బైపోలార్ డిజార్డర్: ఆత్మహత్యకు పురిగొల్పే మానసిక వ్యాధి

ఫొటో సోర్స్, PM Images
- రచయిత, సుశీలా సింగ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
అనిల్ (పేరు మార్చాం)కు సుమారు 11-12 సంవత్సరాల వయసుంటుంది. చాలా కోపంగా ఉన్నాడు. ఆ ఆవేశంలో ఒకసారి తల్లినే కొట్టబోయాడు. అనిల్‌లో కోపాన్ని చూడటం అతని తల్లికి అదే మొదటిసారి కాదు.
అంతకుముందు కూడా కోపం వస్తే వస్తువులను విసిరేవాడు. తమ్ముడిని నెట్టేసేవాడు, లేదంటే కొట్టేవాడు. కొన్నిసార్లు అతన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టంగా ఉండేది. స్కూల్లో స్నేహితులు కూడా తమతో గొడవపడ్డాడని, కొట్టాడని అనిల్ మీద ఫిర్యాదులు చేసేవారు.
అయితే అతని మానసిక స్థితిలో మరో మార్పు కూడా తల్లికి కనిపించింది. అతను శాంతంగా ఉన్న సమయంలో ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు. అప్పుడప్పుడు ఏ కారణం చెప్పకుండా ఏడ్చేవాడు. ఒక్కోసారి తనను తాను గదిలో బంధించుకుని తాళం వేసుకునేవాడు.
తల్లి మొదట్లో ఈ ప్రవర్తనను పెద్దగా పట్టించుకునేది కాదు. వయసు పెరుగుతున్నకొద్దీ హార్మోన్ల ప్రభావం వల్ల అలా చేస్తున్నాడని సర్ది చెప్పుకునేవారామె.
కానీ అనిల్ ప్రవర్తన విపరీతంగా మారుతుండటాన్ని తల్లి గుర్తించారు. అప్పటి నుంచి అతని మానసిక స్థితిలో హెచ్చుతగ్గులను జాగ్రత్తగా గమనించడం ప్రారంభించారు. అనిల్ పదేపదే ఇలా విపరీత పోకడలు పోవడాన్ని గుర్తించారామె. తన మీద చెయ్యెత్తినప్పుడు అనిల్ చేయిదాటి పోతున్నాడని ఆమె అర్ధం చేసుకున్నారు.
ఇలాంటి ప్రవర్తన తర్వాత అనిల్ తనకు తాను కూడా హాని చేసుకుంటాడేమోనని ఆమె భయపడ్డారు. దీనికి వైద్య సహాయం తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. మానసిక వైద్యురాలు డాక్టర్ మనీషా సింఘాల్‌తో మాట్లాడిన తరువాత తన కొడుకు బై పోలార్ డిజార్డర్‌తో బాధపడుతున్నాడని ఆమెకు అర్ధమైంది.

ఫొటో సోర్స్, Dimitri Otis
బైపోలార్ డిజార్డర్ అంటే ఏమిటి?
వైద్యులు చెప్పినదాని ప్రకారం బై పోలార్ డిజార్డర్ అనేది మెదడులోని డొపామైన్ హార్మోన్‌లలో అసమతుల్యత కారణంగా సంభవించే ఒక రకమైన మానసిక రుగ్మత. ఈ అసమతుల్యత కారణంగా ఒక వ్యక్తి మానసిక స్థితి లేదా ప్రవర్తన తీవ్రంగా మారుతుంది.
బైపోలార్ డిజార్డర్‌తో బాధపడుతున్న వ్యక్తి పిచ్చిగా ప్రవర్తించడం, లేదా డిప్రెషన్‌లోకి వెళ్లడం కనిపిస్తుంది. అతని ప్రవర్తనలో తీవ్రమైన హెచ్చు తగ్గులుంటాయి.
బై పోలార్ డిజార్డర్ వల్ల ఆ వ్యక్తి ఒక్కోసారి స్పృహ కోల్పోతాడు. లేదంటే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటాడు. ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూ ఉంటాడు. తనకు నిద్ర అవసరం అన్నది మర్చిపోతాడు. అయినా అలసి పోకుండా ఆరోగ్యంగా ఉంటాడు.
