100 మంది మహిళలు: ఆటోమేషన్ వల్ల ఎవరికి నష్టం?

ఎవరికి నచ్చినా నచ్చకపోయినా కృత్రిమ మేధస్సూ, ఆటోమేషన్, రోబోటిక్స్ లాంటి కొత్త సాంకేతికత కారణంగా ఎన్నో రంగాల్లో సమూల మార్పులొచ్చాయన్నది మాత్రం నిజం.
వర్చువల్ వెయిటర్లు, రోబో వైద్యులు, డ్రైవర్ రహిత కార్ల వంటివన్నీ ఆయా రంగాల్లో సాధించిన అభివృద్ధి ఫలితాలే. కానీ దూసుకెళ్తున్న ఈ సాంకేతిక పరిజ్ఞానం ప్రభావం మహిళలు, పురుషుల ఉద్యోగ జీవితంపైన ఒకేలా ఉంటుందా లేదా అన్నదే తేలాల్సిన ప్రశ్న.
ఆటోమేషన్ ప్రపంచానికి మంచిదా కాదా అన్న అంశంపై ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. కానీ రోబోలూ, కృత్రిమ మేధస్సు అభివృద్ధి వల్ల సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణిత రంగాల్లో ఉద్యోగాలు గణనీయంగా పెరుగుతాయన్నది మాత్రం నిజం.
ఒక్క అమెరికాలోనే వచ్చే పదేళ్లలో ఈ రంగాల్లో ఐదు లక్షల కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయని అంచనా. కానీ వాటివల్ల ఆడవాళ్ల కంటే మగవాళ్లే ఎక్కువ లాభపడే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
వరల్డ్ ఎకనమిక్ ఫోరం ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనంలో ఆటోమేషన్ కారణంగా ఇరవై ఉద్యోగాలను కోల్పోవాల్సి వస్తే మగవాళ్లకు తిరిగి ఐదు కొత్త ఉద్యోగ అవకాశాలు పుడతాయి. అదే ఆడవాళ్లకు ఒక ఉద్యోగమే దొరుకుతుంది.
ప్రస్తుతం ఉన్న ఆడా మగా నిష్పత్తి 2020 దాకా ఇలానే కొనసాగితే ఈ అధ్యయనం తప్పక నిజమవుతుందని ఆ సంస్థ చెబుతోంది. అభివృద్ధి చెందిన పన్నెండు దేశాల్లో ఈ అధ్యయనాన్ని నిర్వహించారు.
కార్యాలయాల్లో చాలా పనులు ఆటోమేషన్‌కి గురవతుండటంతో భవిష్యత్తులో ఉద్యోగాలను కోల్పోయే ప్రమాదం మగవాళ్ల కంటే ఆడవాళ్లకే ఎక్కువగా ఉందని ఈ ఎకనమిక్ ఫోరం అధ్యయనం స్పష్టం చేస్తోంది.
ఈ పరిస్థితి మారాలంటే ఆడవాళ్లలో టెక్నాలజీపైన ఆసక్తిని పెంచాలంటారు ‘రెస్పాన్సిబుల్ రోబోటిక్స్’ సంస్థ సహ-వ్యవస్థాపకులు ఐమీ వాన్ విన్స్‌బర్గ్.

ఫొటో సోర్స్, Reuters
ఎవరి ఉద్యోగాలు మాయమవుతాయి?
ప్రస్తుతం ఆడవాళ్లతో పోలిస్తే మగవాళ్లే ఆటోమేషన్ ప్రమాదానికి దూరంగా ఉన్న ఉద్యోగాల్లో ఎక్కువగా పని చేస్తున్నారని డాక్టర్ కార్ల్ ఫ్రే అంటారు. అమెరికాలో ఆటోమేషన్ కారణంగా భవిష్యత్తులో కనిపించకుండా పోయే ఉద్యోగాలపైన కార్ల్ గతంలో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఒక అధ్యయనం చేశారు.
