబాబు

ఫొటో సోర్స్, BBC/Ambati Rambabu

    • రచయిత, శంకర్ వడిసెట్టి
    • హోదా, బీబీసీ కోసం

ఆంధ్రప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబు చుట్టూ వివాదం ముదురుతోంది. అందుకు ఆయన తీరు కారణమని బాధితులు ఆరోపిస్తున్నారు.

ప్రమాదవశాత్తు బిడ్డను కోల్పోయిన కుటుంబానికి ప్రభుత్వం నుంచి మంజూరు చేసిన నష్టపరిహారం ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మంత్రి వ్యవహారశైలి కారణంగా వివాదం ముదురుతోంది. నిరాహారదీక్షకి దిగుతామని విపక్ష నేతలు హెచ్చరిస్తున్నారు. 

 మృతుడు అనిల్
ఫొటో క్యాప్షన్, మృతుడు అనిల్

ఎవరికి నష్టపరిహారం? ఎందుకు?

పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లి పట్టణంలో అచ్చంపేట రైల్వే గేటు సమీపంలో నివసించే తురక పర్లయ్య, గంగమ్మకి ఇద్దరు బిడ్డలు.

పర్లయ్య అనారోగ్యంతో ఇంటి వద్దనే ఉంటారు. గంగమ్మ సమీపంలోని ఓ ప్రైవేటు స్కూల్లో ఆయాగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు.

తండ్రి మంచాన పడడంతో కొడుకు అనిల్(17) కూడా పనులకు వెళుతూ ఉండేవాడు.

అనిల్ గత ఏడాది ఆగస్టు 20వ తేదీన పట్టణంలోని వినాయక హోటల్ వద్ద పనిచేస్తుండగా ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయాడు.

డ్రైనేజీ శుభ్రం చేస్తుండగా అందులో పడి ఊపిరి సలపక మరణించారు. దాంతో, ఆ కుటుంబం దుఃఖంలో మునిగిపోయింది.

పర్లయ్య కుటుంబం గుంటూరు నుంచి ఉపాధి కోసం సత్తెనపల్లి వచ్చి, చిన్న పూరిపూకలో నివసిస్తోంది.

కొడుకు మరణించిన తరువాత, ప్రభుత్వం నుంచి సహాయం అందిస్తామని స్థానిక నేతలు హామీ ఇవ్వడంతో కొంత ఉపశమనం దక్కుతుందని ఆశించారు. 

ఆ ప్రమాదంలో మరణించిన అనిల్తో పాటుగా మరో ఇద్దరికి కూడా ప్రభుత్వం నష్టపరిహారం విడుదల చేసింది.

ఒక్కొక్కరికీ రూ 5 లక్షల చొప్పున ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పరిహారం చెక్కులు జారీ అయ్యాయి.

బాధితురాలు గంగమ్మ
ఫొటో క్యాప్షన్, బాధితురాలు గంగమ్మ

ఆ చెక్కులు ఏమయ్యాయి?

ప్రభుత్వం నుంచి వచ్చిన చెక్కులు సకాలంలో బాధిత కుటుంబాలకు అందించాల్సి ఉంది.

కానీ, తమకు రావాల్సిన చెక్ మాత్రం నెలలు గడుస్తున్నా అందలేదని బాధిత కుటుంబం వాపోతోంది. 

వాస్తవానికి ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రమాదాల్లో ఎవరికైనా ప్రభుత్వం పరిహారం ప్రకటిస్తే వాటిని వెంటనే అందించే ఏర్పాట్లు చేశారు.

అనేక సందర్భాల్లో నెల లోపే బాధిత కుటుంబాలకు సహాయం అందుతోంది. కానీ, సత్తెనపల్లికి చెందిన గంగమ్మ కుటుంబానికి మాత్రం ఐదు నెలలు గడుస్తున్నా నష్టపరిహారం అందలేదు.

నిజానికి ప్రభుత్వం జారీ చేసిన చెక్కులు సకాలంలో బాధితుల చేతికి చేరకపోతే ఆ చెక్కులు రద్దయ్యే ప్రమాదం ఉంటుంది.