ఈ మానసిక రుగ్మతతో బాధపడుతున్న వ్యక్తి అవసరమైనదానికంటే ఎక్కువగా డబ్బును ఖర్చు చేస్తాడు. ఆలోచించకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటాడు. మనసు స్థిరంగా ఉండదు.
ఇటీవల తాను చూసిన ఓ కేసు గురించి మానసిక నిపుణురాలు పూజాశివం జైట్లీ వివరించారు.
“ఆ యువకుడు ఒక వ్యాపార కుటుంబానికి చెందిన వ్యక్తి. కానీ బిజినెస్ లో అహేతుక నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించాడు. పెద్ద పెద్ద విషయాలు ఆలోచించేవాడు. ఖరీదైన నిర్ణయాలు తీసుకునేవాడు. నిద్రపోవడం అతనికి ఇష్టం ఉండేది కాదు. తనను తాను శక్తివంతుడిగా భావించేవాడు” అంటూ ఆ వ్యాధి లక్షణాలను వివరించారు డాక్టర్ పూజాశివం.
“వీటితోపాటు అతనిలో లైంగిక వాంఛలు కూడా ఎక్కువగా ఉండేవి. అతను ఆసుపత్రిలో చేరినప్పుడు ఇక్కడి ఉద్యోగులతో చాలా విషయాలు మాట్లాడేవాడు. ఉద్యోగాలు ఇస్తానని చెప్పేవాడు. ఆస్తులను మీ పేరు మీద రాసిస్తానని చెప్పేవాడు’’ అని డాక్టర్ పూజా శివం వెల్లడించారు.
ఈ రుగ్మతతో బాధపడేవారు వాస్తవిక పరిస్థితులకు దూరంగా ఉంటారని చెబుతారు పూజాశివం. ఇలాంటి లక్షణాలు రెండు వారాలకు మించి ఉంటే అది ‘మానియా’లా మారుతందని అంటారామె

ఫొటో సోర్స్, Craig F. Walker / The Denver Post
రెండో రకం బైపోలార్ డిజార్డర్ ( హైపోమానియా):
ఈ తరహా రుగ్మతలో మనిషి తీవ్ర విచారంలో ఉన్నట్లు కనిపిస్తాడు. మనసును నిరుత్సాహం ఆవరిస్తుంది. ఏ కారణం లేకుండానే ఏడవాలనిపిస్తుంది. ఏమీ చేయలేకపోతున్నాను అన్న భావన వారిని వెంటాడుతుంది. నిద్ర రాకున్నా పడుకోవడం, లేదంటే అతిగా నిద్ర పోవడంవంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ తరహా ప్రవర్తనలో ఉండేవారు బలహీనంగా కనిపిస్తారు. ఇతరులతో సంబంధాలను తగ్గించుకుంటారు.
ఎప్పుడు గుర్తిస్తాం?
సాధారణ జీవితంలో చాలామందికి ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. కానీ రెండు మూడు రోజుల తర్వాత మామూలు మనుషులు అవుతారు. కానీ ఇది వారం, రెండు వారాలు ఇలాగే కొనసాగితే ‘హైపో మానియా’గా మారుతుంది.
పైన చెప్పిన లక్షణాలు ఎవరిలోనైనా కనిపించాయంటే ఆ వ్యక్తి బైపోలార్ డిజార్డర్ బాధితుడని అర్ధం చేసుకోవాలంటారు డాక్టర్ మనీషా సింఘాల్. మానసిక వైద్యనిపుణుల అభిప్రాయం ప్రకారం ఏ వయసు వారికైనా ఈ బైపోలార్ డిజార్డర్ రావచ్చు.
వందలో 20 నుంచి 30 కేసుల వరకు ఈ డిజార్డర్‌కు సంబంధించినవి ఉంటున్నాయని వైద్యులు చెబుతున్నారు. 20 ఏళ్లలోపు యువకులు ఈ "ఎర్లీ బైపోలార్ డిజార్డర్"కు ఎక్కువగా గురవుతున్నారని తేలింది.
