ప్రెస్ రివ్యూ : తెలంగాణలో కేంబ్రిడ్జి వర్సిటీ పరిశోధనలు!

ఫొటో సోర్స్, PATRICK KOVARIK
జనగామకు దగ్గరలోని గజగిరిగుట్ట పరిసరాల్లో కేంబ్రిడ్జి వర్సిటీతో కలసి హెచ్‌సీయూ పరిశోధన చేపట్టబోతోంది. దీనిపై సాక్షి ఒక కథనం ప్రచురించింది. ఆ కథనం ప్రకారం..
అక్కడ వేల ఏళ్ల క్రితం మానవుల ఆవాసం, బూడిద కుప్ప తరహాలో దిబ్బ ఏర్పాటు, మానవ మనుగడ అదృశ్యం కావడంపై పరిశోధన చేయబోతున్నారు.
జనగామ సమీపంలోని గజగిరిగుట్ట ప్రాంతంలో మనిషి జాడ ఎందుకు కనుమరుగైంది? ఈ రహస్యం తెలుసుకునేందుకు పరిశోధన చేయబోతున్నారు.
మానవ మనుగడలో కీలక భూమిక పోషించిన అంశాలు, ఆనాడు వినియోగించిన ధాన్యం, నాటి పర్యావరణం, ఉపద్రవాలేమైనా సంభవించాయా, మనిషి మనుగడ లేకుండా అదృశ్యమవటానికి కారణమైన అంశాలేంటి అనే విషయాలపై అధ్యయనం చేయబోతున్నారు.
ఇంగ్లండ్‌లోని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం నేతృత్వంలో ఈ అన్వేషణ కొనసాగనుంది.
ఇటీవల కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం ఆర్కియాలజీ విభాగం ప్రొఫెసర్ డోరియన్ ఫుల్లర్ హెచ్‌సీయూను సంప్రదించారు. గజగిరిగుట్ట పరిసరాల్లో పరిశోధనలకు ఫుల్లర్, హెచ్‌సీయూ ప్రొఫెసర్ కె.పుల్లారావు ముందుకొచ్చారు.
- ఆ ప్రాంతంలో తవ్వకాలు జరిపి మానవ మనుగడ సాగిన కాలాన్ని కచ్చితంగా నిర్ధారిస్తారు.
- ప్రస్తుతం బూడిద మట్టి పేరుకుపోయిన ప్రాంతంలో కొన్ని మీటర్ల లోతు తవ్వి నాటి మనుషులు ఆహారంగా వినియోగించిన ధాన్యపు గింజలు, ఇతర పదార్థాల అవశేషాలను గుర్తిస్తారు.
- మట్టి పొరల్లో నిక్షిప్తమైన పుప్పొడి అవశేషాలనూ సేకరిస్తారు.
- దీనివల్ల నాటి ఆహార పదార్థాలు, సేకరణ తీరు, పుప్పొడి ఆధారంగా నాటి వృక్ష జాతి, పర్యావరణం తీరును కచ్చితంగా అంచనా వేస్తారు.
ఇందుకు 'యాక్సలేటర్ మాస్ స్పెక్ట్రోమిట్రీ (ఏఎంఎస్)'అనే ఆధునిక విధానాన్ని అనుసరించనున్నారు.
దీని ద్వారా సేకరించిన అతి సూక్ష్మ నమూనాలను ఆక్స్‌ఫర్డ్, ఆరిజోనా యూనివర్సిటీ ల్యాబ్‌ల్లో పరిశోధిస్తారు.

