విచారాన్ని, ఒత్తిడిని మనకు అనుకూలంగా వాడుకోవడం ఎలా?

కొన్ని రకాల విచారాలతో లాభాలు కూడా ఉంటాయి

ఫొటో సోర్స్, Getty Images

ఆందోళన చెందడం వలన ఒత్తిడి కలుగుతుంది. కానీ కొన్ని రకాల విచారాలతో లాభాలు కూడా ఉంటాయి.

"నేనొక ప్రొఫెషనల్‌గా విచారించే వ్యక్తిని’’ అని కేట్ స్వీని ఆనందంగా చెబుతారు. ఆమె జీవితంలో ఆమె నియంత్రణలో లేని చాలా విషయాల గురించి ఒత్తిడి చెందుతూ ఉండేవారు.

‘‘ఇప్పుడు కూడా తల్లి తండ్రులు కోవిడ్ నివారణకు పాటించాల్సిన భౌతిక దూరం లాంటి నియమాలను పాటిస్తున్నారో లేదోనని విచారిస్తూ ఉంటాను” అని చెప్పారు.

చాలా మందిని ఎప్పుడూ ఏదో ఒక చింత వేధిస్తూనే ఉంటుంది. కానీ స్వీని విషయానికి వస్తే ఆమె ఈ విచారాన్ని ఆధారంగా చేసుకుని తన కెరీర్‌నే మలుచుకున్నారు.

ఆమె కాలిఫోర్నియా యూనివర్సిటీలో హెల్త్ సైకాలజిస్ట్‌గా పని చేస్తున్నారు. ఆమె విచారం, ఒత్తిడి అనే అంశాలపై నిపుణురాలు.

"సొంత జీవితంలోని అనుభవాలనే పరిశోధన కోసం ఎవరైనా వాడుకోవడం అరుదు” అని స్వీని అంటారు.

చిన్న చిన్న విషయాలైన.. పరీక్షల ఫలితాల కోసం వేచి చూడటం నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం విచారించడం లాంటి విషయాల వలన కూడా అనేక లాభాలు ఉంటాయని ఆమె తన పరిశోధనలో తేల్చారు.

కార్చిచ్చు

ఫొటో సోర్స్, Getty Images

రక రకాల విచారాలు

విచారాన్ని రెండు రకాలుగా నిర్వచించారు.

విచారం.. ‘ముప్పుని తగ్గించే లక్ష్యంతో మనిషి ప్రవర్తనా విధానాన్ని ప్రభావితం చేసే ఒక మానసిక స్థితి’ అని వాతావరణ మార్పులను పరిశోధిస్తున్న మానసిక శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

చేదు అనుభవాలు, భవిష్యత్ కోసం పదే పదే వచ్చే ఆలోచనల ఆధారంగా పుట్టేదే విచారమని మానసిక శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. విచారించడం వలన తప్పకుండా హాని జరుగుతుంది. ఒక విషయం గురించి ఆందోళన చెందటం వలన అది మరో విచారానికి దారి తీసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

సాధారణంగా మానసికంగా, శారీరకంగా బలహీనంగా ఉండటం వలన తీవ్రమైన విచారం ఉండే అవకాశం ఉంది. నిద్ర లేమి వలన, కాన్సర్ స్క్రీనింగ్ కి వెళ్ళకపోవడం వలన కూడా విచారం కలుగవచ్చు. సహజంగా అదుపు చేయలేని తీవ్రమైన విచారం కలుగుతూ ఉంటే అది ఆందోళనతో కూడిన సమస్యగా చెప్పవచ్చు.

"ఒక స్పష్టమైన విషయానికి కాకుండా ప్రతి విషయానికి విచారానికి లోనవుతుంటే అది సమస్యలకు దారి తీస్తుంది” అని ఎక్సటెర్ యూనివర్సిటీలో క్లినికల్ మానసిక శాస్త్రవేత్తగా పని చేస్తున్నఎడ్వర్డ్ వాట్కిన్స్ చెప్పారు.

కానీ, చాలా తక్కువ స్థాయిలో విచారించడం లాభదాయకమని ఆయన చెప్పారు.

