మల్టీ లెవెల్ మార్కెటింగ్ మోసాలు: 'బంబుల్, టిండర్ వంటి యాప్స్‌తో నేను మగాళ్ళను ఎందుకు ఆకర్షించాలి?'

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రేచల్ స్క్రేయర్
- హోదా, బీబీసీ న్యూస్
డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అయిన క్యూనెట్ భారీ స్థాయిలో మదుపరులను మోసం చేసిందనే ఆరోపణలు ఎదుర్కొంటోంది. దీనిపై భారత్‌లోని ఆర్థిక నేరాల దర్యాప్తు విభాగం పరిశోధన చేపట్టింది.
క్యూనెట్ స్కీమ్ బాధితులు కొందరు బీబీసీతో మాట్లాడారు. తమ దగ్గర ప్రాడక్టులను కొని మార్కెట్‌లో విక్రయిస్తే, భారీ లాభాలు వస్తాయని క్యూనెట్ ఏజెంట్లు తమతో చెప్పారని వారన్నారు.
మరోవైపు తమ డబ్బులు షెల్ కంపెనీలు (డొల్ల కంపెనీల)ల ద్వారా చేతులు మారుతున్న విషయం ఆ స్కీమ్‌లో చేరే వారికి అసలు తెలియదని గత వారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఒక ప్రకటన విడుదల చేసింది.
ప్రస్తుతం క్యూనెట్‌కు సంబంధించిన 36 బ్యాంకు ఖాతాలను ఈడీ స్తంభింపజేసింది.
మల్టీ లెవల్ మార్కెటింగ్ స్కీమ్స్ (ఎంఎల్ఎం)ల ద్వారా కంపెనీలు తమ డైట్ సప్లిమెంట్ల నుంచి క్లీనింగ్ ప్రోడక్ట్స్ వరకు ఏవైనా ప్రజలు భారీగా కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తాయి. ఆ తర్వాత వీటిని విక్రయించడం ద్వారా ప్రజలు ఆదాయాన్ని సంపాదించే వీలుందని చెబుతాయి.

ఫొటో సోర్స్, Getty Images
నిజానికి ఇలాంటి కొన్ని స్కీమ్‌లలో భారీగా విక్రేతలను (సెల్లర్లను) నియమించుకోవడం ద్వారా కంపెనీలు డబ్బులు సంపాదిస్తుంటాయి.
దిగువ స్థాయిలో సెల్లర్లు పెట్టే డబ్బు ద్వారా పైస్థాయిలో ఉండేవారికి లాభాలు వస్తుంటాయి. కాబట్టి వినియోగదారుల నుంచి కంటే కూడా కొత్తగా నియమించుకునే సెల్లర్ల నుంచి వీరికి లాభాలు వస్తుంటాయి. అంటే ఈ సెల్లర్లకు వస్తాయని చెప్పే లాభాలు ఆపైవారికి వస్తుంటాయి.
భారత్‌లో ఇలాంటి ఎంఎల్ఎంలకు వ్యతిరేకంగా చట్టాలు కూడా ఉన్నాయి. కానీ, వాటిని అమలు చేయడం చాలా కష్టం.
నిజానికి, మరింత మంది సెల్లర్లను నియమించుకునేందుకు కంపెనీలు విపరీతమైన ఒత్తిడి చేస్తుంటాయి. దీంతో కొంతమంది ఎంఎల్ఎం ఏజెంట్లు దీని కోసం చాలాదూరం వెళ్తుంటారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇలాంటి మోసాలకు బాధితులుగా మారిన వారిలో హైదరాబాద్‌కు చెందిన రియా (పేరు మార్చాం) కూడా ఒకరు.
2019 చివర్లో తండ్రి నడిపే షూల దుకాణం మూతపడటంతో వీరి కుటుంబం గడవడం కూడా కష్టమైంది. అప్పుడే ఫేస్‌బుక్‌లో ‘‘బిజినెస్ ఆపర్చ్యునిటీ’’ పేరుతో ఆమెకు ఒక మెసేజ్ వచ్చింది. దీన్ని తన చిన్ననాటి స్నేహితురాలి స్నేహితుడు పంపించారు.
