బీబీసీ 100 మంది మహిళలు: నాలుగు సమస్యలపై విశ్వ నారీ సమరం

బీబీసీ ‘100 మంది మహిళలు’ న్యూస్ సీజన్ మళ్లీ వచ్చేసింది. ఈ కార్యక్రమంలో భాగంగా బీబీసీ ఏటా ప్రపంచవ్యాప్తంగా ఉన్న 100 మంది స్ఫూర్తిప్రదాతలైన, ప్రభావవంతులైన మహిళల జాబితాను ప్రకటిస్తుంది.
ఈ ఏడాది జాబితాలోని మహిళామణులు నాలుగు ప్రధాన సమస్యలపై సమర శంఖం పూరిస్తున్నారు. వీటిని ఎదుర్కొనేందుకు సరికొత్త మార్గాలను అన్వేషించేందుకు ప్రయత్నించనున్నారు.

2017 సిరీస్ జాబితాలో భారత్‌లో జన్మించినవారు పది మంది ఉండగా, వీరిలో ఒకరు 16 ఏళ్ల బాలిక కావడం విశేషం. ప్రముఖ క్రికెటర్ మిథాలీ రాజ్, దిల్లీ తీహార్ జైల్లో ఎనిమిదేళ్లుగా పిల్లలకు పాఠాలు చెబుతున్న ఉపాధ్యాయురాలు, సామాజిక కార్యకర్త తూలికా కిరణ్ కూడా వీరిలో ఉన్నారు.
వేధింపులు, అసమానతలు, సముచిత ప్రాధాన్యం దక్కకపోవడం లాంటి సమస్యలు స్త్రీలకు అంతులేని వేదనను కలిగిస్తున్నాయి.

‘బీబీసీ 100 మంది మహిళలు’ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారిస్తుంది.
మార్పు కోసం కృషి చేసేలా మహిళలను ప్రోత్సహించడం ఈ ఏడాది సిరీస్‌లో ప్రధానాంశం.

కనిపించని అడ్డుగోడలు, నిరక్షరాస్యత, వీధుల్లో వేధింపులు, క్రీడల్లో లింగవివక్ష అనే నాలుగు అతిపెద్ద సవాళ్ల పరిష్కారానికి ఈ సిరీస్ ప్రయత్నిస్తోంది. వీటిని ఎదుర్కొనేందుకు వినూత్న ఆలోచనలతో ముందుకు రావాలని ఈ ఏడాది సిరీస్‌లో ఎంపికైన మహిళలను కోరుతోంది.
నిరక్షరాస్యతపై దిల్లీలో చర్చ
ఈ 100 మంది మహిళల్లో కొందరు అక్టోబరులో నాలుగు వారాల్లో నాలుగు వేర్వేరు నగరాల్లో సమావేశమై, ఈ నాలుగు ప్రధాన సమస్యలకు సరికొత్త పరిష్కారాలపై చర్చిస్తారు.

జాబితాలోని మిగతా మహిళలు తమ తమ ప్రాంతాల నుంచి వీరికి అవసరమైన సహకారాన్ని అందిస్తారు.
మహిళ్లో నిరక్షరాస్యతపై దిల్లీలో, కనిపించని అడ్డుగోడలనే అంశంపై అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో, వీధుల్లో వేధింపులపై బ్రిటన్‌లోని లండన్‌లో, క్రీడల్లో లింగవివక్షపై బ్రెజిల్‌లోని రియోడిజనీరోలో సమావేశాలు, చర్చలు, ఇతర కార్యక్రమాలు ఉంటాయి.

ప్రతిభావంతులైన ఈ 100 మంది మహిళలు ముందుకు తెచ్చే పరిష్కారాలేమిటనే దానిపై తమకు ఉత్కంఠగా ఉందని సిరీస్ ఎడిటర్ ఫియోనా క్రాక్ చెప్పారు.
జాబితాలోని 10 మంది భారతీయులు వీరే.. (పుట్టిన ప్రాంతం ప్రాతిపదికగా)
- ఊర్వశి సాహ్ని: విద్యావేత్త. స్టడీ హాల్ విద్యా ఫౌండేషన్ ఫౌండర్, సీఈవో.
- ఇరా త్రివేది: రచయిత్రి, ఉద్యమకారిణి. వయసు 32 సంవత్సరాలు.
- అదితీ అవస్థి: సీఈవో, ఎంబైబ్ ఫౌండర్. వయసు 35 ఏళ్లు.
- నిత్య తుమ్మలచెట్టి: డైరెక్టర్ ఆఫ్ డైవర్శిటీ, ఫార్చూనల్‌పిక్స్. వయసు 31 సంవత్సరాలు.
- తూలికా కిరణ్: ఉపాధ్యాయురాలు, సామాజిక కార్యకర్త. వయసు 47 ఏళ్లు.
- ప్రియాంకా రాయ్: విద్యార్థి. వయసు 16 సంవత్సరాలు.
- మెహ్‌రూనిసా సిద్ధిఖీ: గృహిణి. వయసు 65 సంవత్సరాలు. నవాజుద్దీన్ సిద్దిఖీ ఈమె కుమారుడే.
- రూపీ కౌర్: రచయిత్రి. వయసు 24 ఏళ్లు.
- విరాలీ మోదీ: వికలాంగుల హక్కుల కార్యకర్త. యువజన ప్రతినిధి. వయసు 25 సంవత్సరాలు.
- మిథాలీ రాజ్: భారత క్రికెట్ జట్టు కెప్టెన్

బీబీసీ ఈ సిరీస్‌ను నిర్వహించడం ఇది ఐదోసారి. ఈ ఏడాది 100 మంది జాబితాలో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా) వ్యోమగామి పెగ్గీ విస్టన్, లైబీరియా అధ్యక్షురాలు ఎలెన్ జాన్సన్ సిర్‌లీఫ్, ఇంగ్లండ్ ఫుట్‌బాల్ క్రీడాకారిణి స్టీఫ్ హౌటన్, బ్రిటన్‌లో యాసిడ్ దాడి బాధితురాలు రేషమ్ ఖాన్, చైనా టీవీ తార, నృత్యకారిణి జిన్ షింగ్ తదితరులు ఉన్నారు.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)








