ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ ఆత్మహత్యలు ఎందుకు పెరుగుతున్నాయి... వీటిని ఆపేదెలా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
"నాకు, నా భార్యకు, మా అమ్మానాన్నలకు కోవిడ్ సోకింది. దాంతో, నేను భయపడి పోయాను. మేమంతా కోవిడ్‌తో చనిపోతామని అనుకున్నాను. కానీ, నా భార్య నాకు ధైర్యం చెప్పేది. అటువంటిది, ఆమే ధైర్యం కోల్పోతుందని అనుకోలేదు" అని అనకాపల్లికి చెందిన మోహన్ చెప్పారు..
విశాఖలోని కేజీహెచ్‌లో చికిత్స తీసుకున్న తరువాత ఆయన కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఆయన అమ్మానాన్నలు కూడా వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు.
"నా భార్యకు కూడా కోవిడ్ తగ్గుముఖం పట్టింది. కొన్ని రోజులు ఆస్పత్రిలో ఉండడం మంచిదని డాక్టర్లు చెప్పారు. మేం ముగ్గురం డిశ్చార్జి అయి ఇంటికి వెళ్తున్నప్పుడు ఏడ్చేసింది. ఇంటికి వెళ్లాక మేం అందరం మూడు నాలుగు గంటలకోసారి వీడియోకాల్ చేసి మాట్లాడేవాళ్లం. నన్ను ఎప్పుడు పంపిస్తారని పదే పదే అడిగేది. కానీ, మూడో రోజు కేజీహెచ్ మీద నుంచి దూకి చనిపోయిందని ఫోన్ వచ్చింది" అని మోహన్ అన్నారు.

ఆమె లాగే కోవిడ్ తగ్గదనే మానసిక అందోళనతో చనిపోతున్న వారి సంఖ్య ఆంధ్రప్రదేశ్‌లో పెరుగుతోంది. విజయనగరం జిల్లాలో కరోనా సోకిందనే ఆందోళనతో ఓ కుటుంబంలోని తల్లి,కుమార్తె,అల్లుడు ముగ్గురూ బావిలో దూకి ఆత్మహత్యకు చేసుకున్నారు. తమ వల్ల ఇద్దరు పిల్లలకు కరోనా ఎక్కడ సోకుతుందనే అందోళనతో వారు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
కృష్ణా జిల్లా పెడనలో కరోనా సోకిన దంపతులు వారం రోజులు పాటు చికిత్స తీసుకున్నారు. అయినా తగ్గలేదనే మనస్తాపంతో ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు.
గత ఏడాది చిత్తూరు జిల్లాలోని కాళహస్తి దగ్గర ఒక గ్రామంలో కూడా కరోనా సోకిందనే భయంతో ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు.
ఈ తరహా సంఘటనలు రాష్ట్రంలో చాలా చోట్ల నమోదవుతున్నాయి. కొన్ని చోట్ల ఆత్మహత్యలకు సిద్ధపడుతున్నవారిని సిబ్బంది, బంధువులు, లేదంటే తోటి పేషెంట్లు గుర్తించి కాపాడుతున్నారు. తాజాగా విశాఖ కేజీహెచ్‌లో ఆత్మహత్యకు ప్రయత్నించిన ఓ మహిళను వైద్య సిబ్బంది కాపాడగలిగారు.

ఆశ కోల్పోవడం వల్లే
ఏపీలో విశాఖ, కృష్ణా జిల్లాలలో కరోనా బాధితుల ఆత్మహత్యలు ఎక్కువగా ఉన్నాయి.
కరోనా సెకండ్ వేవ్‌లో రాష్ట్రంలో ఇప్పటి వరకు 30 మంది వరకు మానసిక ఒత్తిడితో ఆత్మహత్యలు చేసుకున్నట్లు ప్రాధమిక అంచనా ఉందని ఉత్తరాంధ్ర కోవిడ్ నోడల్ అధికారి డాక్టర్ పీవీ సుధాకర్ బీబీసీతో చెప్పారు.
"సెకండ్ వేవ్ ఉధృతి చూసి కరోనా సోకగానే చావు తప్పదని చాలా మంది భావిస్తున్నారు. కానీ కరోనా ఎంత మందికి వచ్చింది? మరణాల రేటు ఎంత? రికవరీ అవుతున్నవారి సంఖ్య ఎంత? ఇటువంటి వాటిపై ఫోకస్ పెట్టడం లేదు. ఫస్ట్ వేవ్ తో పోల్చితే సెకండ్ వేవ్‌లో మరణాలు రేటు కాస్త ఎక్కువే. అయితే పీక్ టైమ్ మాత్రమే దాదాపు 1.6 శాతానికి వెళ్లింది. ప్రస్తుతం అది ఒక శాతం కంటే తక్కువే ఉంది" అని సుధాకర్ తెలిపారు.
అయితే, ఇతర కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిని కూడా కోవిడ్ ఆత్మహత్యలుగా చెబుతున్నారని ఏపీ స్టేట్ కోవిడ్ నోడల్ ఆఫీసర్ శ్రీకాంత్ అర్జా అన్నారు.
"అది కరెక్ట్ కాదు. అందుకే, రాష్ట్రంలో ఇప్పటీ వరకు కోవిడ్ వలన ఆత్మహత్యలు చేసుకున్నవారి డేటాను సమగ్రంగా సేకరించలేదు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా మీడియాలో రిపోర్టు అవుతున్న వాటి ప్రకారం 30 నుంచి 35 వరకు ఉండవచ్చు" అని శ్రీకాంత్ చెప్పారు.

మరణాలు 0.65 శాతమే..
కరోనా శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా బలహీనుల్ని చేస్తోంది. రోజూ చావు వార్తలు వినడం,చూడటం వలన ఆరోగ్యంగా ఉన్నవారు కూడా భయాందోళనలకు గురవుతున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో జూన్ 9, 2021 నాటికి 17,79,773 మందికి కోవిడ్ నిర్ధరణ అయితే అందులో 16,64082 మంది (93.5 శాతం) కోలుకున్నారు. మరో 1,03,995 మంది అంటే 6.5 శాతం మంది చికిత్స పొందుతున్నారు. మొత్తం రాష్ట్రంలో ఇప్పటి వరకు 11,696 మంది కోవిడ్ తో మరణించారు. అంటే, కోవిడ్ సోకిన వారిలో 0.65 శాతం మంది చనిపోయారు.
కొవిడ్ బారిన పడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిలో ఒంటరితనం, చుట్టూ తమ వాళ్లూ ఎవరూ లేరన్న ఆందోళన ఎక్కువగా ఉంటుంది. కోవిడ్ వస్తే కనీసం సొంత మనుషులు కూడా దగ్గరకు రాలేని పరిస్థితి. దాంతో కోవిడ్ బాధితుల ఆత్మస్థైర్యం తగ్గిపోతుంది.
పైగా పక్కనున్న రోగుల పరిస్థితి సీరియస్‌గా ఉన్నా, మరణించినా, అది చూసి మరింత భయానికి గురవుతున్నారు. పైగా రోజుల తరబడి ఆసుపత్రిలో ఉండాల్సి రావడం కూడా రోగులను కుంగదీస్తోంది. ఇటువంటివన్నీ ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలకు దారి తీస్తున్నాయి.

మనోధైర్యమే మందు...
కోవిడ్ పై అవగాహన పెంచుకోవడం వల్ల ఆందోళనను జయించవచ్చని విమ్స్ డైరెక్టర్ కె. రాంబాబు చెబుతున్నారు. "కోవిడ్ రాగానే చనిపోతామనే ఆలోచన వీడాలి. కరోనాను జయించిన వారితో మాట్లాడాలి. వారు చెప్పిన సూచనలు పాటించాలి. భవిష్యత్తు పై ఆశలు పదిలంగా ఉంచుకోవాలి. కోవిడ్ ప్రొటోకాల్ సక్రమంగా పాటించడం మాత్రం మరిచిపోవద్దు" అని ఆయన అన్నారు.
ఏ రకమైన ఒత్తిడైనా ఆరోగ్యం పై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా మరణ భయం ఇమ్యూనిటీ పై ప్రభావం చూపుతుంది. 'పాజిటివ్' రాకముందే నెగెటివ్ ఆలోచనలతో వత్తిడికి లోనవుతున్నారు. ప్రశాంతంగా ఉంటూ మానసిక ధైర్యం కోల్పోకుండా ఆరోగ్య,ఆహార నియమాలు పాటిస్తూ...వ్యాయమం, చిన్నచిన్న పనులు చేసుకుంటూ సానుకూల ధృక్పథంతో ఉన్నవారు కరోనాని సులభంగా జయిస్తున్నారని ఆంధ్రా యూనివర్సిటీ మానసిక శాస్త్ర విభాగాధిపతి ప్రొఫెసర్ ఏంవీఆర్ రాజు బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, MVR RAJU/FACEBOOK
సోషల్ మీడియా
కోవిడ్ సమయంలో సోషల్ మీడియా ప్రభావం బాగా పెరిగిందని, అందులో 90 శాతానికి పైగా సమాచారం ఆందోళన కలిగించేదిగా ఉంటోందని ప్రొఫెసర్ రాజు అంటున్నారు.
