అభిప్రాయం: ‘జిగ్నేష్ లాంటి నాయకులతో హిందుత్వ రాజకీయాలకు ప్రమాదమా?’

ఫొటో సోర్స్, PUNIT PARANJPE/AFP/Getty Images
- రచయిత, రాజేశ్ జోషీ
- హోదా, రేడియో ఎడిటర్, బీబీసీ హిందీ
కాషాయ జెండాలు పట్టుకున్న గుంపులు 'జై భీమ్' అని రాసి ఉన్న నీలం జెండాలు పట్టుకున్న వారి వెంటపడి కొట్టడం, వారి వాహనాల అద్దాలను పగులగొట్టడం, పోలీసుల సమక్షంలోనే ఇరువర్గాలూ రాళ్లు రువ్వుకోవడం వంటి దృశ్యాలను మీరు యూట్యూబ్‌లో అందుబాటులో ఉన్న వీడియోలో చూసే ఉండొచ్చు.
దళితులకు వ్యతిరేకంగా అణచిపెట్టిన ఏ ఆగ్రహం ఇప్పుడు పుణె సమీపంలోని భీమా-కోరెగావ్‌లో బయటకు వచ్చింది?
చిత్పావన్ బ్రాహ్మణ పేష్వాలపై 'అంటరానివారు'గా పేరొందిన మహార్ సైనికుల సాధించిన విజయానికి 200 ఏళ్లు పూర్తయిన సందర్భంగా భీమా-కోరెగాంలో లక్షలాది మంది దళితులు గుమికూడుతారని ముందే తెలుసు. 1927లో బీఆర్ అంబేడ్కర్ హాజరైన చోటనే ఈ ఏడాది దళిత సంఘాలు గుమికూడాయి.
కేంద్రంలో, రాష్ట్రంలో హిందుత్వ అనుకూల పార్టీలు అధికారంలో ఉన్నప్పటికీ, దళిత, హిందూ సంస్థల మధ్య అల్లర్లను ఆపే ప్రయత్నాలు ఎందుకు చేయలేదు? గత ఏడాదిన్నరగా మహారాష్ట్రలోని అనేక నగరాలలో మౌన ప్రదర్శనలు నిర్వహించిన మరాఠాల మౌనం భీమా-కోరెగావ్‌లో బద్దలైంది.

భావజాల సారూప్యత
దళితులపై హింసను ప్రేరేపించినందుకు ఇద్దరు వ్యక్తులపై పోలీసులు క్రిమినల్ కేసులు పెట్టారు. వారిద్దరూ పుణె, ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో పేరున్న హిందుత్వవాద నేతలే.
వారిలో ఒకరు 85 ఏళ్ల శంభాజీ భిడే. ఆయన గురించి నరేంద్ర మోదీ తాను ప్రధాని కావడానికి ముందు చేసిన ప్రసంగంలో, ''మేం ఎప్పుడైనా సమాజం కోసం ఏదైనా కార్యక్రమం చేయాలనుకుంటే, అప్పుడు భిడే గూరూజీనే మా ముందు ఉదాహరణగా నిలిచేవారు'' అన్నారన్నది గుర్తుంచుకోవాలి.
ఈ ఇద్దరు నిందితులకు ఆరెస్సెస్‌తో బొడ్డుతాడు బంధం ఉంది. 1984 వరకు శంభాజీ భిడే ఆరెస్సెస్‌లో ప్రచారక్‌గా పని చేసారు.
హిందూ సమాజాన్ని ఏకం చేయాలని, కుల వివక్షను నిర్మూలించాలని హిందుత్వ సంస్థలు చెబుతున్నాయి. మరి భీమా-కోరెగావ్‌లో హిందువులు ఎందుకు దళితులను బహిరంగంగా సవాలు చేస్తున్నారు?
దళితులకూ, దళితేతర హిందువులకూ మధ్య వైరాన్ని తగ్గించడానికి బదులు, కొంత మంది పక్కనే ఉన్న ఒక గ్రామంలో మధ్యయుగాల నాటి దళిత బోధకుడైన గోవింద్ గైక్వాడ్ సమాధిపై ఉన్న బోర్డును పగులగొట్టారు.

