మీరు బాగా పొడవా? అయితే ఈ వార్త మీ కోసమే..!

రూథ్ అలెక్జాండర్

బీబీసీ న్యూస్

వివిధ ఎత్తున్న నలుగురు వ్యక్తులు

ఫొటో సోర్స్, Thinkstock

'ఎక్కువ పొడవున్న వారికి క్యాన్సర్ రావచ్చు... బాగా ఎత్తు ఎదిగిన వారికి క్యాన్సర్ రిస్కు ఎక్కువ...' వంటి శీర్షికలను ఇటీవల వార్తల్లో తరచుగా చూస్తున్నాం. అయితే క్యాన్సర్‌ రావడానికీ, పొడవుగా ఎదగడానికీ మధ్య లంకె ఏమిటి? దీనినెలా అర్థం చేసుకోవాలి?

నా పొడవు సగటు బ్రిటిష్ మహిళకన్నా ఎక్కువ (నా ఎత్తు ఐదడుగుల 8 అంగుళాలు లేదా 1.73 మీ.) కాబట్టి అసలీ వార్తల్లో నిజమెంతో కాస్త వివరంగా తెలుసుకోవాలనిపించింది.

స్టాక్‌హోంలో కారోలిన్స్‌కా ఇన్స్‌స్టిట్యూట్‌కు చెందిన డాక్టర్ ఎమిలీ బెన్యీ తన బృందంతో కలిసి 55 లక్షల మంది స్వీడిష్ మహిళల రికార్డులను అధ్యయనం చేశారు. ఈ మహిళలంతా 1938-1991 మధ్య జన్మించినవారే. ఒక మీటరు కనీస పొడవుకు అదనంగా ప్రతి 10 సెంటీమీటర్ల ఎత్తుకు క్యాన్సర్ రిస్కు దాదాపు 18 శాతం చొప్పున ఎక్కువవుతుందని ఈ అధ్యయనం నిర్ధారించింది.

పురుషుల్లో ఈ శాతం తక్కువ

ప్రతి 10 సెంటీమీటర్ల అదనపు ఎత్తుకు క్యాన్సర్ రిస్కు 11 శాతం చొప్పున పెరుగుతుంది. వేర్వేరు రకాల క్యాన్సర్లలో రిస్కు వేర్వేరుగా ఉంటుంది. ఉదాహరణకు ఎక్కువ పొడవుండే మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్ రిస్కు 20 శాతం ఎక్కువ. అయితే మెలనోమా రిస్కు మాత్రం పురుషుల్లో, మహిళలలో సమానంగా ప్రతి 10 సెంటీమీటర్ల అదనపు ఎత్తుకు 30 శాతం చొప్పున ఎక్కువవుతుంది.

ఈ అధ్యయన ఫలితాలను వెల్లడించే పత్రికా ప్రకటనే పైన పేర్కొన్న వార్తా శీర్షికలకు ఆధారం. అయితే ఈ పరిశోధన పత్రాలు ఇంకా పూర్తి స్థాయిలో వెలువడాల్సి ఉంది కాబట్టి ఈ అధ్యయనంలో ఉపయోగించిన పద్ధతులపై ఇప్పుడే ఓ అంచనాకు రాలేం.

ఎందుకంటే, ఈ అధ్యయనంలో పరిశోధకులు క్యాన్సర్ రిస్కును అంచనా వేసేటప్పుడు స్మోకింగ్ వంటి అలవాట్లనూ స్థూలకాయం వంటి అంశాల్ని పరిగణనలోకి తీసుకున్నారా లేదా మనకు తెలియదు.

'ఈ పరిశోధనలో ఏవైనా సీరియస్ పొరపాట్లు ఉండొచ్చని అనుకోవడానికి కారణాలేమీ లేవు. అదే సమయంలో ఇందులో పొరపాట్లు ఉండడానికి కూడా అవకాశం లేకపోలేదు' అని ఎకానమిస్ట్ ఇంటలిజెన్స్ యూనిట్ హెల్త్ సెక్షన్‌కు చెందిన డాక్టర్ వివేక్ ముత్తు అన్నారు.

ఇదివరకే నిరూపితమైంది

అయితే, మనిషి ఎత్తుకూ, క్యాన్సర్‌కూ మధ్య పరస్పర సంబంధం ఉందన్న విషయం ఇదివరకే నిరూపితమైందని మనకు తెలుసు. 2011లో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు చేసిన ఒక అధ్యయనంలో ఎక్కువ పొడవుండే మహిళలకు 10 రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉందని తేలింది.

