ఆరుషి కేసు: ‘సీబీఐ విచారణే గందరగోళం’

ఫొటో సోర్స్, FIZA
ఆరుషి హత్య కేసులో ఆమె తల్లిదండ్రులను అలహాబాద్ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. సీబీఐ సరైన ఆధారాలు చూపించలేదని కోర్టు అభిప్రాయపడింది. కానీ జర్నలిస్టు అవిరుక్ సేన్ సీబీఐ విచారణ తీరుపై పలు ప్రశ్నలు సంధించారు.
'ఆరుషి' అనే పేరుతో ఒక పుస్తకాన్ని రాశారు. దానిలో పలు ప్రశ్నలు లేవనెత్తారు.
1. ఘటనా స్థలంలో సేకరించి, ల్యాబరేటరీకి పంపిన శాంపిల్స్‌ను సీబీఐ ట్యాంపరింగ్ చేసింది.
కోర్టు అనుమతి లేకుండా అనేక శాంపిల్స్‌ను కవర్ నుంచి బయటికి తీశారు. ఫొటోలు తీశారు. హైదరాబాద్ లోని సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నస్టిక్ ల్యాబ్ రిపోర్ట్ ప్రకారం, హేమరాజ్ రక్తం తల్వార్ ఇంటికి కొన్ని మైళ్ల దూరంలో ఉన్న కృష్ణ నివాసంలోని పడకపై కనిపించింది. కానీ సీబీఐ దానిని పరిగణలోకి తీసుకోలేదు.
2. 2008లో ఒక సీబీఐ అధికారి హైదరాబాద్‌లోని ల్యాబ్‌కు లేఖ రాసినట్లు అవిరుక్ తన పుస్తకంలో పేర్కొన్నారు. ఆ లేఖలో ఆ అధికారి, రక్తంతో తడిసిన హేమరాజ్ తలగడ ఆరుషి గదిలో దొరికిందని తెలిపాడు.

అదే సీబీఐ - ఆ తలగడ హేమరాజ్ గదిలోనే దొరికిందని సుప్రీంకోర్టు, అలహాబాద్ హైకోర్టులకు తెలిపింది. సీబీఐ అధికారి రాసిన లేఖతో హేమరాజ్ తన తలగడతో ఆరుషి గదిలోనే ఉన్నట్లు, ఆరుషే అతణ్ని తన గదిలోకి అనుమతించిందన్న కథనానికి బలం చేకూరిందని అవిరుక్ తన పుస్తకంలో పేర్కొన్నారు. బయటి వాళ్లెవరూ ఇంట్లోకి ప్రవేశించే అవకాశం లేకపోవడంతో, ఇది పరువు హత్య అన్న సీబీఐ వాదనకు బలం చేకూరింది.
3. ఈ పుస్తకం ప్రకారం - ఆరుషిని రాజేశ్ తల్వార్ గోల్ఫ్ స్టిక్‌తో కొట్టి చంపేశాడని సీబీఐ కోర్టుకు తెలిపింది. అయితే విచారణ సందర్భంగా ప్రాసిక్యూషన్ తర్వాత మరో గోల్ఫ్ స్టిక్‌ను కోర్టుకు అందజేసింది. ఇలా రెండు గోల్ఫ్ స్టిక్‌లను కోర్టుకు సమర్పించడం పలు అనుమానాలకు తావిస్తోంది.
అంతే కాకుండా విచారణ సందర్భంగా ప్రాసిక్యూషన్ ఆరుషి గొంతును స్కాపెల్ లేదా ఓ డెంటిస్ట్ ఉపయోగించే పదునైన కత్తితో కోసినట్లు వాదించిందని అవిరుక్ తన పుస్తకంలో తెలిపారు. కానీ పోలీసులు తల్వార్ దంపతుల నుంచి అలాంటి ఏ ఆయుధాన్నీ స్వాధీనం చేసుకోలేదు.

