అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లపై ఆరోపణలు ఏమిటి.. కేంద్రం తెచ్చిన కొత్త రూల్స్‌తో ఏమేం మార్పులొస్తాయి

ఈకామర్స్ వార్

ఫొటో సోర్స్, Alamy

    • రచయిత, అరుణోదయ్ ముఖర్జీ
    • హోదా, బీబీసీ న్యూస్

కరోనావైరస్ వ్యాప్తి నడుమ సరకులు ఆన్‌లైన్‌లో కొనుక్కోవడం శ్రేయస్కరమని నిపుణులు చెబుతున్నారు. దీంతో మనం బయటకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. పైగా ప్రత్యేక ఆఫర్లతో సరకులు వస్తుంటాయి. సమయం కూడా ఆదా అవుతుంది.

రెండేళ్లుగా భారత్‌లో ఈ-కామర్స్ పరుగులు పెడుతోంది. ముందునుంచే పురోగమన బాటలో ఉన్న ఈ రంగానికి వరుస లాక్‌డౌన్‌లు మరింత మేలు చేశాయి.

అయితే, ఎన్నో వివాదాలు కూడా ఈ రంగాన్ని వెంటాడుతున్నాయి. దీనిపై సామాజిక మాధ్యమాల్లో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది.

వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ-కామర్స్ మార్కెట్లలో భారత్ ఒకటి. అందుకే దిగ్గజ సంస్థలు ఇక్కడ వ్యాపారం చేసేందుకు వరుస కడుతున్నాయి. అయితే, వీటిని వెంటాడుతున్న వివాదాలు ఏమిటి?

ఈకామర్స్ వార్

ఫొటో సోర్స్, Science Photo Library

ఆ నిబంధనలే మూలం..

భారత్‌లో షాపింగ్ విధానాలను ఈ-కామర్స్ సమూలంగా మార్చేసింది. వచ్చే మూడేళ్లలో ఈ రంగం విలువ మొత్తంగా 9,900 కోట్ల డాలర్లకు పెరుగుతుందని అంచనాలు ఉన్నాయి.

ముందునుంచే అభివృద్ధి బాటలో ఉన్న ఈ రంగాన్ని కరోనా మహమ్మారి పరుగులు పెట్టిస్తోంది.

ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ లాంటి ఈ-కామర్స్ దిగ్గజ సంస్థల సేవలను ఏటా కొన్ని లక్షల మంది వినియోగించుకుంటున్నారు. అయితే, ఈ సంస్థలను వరుస వివాదాలు వెంటాడుతున్నాయి.

కొంతమంది విక్రేతలకు లాభం చేకూర్చేలా, మరికొంతమందిని అణచివేసేలా ఈ సంస్థలు తమ వేదికలపై పక్షపాతం చూపిస్తున్నాయని చిన్న విక్రేతలు ఆరోపిస్తున్నారు.

మరోవైపు ఇలాంటి ఈ-కామర్స్ దిగ్గజాల వల్ల తమకు వ్యాపారం చేసుకోవడమే కష్టం అవుతోందని సాధారణ జనరల్ స్టోర్స్ యజమానులు వాపోతున్నారు.

ఈకామర్స్ వార్

ఫొటో సోర్స్, GAURAV

కొత్త నిబంధనలు ఏం చెబుతున్నాయి?

ఈ-కామర్స్ రంగంలో వివాదాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా జూన్ 21న కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది.

ముఖ్యంగా పండగలు, ప్రత్యేక సందర్భాల్లో ఇచ్చే ‘‘ఫ్లాష్ సేల్’’ ఆఫర్లను ఇకపై పెట్టకూడదని తాజా విధానాల్లో ప్రతిపాదించారు.

‘‘తమ ప్లాట్‌ఫామ్‌లలో విక్రయాలు జరిపే వారిలో కొందరికి మాత్రమే లబ్ధి చేకూర్చేలా ఎలాంటి సమాచారాన్ని వెబ్‌సైట్‌లో ఉంచకూడదు. అంతేకాదు వెబ్‌సైట్‌కు సంబంధించిన వారెవరూ ప్లాట్‌ఫామ్‌పై విక్రేతలుగా కొనసాగడానికి వీల్లేదు’’అని కొత్త నిబంధనల్లో ప్రతిపాదించారు.

