హెచ్-1బీ: అమెరికా వీసాల నిబంధనల మార్పుతో ఎవరికి ఎంత నష్టం?

ఫొటో సోర్స్, iStock
- రచయిత, వరికూటి రామకృష్ణ
- హోదా, బీబీసీ ప్రతినిధి
మరోసారి హెచ్-1బీ వీసాల వివాదం రాజుకుంది. అమెరికాలోని ప్రవాస భారతీయుల్లో మళ్లీ ఆందోళనలు రేకెత్తుతున్నాయి.
వీసాల గడువు పొడిగింపు ఉండదని, హెచ్-4 వీసాల మీద అమెరికాకు వచ్చే హెచ్-1బీ కుటుంబ సభ్యులకు వర్క్ పర్మిట్ ఇకపై ఇవ్వరనే వార్తలు అటు ప్రవాస భారతీయులతోపాటు ఇక్కడి వారి బంధువులను ఆందోళనకు గురి చేస్తున్నాయి.
అసలు వివాదం ఏమిటి? అమెరికా ఏం చేయబోతోంది? ప్రవాస భారతీయులపై ఏ మేరకు ప్రభావం పడుతుంది? వంటి అంశాలు చూద్దాం..

ఫొటో సోర్స్, Stephen Brashear/getty images
ప్రస్తుత వివాదం
హెచ్-1బీ వీసాతో అమెరికాలో తాత్కాలికంగా ఉద్యోగం చేయొచ్చు. ఈ వీసా కలిగిన వారి కుటుంబ సభ్యులు అంటే జీవిత భాగస్వామి, 21 ఏళ్లలోపు పిల్లలు కూడా అమెరికాలో ఉండొచ్చు. ఇందుకు వారికి హెచ్-4 వీసాలు జారీ చేస్తారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా వీరికి కూడా వర్క్ పర్మిట్ ఇచ్చేలా 2015లో నిబంధన తీసుకొచ్చారు. నాటి నుంచి హెచ్-4 వీసాదారులకు ఉద్యోగం చేయడానికి అనుమతులు వచ్చాయి.
అయితే ప్రస్తుతం ట్రంప్ ప్రభుత్వం ఈ నిబంధన తీసి వేయాలని భావిస్తున్నట్లు ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అలాగే హెచ్-1బీ వీసాల గడువును పొడిగించే సదుపాయాన్ని కూడా తొలగించేందుకు రంగం సిద్ధమవుతోందని వార్తలు వస్తున్నాయి. ప్రవాస భారతీయులు, వారి బంధువుల్లో ఈ అంశాలు ఆందోళన కలిగిస్తున్నాయి.

ఫొటో సోర్స్, Justin Sullivan/getty images
వ్యతిరేకత ఎందుకు?
అమెరికాలోని ఐటీ సంస్థలు ప్రధానంగా నిపుణుల కోసం హెచ్-1బీ వీసాలపై ఆధారపడుతున్నాయి. ఆ దేశంలో కార్యకలాపాలు సాగిస్తున్న భారత ఐటీ సంస్థలు కూడా ఇదే పద్ధతిని అనుసరిస్తున్నాయి. అయితే ఇమిగ్రేషన్ చట్టాలలోని లొసుగులను ఆసరా చేసుకొని కొన్ని సంస్థలు నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్లు అమెరికా అంటోంది.
"టీసీఎస్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ వంటి సంస్థలు నిబంధనలు ఉల్లంఘించి హెచ్-1బీ వీసాలను పొందుతున్నాయి. వాటికి లభిస్తున్న వీసాల సంఖ్యను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది" అని వైట్ హౌస్ 2017 ఏఫ్రిల్‌లో ఆరోపించింది.
కనీసం 60 వేల డాలర్లు
అమెరికా పౌరులతో సమానంగా హెచ్-1బీ వీసాదారులను సంస్థలు నియమించుకుంటున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో 1998లో హెచ్-1బీ నిబంధనలు మార్చారు. ఈ వీసా మీద నియమించుకునే విదేశీ ఉద్యోగులకు ఏడాదికి కనీసం 60,000 డాలర్లు వేతనం ఇవ్వాలని నిర్దేశించారు. అంతకంటే తక్కువ వేతనం ఉండే ఉద్యోగాల్లో అమెరికన్లను మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. అమెరికాలో మాస్టర్ డిగ్రీ చేసిన ఉద్యోగులకు ఈ నిబంధనలు వర్తించవు.

ఫొటో సోర్స్, Bryan Bedder/getty images
ఉల్లంఘన ఇలా..
ఇక్కడే కంపెనీలు నియమాలను ఉల్లంఘిస్తున్నాయనేది ఆరోపణ. ఏడాదికి 60,000-65,000 డాలర్ల వేతనాన్ని ఇస్తూ కొన్ని ఐటీ సంస్థలు హెచ్-1బీ వీసాదారులను అత్యధిక సంఖ్యలో నియమించుకుంటున్నట్లు వైట్ హౌస్ తెలిపింది. ఇదే సమయంలో అమెరికా ఐటీ ఉద్యోగికి సగటు వార్షిక వేతనం 1,50,000 డాలర్లుగా ఉన్నట్లు చెబుతోంది. అంటే విదేశీయులను తక్కువ వేతనానికి తెచ్చుకోవడంతోపాటు ఈ క్రమంలో అధిక వేతనాలు తీసుకునే అమెరికన్లను ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్లు అక్కడి ప్రజాప్రతినిధులు ఆరోపిస్తున్నారు.