ఫొటో సోర్స్, PENGUIN INDIA
4. తల్వార్ దంపతులను విచారణకు పిలిచేందుకు, వారితో సంభాషించేందుకు, వారి నుంచి వివరాలు తెలుసుకునేందుకు సీబీఐ అధికారులు [email protected] అన్న ఐడీని ఉపయోగించారు.
సీబీఐ ప్రభుత్వ ఐడీని ఉపయోగించకుండా, హేమరాజ్ పేరుతో ఉన్న మెయిల్ ఐడీని ఉపయోగించడంపై అవిరుక్ సందేహాలు వ్యక్తం చేశారు.
5. తల్వార్ దంపతుల ఇంటిలో పని చేసే భారతి మండల్ కోర్టులో, ఇంటి తలుపు లోపలి నుంచి గడియ వేసి ఉండడంతో తాను బయటి నుంచి దాన్ని తెరవడానికి ప్రయత్నించినట్లు తెలిపింది.
అయితే అవిరుక్‌తో మాట్లాడినప్పుడు భారతి - తాను బెల్ కొట్టి, తలుపు తెరవడం కోసం వేచి ఉన్నానని తెలిపింది. ఇతరుల తలుపును బైటి నుంచి ఎలా తెరవడానికి ప్రయత్నిస్తామని ప్రశ్నించింది.
6. ఒకవేళ ఆరుషి తన గది తలుపు తెరవకుంటే, ఆమె గదిలోకి ప్రవేశించేందుకు మరో దారేదైనా ఉందా? ఆ దిశగా విచారణ సరిగా జరగలేదని అవిరుక్ సేన్ అభిప్రాయపడ్డారు.
ఆరుషి గదికి ముందు ఓ గెస్ట్ టాయిలెట్ రూం ఉంది. ఆరుషి టాయిలెట్‌కు గెస్ట్ టాయిలెట్‌కి మధ్య ఓ తలుపు ఉంది. ఆ తలుపును గెస్ట్ టాయిలెట్ వైపు నుంచి తెరిచే అవకాశం ఉంది.
7. ఈ కేసులో తల్వార్ కుటుంబానికి దగ్గరగా ఉండే డాక్టర్ సుశీల్ చౌదరి తనను పిలిచారని మాజీ పోలీస్ అధికారి కేకే గౌతమ్ ఈ కేసులో కోర్టుకు తెలిపారు. పోస్ట్ మార్టం రిపోర్టులో 'రేప్' అన్న పదాన్ని కొట్టేయాలని తనను డాక్టర్ సుశీల్ కోరినట్లు గౌతమ్ కోర్టుకు తెలిపారు.

ఫొటో సోర్స్, FIZA
అయితే చౌదరి దీనిని కొట్టిపారేశారు. సుశీల్ చౌదరిని పిలవాలని సుప్రీంకోర్టు సీబీఐను ఆదేశించినా, ఆయన వాంగ్మూలం తీసుకోలేదు. తల్వార్‌ల కేసులో ఆయన వాంగ్మూలం చాలా కీలకమని ఆ పుస్తకం అభిప్రాయపడింది.
అయితే సీబీఐ తరపు న్యాయవాది ఆర్‌కే సైనీ ఈ పుస్తకంలో లేవనెత్తిన సందేహాలన్నిటినీ కొట్టిపారేశారు.
ఆ పుస్తకంలో కొత్తగా చెప్పినవేమీ లేవని ఆయన అభిప్రాయపడ్డారు. అవిరుక్ సేన్ తల్వార్ దంపతుల మీడియా మేనేజర్ అని అన్నారు.
ఇదే పుస్తకంలో ఆర్‌కే సైనీ కోర్టులో ఆరుషి, హేమరాజ్ మధ్య సంబంధం గురించి వాదిస్తూ 'వాళ్లిద్దరి మధ్య అక్రమ సంబంధం ఉంది' అని అరిచినట్లు ఆరోపించారు.
అయితే కోర్టు వ్యవహరాలన్నీ చట్టప్రకారం జరుగుతాయి కానీ, రెచ్చగొట్టడం ద్వారా కాదని ఆర్‌కే సైనీ ఆన్నారు.
ఇదీ కేసు నేపథ్యం
2008లో జరిగిన ఆరుషి, హేమరాజ్‌ల హత్య కేసులో ఆ బాలిక తల్లిదండ్రులే దోషులంటూ కింది కోర్టు తీర్పు ఇచ్చింది. కానీ దీన్ని హైకోర్టు కొట్టేసింది.
16 మే, 2008 న దిల్లీ సమీపంలోని నోయిడాలోని తన నివాసంలో 14 ఏళ్ల ఆరుషి మృతదేహం కనిపించింది. ఆ మరుసటి రోజే ఆ ఇంటి పనిమనిషి హేమ్‌రాజ్ మృతదేహం కూడా ఇంటి పైకప్పు మీద లభించింది.
మొదట ఉత్తరప్రదేశ్ పోలీసులు - కేసును పరిష్కరించామని, తల్వార్ ఇంటిలో పని చేసే పని నౌకర్లే దోషులని ప్రకటించారు. ఆ తర్వాత వారే - ఆరుషి, హేమరాజ్‌లు కలిసి ఉండగా చూసిన రాజేశ్ తల్వార్ ఆ కోపంలో వారిద్దరినీ హత్య చేశారని ప్రకటించారు.
కేసును విచారించిన సీబీఐ కోర్టు 23 నవంబర్, 2013 న తల్వార్ దంపతులను దోషులుగా తేల్చింది. అయితే తల్వార్ దంపతులు తమపై వచ్చిన అన్ని ఆరోపణలను నిరాకరించారు.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