విక్రయదారులందరికీ సమాన అవకాశం కల్పించేలా కొత్త నిబంధనలను ప్రతిపాదించామని కేంద్రం తెలిపింది. వీటిపై ఏమైనా సందేహాలు, సలహాలు ఇవ్వాలని అనుకుంటే, జులై 6 కల్లా తమకు పంపాలని కోరింది.

కేంద్ర ప్రభుత్వ కొత్త నిబంధనలను కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖందేల్వాల్ స్వాగతించారు. అవకతవకలకు ఈ-కామర్స్ సంస్థలను బాధ్యుల్ని చేస్తూ కొత్త నిబంధనలను తీసుకొచ్చారని ఆయన అన్నారు.

మూడేళ్ల నుంచి జరుగుతున్న చర్చలకు తెరదించుతూ కేంద్ర ప్రభుత్వం తాజా నిబంధనలను ప్రతిపాదిచింది.

ఈ కామర్స్

ఫొటో సోర్స్, Getty Images

కర్ణాటక హైకోర్టు ఏం చెప్పింది?

దీని గురించి తెలుసుకోవాలంటే మన 2019లోకి వెళ్లాలి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ అక్రమ వ్యాపార విధానాలను అనుసరిస్తున్నాయని దిల్లీకి చెందిన వర్తకుల సంస్థ సీఏఐటీ.. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)ను ఆశ్రయించింది.

అయితే, సీసీఐ తమపై దర్యాప్తు జరపకుండా అడ్డుకోవాలని అమెజాన్, ఫ్లిప్‌కార్ట్.. కర్ణాటక హైకోర్టును ఆశ్రయించాయి. అయితే, ఈ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది.

కోర్టు నిర్ణయాన్ని ప్రవీణ్ స్వాగతించారు. ‘‘ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌ల బిజినెస్ మోడల్స్.. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయనే మా వాదనతో కోర్టు ఏకీభవించినట్లయింది’’అని ఆయన వ్యాఖ్యానించారు.

దాదాపు 8 కోట్ల రీటెయిల్ స్టోర్లకు సీఏఐటీ ప్రాతినిధ్యం వహిస్తోంది. 2020 ప్రారంభంలో జెఫ్ బెజోస్ ఇండియా వచ్చినప్పుడు ఈ సంస్థ నిరసన ప్రదర్శనలు చేపట్టింది. ‘‘ఆర్థిక ఉగ్రవాదం నుంచి ఈ-కామర్స్‌కు విముక్తి కల్పించాలి’’అని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రవీణ్ కోరుతున్నారు.

ఈ అంశం కోర్టు పరిధిలో ఉండటంతో, దీనిపై మాట్లాడేందుకు లాయర్లు నిరాకరిస్తున్నారు.

ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌ లాంటి ఈ-కామర్స్ సంస్థలపై దర్యాప్తు కోసం కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా జారీచేసిన ఆదేశాలను బీబీసీ పరిశీలించింది. ‘‘తమ సంస్థకు చెందిన లేదా తమతో సంబంధమున్న విక్రయదారులకు లబ్ధి చేకూర్చేందుకు ఈ-కామర్స్ సంస్థలు ప్రయత్నిస్తున్నాయి’’అనే ఆరోపణలు వాటిలో ఉన్నాయి.

‘‘స్మార్ట్‌ఫోన్ కంపెనీలతో ఈ సంస్థలు ఎక్స్‌క్లూజివ్ ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. దీనివల్ల ఎక్కువ డిస్కౌంట్లు ఇవ్వగలుగుతున్నాయి. ఫలితంగా మిగతా సంస్థలు విక్రయాల్లో వెనుకబడుతున్నాయి’’అనే ఆరోపణలు కూడా ఆదేశాల్లో ఉన్నాయి. ఈ ఆరోపణలపై దర్యాప్తు చేపట్టాలని సీసీఐ ఆదేశించింది.

ఆన్ లైన్ యుద్ధం

ఫొటో సోర్స్, Getty Images

సీసీఐ చర్యలు తీసుకుంటుందా?

ప్రస్తుతం సీసీఐ విచారణకు ఆదేశించింది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సీసీఐ ఈ విచారణ చేపడతారు. అనంతరం సీసీఐ సభ్యులకు నివేదిక సమర్పిస్తారు.

ఈ నివేదికను సీసీఐ సమీక్షిస్తుంది. కాంపిటీషన్ నిబంధలను ఈ-కామర్స్ దిగ్గజాలు ఉల్లంఘించాయో లేదో తీర్పును వెల్లడిస్తుంది.

అయితే, దీనికి ఎంత సమయం పడుతుందో తెలియడం లేదు.

ఒకవేళ నిబంధనలను ఉల్లంఘించినట్లు రుజువైతే ఆర్థికపరమైన జరిమానా విధిస్తారు. గత మూడేళ్ల టర్నోవర్‌లో గరిష్ఠంగా పది శాతం వరకు జరిమానా విధించే అవకాశముందని కాంపిటీషన్ చట్టాల నిపుణురాలు, న్యాయవాది అదితి గోపాలకృష్ణన్ చెప్పారు.

‘‘కాంపిటీషన్ చట్టం.. సివిల్ చట్టం. దీనికింద క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి వీలుపడదు. అయితే, నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే, సంస్థలతోపాటు వాటిలోని వ్యక్తులకూ జరిమానా విధించొచ్చు. అంతేకాదు వ్యాపార నిబంధనల్లో మార్పులను కూడా సీసీఐ సూచించొచ్చు’’.

ఫ్లిప్ కార్ట్

ఫొటో సోర్స్, Getty Images

ఎఫ్‌డీఐ నిబంధనలు ఏం చెబుతున్నాయి?

ఆటోమేటిక్ రూట్‌లో ఈ రంగంలో వంద శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం వీలుకల్పించింది. అయితే, సొంతంగా వస్తువులను ఉత్పత్తిచేసి, నేరుగా వినియోగదారులకు విక్రయించేందుకు వీలులేదు.

మరోవైపు తమ ప్లాట్‌ఫామ్‌లో ఒకే విక్రయదారుడు లేదా ఒకే గ్రూప్‌కు చెందిన వస్తువులు 25 శాతానికి మించి ఉండటానికి వీలులేదు.

అదే సమయంలో వస్తువులు లేదా సేవల ధరలను ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రభావితం చేయడానికి వీలులేదు. అందరి విక్రయదారులకూ తమ ప్లాట్‌ఫామ్‌లపై సమాన అవకాశాలు కల్పించాలి.

ఈ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని ప్రవీణ్ ఖందేల్వాల్ ఆరోపిస్తున్నారు. ‘‘కొంతమంది విక్రయదారులకు లబ్ధి చేకూర్చేలా వ్యవహరిస్తున్నారు. ధరల్లో మార్పులు చేసి, ఎక్కువ డిస్కౌంట్లు ఇస్తున్నట్లు చూపిస్తున్నారు. సొంతంగా వస్తువులను కూడా ఉత్పత్తిచేసి, అమ్ముతున్నారు’’అని ఆయన ఆరోపిస్తున్నారు.

ఈ విషయంపై భారత ప్రభుత్వానికి ఇప్పటికే చాలా లేఖలు రాశామని, కానీ ఎలాంటి స్పందనా రాలేదని ఆయన వివరిస్తున్నారు.

భారత్‌లో ఈ-కామర్స్ మార్కెట్‌పై విదేశీ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. 2018 మేలో ఫ్లిప్‌కార్ట్‌ను 16 బిలియన్ డాలర్లకు వాల్‌మార్ట్ కొనుగోలు చేయడమే దీనికి ఉదాహరణ.