అలా క్యూనెట్ స్కీమ్‌లో ఆమె చేరారు. దీని కోసం ఆమె రుణం తీసుకున్నారు. అయితే, చేరిన తర్వాత ఉత్పత్తులను విక్రయించడం కంటే కొత్తవారిని నియమించుకోవడంపైనే ఎక్కువగా ఒత్తిడి చేయడాన్ని ఆమె గమనించారు.
మొదట కుటుంబ సభ్యులు, ఆ తర్వాత స్నేహితులు, ఆ తర్వాత సోషల్ మీడియా, ఆ తర్వాత డేటింగ్ యాప్స్ ఇలా చాలా మార్గాల నుంచి కొత్త సెల్లర్లను నియమించుకోవాలని ఆమెపై ఒత్తిడి చేసేవారు.
‘‘నా ఫోన్‌లోని నాకు తెలిసిన వారి నంబర్లన్నీ పేపర్‌పై రాసివ్వమని వారు అడిగారు. వెంటనే ఎందుకు అని అడిగాను. మీరు ప్రాడక్టులను అమ్మాలి అనుకుంటే మొదటగా మీకు నెట్‌వర్క్ ఉండాలి అని వారు చెప్పారు’’అని రియా వివరించారు.
‘‘మీరు మగవారిని కూడా దీనిలో చేరేలా ఆకర్షించగలగాలి అని ఆయన చెప్పినప్పుడు, చాలా తేడాగా అనిపించింది. బంబుల్ లేదా టిండర్‌లో నేను ఎందుకు మగవారిని ఆకర్షించాలని ప్రశ్నించుకున్నాను’’ అని ఆమె చెప్పారు.
మరోవైపు సోషల్ మీడియా ప్రొఫైల్ కూడా ఆకర్షణీయంగా కనిపించాలని వారు ఒత్తిడి చేసేవారు. వేరేవారి దగ్గర నుంచి తీసుకున్న ఖరీదైన ఆభరణాలు, బట్టలు వేసుకొని ఫోటోషూట్లు కూడా చేయమని చెప్పేవారు.
‘‘మీరు గూచీ బ్యాగు వేసుకుని ఫోటోలు దిగితే, హాయ్ ఎలా ఉన్నావ్.. అని చాలా మంది అడుగుతారు. అప్పుడు నేను ఒక బిజినెస్‌లో చేరాను, అక్కడ నాకు చాలా ఆదాయం వస్తోంది అని చెప్పాలని వారు మనకు సూచిస్తారు’’ అని ఆమె వివరించారు.
మరోవైపు ఐటీ కార్మికుడు రాఘ్ కూడా ఇలాంటి మోసాలకు బాధితుడిగా మారాడు. పైగా ఇలాంటి మోసాలతో మరింత మందిని క్యూనెట్‌లో చేర్పించాలని తనకు సూచించినట్లు ఆయన చెప్పారు.
‘‘ఒక వ్యక్తి దగ్గర చాలా ఖరీదైన వాచ్ ఉంది. దానితో ఒక ఫోటో తీసుకోమని మాకు చెప్పారు. అంటే అప్పుడు నా దగ్గర కూడా ఆ వాచ్ ఉందని అందరూ అనుకునేవారు’’అని ఆయన చెప్పారు.
‘‘నిజానికి ఇదే వాచ్‌ను నన్ను చేర్పించుకున్న వ్యక్తి ఇన్‌స్టా అకౌంట్‌లో నేను చూశాను’’అని ఆయన వివరించారు. తను మోసపోయానని తెలుసుకోవడంతోపాటు తను దాచుకున్న డబ్బులు కూడా అయిపోవడంతో, రాఘ్ పరిస్థితి మరింత దిగజారింది.
‘‘నేను సరిగా భోజనం చేసేవాడిని కాదు. మా ఇంట్లో వారు, స్నేహితులతోనూ నేను మాట్లాడలేకపోయేవాడిని. ఎందుకంటే నాకు చాలా సిగ్గుగా అనిపించేది’’అని ఆయన వివరించారు.
ఒకసారి అయితే, ఆత్మహత్య చేసుకోవాలని కూడా తనకు అనిపించినట్లు ఆయన తెలిపారు.
ఇలాంటి ఎంఎల్ఎం స్కీమ్‌లలో చేరేవారి కోసం భారీ జూమ్ మీటింగ్‌లు, డ్యాన్సింగ్ ప్రోగ్రామ్‌లు కూడా ఏర్పాటుచేస్తుంటారని కొందరు నిపుణులు వివరించారు.
ఏజెంట్లను కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా నమ్మాలని కొత్తవారికి సూచిస్తారు. వారికి వ్యతిరేకంగా మాట్లాడితే, దారుణంగా ప్రవర్తిస్తారు కూడా. రియాకు ఇలాంటి అనుభవమే ఎదురైంది.
వందల మంది సీనియర్ ఏజెంట్లుండే వాట్సాప్ గ్రూపులో తమ పేరును పదే పదే చెబుతూ ఎలా అవమానిస్తారో కూడా ఆమె వివరించారు.
‘‘వాళ్లు మన పేరు చెబుతారు. నువ్వు ఎందుకూ పనికిరావు. చచ్చిపో అని అంటారు’’అని ఆమె చెప్పారు.
అలాంటి వాతావరణంతో ఆమె కుంగుబాటుకు గురయ్యారు. దీని నుంచి బయట పడేందుకు ఆమెకు దాదాపుగా ఏడాది పట్టింది.
క్యూనెట్ స్కీమ్‌ను ‘‘పొంజీ స్కీమ్’’గా అధికారులు చెబుతున్నారు. అయితే, ఈ విషయంలో కొన్ని ప్రశ్నలు ఇప్పటికీ ప్రజలను వెంటాడుతూనే ఉన్నాయి.
ఇలాంటి ఆరోపణలను బహిరంగంగానే కంపెనీ తిరస్కరిస్తూ వచ్చింది. అయితే, కొందరు ఏజెంట్లపై వచ్చిన అక్రమ నగదు చలామణితోపాటు ఇతర తీవ్రమైన ఆరోపణలపై సంస్థ స్పందించలేదు.

ఫొటో సోర్స్, CONTRIBUTOR'S OWN PHOTO
కొత్తేమీకాదు..
‘‘ఎంఎల్ఎంలు ఏమీ కొత్తకాదు. కోవిడ్-19 వ్యాప్తి తర్వాత ఇవి మరింత ఎక్కువ మందికి చేరువ అవుతున్నాయి’’అని హైదరాబాద్‌కు చెందిన ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ చెప్పారు.
‘‘ఇదివరకు వారు నేరుగా కలిసేవారు. కానీ, ఇప్పుడు అంతా ఆన్‌లైన్‌లోనే జరుగుతోంది. అసలు ఆ మీటింగ్‌లు ఎప్పుడు, ఎక్కడ? ఎలా? నిర్వహిస్తున్నారో కూడా తెలియడం లేదు’’అని ఆయన అన్నారు.
ఎక్కువగా క్యూనెట్ ఏజెంట్లు వాట్సాప్, జూమ్ కాల్స్‌లోనే మాట్లాడతారని రియా చెప్పారు. తన ఆర్థిక పరిస్థితి కూడా వారిని గుడ్డిగా నమ్మడానికి ఒక కారణమని ఆమె వివరించారు.
‘‘అలాంటి పరిస్థితుల్లో ఉండేవారినే వారు లక్ష్యంగా చేసుకుంటారు’’అని రియా చెప్పారు.
‘‘మీరు జీవితంలో మంచిగా సంపాదిస్తూ, సంతోషంగా ఉంటే, ఎవరూ మీ దగ్గరకు రారు’’అని ఆమె వివరించారు.
ఇది కూడా చదవండి:
- బీబీసీ మోదీ డాక్యుమెంటరీ: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, దిల్లీలోని జేఎన్‌యూలో డాక్యుమెంటరీ ప్రదర్శనపై నిరసనలు
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ: ప్రైవేటు స్కూళ్లలో 25 శాతం సీట్లను పేద విద్యార్థులకు ఎందుకు ఇవ్వడం లేదు?
- 8 ఏళ్ల వయసులోనే సన్యాసినిగా మారిన వజ్రాల వ్యాపారి కూతురు...ఈ నిర్ణయంపై ఎవరేమన్నారు?
- సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్లూ... జర భద్రం
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

