“ఈ రుగ్మత పాతదే అయినా దీన్ని ఇప్పుడు కొత్తగా చూస్తున్నాం. ప్రజలకు దీనిపై అవగాహన పెరగడంతో ఈ సమస్య ఇప్పుడు ఎక్కువగా బయటకు వస్తోంది. ఈ రోజుల్లో ఇది చాలా సర్వసాధారణంగా మారింది. వందమందిలో 5శాతంమందికి ఈ వ్యాధి ఉంది ’’ అన్నారు ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ హాస్పిటల్‌లో మానసిక వైద్యురాలిగా పని చేస్తున్న రూపాలి శివాల్కర్.
40 సంవత్సరాల వయసు దాటిన వ్యక్తులలో ఇలాంటి రుగ్మతలు కనిపించినా, అవి నేరుగా మెదడులో మార్పులకు కారణమైనా దానిని 'ఆర్గానిక్ మూడ్ డిజార్డర్' అని పిలుస్తారు.

ఫొటో సోర్స్, Science Photo Library
బైపోలార్ డిజార్డర్-ఆత్మహత్య ఆలోచనలు
పిల్లలు కౌమార దశకు చేరుకున్నప్పుడు హార్మోన్ల మార్పుల వల్ల వారి మానసిక స్థితి కూడా మారుతుంది. ఈ వయసులో వారు చిన్నచిన్న విషయాలకు చిరాకు పడుతుంటారు. కోపం తెచ్చుకుంటారు. అయితే ఇది ఎక్కువసేపు ఉండదు. ఇలాంటి కేసులు 'సైక్లో థైమిక్ డిజార్డర్' కిందకు వస్తాయి. ఇక్కడ కోపమైనా, బాధయినా ఎలాంటి భావోద్వేగమైనా చాలా తక్కువ తీవ్రతతో ఉంటుంది.
పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తే ఆందోళన చెందాల్సిన పని లేదు. కానీ ఎక్కువ రోజులు కొనసాగితే బైపోలార్ డిజార్డర్ నుంచి అది ‘క్లాసికల్ మానియా’గా మారే అవకాశం ఉంది.
ఇందులో ఎదిగే దశలో ఉన్న పిల్లల్లో విపరీతమైన కోపం, దూకుడుతనం, నిద్ర అవసరం లేకపోవడం, ఎక్కువగా మాట్లాడటం, డబ్బులు విచక్షణ లేకుండా ఖర్చు చేయడం, సాధారణ స్థాయికంటే ఎక్కువ లైంగిక వాంఛలు కలగడం కనిపిస్తాయి.
ఇటీవల బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య తర్వాత ఈ తరహా మానసిక రుగ్మతలపై మీడియాలో చర్చ జరిగింది. రాజ్‌పుత్ కూడా బైపోలార్ డిజార్డర్‌తో పోరాడేవాడని చెబుతున్నారు.
"ఉన్మాదం లేదా విచారం చివరికి ఆత్మహత్యకు ప్రేరేపించే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రెండు సందర్భాల్లో వ్యక్తి వాస్తవికత నుంచి దూరంగా వెళ్లిపోతాడు. ఉన్మాదంలో ఉన్నవ్యక్తికి తాను చేయాల్సింది ఏంటో, చేయకూడనిది ఏంటో ఆలోచించే శక్తిని కోల్పోతాడు’’ అని సైకియాట్రిస్ట్ డాక్టర్ పూజా శివం జైట్లీ అన్నారు.
"ఇలాంటి పరిస్థితిలో రోగి తీవ్రమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. బైపోలార్ డిప్రెషన్‌లో ఆత్మహత్య ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. ఆ వ్యక్తి ఆత్మహత్య గురించి ఎక్కువగా మాట్లాడుతున్నాడంటే దాని 'రెడ్' సిగ్నల్‌గా భావించాలి. వెంటనే చికిత్సకు పంపించాలి’’ అని డాక్టర్ పూజా శివం అన్నారు.
ఈ రుగ్మతను నియంత్రించడం సాధ్యమేనా ?
“బైపోలార్ డిజార్డర్‌తో బాధపడుతున్న వ్యక్తి తనకు ఆత్మహత్య ఆలోచనలు వస్తున్నట్లు గుర్తిస్తారు’’ అన్నారు డాక్టర్ రూపాలీ శివాల్కర్. ఈ రుగ్మత ప్రాణాంతకం అంటారు డాక్టర్ రూపాలి.