ఫొటో సోర్స్, Getty Images
సంక్రాంతికి చార్జీల బాదుడు
సంక్రాంతి ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రైవేటు ట్రావెల్స్ సంస్థలు దోపిడీకి తెరతీశాయంటూ ఆంధ్రజ్యోతి ఒక కథనం ప్రచురించింది. దాని ప్రకారం..
సంక్రాంతి కోసం సొంతూరుకి వెళ్లేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. పండుగ నేపథ్యంలో ఏపీ, తెలంగాణ ఆర్టీసీలు ప్రస్తుత టికెట్ ధరపై 50 శాతం అదనంగా వసూలు చేస్తున్నాయి.
ప్రైవేటు ట్రావెల్స్ మాత్రం ఇష్టం వచ్చినట్లు చార్జీలు పెంచుకుని సంక్రాంతి డిమాండ్‌ను సొమ్ము చేసుకుంటున్నాయి.
ప్రైవేటు ఆపరేటర్లు తత్కాల్ విధానాన్ని అమలు చేస్తున్నారు. చార్జీలను 3రెట్లు పెంచినట్లు చెబుతున్నారు.
పండుగ పూట ఊరు వెళ్లాలంటే అడిగినంత చెల్లిస్తేనే టికెట్ రిజర్వు చేస్తున్నారని ప్రయాణికులు చెబుతున్నారు.
నిబంధనలకు విరుద్ధంగా టికెట్ ధరలను పెంచేస్తున్నా.. రవాణా శాఖ అధికారులు ప్రైవేటు ట్రావెల్స్‌పై చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.
హైదరాబాద్ నుంచి విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ, ఒంగోలు, నెల్లూరు, తిరుపతితో పాటు రాయలసీమలోని పలు ప్రాంతాలకు వెళ్లే బస్సులకు డిమాండ్ విపరీతంగా ఉంటుంది.
డిమాండ్‌కు అనుగుణంగా ప్రభుత్వం బస్సులను నడపాల్సి ఉన్నా ఆ పని చేయలేదు. మొక్కుబడిగా స్పెషల్ బస్సులు వేసి ఊరుకుంది.
రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లు నడుపుతున్నా సరిపోవడం లేదు.

ఫొటో సోర్స్, AP Govt
అమరావతిపై అంతర్జాతీయ మీడియా సదస్సు
అమరావతిలో అభివృద్ధి పనులను జాతీయ, అంతర్జాతీయ మీడియాకు పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించనున్నారు.
అమరావతి నిర్మాణంలో కీలక మైలురాళ్లు, పెట్టుబడులకు అద్భుత అవకాశాలను ప్రపంచానికి తెలియజేస్తారు.
రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ) 9న జాతీయ మీడియా సహకారంతో ఢిల్లీలో ఈ సదస్సును నిర్వహిస్తోంది.
సదస్సులో అమరావతి మీడియా సిటీ అనే అంశంపై ప్రధానంగా దృష్టి సారిస్తారు.
మీడియా సిటీలో 2036 కల్లా నేరుగా 65 వేల ఉద్యోగాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు.
మీడియా ఆధారిత ఇంటిగ్రేటెడ్ బిజినెస్ పార్క్ (ఐబీపీ) ఏర్పాటు, యానిమేషన్, వీఎ్‌ఫఎక్స్, గేమింగ్ కంపెనీలకు ఆర్థిక ప్రోత్సాహకాలు, తొలి దశలో 20-30 ఎకరాల్లో టాలీవుడ్/బాలీవుడ్, టీవీ, లోకాస్ట్ కంటెంట్‌లకు అత్యాధునిక టెక్నాలజీతో స్టూడియో ఏర్పాటు చేయాలన్నారు.

ఫొటో సోర్స్, Telangana CMO
ఏప్రిల్ నుంచి కేసీఆర్ ఎన్నికల కసరత్తు
తెలంగాణ సీఎం కేసీఆర్, తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత వచ్చే ఏప్రిల్ నుంచి జిల్లా స్థాయి, లోక్‌సభ, శాసనసభ నియోజకవర్గాల వారిగా సమీక్షలు నిర్వహించనున్నారు. పార్టీ ఎంపీలు, శాసనసభ్యులు, ముఖ్యనేతలతో ఆయన భేటీ అవుతారని ఈనాడు ఒక కథనం ప్రచురించింది. దాని ప్రకారం..
వచ్చే సార్వత్రిక ఎన్నికలకు పార్టీ కార్యకర్తలను సిద్ధం చేసే పనిలో కేసీఆర్ ఉన్నారు.
పార్టీ ముఖ్య నేతలతో ఇటీవల సమావేశమైన కేసీఆర్ కార్యాచరణ ఖరారు చేశారు.
ఈ నెలలోనే అన్ని నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జీలను ప్రకటిస్తారు.
మార్చిలో శాసనసభ బడ్జెట్ సమావేశాలు ముగిసిన వెంటనే అన్ని శాసనసభ, లోక్‌సభ నియోజకవర్గాల్లో పార్టీ స్థితిగతులపై సూక్ష్మస్థాయి పరిశీలనకు శ్రీకారం చుడతారు.
ఆయా నియోజకవర్గాల ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జీలతో సమావేశాలు నిర్వహిస్తారు.
వంద రోజులపాటు కొనసాగే ఈ ప్రక్రియ ద్వారా క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు, వచ్చే ఎన్నికల్లో విజయానికి అవసరమైన వ్యూహాలను ఖరారు చేస్తారు.