ఫొటో సోర్స్, AFP/GETTY IMAGES
మౌనప్రదర్శనలు
ఇదెందుకు జరిగింది? దీనిని మరాఠాలు మహారాష్ట్రలోని అనేక నగరాలు, పట్టణాలలో నిర్వహించిన మౌన ప్రదర్శనల నేపథ్యంలో చూడాల్సి ఉంటుంది.
లక్షలాది మంది మరాఠాలు చేతుల్లో కాషాయ జెండాలను ప్రదర్శిస్తూ గత ఏడాదిన్నరగా మహారాష్ట్రలోని నగరాలు, పట్టణాల్లో మౌన ప్రదర్శనలతో వార్తల్లో నిలిచారు. పూర్తి నిశ్శబ్దంగా, క్రమశిక్షణతో వారు ఈ ప్రదర్శనలు చేపట్టారు. వారి ప్రదర్శనలలో ఒక్క నినాదం కూడా లేదు. ఒక్క ప్రసంగమూ లేదు.
నగరాల్లోని వీధుల గుండా జరిగే ఈ ప్రదర్శనలకు విద్యార్థినులు నేతృత్వం వహించేవారు. జులై 13, 2016న అహ్మద్‌నగర్ జిల్లాలోని కోపర్ది గ్రామంలో ఒక 13 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య జరిగాక ఈ మౌన క్రోధం పెల్లుబికింది.
ఈ కేసులో నిందితులు దళితులు. వారిని కఠినంగా శిక్షించాలనేది మరాఠాల డిమాండ్. అదే సమయంలో ఈ ఆందోళనలో దళిత వ్యతిరేక డిమాండ్లు కూడా వినవచ్చాయి.
మరాఠాలకు ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఇవ్వాలనేది వాటిలో ప్రధానమైనది. దాంతో పాటు షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల చట్టం 'దుర్వినియోగం' కాకుండా దానిలో మార్పులు చేయాలనేది మరొకటి.

ఫొటో సోర్స్, Sairat Movie
సైరాట్ సినిమాపై వివాదం
మరాఠాలు, దళితుల మధ్య ప్రస్తుతం తలెత్తిన ఈ వివాదం వీధుల్లోకెక్కడానికి ముందు - అది నాగరాజ్ మంజులే సినిమా 'సైరాట్' విడుదల సందర్భంగా తెరపై బయటపడింది.
ఒక జమిందారీ కుటుంబానికి చెందిన యువతి, దళిత యువకుడి ప్రేమ విషాదాంతంగా ముగిసే ప్రేమకథే సైరాట్.
ఈ సినిమాతో మరాఠా-దళితుల మధ్య వాతావరణం మరోసారి వేడెక్కింది.
మరాఠాల ఆగ్రహాన్ని పలు రకాలుగా విశ్లేషించే ప్రయత్నాలు జరిగాయి.
కొంతమంది సమీక్షకులు దీనిని అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల ఆగ్రహం ఈ విధంగా బయట పడుతుందని అంటే, మరికొందరు విశ్లేషకులు మరాఠా ఉద్యమం వెనుక రిజర్వేషన్ వ్యవస్థను తొలగించాలనే వ్యూహం ఉందని ఆరోపిస్తున్నారు.