అమెరికన్ల ఆందోళన
ఉద్యోగాలు కోల్పోయిన అమెరికన్ ఐటీ ఉద్యోగులు "సేవ్ జాబ్స్ యూఎస్ఏ" పేరిట ఒక సంస్థను ఏర్పాటు చేసుకున్నారు. హెచ్-1బీ వీసాలపై తక్కువ వేతనాలకు విదేశీ ఉద్యోగులను తీసుకు రావడం వల్లే తాము ఉపాధి కోల్పోయినట్లు వీరు ఆరోపిస్తున్నారు. పైగా హెచ్-1బీ వీసాదారులపై ఆధారపడే కుటుంబ సభ్యుల (హెచ్-4)కు వర్క్ పర్మిట్ ఇవ్వడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
సేవ్ జాబ్స్ యూఎస్ఏ వర్సెస్ డీహెచ్ఎస్
హెచ్-4 వీసాదారులకు వర్క్ పర్మిట్ ఇచ్చే నిబంధనను రద్దు చేయమని సేవ్ జాబ్స్ యూఎస్ఏ 2016లో డిస్ట్రిక్ కోర్టులో పిటీషన్ వేసింది. అయితే అప్పట్లో ఆ కోర్టు దీన్ని కొట్టివేసింది. ఆ తరువాత సంస్థ మరోసారి 2017లో పిటీషన్ దాఖలు చేసింది. దీనిపై అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోం ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) త్వరలోనే తమ అభిప్రాయం కోర్టుకు వెల్లడించనుంది.

ఫొటో సోర్స్, David Ramos/getty images
ప్రజాప్రతినిధులు
హెచ్-1బీ వీసా విధానాన్ని తీసుకురావడంతో కీలక పాత్ర పోషించిన మాజీ కాంగ్రెస్ సభ్యుడు బ్రూస్ మోరిసన్ వంటి వారు ప్రస్తుత విధానాన్ని ప్రక్షాళన చేయాలని కోరుతున్నారు. అమెరికా ఉద్యోగాలను ఔట్ సోర్సింగ్ ఇవ్వకూడదంటూ రిపబ్లికన్ సభ్యుడు డారెల్ ఇస్సా 2017లో బిల్లును ప్రవేశపెట్టారు.
అమెరికా ఏమంటోంది?
హెచ్-1బీ వీసాల గడువు పొడిగింపుపై కానీ, హెచ్-4 వీసాల విషయంలో కానీ అమెరికా అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. ఇప్పటికైతే హెచ్-1బీ విషయంలో ఎటువంటి మార్పులు లేవని గతంలో మాదిరే విధానాలు ఉంటాయని భారత్‌లోని అమెరికా ఎంబసీ కార్యాలయం ప్రతినిధి మెక్‌లారెన్ బీబీసీకి చెప్పారు.

ఫొటో సోర్స్, Facebook/Mastercard
మార్చడం సాధ్యమా?
ఒకవేళ అమెరికా హెచ్-1బీ వీసా నిబంధనలు మార్చడానికే నిర్ణయించుకున్నా అది అంత తేలికైన విషయం కాదు. దీనిపై బాధితులు కోర్టులు ఆశ్రయించే అవకాశం ఉంది. మరోవైపు కార్పొరేట్ సంస్థల నుంచి వ్యతిరేకత వస్తోంది. గూగుల్, ఫేస్‌బుక్ వంటి అమెరికా సంస్థలు గతంలో వీసా నిబంధనలు కఠినతరం చేయడంపై ఆందోళన వ్యక్తం చేశాయి.
ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జూకర్‌బర్గ్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ వంటి వారు బహిరంగంగానే ట్రంప్ విధానాలను విమర్శించారు.
వారికే నష్టం
గూగుల్, ఐబీఎం, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థల్లో ఎంతో కాలం నుంచి ప్రవాస భారతీయులు క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. విదేశీయుల నైపుణ్యం తోడు కావడం వల్లే అమెరికా ఆర్థికవ్యవస్థ ఇంతగా అభివృద్ధి చెందిందన్న జూకర్ బర్గ్ మాటల్లో ఈ విషయం ధ్వనిస్తోంది. అందువల్ల హెచ్-1బీ వీసాదారులను వెనక్కి పంపించేస్తే కార్పొరేట్ సంస్థలపై ప్రభావం పడుతుందని, అంతిమంగా అమెరికాకు నష్టం కలుగుతుందని గతంలో వాషింగ్టన్ పోస్ట్‌కు రాసిన వ్యాసంలో జూకర్ బర్గ్ అన్నారు.