ఈ పరస్పర సంబంధం ఎందుకుంది?

ఏదీ కచ్చితమైందని చెప్పలేకపోయినా ఈ ప్రతిపాదన వెనుక చాలా సిద్ధాంతాలున్నాయి. మానవ ఎదుగుదలకు సంబంధించిన హార్మోన్‌తో దీనికి సంబంధం ఉండొచ్చన్నది ఒక భావన.

అయితే దీని గురించి యూనివర్సిటీ ఆఫ్ లండన్‌కు చెందిన ప్రొఫెసర్ డొరోథీ బెనెట్ చాలా సులువైన మాటల్లో ఇలా చెబుతారు - ఎక్కువ పొడవుండే వారిలో కణాలు ఎక్కువగా ఉంటాయి.

'మీరెంత ఎత్తు పెరిగితే మీలో కణాల సంఖ్య అంతగా పెరుగుతుంది. క్యాన్సర్ ఒకే ఒక కణం నుంచి మొదలవుతుంది. కాబట్టి మీలో ఒక ప్రత్యేక తరహా కణాల సంఖ్య ఎంత ఎక్కువ అనే దాన్ని బట్టి మీకు ఆ తరహా క్యాన్సర్‌ రిస్కు ఎక్కువగా ఉండటం సహజమే' అని డొరోథీ అన్నారు.

స్కేలుతో మహిళ

ఫొటో సోర్స్, iStock

ఫొటో క్యాప్షన్, పొడవుగా ఉండటమంటే ‘చిన్నపుడు మరింత ఆరోగ్యకరంగా పెరిగార‘ని చెప్పవచ్చు

బ్రిటన్‌లోని క్యాన్సర్ పరిశోధన సంస్థ అంచనా ప్రకారం ఆ దేశంలో జన్మించేవారిలో 50 శాతం మందికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ 1960 నుంచి క్యాన్సర్ పెరుగుతోంది.

ఈ లెక్కన, నేను సగటు బ్రిటిష్ మహిళ పొడవు (1.62మీ. లేదా ఐదడుగుల 4 అంగుళాలు) కన్నా దాదాపు 10 సెంటీమీటర్లు ఎక్కువ కాబట్టి నాకు నా జీవితకాలంలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు సగటుకన్నా 16 శాతం ఎక్కువని బెన్యీ అంచనా వేశారు.

మరో మాటలో చెప్పాలంటే, వ్యక్తిగతంగా నా కేసులో రిస్కు 50 శాతానికి బదులు 59 శాతం ఉన్నట్టు లెక్క. అదీ స్వీడిష్ మహిళల లాగానే బ్రిటిష్ మహిళలలో కూడా ఎత్తుకూ, క్యాన్సర్‌కూ మధ్య సంబంధం ఉందనుకున్నప్పుడే.

ఇది నాకు నిజంగానే చెడ్డ వార్త.

కానీ ఎక్కువ పొడవున్న వారు భయపడాల్సిన పనేమీ లేదని లండన్ యూనివర్సిటీలో వైద్య గణాంకాల ప్రొఫెసర్ టిమ్ కోల్ చెబుతున్నారు. ఎందుకంటే మామూలుకన్నా ఎక్కువ పొడవుండేవారికి గుండెజబ్బు వంటి ఇతర వ్యాధులు వచ్చే అవకాశాలు తక్కువ.

'ఎక్కువ పొడవు అంటే అర్థం మీకు చాలా అనుభవం ఉన్నట్టు లెక్క. మీకు బాల్యం ఆరోగ్యకరంగా గడచిందని అర్థం' అని ఆయనంటారు.

'బాల్యంలో ఆరోగ్యంగా ఉన్నవారు మిగతా జీవితకాలంలో ఆరోగ్యంగానే ఉండే అవకాశం ఎక్కువనేది సాధారణ నియమం. దీనికి మనిషి ఎత్తుతో సంబంధం ఉంది. అట్లాగే అసమానతలతో, సామాజిక వర్గాలతో కూడా గుండెజబ్బులకు నేరుగా సంబంధం ఉంది' అని ఆయన చెబుతారు.

కాబట్టి ఇది నాకు ఏ మాత్రం చెడ్డ వార్త కాదు.

కోల్ ఇంకా ఇలా అంటారు, 'ఏదేమైనా, పొడవు విషయంలో మనం చేయగలిగేదేమీ లేదు. కాబట్టి అనవసరంగా భయపడిపోవడంలో అర్థమేముంది?'

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ లోనూ ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేసుకోండి.