వేణుగోపాల్ ధూత్: ఇంటింటికీ కలర్ టీవీని తీసుకెళ్లిన వీడియోకాన్ ఎలా ‘పతనమైంది’?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, నిఖిల్ ఇనామ్‌దార్
- హోదా, బీబీసీ ప్రతినిధి
భారత్‌లోని ప్రముఖ పారిశ్రామికవేత్తల్లో ఒకరైన వీడియోకాన్ సీఈవో వేణుగోపాల్ ధూత్‌ను ఇటీవల కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అధికారులు అరెస్టు చేశారు.
మోసం, నేరపూరిత కుట్ర తదితర ఆరోపణలపై ఆయన మీద కేసు నమోదుచేశారు.
ఐసీఐసీఐ బ్యాంకు మాజీ చీఫ్ చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్‌లను అరెస్టు చేసిన కొన్ని రోజులకే వేణుగోపాల్‌ను కూడా సీబీఐ అదుపులోకి తీసుకొంది.
2009లో వేణుగోపాల్ కంపెనీకి చందా కొచ్చర్ అక్రమంగా భారీ రుణాలు మంజూరు చేశారని, ఫలితంగా చందా భర్త దీపక్ పునరుత్పాదక ఇంధన కంపెనీలో వేణుగోపాల్ పెట్టుబడులు పెట్టారని సీబీఐ ఆరోపిస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
ఇప్పటివరకు ఈ కేసు విషయంలో సీబీఐ చూసీచూడట్లుగా వ్యవహరిస్తోందనే ఆరోపణలు ఉండేవి. కానీ, తాజా అరెస్టులతో ఈ కేసు కీలక మలుపు తిరిగిందని చెప్పుకోవాలి.
మరోవైపు ఈ కేసులో వేణుగోపాల్ అప్రూవర్‌గా మారతానని అధికారులకు చెప్పినట్లు కొన్ని మీడియా సంస్థలు వార్తలు ప్రచురించాయి.
అదే నిజమైతే ఈ కేసు మరిన్ని అక్రమాలను వెలుగులోకి తీసుకొచ్చే అవకాశముంది. ‘‘ఎందుకంటే ధూత్ కుటుంబానికి రాజకీయ నాయకులతో చాలా సంబంధాలు ఉన్నాయి’’అని ఈ కేసుపై 2016లోనే అధికారులకు సమాచారం ఇచ్చిన అరవింద్ గుప్తా బీబీసీతో చెప్పారు.
‘‘దర్యాప్తు సరైన దిశలో వెళ్తోంది. అయితే, దీని పరిధిని మరింత విస్తరించాల్సిన అవసరముంది. ఎందుకంటే ఆ రుణానికి ఆమోదం తెలిపిన ఐసీఐసీఐ క్రెడిట్ కమిటీలో చందా కొచ్చర్ మాత్రమే లేరు. మరోవైపు ఇలా రుణాలు ఎగవేసిన వ్యాపారవేత్తల్లో వేణుగోపాల్ ధూత్ లాంటి వారు చాలా మందే ఉన్నారు’’ అని గుప్తా చెప్పారు.

ఫొటో సోర్స్, ANI
ఇంతకీ వేణుగోపాల్ ధూత్ ఎవరు?
1990ల చివర్లో, 2000ల మొదట్లో పారిశ్రామిక కార్యక్రమాలు, కార్పొరేట్ సర్కిళ్లు, బడ్జెట్ చర్చల్లో వేణుగోపాల్ ధూత్ పేరు ప్రముఖంగా వినిపించేది.
బిజినెస్ పాత్రికేయులు కూడా ఆయన్ను చాలా ఇష్టపడేవారు.
ఎందుకంటే ఆయనతో మాట్లాడటం చాలా తేలిక. అడిగిన వెంటనే పాత్రికేయులకు తన అభిప్రాయాలను చెప్పేవారు.
వేణుగోపాల్‌ది వ్యవసాయ కుటుంబం. ఆ కుటుంబం మొదట ఔరంగాబాద్‌తోపాటు మహారాష్ట్రలోని భిన్న ప్రాంతాల్లో బజాజ్ స్కూటర్ల సరఫరా లైసెన్సులు తీసుకొంది.
1990ల్లో వీడియోకాన్‌ను కంజ్యూమర్ గూడ్స్ సంస్థగా తీర్చిదిద్దడంలో వేణుగోపాల్ ధూత్ ప్రధాన పాత్ర పోషించారు.
భారత్‌లో తొలి కలర్ టీవీని గడపగడపకూ పరిచయం చేసిన ఘనత ఈసంస్థకే దక్కుతుంది.
క్రమంగా వాషింగ్ మెషీన్లు, ఏసీలు, ఫ్రిజ్‌లు లాంటి ఇతర కంజ్యూమర్ గూడ్స్ తయారీలోకీ సంస్థ అడుగుపెట్టింది. భారత్ వైట్ గూడ్స్ మార్కెట్‌లో ‘‘కింగ్’’గా వేణుగోపాల్ ధూత్‌ను పిలిచేవారు.
చిన్న పట్టణం నుంచి వచ్చి.. వచ్చీరాని ఇంగ్లిష్‌లో మాట్లాడే వేణుగోపాల్ ఒక పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్నే నిర్మించారు.
ఆయన రాజకీయ సంబంధాలు కూడా బాగా వేళ్లూనుకున్నాయి. ఆర్థిక సంస్కరణలకు ముందు భారీగా విధించిన దిగుమతి సుంకాల ద్వారా సంస్థ చాలా ప్రయోజనాలు పొందిందని మార్కెట్ నిపుణులు చెబుతుంటారు.
అయితే, ఇతర దేశీయ బ్రాండ్‌లను వెనక్కి నెట్టడానికి ప్రకటనల్లో వీడియోకాన్ దూకుడుగా ముందుకు వెళ్లడమే కారణమని విశ్లేషిస్తుంటారు.
‘‘క్రికెటర్లు, సినిమా తారలను వీరు ప్రకటనల్లోకి తీసుకొనేవారు. దేశం మొత్తంగా వీరి స్టోర్లు ఉండేవి’’అని రీటెయిల్ కన్సల్టెన్సీ టెక్‌నోప్యాక్ అడ్వైజర్స్ చైర్మన్ అరవింద్ సింఘాల్ చెప్పారు.
‘‘వారు మార్కెట్‌లో నంబర్ వన్‌గా ఉండేవారు. ఆ తర్వాత నంబరు 2, ఆ తర్వాత నంబరు 3 అలా వెనక్కి వచ్చారు. 2008-09 వరకు వారి హవా నడిచింది’’అని ఆయన వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
పతనం ఎలా?
వీడియోకాన్ పతనానికి చాలా కారణాలు ఉన్నాయి.
‘‘ప్రభుత్వాలు మారడం, మార్కెట్‌లో శాంసంగ్, ఎల్‌జీ లాంటి బ్రాండ్ల నుంచి పోటీ రావడం వీడియోకాన్‌కు ప్రతికూలంగా మారాయి. మరోవైపు తమ కోర్ మార్కెట్‌ను పక్కన పెట్టి.. ఆయిల్ అండ్ గ్యాస్, టెలికాం లాంటి తమకు అసలు పరిచయంలేని విభాగాల్లోకి కూడా సంస్థ అడుగు పెట్టింది’’అని సింఘాల్ వివరించారు.
స్పెక్ట్రం వేలంలో పాల్గొన్న తర్వాత వీడియోకాన్ టెలికమ్యూనికేషన్లను సంస్థ మొదలుపెట్టింది.
అయితే, 2జీ కుంభకోణం తర్వాత సంస్థ లైసెన్సును కూడా రద్దు చేశారు.
ఈ తర్వాత మళ్లీ కొన్ని సర్కిళ్లలో లైసెన్సులను సంస్థ తీసుకుంది. కానీ, వీటిని కూడా భారతీ ఎయిర్‌టెల్‌కు విక్రయించింది.