గత వందేళ్లలో టెక్నాలజీ కారణంగా మహిళలకు ఉద్యోగ అవకాశాలు గణనీయంగా పెరిగాయని కార్ల్ చెబుతారు. యంత్రాల కారణంగా శారీరక శ్రమ తగ్గిపోయిందనీ, జ్ఞాపక శక్తీ, చదవడం, రాయడం లాంటి నైపుణ్యాలు అవసరమైన ఉద్యోగాలు పెరిగాయనీ, ఫలితంగా మహిళలకు అవకాశాలు మెరుగయ్యాయనీ ఆయన అంటారు.
ఆటోమేషన్ ఫలితంగా ఎవరి ఉద్యోగాలకు ఎక్కువ ముప్పు అన్న అంశంపై ఒక్కో సంస్థ నివేదిక ఒక్కో మాట చెబుతోంది. వరల్డ్ ఎకనమిక్ ఫోరం గతేడాది ప్రచురించిన ‘ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్’ నివేదిక ప్రకారం ఆటోమేషన్ వల్ల మహిళలూ, పురుషులూ దాదాపు సమానంగా ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
ప్రైస్ వాటర్ హౌజ్ కూపర్స్ నివేదిక ప్రకారం యూకే, యూఎస్, జర్మనీ, జపాన్ దేశాల్లో పనిచేసే మగవాళ్లకు ఆటోమేషన్ ముప్పు ఎక్కువ.
కానీ కాలిఫోర్నియాలోని ‘ఇన్‌స్టిట్యుట్ ఆఫ్ స్పేషియల్ ఎకనమిక్ ఎనాలిసిస్’ మాత్రం ఆటోమేషన్ ఫలితంగా మగవాళ్లతో పోలిస్తే ఆడవాళ్లు రెండింతలు ఎక్కువగా ఉద్యోగాలకు దూరమయ్యే అవకాశం ఉందంటోంది.
కార్యాలయాల్లో, ముఖ్యంగా అడ్మినిస్ట్రేషన్ విభాగాల్లో ఎక్కువగా మహిళలే పనిచేస్తున్నారు కాబట్టి వాళ్లకే ఆటోమేషన్ ముప్పు ఎక్కువని తెలుస్తోంది.
ఆటోమేషన్ ప్రభావం అన్ని దేశాల్లో, అన్ని రంగాల్లో ఒకేలా ఉండకపోవచ్చు. ఆయా దేశాల ఆర్థిక స్థితిగతుల కారణంగా కృత్రిమ మేధస్సు, రోబోటిక్స్ లాంటి రంగాల్లో పెట్టుబడులు పెరగడమో, తగ్గడమో జరుగుతుంది. ఆ పరిణామాలపైనే ఉద్యోగ భద్రతా ఆధారపడి ఉంటుంది.
ప్రస్తుతం అన్ని రంగాల్లో లింగ వివక్షను తగ్గించి, టెక్నాలజీకి సంబంధించిన రంగాలవైపు మహిళలను ఆకర్షించగలిగితే భవిష్యత్తులో వారి ఉద్యోగాలకు ఎలాంటి ఢోకా ఉండదంటారు నిపుణులు.


బీబీసీ '100 మంది మహిళలు':
ప్రపంచవ్యాప్తంగా ఉన్న 100 మంది స్ఫూర్తిప్రదాతలైన, ప్రభావవంతులైన మహిళల జాబితాను బీబీసీ ప్రతిఏటా ప్రకటిస్తుంది.
కనిపించని అడ్డుగోడలు, నిరక్షరాస్యత, వీధుల్లో వేధింపులు, క్రీడల్లో లింగవివక్ష అనే నాలుగు అతిపెద్ద సవాళ్ల పరిష్కారానికి ఈ సిరీస్ ప్రయత్నిస్తోంది. వీటిని ఎదుర్కొనేందుకు ఈ ఏడాది జాబితాలోని మహిళామణులు సరికొత్త మార్గాలను అన్వేషించేందుకు ప్రయత్నించనున్నారు.
