అభిప్రాయం: #MeToo: మహిళలను వేధించినందుకు పురుషుల పశ్చాత్తాపం

ఫొటో సోర్స్, Getty mages/JUAN CEVALLOS
- రచయిత, దివ్య ఆర్య
- హోదా, బీబీసీ హిందీ
ముందుగా ఇది చదువుతున్న పురుషులకు ఒక విన్నపం. ఈసారి ఇక్కడ పంచుకుంటున్న భావాలు నావి కావు. పురుషుల కోసం పురుషులు పంచుకుంటున్న ఆలోచనలివి. కాబట్టి మీకు కాస్త ఇబ్బందిగా అనిపించినా కొంచెం ఓపికతో చివరి వరకు చదివే ప్రయత్నం చేయండి.
మీరు ఎప్పుడైనా కళాశాలలో బయటకు కనిపించే అమ్మాయిల బ్రా స్ట్రాప్స్‌ను పదేపదే తొంగి చూశారా?
అమ్మాయిలను అసభ్యపద జాలంతో కామెంట్ చేయడంతోపాటు వారికి ఇష్టం లేకపోయినా పదేపదే వద్దంటున్నా అది కావాలి ఇది కావాలని బలవంతం చేశారా?
ఏ మాత్రం సిగ్గు పడకుండా అసభ్యంగా ప్రవర్తించడంలో ఆనందాన్ని మీరు అనుభవించారా?
అవసరం లేకపోయినా ఎప్పుడైనా మీరు అమ్మాయిలను తాకారా? ఆ స్పర్శ వారిని ఇబ్బంది పెడుతుందని తెలిసి కూడా ఆ పని చేశారా?
షరీఖ్ రఫీక్ మాత్రం తాను చేశానని ఒప్పుకుంటున్నాడు.

ఫొటో సోర్స్, AFP
తన ప్రవర్తనకు ఇప్పుడు సిగ్గుపడుతున్నాడు.
ట్విటర్‌లో # MeToo హ్యాష్ ట్యాగ్ వెతుకుతున్నప్పుడు షరీఖ్ కనిపించాడు.
# MeToo అనేది ఇప్పుడు కొత్త ట్రెండ్‌గా మారింది. హాలీవుడ్ నిర్మాత హార్వే వైన్‌స్టీన్ ఉదంతం తరువాత ఎంతో మంది మహిళలు ట్విటర్ వేదికగా తమ లైంగిక వేధింపుల అనుభవాలను పంచుకుంటున్నారు.

ఫొటో సోర్స్, Twitter
అయితే మహిళలు ఏం చెబుతున్నారో అన్నదానిపై నేను పెద్దగా దృష్టి పెట్టలేదు. నిజం చెప్పాలంటే ఇలాంటివి చదివి చదివి విసుగొచ్చేసింది.
చివరకు కోపం కూడా.
ఏముంది ఇంతలో మరో హ్యాష్ ట్యాగ్, మరో నిర్భాగ్యురాలి రోదన.
ఎప్పటి నుంచో ఇలాంటి వేధింపుల గురించి అరిచి అరిచి మా గొంతులు బొంగురుపోయినా వాటిని మాత్రం పట్టించుకునే నాథుడు లేడు.
అందుకే ఈ సారి పురుషులు ఏం చెబుతారో వినాలనుకున్నాను.
నేడు మహిళలు ముందుకు వచ్చిన తాము ఏవిధంగా లైంగిక వేధింపులకు గురయ్యారో బహిరంగంగా ధైర్యంగా చెబుతున్నారు.
అలాంటప్పుడు తాము ఎలా వేధించామో చెప్పే ధైర్యం పురుషులకు ఉండదా?
మహిళలను ఇబ్బంది పెడుతున్నప్పడు వారిని వేధిస్తున్నామనే ఆలోచన పురుషుల్లో కలుగుతుందా?
ఇటువంటి పనుల వల్ల తాము చెడ్డ వ్యక్తులుగా గుర్తింపు పొందుతామనే భయం వారికి ఉంటుందా?
ఇతరులు ఇలాంటి చెడ్డ పనులు చేస్తున్నప్పుడు ఏమీ తెలియనట్లు కళ్లు మూసుకుని ఉంటారా?

ఫొటో సోర్స్, Twitter
మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించి ఇప్పుడు పశ్చాత్తాపపడుతున్నవారిలో ఉన్నది షరీఖ్ రఫీక్ ఒక్కరు మాత్రమే కాదు.
మహిళల మనసును అర్థం చేసుకోకుండా వారిని వేధించడం తమ జన్మ హక్కుగా భావించే వారు చాలా మంది వీరిలో ఉన్నారు.
ఒమర్ షేక్ అలాంటి వారిలో ఒకరు. తను పని చేసే చోట ఓ మహిళ లైంగిక వేధింపులకు గురవుతున్నా చూస్తూ ఉండి పోయినందుకు అతను సిగ్గుపడుతున్నాడు.
తనను వేధిస్తున్న ఒకరిని వెనుకేసుకొస్తున్న ఒమర్ తీరు పట్ల ఒక మహిళా ఉద్యోగి తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసినప్పుడు అతను ఎంతగానో సిగ్గుపడ్డాడు.
తన మిత్రుడు స్నేహమనే హద్దులు దాటి ఆ మహిళతో ప్రవర్తిస్తున్నట్లు ఒమర్ గమనించాడు.
కానీ ఏం జరగనట్లు, తనకేమీ పట్టనట్లు మౌనంగా ఉండి పోయాడు.
కొన్ని కోట్ల రూపాయలు విలువైన యూరప్ ప్రాజెక్ట్‌కు ఆ వ్యక్తి బాధ్యుడిగా ఉన్నాడు. అందువల్ల అతనిని తాను ఏమీ అనలేక పోయినట్లు ఒమర్ చెబుతున్నాడు.

ఫొటో సోర్స్, Getty Images
కాబట్టి ముందుగా వేధింపులకు దారితీస్తున్న అంశాలను గుర్తించాలి. ఆ తరువాత వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నించాలి.
అయితే ఇదంత సులభమైన విషయం కాదు. ఎందుకంటే డబ్బు, గౌరవం, కెరీర్.. వీటిలో ఏదో ఒకటి కోల్పోవాల్సి వస్తుంది.
ఆ వేధింపులను మహిళలు కూడా ‘మజా’ చేయాలని చెప్పే వారిని చూసి ప్రజలు నవ్వొచ్చు.
అలాంటి వారికి ఇది పెద్ద విషయంగా అనిపించదు కాబట్టి వారి దృష్టిలో ఇదంతా మామూలే. ఎందుకంటే ఇందులో ఎటువంటి హాని ఉండదు కదా అనేది వారి అభిప్రాయం.
అయితే మీకు తెలుసా? షరీఖ్, ఒమర్ లాంటి వాళ్లు #SoDoneChilling కావాల్సి ఉంది.
తమ చట్టూ ఉన్న మహిళల అభిప్రాయాలను గౌరవిస్తూ వారు భద్రంగా ఉండేలా చూడాలి.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








