హార్వే వైన్‌స్టీన్: బయటకు వస్తున్న బాధితులు

ఫొటో సోర్స్, Getty Images
హాలీవుడ్ మూవీ మొఘల్ హార్వే వైన్‌స్టీన్ లైంగిక వేధింపుల గురించి మరిన్ని కథనాలు వెలుగులోకి వస్తున్నాయి.ః
అనేక మంది నటీమణులు వైన్‌స్టీన్ లైంగిక వేధింపులు, దౌర్జన్యాల గురించి మీడియా ముందుకు వచ్చి వివరించారు.
హాలీవుడ్‌లోని అత్యంత శక్తివంతమైన వారిలో ఒకడిగా పేరొందిన వైన్‌స్టీన్ కెరీర్ ప్రారంభంలో ఉన్న అనేక మంది నటీమణులను ఎలా లోబరుచుకోవడానికి ప్రయత్నించాడో ఆ కథనాలు వెల్లడిస్తున్నాయి.
వారు వెల్లడించిన వివరాల ప్రకారం - తన మాట వింటే వాళ్ల కెరీర్ బాగా ఉంటుందని వైన్‌స్టీన్ మాటల ద్వారా, చేతల ద్వారా సూచించేవాడు. లేకుంటే వాళ్ల కలలు కల్లలవుతాయని హెచ్చరించేవాడు.
వైన్‌స్టీన్‌పై ఆరోపణలు చేసిన నటీమణులు
గ్వెనెత్ పాల్‌ట్రో

ఫొటో సోర్స్, Getty Images
న్యూయార్క్ టైమ్స్‌కు ఇచ్చిన ప్రకటనలో పాల్‌ట్రో.. 1996లో ఎమ్మా సినిమాలో ప్రధాన పాత్రధారి అవకాశం ఇచ్చిన తర్వాత, వైన్‌స్టీన్ ఆమెను తన హోటల్ గదికి ఆహ్వానించాడని తెలిపింది.
హోటల్ గదిలో ఆమెపై చేతులు వేసి, ఒళ్లు పట్టమని కోరాడు.
అప్పుడే సినిమా ఒప్పందంపై సంతకాలు చేయడం వల్ల, ఈ పరిణామంతో చాలా భయపడిపోయానని పాల్‌ట్రో వివరించింది.
జరిగిన సంఘటన గురించి ఆమె తన బాయ్‌ఫ్రెండ్ బ్రాడ్ పిట్‌కు చెప్పడంతో అతను వైన్‌స్టీన్‌తో గొడవ పడ్డాడు.

ఫొటో సోర్స్, Getty Images
ఏంజెలినా జోలి
వైన్‌స్టీన్ 1998లో 'ప్లేయింగ్ బై హార్ట్' విడుదల సందర్భంగా ఒక హోటల్ గదిలో తనతో శృంగారానికి ప్రతిపాదించినట్లు జోలి తెలిపింది.
న్యూయార్క్ టైమ్స్‌కు పంపిన ఈమెయిల్‌లో,'' వైన్‌స్టీన్‌తో నాకు చాలా చెడ్డ అనుభవం ఉంది. ఆ సంఘటనతో నేను మరెప్పుడూ అతనితో సినిమాలు చేయకూడదని నిర్ణయించుకున్నాను. ఎవరైనా అతనితో పని చేస్తున్నా, వాళ్లను హెచ్చరించేదాన్ని'' అని వెల్లడించింది.

ఫొటో సోర్స్, REX/SHUTTERSTOCK
హెథర్ గ్రాహమ్
2000 సంవత్సరం ప్రారంభంలో వైన్‌స్టీన్ తనతో శృంగార ప్రతిపాదన తెచ్చినట్లు 'బూగీ నైట్స్' నటి హెథర్ గ్రాహమ్ వెరైటీ పత్రికకు తెలిపారు. అతని చిత్రాల్లో ఒక పాత్ర కోసం మాట్లాడేందుకు అతణ్ని కలిసినట్లు వెల్లడించింది.
వైన్‌స్టీన్ తన మీద పడి నొక్కి పెట్టడానికి ప్రయత్నించాడని ఆరోపించింది.
'నా భార్య దీన్నంతా పెద్దగా పట్టించుకోదు' అని వైన్‌స్టీన్ తనతో అన్నట్లు హెథర్ తెలిపింది.