ఫొటో సోర్స్, Getty Images
మరోవైపు ఆయిల్, గ్యాస్ రంగంలో విజయం సాధించాలన్న వేణుగోపాల్ ధూత్ లక్ష్యాలు నెరవేరలేదు. బీమా రంగంలోనూ సంస్థకు ఇలాంటి ఎదురుదెబ్బే తగిలింది.
2012నాటికి రుణాల ఎగవేత ముప్పు అంచున ఉన్న ఎస్సార్ గ్రూప్, జీవీకే, జీఎంఆర్, రిలయన్స్ ఏడీఏజీ లాంటి సంస్థల జాబితాలో వీడియోకాన్ కూడా చేరింది.
ఇలాంటి మొదటి పది సంస్థల మొత్తం రుణం బ్యాంకుల మొత్తం రుణాల్లో 13 శాతం వరకూ ఉందని క్రెడిట్ సూసీ ‘‘హౌస్ ఆఫ్ డెట్’’నివేదిక వెల్లడించింది.
మూడేళ్ల తర్వాత కూడా పరిస్థితి మెరుగుపడలేదు. వీడియోకాన్, జీఎంఆర్ లాంటి సంస్థలు మరింత అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. అప్పట్లో రుణాలు భారీగా పెరిగిన సంస్థల జాబితాలో వీడియోకాన్ మొదటి స్థానంలో కనిపించింది.
2018లో భారత్‌లోని దివాలా వ్యవహారాలను పర్యవేక్షించే కోర్టు.. వీడియోకాన్‌పై ఇన్‌సాల్వెన్సీ ప్రక్రియలు మొదలుపెట్టింది. అదే సమయంలో సంస్థను రుణాల ఊబి నుంచి గట్టెక్కించేందుకు ఐసీఐసీఐను ఆయన ఆశ్రయించారు. ఇప్పుడు ఆయన ఇదే కేసులో అరెస్టు అయ్యారు.
కథ అలా చివరకు..
ఈ కేసుపై వచ్చిన ఆరోపణలను దాటుకొని ఐసీఐసీఐ ముందుకు వెళ్లింది.
కానీ, ఈ ఆరోపణలను దాటుకొని మళ్లీ మార్కెట్‌లో నిలదొక్కుకోవడం వేణుగోపాల్ ధూత్‌కు అంత తేలిక కాదు.
ఇలా అంచెలంచెలుగా పైకి వెళ్లి పాతాళానికి పడిపోయిన వ్యాపారవేత్తలు మరికొందరు కూడా ఉన్నారు.
2000ల్లో రుణాలు తీసుకొని ఇలానే వ్యారాలను విస్తరించాలని భావించిన కొందరు పారిశ్రామికవేత్తలు ఘోరంగా విఫలం అయ్యారని ఇన్‌స్టిట్యూషనల్ అడ్వైజరీ సంస్థ ఎల్ఐఏఎస్ ఫౌండర్, మేనేజింగ్ డైరెక్టర్ అమిత్ టండన్ చెప్పారు.
‘‘ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోవడం, ఎలాంటి అనుభవంలేని రంగాల్లోకి అడుగుపెట్టడంతో చాలా మంది పాతాళానికి పడిపోయారు. మరికొందరు ఇప్పటికీ ఏదోలా ముందుకు నెట్టుకుంటూ వస్తున్నారు’’అని ఆయన చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- కరెంటు, తిండీ లేకుండా సముద్రంలోనే నెల రోజులు, చివరికి ఎలా బయటపడ్డారు?
- కోవిడ్-19 బీఎఫ్7: ఆక్సిజన్ సిలిండర్, మందులు కొని ఇంట్లో పెట్టుకోవాలా?
- అమ్మ ఒడి : బడికి వెళ్లే పిల్లలకు ఇచ్చే రూ.15 వేలు తీసుకోవడం ఎలా?
- క్రికెట్: ఈ ఏడాది అత్యధిక పరుగులు చేసిన టాప్ 5 భారత ఆటగాళ్లు వీళ్లే...
- చార్లీ చాప్లిన్ శవపేటికను దొంగతనం చేసి, అతడి భార్యను బ్లాక్ మెయిల్ చేసిన దొంగల కథ మీకు తెలుసా..?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