పరోక్ష పద్ధతిలో సర్పంచ్ ఎంపిక!
తెలంగాణలో నూతన పంచాయతీరాజ్ చట్టం రూపకల్పన కోసం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. దీనిపై ఆంధ్రజ్యోతి ఒక కథనం ప్రచురించింది. దాని ప్రకారం..
గ్రామ సర్పంచ్‌లను పరోక్ష పద్ధతిలో ఎన్నుకోవాలని, ఈ మేరకు నూతన పంచాయతీరాజ్ చట్టంలో పొందుపరచాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. పంచాయతీ ఎన్నికల్లో వార్డు సభ్యులుగా గెలిచిన వారు.. తమలో ఒకరిని సర్పంచ్‌గా ఎన్నుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
జూపల్లి కృష్ణారావు నేతృత్వంలోని ఈ కమిటీ సభ్యులతో ప్రగతి భవన్‌లో ఆయన సమావేశమయ్యారు.
చట్టంలో పొందుపర్చాల్సిన అంశాలకు సంబంధించి తన అభిప్రాయాలను వివరించారు.
సర్పంచ్ పదవికి పరోక్ష ఎన్నిక నిర్వహించాలనే విషయంపై సీఎం స్పష్టత ఇచ్చారు.
పంచాయతీ ఎన్నికలను పార్టీ పరంగా నిర్వహించాలా? పార్టీ రహితంగా నిర్వహించాలా? అనే విషయంపైనా సభ్యులతో చర్చించారు.
దీనిపై కేబినెట్ సబ్ కమిటీ అధ్యయనం చేసి, శాస్త్రీయంగా తగిన సూచన చేయాలని చెప్పారు.

ఇక ఊరూరా సిసీ కెమేరాలు!
తెలంగాణలో ఇక ఊరూరా ప్రధాన కూడళ్లలో సీసీటీవీలు ఏర్పాటు చేయాలని పోలీస్ శాఖ నిర్ణయించినట్లు ఆంధ్రజ్యోతి ఒక కథనం ప్రచురించింది. నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ, కేసుల దర్యాప్తునకు ఉపయోగపడే సీసీటీవీ కెమెరాలను గ్రామాల్లో ఏర్పాటు చేయనున్నారు.
ప్రతి గ్రామంలో ప్రధాన కూడళ్లు, నేరాలు జరిగే అవకాశమున్న ప్రాంతాల్లో నిఘా నేత్రాలు ఏర్పాటు చేసి, వాటిని మండల కేంద్రంలోని ఠాణాల్లో కమాండ్ కంట్రోల్ రూంలకు అనుసంధానం చేయనున్నారు.
సీసీటీవీ కెమెరాల కొనుగోలు, కేబులింగ్, కమాండ్ కంట్రోల్ రూంల ఏర్పాటు బాధ్యతను ఒక కంపెనీకి అప్పగించింది. గ్రామాల్లో 'నేను సైతం' కోసం ప్రతి అధికారీ చొరవ తీసుకోవాలని డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
హైదరాబాద్‌లో నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ కోసం 'నేను సైతం' కార్యక్రమాన్ని ప్రారంభించారు.
హైదరాబాద్‌లో గత ఏడాది నమోదైన 90 శాతం కేసులను వీటి ద్వారానే ఛేదించారు.
హైదరాబాద్‌ను స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణ పల్లెలకూ సీసీటీవీ కెమెరాలను విస్తరించబోతోంది పోలీసు శాఖ.
డీజీపీ ఆదేశాల నేపథ్యంలో రాచకొండ పోలీసులు యాదాద్రి-భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని 14 గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.
మా ఇతర కథనాలు:
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.