అయితే, ఇక్కడ ఈ-కామర్స్ దిగ్గజాలు అడుగుపెట్టడంపై చాలా మంది ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ముఖ్యంగా పోటీతత్వాన్ని పూర్తిగా లేకుండాచేసి, ఈ సంస్థలే రాజ్యమేలుతాయని విమర్శిస్తున్నారు.

‘‘ఒకరివైపు వేళ్లు చూపించడం తేలిక. కంపెనీలపై ఆరోపణలు చేయడం సరికాదు. ముందు సంస్థలు వచ్చాయి. తర్వాతే నిబంధనలు తీసుకొచ్చారు’’అని టెక్నోపార్క్ అడ్వైజర్స్ రీటెయిల్ అండ్ కన్సుమర్ హుడ్, సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అంకుర్ బైసెన్ వివరించారు.

‘‘ఈ-కామర్స్ విషయంలో ప్రభుత్వ వ్యవస్థ చాలా సంక్లిష్టంగా ఉంటుంది. దీనిలో ఎన్నో సవాళ్లు ఉన్నాయి. వీటిలో కొన్నింటికి పరిష్కారం చూపుతూ ముసాయిదా ఈ-కామర్స్ విధానాన్ని తీసుకొచ్చారు. అయితే, దీన్ని నోటిఫై చేయలేదు.’’

‘‘దీనిపై భిన్నవర్గాల అభిప్రాయాలను సేకరిస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కోలాంటి అభిప్రాయాన్ని వ్యక్తంచేస్తున్నారు. వీటన్నింటికీ విధానంలో చోటుకల్పించడం చాలా కష్టం.’’

ఈ సంక్లిష్టతను కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా తొలగించాలని నిపుణులు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు.

యాంటీ-కాంపిటీషన్ విధానం అంటే ఏమిటో సీసీఐ స్పష్టతను ఇవ్వాలని అదితి వివరించారు.

అమెజాన్ ఆఫర్లు

ఫొటో సోర్స్, facebook/AmazonIN

ఈ-కామర్స్ సంస్థలు ఏమంటున్నాయి?

ఈ అంశంపై స్పందించిందుకు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ నిరాకరించాయి. ఈ అంశం కోర్టు పరిధిలో ఉన్నందున తాము మాట్లాడబోమని వివరించాయి.

అయితే, చిన్న మధ్య స్థాయి కంపెనీలతో తాము కలిసి పనిచేస్తున్నామని, మరిన్ని ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తున్నామని గతంలో రెండు సంస్థలూ తెలిపాయి.

2025నాటికి పది లక్షల కొత్త ఉద్యోగాలు కల్పిస్తామని గతేడాది అమెజాన్ ప్రకటించింది. గతేడాది భారత్‌లో పర్యటించిన జెఫ్ బెజోస్.. బిలియన్ డాలర్ల పెట్టుబడి పెడుతున్నట్లు ప్రకటించారు. భారత వినియోగదారుల ఎగుమతులు 3 బిలియన్ డాలర్లకు చేరినట్లు గత ఏప్రిల్‌లో అమెజాన్ తెలిపింది.

మరోవైపు చిన్న వ్యాపారులకు ఊతం ఇచ్చేందుకు 2019లో సమర్థ్ ప్రోగ్రామ్‌ను ఫ్లిప్‌కార్ట్ తెరపైకి తీసుకొచ్చింది. దీనిలో భాగంగా గ్రామీణ మహిళలు, చేనేత కార్మికులు, కళాకారులకు సాయం చేస్తున్నారు.

గత ఫిబ్రవరిలో చిన్న, మధ్య స్థాయి వ్యాపారాలను ప్రధాన స్రవంతిలోకి తీసుకొచ్చేందుకు మహారాష్ట్ర ఖాదీ బోర్డుతో ఫ్లిప్‌కార్ట్ ప్రత్యేక ఒప్పందం కుదర్చుకుంది.

తమపై విచారణకు వీలుకల్పిస్తూ హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని రెండు సంస్థలూ సవాల్ చేశాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)