బాపు వీరు వటేగోవాంకార్: 'కృష్ణా నది దగ్గర బొబ్బిలి పులి'

ఫొటో సోర్స్, RAJU SANADI
- రచయిత, తుషార్ కులకర్ణి, మొహిసిన్ ముల్లా
- హోదా, బీబీసీ మరాఠీ
''రంగా షిండే బోర్గావ్‌లో ఓ బాలికను చంపేశాడు. కానీ అతడికి వ్యతిరేకంగా కోర్టులో సాక్ష్యం చెప్పటానికి ఎవరూ ముందుకు రావటం లేదు. అతడంటే వారికి భయం. అప్పుడు నలుగురు యువతులు నా దగ్గరకు వచ్చారు. 'ఇప్పుడు మేం ఎక్కడికి వెళ్లాలి? మేం నిస్సహాయులం. మేం మా శరీరాలను కృష్ణా నదికి, కోయనా నదికి అర్పిస్తాం. దయవుంచి మాకు సాయం చేయండి' అని కోరారు. అప్పుడు నేను గొడ్డలి తీసుకుని రంగాను చంపేశాను.''
బాపు వీరు వటేగోవాంకార్ తను చేసిన మొదటి హత్య గురించి ఈ కథ చెప్తుండేవారు. పసుపు రంగు తలపాగా, నుదుట పసుపు బొట్టు, తెల్ల గడ్డం, తెల్ల మీసాలు, భుజాన నల్లటి కంబళి.. చాలా సుపరిచితమైన మనిషి. యూట్యూబ్‌లో, ఫేస్‌బుక్‌లో జనం దీనిని చాలా సార్లు చూశారు. ఈ 'కృష్ణా నది దగ్గర బొబ్బిలి పులి' ఇటీవల చనిపోయారు. ఆ తర్వాత ఆయనకు సంబంధించిన వీడియోలు వీక్షించటం ఇంకా పెరిగింది.
జనం ఆయనను బాపు అని గౌరవంగా పిలుస్తారు. ఇంకొందరు ఆయనను ధాణ్య (శక్తివంతుడు) అని పిలుస్తారు. మరికొందరు ఆయనను 'రాబిన్ హుడ్' అని పిలుస్తారు. ఆయన సుమారు వంద సంవత్సరాలు జీవించారు. జనం ఆయన ముందు తలవంచి అభివాదం చేసేవారు. యువత ఆయనతో సెల్ఫీలు తీసుకునేది. ఆయనను ప్రవచనాలు ఇవ్వటానికి ఆహ్వానించేవారు. బాపు వీరు వటేగోవాంకార్ కథ ఆసక్తిని, దిగ్భ్రాంతిని కలిగిస్తుంది.

ఫొటో సోర్స్, Bapu Biru Wategaonkar/Facebook
మల్లయోధుడు హంతకుడయ్యాడు
బాపు స్వస్థలం బోర్గావ్. అది పశ్చిమ మహారాష్ట్రలోని సాంగ్లి జిల్లాలో వాల్వా తహశీల్ పరిధిలో గల ఓ గ్రామం. చిన్నప్పటి నుంచీ కుస్తీ పోటీలంటే ఆయనకు చాలా ఇష్టం. అతడు చాలా బలశాలి. ఎవరైనా ఏ మహిళనైనా వేధించటానికి, అత్యాచారం చేయటానికి ప్రయత్నిస్తే ఆయనకు చాలా కోపం వచ్చేదని స్థానిక పాత్రికేయుడు రాజు సనాది మాకు చెప్పారు.
ఆ కారణంతోనే అతడు ఆయుధం చేపట్టి తొలి హత్య చేశాడు. అతడు రంగా షిండేను చంపినపుడు రంగా సోదరుడు బాపుపై ప్రతీకారం తీర్చుకోవటానికి ప్రయత్నించాడు. కానీ అతడిని కూడా బాపు చంపేశాడు.
అప్పుడు అరెస్ట్ భయంతో బాపు కనిపించకుండాపోయాడు. ''నేను మా ఊరికి వెళ్తే పోలీసులు నన్ను అరెస్ట్ చేస్తార'న్న భయం ఆయనది. దాంతో ఆయన సహ్యాద్రి కీకారణ్యంలో దాక్కున్నారు. అతడు నేరస్తుడు. కానీ ఆయనను జనం అభిమానించేవారు.''

ఫొటో సోర్స్, AMOL GAVLI
పాతికేళ్లు పోలీసులకు దొరకకుండా
''బాపు వీరు తన ప్రతిష్ఠ గురించి ఎప్పుడూ పట్టించుకునేవారు. ఆ కాలంలో ఉత్తరప్రదేశ్‌లో చాలా మంది బందిపోటు దొంగలు తయారయ్యారు. బాపు వీరు కూడా అలాంటి వాడే. ఆయన ఒక గ్రామంలో ఓ గూండాని చంపాడు. అది అతడి తొలి హత్య. అతడికి మంచి దృక్కోణం లభించటానికి అది దోహదపడింది'' అని కొల్హాపూర్‌లో ఎన్నో ఏళ్లు పనిచేసిన సీనియర్ జర్నలిస్ట్ అనంత్ దీక్షిత్ పేర్కొన్నారు.
ఆయన అడవిలో తిరుగుతూ అనుకోకుండా ఏదో గ్రామానికి వెళ్లేవాడు. అక్కడ భోజనం చేసేవాడు. కానీ తర్వాత ఎప్పుడో ఆయన గురించి జనానికి తెలిసేది. పోలీసులు ఆ గ్రామానికి వచ్చే ముందే ఆయన అక్కడి నుంచి మాయమయ్యేవాడు. ఆయన 25 సంవత్సరాల పాటు అరెస్ట్ కాకుండా తప్పించుకోగలిగాడు.
ఆయన గ్రామాల్లో ఘర్షణలను పరిష్కరించేవాడని, మహిళలకు సాయం చేసేవాడని జనం చెప్తుంటారు. కాలక్రమంలో ఆయన తన ముఠాను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ముఠాలో సుఖ్‌దేవ్ గావ్లీ కూడా ఉన్నారు.
''ఆయనతో మేం 15, 16 మందిమి ఉండేవాళ్లం. ఆయన పెద్దన్న లాగా మా బాగోగులు చూసుకునేవాడు. ఎవరైనా జబ్బుపడితే ఆయన కలవరపడిపోయేవాడు'' అని సుఖ్‌దేవ్ గావ్లీ మాకు చెప్పారు.

ఫొటో సోర్స్, SAGAR KADAV
శిక్షపూర్తయ్యాక ఆధ్యాత్మిక బోధనలు
బాపు వీరు పోలీసులకు లొంగిపోయినపుడు యావజ్జీవ కారాగారశిక్ష విధించారు. ఆ శిక్ష పూర్తయిన తర్వాత ఆయన తన గ్రామానికి తిరిగి వెళ్లాడు. ఆయన జీవితం మారిపోయింది.
భజనలు-కీర్తనలు, ఆధ్యాత్మిక ప్రవచనాలను ప్రారంభించారు. మద్యపానానికి వ్యతిరేకంగా యువతకు సందేశాలివ్వటం ఆరంభించారు. నేరపూరిత కార్యక్రమాల్లో పాల్గొనవద్దని యువతకు బోధించేవారు.
''శిక్ష పూర్తయిన తర్వాత బాపు తన ప్రతష్ఠను మెరుగుపరచుకోవటానికి ప్రయత్నించారు. కానీ అంతకుముందలి పరిస్థితిని పరిగణనలోకి తీసుకుంటే చట్టప్రకారం ఆయన నేరస్థుడు'' అని మాజీ పోలీస్ అధికారి భీమ్‌రావ్ చాచే బీబీసీతో పేర్కొన్నారు. బాపును అరెస్ట్ చేసిన పోలీస్ బృందంలో ఆయన కూడా ఉన్నారు.

ఫొటో సోర్స్, SAGAR KADAV
జానపద గీతాలు, సినిమా
పశ్చిమ మహారాష్ట్రలోని సాంగ్లి, సతారా ప్రాంతాలకు చెందిన జానపద కళాకారులు బాపు మీద పాటలు రాశారు. గ్రామీణ ఉత్సవాల్లో ఆయన కథలను తమాషా అనే జానపద కళారూపంలో చెప్పేవారు.
కాలాంబా జైలు ఖైదీ అనే వాగనాట్య నాటక రూపం చాలా ప్రఖ్యాతి పొందింది. ఇది బాపు జీవితం మీద రామచంద్ర బాన్సోడే రాసిన వాగనాట్య నాటకం. ''బాపు వీరు వటేగోవాంకార్‌ను నా భర్త రామచంద్ర బాన్సోడే జైలులో కలిశారు. ఆయన కథనంతా విని ఈ వాగనాట్య రాశారు'' అని జానపద కళాకారిణి మంగళ బాన్సోడే తెలిపారు.
''మేం మా వాగనాట్యను వాస్తవ కథల ఆధారంగా ప్రదర్శించేవాళ్లం. గ్రామీణ ప్రాంతాల్లో ఈ నాటక రూపానికి మంచి ఆదరణ ఉండేది. దీంతో బాపు వీరు వటేగావోంకార్ మీద నాటకం రాయాలని నా భర్త భావించారు. ఈ నాటకాన్ని ప్రదర్శించినపుడు ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన లభించింది. ఈ నాటకం చూడటం కోసం ఐదారు వేల మంది జనం పోగయ్యేవారు. వారంతా చప్పట్లు, ఈలలతో అభినందించేవారు'' అని ఆమె గుర్తుచేసుకున్నారు.
ఆయన జీవితం మీద 'బాపు వీరు వటేగోవాంకర్' పేరుతో ఒక సినిమా కూడా ఉంది. ప్రఖ్యాత నటుడు మిలింద్ గుణాజీ ఆ సినిమాలో బాపు పాత్ర పోషించారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