తరచుగా కార్చిర్చులు చెలరేగే కొన్ని ఆస్ట్రేలియా రాష్ట్రాలలో నివసించే ప్రజల్లో ఆ మంటలను ఎదుర్కొనేందుకు కావల్సిన విచారం ఉంటుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనిని చదువులో ఉత్తమంగా నిలబడటానికి, పొగ తాగడం మానడానికి చేసే ప్రయత్నాలలో కలిగే విచారంతో పోల్చారు.

విచారం చాలా వరకు భవిష్యత్ గురించి ఉంటుంది. అందువలన ఇది ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది.

విచారించడం వలన ఏదైనా చెడు జరగకుండా ఆపడానికి ఉపయోగపడడం గాని, లేదా జరగబోయేదానికి సంసిద్ధంగా ఉండటానికి గాని పనికొస్తుందని స్వీని అన్నారు.

గ్రెటా థన్‌బర్గ్

ఫొటో సోర్స్, Getty Images

దీనికి వాట్కిన్స్ మూడు పద్ధతులు చెబుతారు

ఒకటి: ఏదైనా ఒక విషయం గురించి విచారించడం వలన తగిన చర్యలు తీసుకోవడానికి అవకాశం కలగడం కానీ, ఏదైనా చేయడానికి ఉత్సాహం కానీ కలుగుతుంది.

రెండు: ఏదైనా విషయం పట్ల నెలకొన్న అస్పష్టత నుంచి బయటపడటానికి అవసరమైన చర్యలు తీసుకునేందుకు సహాయపడుతుంది.

మూడు: విచారించడం వలన ఏ పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉండటం, ప్రణాళిక చేసుకోవడం, సమస్యను నివారించడానికి తగిన ఉపాయం ఆలోచించేలా చేస్తుంది.

విచారానికి, పని చేసే సామర్ధ్యానికి మధ్యనున్న సంబంధం గురించి చెబుతూ.. విచారం చాలా తక్కువ ఉంటే చేయాల్సిన పనుల గురించి ఉత్సాహం తగ్గొచ్చని, ఒక వేళ విచారం ఎక్కువగా ఉంటే స్తబ్దంగా అయిపోయే అవకాశం ఉందని ఆయన అన్నారు.

ఒక సమస్యని అర్ధం చేసుకోవడం, విచారించి దానికి తగిన చర్యలు తీసుకోవడంపై దృష్టి పెట్టడం వలన మార్పుకు కారణమవుతుందని ఆయన చెప్పారు.

మనిషిలో పుట్టే ప్రతీ భావోద్వేగం లాగే విచారానికి కూడా పనుంది అని స్వీని అన్నారు.

“అదొక సంకేతం. మనకి జరగబోయే దాని గురించి హెచ్చరిస్తూ మన దృష్టిని అటువైపు మరలుస్తుంది, దాని వలన ఏదైనా ఉపద్రవం సంభవించకుండా చూడటం కానీ, లేదా దానికి సంసిద్ధంగా ఉండేలా గానీ చేస్తుంది” అని ఆమె అన్నారు.

కోవిడ్ గురించి తొలినాళ్లలో చేసిన పరిశోధనలు ఈ విషయాన్ని నిరూపించాయి. కోవిడ్-19 గురించి నిర్వహించిన ఒక సర్వే వైరస్ గురించి ప్రజలు ఎంత విచారిస్తున్నారో చెప్పమని అడిగింది.

వైరస్ సోకితే ముప్పు ఉందని అనుకుంటున్నట్లు ఎక్కువమంది చెప్పారు. అలాగే, వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా ఎక్కువ విచారిస్తున్నట్లు తెలిపారు.

ప్లకార్డుతో బాలబాలికలు

ఫొటో సోర్స్, Getty Images

ఉత్తమ పద్దతిలో విచారించడం ఎలా?

కోవిడ్ 19 పట్ల నెలకొన్న అనిశ్చిత పరిస్థితి మరింత విచారానికి గురి చేస్తోంది. ఏదైనా ఒక నిర్ణీత సమయంలో పరిష్కారమవుతుందనుకునే అంశం గురించి విచారించడం సులభంగానే ఉంటుంది.