ఫొటో సోర్స్, Chip Somodevilla/getty images
ప్రవాస భారతీయులపై ప్రభావం
ఒకవేళ హెచ్-1బీ వీసాల పొడిగింపును నిలిపి వేసినా, హెచ్-4 వీసాదారులకు వర్క్ పర్మిట్ ఆపివేసినా దాదాపు 10 లక్షల మంది ప్రవాస భారతీయులపై ప్రభావం చూపుతుందని సాఫ్ట్‌వేర్ రంగ నిపుణుడు రజిత్ ఆకుల అన్నారు. వీరిపై ఆధారపడిన కుటుంబ సభ్యులను కూడా పరిగణనలోకి తీసుకుంటే ఈ సంఖ్య 25-30 లక్షల వరకు ఉండొచ్చని తెలిపారు. గ్రీన్ కార్డు వస్తుందనే ఉద్దేశంతో చాలా మంది అక్కడ ఇళ్లు, వాహనాలు కొనుగోలు చేస్తున్నారు. ఇప్పుడు వీరు వెనక్కి వెళ్లాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. పిల్లల చదువులు కూడా సమస్యాత్మకంగా మారే అవకాశం ఉంది.
ఇక్కడ ఉద్యోగాలు లభిస్తాయా?
అమెరికా నుంచి ఎక్కువ సంఖ్యలో ప్రవాస భారతీయులు స్వదేశానికి తిరిగి రావడం వల్ల కొన్నిసమస్యలు వస్తాయని రజిత్ చెబుతున్నారు. వీరందరికీ భారత్‌లో ఉపాధి లభించే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని తెలిపారు.

ఫొటో సోర్స్, MANJUNATH KIRAN/getty images
అభద్రతా భావం
ట్రంప్ నిర్ణయాలతో ప్రవాస భారతీయుల్లో అభద్రతా భావం పెరుగుతున్నట్లు అమెరికాలో స్థిరపడ్డ సుమాలనీ సోమా తెలిపారు. కేరళకు చెందిన ఓ మహిళా ఉద్యోగి హెచ్-1బీ వీసాపై అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే జీవితంలో స్థిరపడుతున్నామని ఇలాంటి సమయంలో వీసా నిబంధనలు కఠినతరం చేస్తారంటున్న వార్తలు నిద్ర లేకుండా చేస్తున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. హెచ్-4 వీసాలపై ఉంటున్న తన స్నేహితులదీ ఇదే పరిస్థితని తెలిపారు.
"అమెరికాలో కన్సల్టెన్సీ సేవలు అందిస్తున్న భారతీయ సంస్థలు నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయి. మోసపూరితంగా హెచ్-1బీ వీసాలు పొందుతున్నాయి. ఇలాంటి సంస్థల వల్లే అమెరికా వీసాల విషయంలో కఠిన నిబంధనలు తీసుకు రావాలనుకుంటోంది. ఇది నిజాయతీపరుల పాలిట శాపంగా మారుతోంది" అని కాలిఫోర్నియాకు చెందిన స్కంధా చింతా ఆవేదన వ్యక్తం చేశారు.

ఫొటో సోర్స్, DIBYANGSHU SARKAR/getty images
భయపడాల్సిన అవసరం లేదు
అయితే ప్రస్తుతం వస్తున్న వార్తలు చూసి ఆందోళన చెందాల్సిన పని లేదని అమెరికా వీసా వ్యవహారాల్లో నిపుణుడైన సతీశ్ కుమార్ చెబుతున్నారు. హెచ్-1బీ వీసాల గడువును పొడిగించుకునేందుకు వీలు లేకుండా చేసే చట్టాలు అమెరికా తీసుకొచ్చే అవకాశాలు చాలా తక్కువని, ఇందుకు అనేక అవరోధాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని వివరించారు.
మా ఇతర కథనాలు:
- నెట్ సరే.. న్యూట్రాలిటీ సంగతేంటి?
- దేశ ఆర్థిక వృద్ధిపై పాస్‌పోర్ట్‌ల ప్రభావం ఉంటుందంటే నమ్మగలరా?
- ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్: ర్యాంకులు ఇలా ఇస్తారు..
- ఆక్స్ఫర్డ్.. కేంబ్రిడ్జ్.. స్టాన్ఫర్డ్ల్లో ఉచితంగా చదవాలనుందా!
- ట్రంప్ ఏం తింటారు? వాటి అర్థం ఏంటి?
- పాకిస్తాన్‌పై ‘ట్రంప్ కార్డ్’తో భారత్‌కు మేలెంత?
- 'యాహూ యూజర్ల ఖాతాలన్నీ లీకయ్యాయ్'
- వాట్సాప్‌కి నకిలీ.. పది లక్షల డౌన్లోడ్లు
- తుపాకులకు ఓకే.. బాణసంచాకు మాత్రం నో
- ‘వన్నాక్రై సైబర్ దాడి చేసింది ఉత్తర కొరియానే’
- తెలుగులో వాడుక భాషకు పట్టం గట్టిందెవరు?
- 'అక్కడే చనిపోయినా బాగుండేది'
- చదువుల రాణి ఈ తెలంగాణ కళ్యాణి
- ఇంటర్వ్యూకు వెళ్తున్నారా? ఈ ఐదు విషయాలు గుర్తుంచుకోండి!
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