ఫొటో సోర్స్, Reuters
కారా డెలవీన్
ఒక హోటల్ గదిలో, అందరు ఆడవాళ్ల ఎదుటే వైన్‌స్టీన్ తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని బ్రిటీష్ మోడల్, నటి కారా డెలవీన్ ఆరోపించింది.
వైన్‌స్టీన్ ప్రవర్తనతో తాను చాలా ఇబ్బందిని ఎదుర్కొనట్లు వెల్లడించారు. వైన్‌స్టీన్ ఆమె పెదాలపై ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించగా.. అతణ్ని నెట్టివేసి, ఎలాగోలా గది నుంచి బైట పడింది.
దాని గురించి చెప్పడానికి ఇన్నాళ్లూ భయపడినట్లు డెలవీన్ వెల్లడించింది.
జో బ్రోక్
1997లో ఏవో అబద్ధాలు చెప్పి వైన్‌స్టీన్ తనను హోటల్ గదికి తీసుకెళ్లినట్లు మోడల్, నటి జో బ్రోక్ తెలిపింది.
హోటల్ గదిలో వైన్‌స్టీన్ నగ్నంగా తన ఎదుట నిలబడి ఒళ్లు పట్టమని కోరినట్లు బీబీసీ రేడియో 4 కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించింది.
అతని నుంచి తప్పించుకోవడానికి ఆమె బాత్‌రూంలోకి దూరి తలుపు బిగించుకుంది. చాలాసేపు తలుపులు బాదిన వైన్‌స్టీన్, ఆమె ఎంతకీ తెరవకపోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

ఫొటో సోర్స్, Getty Images
ఆసియా అర్జెంటో
ఇటాలియన్ నటి, దర్శకురాలు ఆసియా అర్జెంటోకు క్రైమ్ డ్రామా 'బీ మంకీ'తో వైన్‌స్టీన్ సంస్థ మీరామాక్స్‌తో సంబంధం ఏర్పడింది.
ఫ్రెంచ్ రివియేరాలో ఒక పార్టీకి వెళదామని చెప్పి వైన్‌స్టీన్ తనను ఒంటరిగా అతని గదికి పిలిపించుకున్నాడని అర్జెంటో వెల్లడించింది.
తనను ఒళ్లు పట్టమని అడగ్గా, తాను అయిష్టంగానే అందుకు అంగీకరించింది. ఆ సందర్భంగా వైన్‌స్టీన్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని అర్జెంటో తెలిపింది.
తన కెరీర్ నాశనం అవుతుందనే ఇన్నాళ్లూ నోరు విప్పలేదని వివరించింది.

ఫొటో సోర్స్, Getty Images
లూసియా స్టోలర్
ప్రస్తుతం లూసియా ఎవాన్స్ అని పిలుస్తున్న స్టోలర్‌కు, మొదట 2004లో న్యూయార్క్ క్లబ్‌లో వైన్‌స్టీన్‌తో పరిచయం ఏర్పడింది. అప్పట్లో ఆమె నటి కావాలనుకుంటోంది.
ఒక సినిమా పాత్ర కోసం అతని ఆఫీసుకు వెళ్లినపుడు తనపై బలాత్కారం జరిగిందని స్టోలర్ వెల్లడించింది.
మీరా సార్వినో
వైన్‌స్టీన్ తనను లైంగికంగా వేధించాడని, తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలంటూ బలవంతం చేశాడని అతని చిత్రాల్లో నటించిన మీరా సార్వినో 'న్యూయార్కర్'కు తెలిపింది.
1995లో టొరొంటో అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా హోటల్ గదిలో జరిగిన సంఘటనను ఆమె గుర్తు చేసుకుంది.
''ఆ రోజు అతను నా భుజాలను పట్టుకుని నిమరడం ప్రారంభించాడు. క్రమక్రమంగా మరింత దగ్గరగా రావడానికి ప్రారంభించాడు. నేను తప్పించుకోవడానికి ప్రయత్నించగా, నా వెంటబడినంత పని చేశాడు'' అని వివరించింది.

ఫొటో సోర్స్, CBS News
లూయిసెట్ గైస్
2008లో జరిగిన సన్ డ్యాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో వైన్‌స్టీన్ తనపై దాడికి పాల్పడ్డాడని నటి, నిర్మాత లూయిసెట్ గైస్ తెలిపింది.
స్ర్కిప్ట్ గురించి చర్చించేందుకు వైన్‌స్టీన్ ఆమెను ఒక హోటల్ గదికి ఆహ్వానించాడు.
అరగంట గడిచాక బాత్‌రూంలోకి వెళ్లి, రోబ్ మాత్రం ధరించి వచ్చాడని గైస్ తెలిపింది.
కొంతసేపటి తర్వాత ఆమె ఎదురుగానే వైన్‌స్టీన్ హస్తప్రయోగం చేసుకున్నాడు.
ఆమెను బాత్ రూంలోకి లాక్కెళ్లి, శృంగారానికి ఒప్పుకుంటేనే స్క్రిప్టుకు ఓకే చెబుతానంటూ బెదిరించాడు.
చివరికి గైస్ అతని పట్టు విడిపించుకొని, ఆమె అక్కడి నుంచి బయటపడింది.

ఫొటో సోర్స్, Brendan Hoffman/Getty Images
తనకు వ్యతిరేకంగా పలువురు నటీమణులు చేసిన ఆరోపణలపై వైన్‌స్టీన్ ప్రతిస్పందించాడు.
తన ప్రవర్తన చాలా మందికి బాధ కలిగించి ఉంటుందని ఒప్పుకున్న వైన్‌స్టీన్, తనపై వచ్చిన ఆరోపణలను ఖండించాడు.
పరస్పర అంగీకారం లేకుండా ఎవరితోనూ సెక్స్‌లో పాల్గొనలేదని స్పష్టం చేశాడు.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