ఉదాహరణకు 2016లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల గురించి స్వీని విచారించారు. రెండు సంవత్సరాల తర్వాత మధ్యంతర ఎన్నికల సమయంలో ఆమె ప్రజలను ఓటు వేయమని కోరుతూ 500 పోస్ట్ కార్డులు రాశారు.

విచారాన్ని సానుకూలంగా వాడుకోవడానికి స్వీని మూడంచెల పద్దతిని చెబుతారు.

1. ముందు విచారానికి ఒక పేరివ్వండి.

2. ఆ సమస్యను పరిష్కరించడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలో మానసికంగా ఆలోచించుకోండి.

3. విచారం తగ్గడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకున్న తర్వాత , విచారాన్ని తగ్గించే పరిస్థితులను యధాతధంగా స్వీకరించే వాస్తవ స్థితిలోకి రండి.

పరిస్థితులతో పాటు ప్రయాణించగలిగే స్వభావం కోవిడ్ 19 ఒత్తిడి నుంచి బయటపడటానికి చాలా ఉపయోగపడుతుందని స్వీని చెప్పారు. వాస్తవ పరిస్థితులకు తగ్గట్టు ప్రవర్తించడం కూడా మానసిక ఆరోగ్యానికి మంచిదని ఆమె చెప్పారు.

ఓటు వేయాలంటూ ప్రచారం

ఫొటో సోర్స్, Getty Images

యూరప్‌లో యువత కరోనా మహమ్మారి సమయంలో మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు వాట్కిన్స్ సూచనల పట్టీని తయారు చేసారు.

“భౌతిక దూరం పాటించడం వలన వైరస్ బారి నుంచి రక్షించుకోగలమనే సమాచారంతో పాటు, కరోనా వైరస్ గురించి తేలికపాటి విచారం ఉండటం వలన వైరస్ గురించి అమలులో ఉన్న నిబంధనలను పాటించడానికి సహాయపడుతుంది. అదే వైరస్ గురించి తీవ్రంగా ఆలోచించడం వలన సరైన చర్యలు తీసుకోవడంలో విఫలమవుతారు" అని విచారం గురించి అందుబాటులో ఉన్న సమాచారం చెబుతోంది.

"ఎవరైనా పనులకు హాజరవ్వాలనుకుంటే, ఏమి జరుగుతుందోననే భయాన్ని వీడి వారు ప్రయాణం చేస్తున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, భౌతిక దూరం గురించి ఆలోచించుకోవాలి. సంసిద్ధంగా ఉండటం వలన పరిస్థితులు వారి నియంత్రణలో ఉంటాయి, ఏదో జరుగుతుందని భయపడుతూ ఉండటం వలన ఆందోళన పెరుగుతుంది” అని వాట్కిన్స్ వివరించారు.

విచారం తగ్గించుకోవడానికి క్రమబద్ధమైన జీవనం సాగించటం, ఆప్తులను, ఇరుగు పొరుగు వారిని తరచుగా పలకరిస్తూ ఉండటం చేయాలని సూచించారు.

స్వీయ విచారాన్ని వీడి ఇతరుల గురించి ఆలోచించేలా మలుచుకోవడం లాంటివి చేయాలని మానసిక శాస్త్రవేత్తలు సూచనలు చేశారు.

ఈ లాక్ డౌన్ నుంచి బయట పడాలని స్వీని ఆశావాదంతో ఆలోచిస్తున్నారు. కానీ, ఏదైనా ముప్పు గురించి విచారించవలసిన అవసరం ఉందేమోనని ఆమె వారానికొకసారి తరచి చూసుకుంటారు.

విచారంతో సమతుల్యత సాధించడం కొంచెం కష్టంగా ఉన్నప్పటికీ.. బ్యాలెన్స్ చేయడమే లక్ష్యంగా పెట్టుకుంటే చాలా మందికి విచారం కూడా ఉపయోగపడుతుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)