ఇంటర్వ్యూలో ఈ ఐదు పనులు అస్సలు చేయొద్దు!

ఫొటో సోర్స్, iStock
బ్రిటన్‌లో "బీబీసీ వన్"లో ప్రసారమయ్యే "ద అప్రెంటిస్" కార్యక్రమం బాగా ప్రజాదరణ పొందింది. అందులో లార్డ్ షుగర్‌తో కలిసి క్లోడ్ లిట్నర్ ఇంటర్వ్యూలు చేస్తుంటారు. ఈ ఇంటర్వ్యూలో గెలిస్తే 2 కోట్ల రూపాయలు మీ సొంతం అవుతాయి. అంతేకాదు, బ్రిటిష్ వ్యాపార దిగ్గజం లార్డ్ షుగర్‌తో బిజినెస్ పార్ట్‌నర్ అయిపోవచ్చు.
అయితే, ఆ ఇంటర్వ్యూల్లో గెలవడం ఆషామాషీ వ్యవహారం కాదు. క్లోడ్ లిట్నర్‌ను మెప్పించడం కత్తిమీద సామే. ఇంటర్వ్యూలు తీసుకోవడంలో క్లోడ్ లిట్నర్ ఎంత దిట్టంటే ఆయన ఇంటర్వ్యూ తీసుకుంటున్నారంటేనే చాలా మందికి భయమేస్తుంది.
ఆయన ఇంటర్వ్యూలో అడిగే ప్రశ్నలు ఎంత కఠినంగా ఉంటాయంటే తన ప్రశ్నలతో ఎంత బలమైన అభ్యర్థినైనా మట్టికరిపించే సమర్థత ఆయన సొంతం. ఇంటర్వ్యూలో అభ్యర్థులు ఏమేం చేయకూడదో అడిగితే ఆయన ఏం అన్నారంటే..

1) నిర్లక్ష్యం అస్సలు వద్దు
"ఏ కంపెనీలో జాబ్ కోసం ఇంటర్వ్యూకు వెళుతున్నారో ఆ కంపెనీ గురించి ముందే తెలుసుకోవడంలో అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు. కంపెనీ గురించి ముందే తెలుసుకొని వెళ్లాలి. ఈ విషయంలో నిర్లక్ష్యం చేయటానికి వీల్లేదు " అని ఆయన తెలిపారు.
"ఇంటర్వ్యూలో మా కంపెనీ టర్నోవర్ గురించి మీ అభిప్రాయం అని అడగొచ్చు. మా కంపెనీ పరిస్థితి ఎలా ఉంది? దానిపై మీ అభిప్రాయం ఏమిటనే ప్రశ్న కూడా అడగొచ్చు" అని ఆయన తెలిపారు.
కంపెనీ గురించి తెలుసుకోకుండా ఇంటర్వ్యూకు వెళితే జాబ్ దొరకడం కష్టమేనని ఆయన అన్నారు.

2) అవును - కాదు అనే సమాధానాలొద్దు
ఇంటర్వ్యూలో మీ సమాధానం, మీ దృష్టి పూర్తిగా ఇంటర్వ్యూ తీసుకునే వారిపై, వారడిగే ప్రశ్నలపైనే ఉండాలి.
"ప్రశ్న అడిగితే దానికి అవును లేదా కాదు అని సమాధానం ఇవ్వడం చాలా పెద్ద తప్పు. ఇది మీ పట్ల ఇంటర్వ్యూ తీసుకునేవారికి తప్పుడు సంకేతాలిస్తుంది" అని క్లోడ్ తెలిపారు.
3) అతిగా స్నేహపూర్వక వైఖరి మంచిదికాదు
ఇంటర్వ్యూలో కూడా మనకు కొన్ని హద్దులుండాలని క్లోడ్ అంటున్నారు. "ఇంటర్వ్యూలో సమాధానాలిస్తున్నప్పుడు స్నేహపూర్వక వైఖరితో సమాధానాలుండాలి కానీ అతిగా ఉండకూడదు" అని ఆయన అన్నారు.
"ప్రశ్నలకు మీరిచ్చే ప్రతీ సమాధానం మీ సామర్థ్యాన్ని వారికి చూపించే విధంగా ఉండాలి. నిజాయితీగా సమాధానం ఇవ్వాలి."

4) తొందరగా బయటికి వెళ్లిపోకండి
ప్రశ్నలు పూర్తయిన వెంటనే ఇంటర్వ్యూ పూర్తయిందని అర్థం కాదని, ఆ ఇంటర్వ్యూ రూం నుంచి మీరు బయటికి వెళ్లినప్పుడే ఇంటర్వ్యూ పూర్తయినట్టని ఆయన తెలిపారు.
ఇంటర్వ్యూ తర్వాత బయటికి వెళుతున్నప్పుడు వెనుక తిరిగి 'సార్ నాకీ జాబ్ తప్పక కావాలి, నేను దీన్ని బాగా కోరుకుంటున్నాను' అని చెప్పడం మంచిది కాదని అలా చేస్తే మీ సమర్థతపై మచ్చ పడుతుందని ఆయన తెలిపారు.
5) ఇతర అభ్యర్థులతో పోల్చుకోవద్దు
మీరేం చేయగలరో అది మీరు చెప్పొచ్చు. కానీ ఇతర అభ్యర్థుల గురించీ, వారి సమర్థత, అసమర్థతల గురించి ఇంటర్వ్యూలో మాట్లాడొద్దు. ప్రతిచోటా నేనే గొప్పవాడిని అని అనుకోవడం తగదని ఆయన అన్నారు.
"నేనెవరినైనా ఎంపిక చేసి ఆ తర్వాత ఏదో కారణంతో వారికి బదులు నేను మిమ్మల్ని పిలవచ్చు. అక్కడ మీరు మీ పనితీరు ద్వారా నా నిర్ణయం సరైందేనని రుజువు చేయాలి. ఇలాంటి చిన్న చిన్న విషయాలు చాలా ప్రభావం చూపుతాయి" అని క్లోడ్ అన్నారు.
మా ఇతర కథనాలు:
- గమ్యం: జేఈఈలో విజయం సాధించడం ఎలా?
- ఆక్స్ఫర్డ్.. కేంబ్రిడ్జ్.. స్టాన్ఫర్డ్ల్లో ఉచితంగా చదవాలనుందా!
- 2050 నాటికి అతి పెద్ద పది సవాళ్లివే!
- లబ్..డబ్బు: ఉద్యోగాల భవిష్యత్ ఏంటి? ఏం చేస్తే జాబ్ గ్యారెంటీ ఉంటుంది?
- ఈ ఉద్యోగాలు కొన్నాళ్లు సేఫ్
- గూగుల్‌లో ఉద్యోగం వదిలేశాడు.. అమ్మతో కలిసి హోటల్ పెట్టాడు
- సోషల్ మీడియా... నిద్ర రాదయా!
- నిద్ర గురించి మీరు తెలుసుకోవాల్సిన 10 విషయాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