"కోవిడ్ మరణాలు, పెరుగుతున్న కేసులు, కొత్త రకం జబ్బుల గురించిన వార్తలే మనం ఎక్కువగా చూడటానికి ఇష్టపడుతుంటాం. ఇవి ప్రతికూల ఆలోచనలు కలిగిస్తాయి. దాని వలన ఆత్మహత్య ఆలోచనలు కలుగుతాయి. దీనికి బదులు, కరోనాని జయించిన వారి వివరాలు పెద్దగా పట్టించుకోవడం ముఖ్యం. వందేళ్లు దాటిన వారు కూడా కరోనాను జయిస్తున్నారు. అటువంటి వారి ఇంటర్వ్యూలను ఆసుపత్రుల్లో ప్రసారం చేయడం, కోవిడ్ విజేతలతో, బాధితులతో మాట్లాడించడం వంటివి చేయాలి. కుటుంబ సభ్యులు కూడా బాధితులతో తరచూ మాట్లాడుతుండాలి. మంచి విషయాలను చర్చిస్తుండాలి. ఇది వారి ఒత్తిడిని దూరం చేసి విటమిన్‌లా పనిచేస్తుంది." అని ఆయన సూచిస్తున్నారు.
కోవిడ్ వస్తే మరణం తప్పదని కొందరు ఆస్పత్రుల్లో, మరికొందరు ఇళ్లల్లో ఆత్మహత్యలకు పాల్పడే ధోరణిని తగ్గించేందుకు ప్రభుత్వం వైపు నుంచి చర్యలు చేపట్టామని ఏపీ స్టేట్ కోవిడ్ నోడల్ ఆఫీసర్ శ్రీకాంత్ అర్జా బీబీసీతో చెప్పారు.
"కరోనా బారిన పడిన వారికి మానసిక ధైర్యం చెప్పేందుకు రాష్ట్రంలో 15 మంది మానసిక వైద్యులను ప్రత్యేకంగా నియమించాం. వారి ద్వారా కోవిడ్ రోగులకు టెలి కాన్ఫరెన్సులు నిర్వహించి, మనోధైర్యంో ఎలా ఉండాలో చెప్పిస్తున్నాం. రోగులలో మానసిక ధైర్యాన్ని నింపుతున్నాం. అలాగే, వాలంటీర్ల ద్వారా ఆత్మహత్యలు చేసుకోవద్దని, కోవిడ్ కొద్ది రోజుల్లో తగ్గిపోతుందని, అధైర్యపడవద్దని ప్రచారం చేయిస్తున్నాం" అని ఆయన అన్నారు.
గమనిక: (మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007)
ఇవి కూడా చదవండి:
- ఆస్ట్రేలియా వార్నింగ్: భారత్ నుంచి వస్తే అయిదేళ్ల జైలు, భారీ జరిమానా
- గంగానది ఒడ్డున ఇసుకలో బయటపడుతున్న మృతదేహాలు... యూపీ, బిహార్లలో ఏం జరుగుతోంది?
- కరోనావైరస్ను జయించారు సరే, కానీ ఈ విషయాలను ఏమాత్రం మర్చిపోకండి
- మ్యూకోర్మైకోసిస్: భారత్‌లో కోవిడ్ రోగుల అవయవాలు దెబ్బతీస్తున్న 'బ్లాక్ ఫంగస్'
- ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం
- భారత్‌లో కోవిడ్ వ్యాక్సీన్ కొరత, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో గందరగోళం... ఈ పరిస్థితికి కారణమేంటి?
- కోవిడ్-19: వ్యాక్సీన్లలో పంది మాంసం ఉంటుందా.. వ్యాక్సీన్ వేసుకుంటే నపుంసకులు అయిపోతారా
- పదకొండేళ్ల పర్యావరణ ఉద్యమకారుడిని చంపేస్తామంటూ బెదిరింపులు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