మళ్లీ వాటిని క్లియర్ చేయించుకోవాలంటే సామాన్య కుటుంబాలకు తలకుమించిన పని అవుతుంది.

అనిల్ మృతికి ప్రభుత్వం అందించిన పరిహారం చెక్కు తమకు చేరలేదని కుటుంబం చెబుతోంది.

అదే సమయంలో మిగిలిన ఇద్దరికీ పరిహారం అందించారని సత్తెనపల్లి మునిసిపల్ కమిషనర్ బీబీసీకి తెలిపారు.

గంగమ్మ చెక్ మాత్రం తమకు చేరలేదని, నేరుగా ప్రభుత్వం నుంచి స్థానిక ఎమ్మెల్యే అంబటి రాంబాబు తీసుకున్నారని ఆయన చెప్పారు.

అంబటి రాంబాబు

ఫొటో సోర్స్, AmbatiRambabu/Twitter

ఫొటో క్యాప్షన్, అంబటి రాంబాబు

రెండున్నర లక్షలు అడిగారు...

బాధిత కుటుంబానికి ప్రభుత్వం ఇచ్చిన నష్టపరిహారంలో సగం తమకు ఇవ్వాలని మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేసినట్టు బాధితులు చెబుతున్నారు. 

తొలుత ఈ విషయాన్ని డిసెంబర్ 18న కౌలురైతు కుటుంబాలకు సహాయం అందించడం కోసం సత్తెనపల్లి నియోజకవర్గంలో పర్యటించిన పవన్ కల్యాణ్‌ ప్రస్తావించారు. సభా వేదిక నుంచే అంబటి రాంబాబు తీరుని తప్పుబట్టారు. 

నష్టపరిహారం ఇవ్వడానికి కూడా లక్షా, రెండు లక్షలు తీసుకోవడానికి సిగ్గులేదా అంటూ జనసేన అధినేత ప్రశ్నించారు. 

పవన్ ఆరోపణలను నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఖండించారు. కానీ చెక్ మాత్రం బాధిత కుటుంబానికి అందించడానికి తగిన చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. 

"మా బిడ్డపోయాడు. నష్టపరిహారం ఇస్తామన్నారు. మొదట హోటల్ యజమాని అడుగుతున్నారని చెప్పారు. మేం వెళ్లి అడిగాం. మీ డబ్బులు నాకెందుకని ఆయన అన్నారు. ఆ తర్వాత మంత్రి గారిని కలిశాం. ఖర్చులుంటాయి.. సగం ఇవ్వాల్సిందేనన్నారు. పోలీసుల దగ్గరకు వెళ్లాం. మా చెక్ ఇవ్వలేదని చెప్పినా పట్టించుకోలేదు. అందుకే జనసేన వాళ్లని కలిశాం. అందుకే, మాకు రావాలసిన చెక్ కూడా అందకుండా చేసేశారు" అంటూ గంగమ్మ బీబీసీ ముందు ఆందోళన వ్యక్తం చేశారు.

"మేము పేదోళ్లం, మాకు వచ్చిన దానిలో సగం తీసేసుకుంటే ఎలా" అంటూ ఆమె ప్రశ్నించారు.

"రూ. 5 లక్షల చెక్ వస్తే మార్చి, రెండున్నర లక్షలు వాళ్లకిచ్చేస్తే.. ఇక మా కుటుంబంలో ఆడబిడ్డ ఉంది, ఆమె బ్రతుకు ఏమి కావాలి?" అంటూ గంగమ్మ కన్నీరు పెట్టుకున్నారు.

తమకు రావాల్సిన చెక్ ఇవ్వకుండా, ఇప్పుడు వెనక్కి పంపించేశామని చెబుతున్నారని ఆమె అన్నారు. 

పవన్ కల్యాణ్‌
ఫొటో క్యాప్షన్, పవన్ కల్యాణ్‌

మంత్రి గారే చూస్తున్నారు...

సాధారణంగా ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు, ఇతర సహాయాలన్నీ అధికారులు అందించాల్సి ఉంటుంది. అత్యధిక సందర్భాల్లో ప్రజాప్రతినిధుల సమక్షంలో అది జరుగుతుంది.