2017 సిరీస్ జాబితాలో భారత్‌లో జన్మించినవారు పది మంది ఉండగా, వీరిలో ఒకరు 16 ఏళ్ల బాలిక కావడం విశేషం. ప్రముఖ క్రికెటర్ మిథాలీ రాజ్, దిల్లీ తీహార్ జైల్లో ఎనిమిదేళ్లుగా పిల్లలకు పాఠాలు చెబుతున్న ఉపాధ్యాయురాలు, సామాజిక కార్యకర్త తూలికా కిరణ్ కూడా వీరిలో ఉన్నారు.
ఈ 100 మంది మహిళల్లో కొందరు అక్టోబరులో నాలుగు వేర్వేరు నగరాల్లో సమావేశమై, ఈ నాలుగు ప్రధాన సమస్యలకు సరికొత్త పరిష్కారాలపై చర్చిస్తారు. మహిళ్లో నిరక్షరాస్యతపై దిల్లీలో, కనిపించని అడ్డుగోడలనే అంశంపై అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో, వీధుల్లో వేధింపులపై బ్రిటన్‌లోని లండన్‌లో, క్రీడల్లో లింగవివక్షపై బ్రెజిల్‌లోని రియో డిజనీరోలో సమావేశాలు, చర్చలు, ఇతర కార్యక్రమాలు ఉంటాయి.


ఫొటో సోర్స్, Getty Images
ఉద్యోగుల ఎంపిక దశలోనే మార్పు మొదలవ్వాలని ‘నేషనల్ సెంటర్ ఫర్ విమెన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ’ సంస్థ రీసెర్చ్ డైరెక్టర్ క్యాథరీన్ ఆష్‌క్రాఫ్ట్ సూచిస్తారు. ‘మనుషులు నిక్షిప్తం చేసే డేటా ఆధారంగానే యంత్రాలు పనిచేస్తాయి. కాబట్టి మన ఆలోచనల ప్రభావం వాటిపైన పడకుండా, ఏ ఒక్క జండర్ వైపో మొగ్గు చూపకుండా వాటిలో సమాచారం నింపడం కీలకం’ అంటారు క్యాథరీన్.
ఉదాహరణకు మగవాళ్లలోనూ నర్సులుగా పనిచేయడానికి ఇష్టపడే వాళ్లుంటారు. ఆడవాళ్లలోనూ మంచి ప్రొగ్రామింగ్ నిపుణులుంటారు. ‘నర్సు ఉద్యోగానికి ఆడవాళ్ల అప్లికేషన్లనే పరిశీలించాలి’, ‘ప్రోగ్రామింగ్ ఉద్యోగానికి పురుషుల దరఖాస్తులకే ప్రాధాన్యమివ్వాలి’ లాంటి ఆదేశాలను కృత్రిమ మేధస్సుకి అందిస్తే అర్హులైన వాళ్లు ఉద్యోగాలకు దూరమయ్యే అవకాశం ఉంది.
కాబట్టి యంత్రాలకు సమాచారం ఇచ్చేప్పుడు జాగ్రత్తగా ఉండాలంటారు ప్రిన్స్‌టన్ యూనివర్సిటీకి చెందిన ఏఐ నిపుణులు ఐలిన్ కలిస్కన్.
ఏదేమైనా మహిళలు టెక్నాలజీకి సంబంధించిన రంగాల్లోకి ఎక్కువ సంఖ్యలో ప్రవేశించినప్పుడే భవిష్యత్తులో వాళ్ల ఉద్యోగాలకు తక్కువ ప్రమాదం ఉంటుందన్నది నిపుణులందరి మాట.
ఇప్పటికైనా స్పందించి మహిళలను ఎక్కువ సంఖ్యలో సాంకేతిక రంగాల్లోకి ఆకర్షించకపోతే భవిష్యత్తులో వారి ఉద్యోగ భద్రత చిక్కుల్లో పడుతుందని హెచ్చరిస్తారు రోబోటిక్స్ నిపుణులు వాన్ విన్స్‌బర్గ్.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)