థైరాయిడ్, రక్తపోటు, డయాబెటిస్, ఊబకాయం, మానసిక రుగ్మతలు అంటు వ్యాధులు కావు. వీటిని నియంత్రించవచ్చు. కానీ పూర్తిగా మాత్రం తొలగించలేం అన్నారు డాక్టర్ రూపాలి.
“మెదడుతో సంబంధం ఉన్న ఇలాంటి రుగ్మతలన్నీ జన్యు సంబంధమైనవి. ఇంట్లో పెద్దవాళ్లు ఎవరికైనా ఈ సమస్య ఉంటే, పిల్లల్లో కూడా అవి ఉండే అవకాశం ఉంటుంది’’ అన్నారను. సైకియాట్రిస్ట్ డాక్టర్ మనీషా సింఘాల్
“బైపోలార్ డిజార్డర్ అనేక మానసిక వ్యాధులలో ఒకటి. ఈ రుగ్మత నుంచి బయటపడ్డాక బాధితుడు తిరిగి సాధారణ జీవితం గడుపుతాడు. అప్పుడా వ్యక్తికి తన అనారోగ్యం గురించి వివరించాలి. తనలో మార్పులు వస్తున్నట్లు, మానసిక స్థితి మారుతున్నట్లు అనిపించిన వెంటనే అతనే డాక్టర్ వద్దకు వెళ్లి చికిత్స తీసుకోగలుగుతాడు’’ అన్నారు మనీషా.
మెదడు కణాలలోని మూడ్ స్టెబిలైజర్, లేదా స్టెబిలైజర్‌ను దీనికి చికిత్సలో వాడుకుంటారు. డొపామైన్‌ను సమతుల్యం చేయడం ద్వారా వ్యాధిని నియంత్రించడానికి ప్రయత్నిస్తారు.
ఇలాంటి రుగ్మతలనున్న వ్యక్తులపట్ల ఎక్కువ శ్రద్ధ, ప్రేమ చూపాల్సిన అవసరం ఉంది. ఈ రుగ్మత ఉన్నవారు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. మళ్లీ సాధారణ స్థితికి వచ్చినప్పుడు తమ తప్పులను తెలుసుకుంటారు. రుగ్మత ఉన్నవారిని ప్రశాంతంగా ఉండనివ్వాలి. అలసి పోకుండా జాగ్రత్త పడాలి. పదిమందితో కలిసేలా చూడాలి.
గమనిక: మందులు, చికిత్స ద్వారానే మానసిక వ్యాధులను నయం చేయడం వీలవుతుంది. ఇందుకోసం మానసిక వైద్య నిపుణుల సలహాలు తీసుకోవాలి. మీకు లేదా మీకు తెలిసిన వారికి ఎవరికైనా ఇలాంటి మానసిక అసౌకర్యం, లక్షణాలు ఉంటే వెంటనే హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేసి సహాయం పొందవచ్చు
హెల్ప్‌లైన్ నంబర్లు
సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ - 1800-599-0019
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్ అండ్ అలైడ్ సైన్సెస్ - 9868396824, 9868396841, 011-22574820
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్ - 080 - 26995000
విద్యాసాగర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ అలైడ్ సైన్సెస్ - 011 2980 2980
ఇవి కూడా చదవండి:
- #BBCShe: విజయవంతమైన కులాంతర వివాహాల్ని మీడియా ఎందుకు చూపదు?
- పోర్ట్ రాయల్: చరిత్రలో ‘అత్యంత దుర్మార్గపు నగరం’ ఎందుకైంది? సముద్రంలో ఎలా మునిగిపోయింది?
- కోకాకోలా, మొసలిపేడ, పంది పేగులు... గర్భం రాకుండా పూర్వం వీటితో ఏం చేసేవారో తెలుసా?
- ‘కులాంతర వివాహం చేసుకుంటే టెర్రరిస్టుల్లా చూస్తున్నారు’
- మహిళలు వీర్యాన్ని దాచుకుని, తమకి కావలసినప్పుడు గర్భం ధరించే అవకాశం వస్తే ఈ ప్రపంచం ఎలా మారుతుంది?
- మహిళల భావప్రాప్తి కోసం ఫ్రాన్స్ రాకుమారి మేరీ బోనపార్టీ చేసిన ప్రయోగాలేంటి?
- విచారాన్ని, ఒత్తిడిని మనకు అనుకూలంగా వాడుకోవడం ఎలా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