కానీ, డ్రైనేజీలో పడి మరణించిన వారి కుటుంబాలకు అందించాల్సిన సీఎంఆర్ఎఫ్ నష్టపరిహారం చెక్కులు తమకు చేరలేదని సత్తెనపల్లి మునిసిపల్ అధికారులు చెబుతున్నారు. 

"ఆ చెక్కులు మాకు వస్తే మేము పంపిణీ చేస్తాం. కానీ అవి మంత్రి గారే తీసుకున్నారు. ఆయన ఇవ్వాల్సి ఉంది. ఎందుకు ఇవ్వలేదన్నది మాకు తెలియదు. అది ఆయన్నే అడగాలి" అని సత్తెనపల్లి మునిసిపల్ కమిషనర్ సమ్మయ్య బీబీసీతో అన్నారు. 

ప్రభుత్వ సహాయం పంపిణీ బాధ్యత అధికారులదే కదా అంటే అన్ని సార్లు అలాంటివి సాధ్యం పడవంటూ ఆయన సమాధానమిచ్చారు. 

మంత్రి స్పందించడం లేదు..

నేరుగా మంత్రి లంచం అడిగారని ఆరోపణలు రావడం, బాధితులకు అందించాల్సిన చెక్ తన దగ్గర ఉంచుకోవడం, బాధితులు ఆందోళన చెందుతున్నా ఉపేక్షించడం వంటి వ్యవహారాలపై మంత్రి అంబటి రాంబాబు వివరణ కోసం బీబీసీ ప్రయత్నించింది. 

ఆయనకు కాల్ చేసినా, మెసేజ్ చేసినా స్పందించలేదు. 

మంత్రి తీరుని సత్తెనపల్లి వాసులు తప్పుబడుతున్నారు. ఓ మంత్రి హోదాలో ఉండి సామాన్య కుటుంబంతో ఆడుకోవడం సబబు కాదని రిటైర్డ్ లెక్చరర్ ఆర్ సూర్యారావు అన్నారు. 

"రాజకీయాలు, ఇతర వ్యవహారాలు ఏమైనా ఉంటే మంత్రి చూసుకోవాలి. కానీ బాధితులకు అందించాల్సిన చెక్ తన వద్ద ఉంచుకోవడం చట్టపరంగానూ తప్పు అవుతుంది. అమానవీయ వ్యవహారం కూడా. ఇలాంటి ధోరణి సరికాదు. మంత్రి తీరు మార్చుకోవాలి. గంగమ్మ కుటుంబానికి ఇవ్వాల్సిన చెక్ వెంటనే అందించేందుకు చర్యలు తీసుకోవాలి" అని ఆయన అన్నారు. 

మంత్రి మీద ఆరోపణలు వస్తే అవి తప్పని నిరూపించాల్సింది పోయి, అవి వాస్తవమే అన్నట్టుగా వ్యవహించడం తగదని సూర్యారావు అన్నారు.

వీడియో క్యాప్షన్, జగన్ విశాఖ టూర్ : సీఎం వస్తున్నారని చెట్లు నరికేశారు, నిబంధనలను పట్టించుకోరా?

నిరాహార దీక్ష చేస్తాం...

గంగమ్మ కుటుంబానికి సత్తెనపల్లికి చెందిన జనసేన నేతలు అండగా నిలుస్తున్నారు.

దాంతో, జనసేన వాళ్లు తనపై రాజకీయ లక్ష్యంతో ఆరోపణలు చేస్తున్నారంటూ గతంలో మంత్రి ఎదురుదాడి చేశారు.

తాజాగా గంగమ్మ కూడా తన చెక్ వెనక్కి పంపించేశారంటూ జనసేన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. 

బాధితురాలికి న్యాయం చేయకపోతే తాము నిరాహారదీక్ష చేస్తామంటూ ఆ పార్టీ నేతలు హెచ్చరించారు. తక్షణమే బిడ్డను కోల్పోయిన నిరుపేద కుటుంబానికి అందించాల్సిన పరిహారం చెల్లించాలని వారు మంత్రిని కోరారు. 

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)