ఫొటో సోర్స్, HULTON ARCHIVE
ఫ్రీలాన్సింగ్ హిందుత్వవాదులు
ఈ మౌన ప్రదర్శనల వెనుక హిందుత్వ సంస్థల హస్తం ఉన్నా లేకున్నా, అనేక చోట్ల ఆరెస్సెస్ ప్రతినిదులు మాత్రం రిజర్వేషన్‌లను పున:సమీక్షించాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు.
ఎప్పుడైనా ఎన్నికల్లో ఓడిపోతామనే భయం కలిగినప్పుడు విస్తృత హిందూ సమాజానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సంఘ్ పరివార్ శక్తులు రిజర్వేషన్‌ను ఒక అన్యాయంగా పేర్కొంటూ , దానిని అంతం చేయాలనే ప్రకటనలు చేస్తుంటాయి.
బీజేపీ, ఇతర హిందుత్వ సంస్థలు మరాఠాల దళిత వ్యతిరేక మౌన ప్రదర్శనలను నిర్లక్ష్యం చేయలేవు. అలా అని వాటిని సమర్థించనూ లేవు.
దళిత వ్యతిరేక దృక్పథాన్ని అవలంబిస్తే, దాని వల్ల ఎన్నికల్లో వాటికి చాలా నష్టం. అందువల్లే, ఇందు కోసం కొంత మంది ఫ్రీలాన్సింగ్ హిందుత్వవాదులను పుణెలో ప్రవేశపెట్టారు. దళిత వ్యతిరేక భావాల్ని రెచ్చగొట్టారు. తమపై ప్రత్యక్షంగా దళిత వ్యతిరేకులన్న ఆరోపణలు రాకుండా జాగ్రత్త తీసుకున్నారు.
పుణె చుట్టుపక్కల ప్రాంతాలలో దళిత వ్యతిరేక వాతావరణం ఏర్పడుతున్నపుడు ఆరెస్సెస్ ఒక్క ప్రకటనా చేయలేదు.
కానీ ఎప్పుడైతే దళితులపై కాషాయ ధ్వజదారులు దాడికి పాల్పడ్డారో, 'మహారాష్ట్రలో దళితులు, హిందువుల మధ్య పోరు'లాంటి హెడ్ లైన్లు కనిపించడం మొదలయ్యాయో.. సంఘ్ ప్రచార్ ప్రముఖ్ డాక్టర్ మన్మోహన్ వైద్య క్షణం ఆలస్యం చేయకుండా వాటిని 'హిందూ వ్యతిరేక శక్తుల చర్యలు'గా అభివర్ణించారు.
ఇదే మన్మోహన్ వైద్య, 2017 జనవరిలో ఐదు రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా ఒక ప్రసంగంలో రిజర్వేషన్ విధానాన్ని తొలగించాలని సూచించారు.
''ప్రపంచంలోని ఏ దేశంలోనూ రిజర్వేషన్ వ్యవస్థ లేదు. ఇది మంచిది కాదు. అందరికీ సమాన అవకాశాలు లభించాలి'' అని అన్నారు.

ఫొటో సోర్స్, SAM PANTHAKY/AFP/Getty Images
ఊపిరాడనివ్వని దళిత నేతలు
సంఘ్ పరివార్ అప్పుడప్పుడూ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తూ ఉన్నత కులాల వారి నమ్మకాన్ని కోల్పోకుండా జాగ్రత్త పడుతుంది. అదే సమయంలో రామ్ విలాస్ పాశ్వాన్, రామదాస్ అఠవలే, ఉదిత్ రాజ్‌లాంటి దళిత నేతలను తన వైపు నిలబెట్టుకుంటూ బీజేపీ అంటే బ్రాహ్మణ-బనియా అన్న ముద్ర పడకుండా, దళితుల మద్దతు జారిపోకుండా జాగ్రత్త వహిస్తుంది.
అయితే గుజరాత్ ఎన్నికల్లో జిగ్నేష్ మేవానీ లాంటి 'వామపక్ష' భావజాలం ఉన్న దళిత నేత విజయం సాధించడం తమకు ఏ మాత్రం శుభసూచికం కాదని సంఘ్ పరివార్, బీజేపీలు గుర్తించాయి.
జిగ్నేష్ మేవానీ, సహారన్‌పూర్‌కు చెందిన చంద్రశేఖర్ అజాద్ 'రావణ్' లాంటి నేతలు వాళ్లకు గొంతులో చిక్కుకున్న ముల్లులా మారారు. ఈ ముల్లును తొలగించాలంటే రక్తం కారుతుంది. దానిని అలాగే ఉండనిస్తే నొప్పి కలుగుతుంది. అయితే ఈ ముల్లును నిష్క్రియం చేయడం సంఘ్ పరివార్‌కు చాలా అవసరం.
ఇలాంటి సందర్భాలలో ఇప్పటి వరకు 'దేశద్రోహి' అన్న ట్యాగ్ బాగానే పని చేసింది. కానీ ఇలా ఎంతవరకు?
మా ఇతర కథనాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








