టూనీషియాలో ముద్దుకు సంకెళ్లు

ఫొటో సోర్స్, AFP / GETTY IMAGES
ముద్దు పెట్టుకుంటేనే జైల్లో వేస్తారా..? ఇదేమి విడ్డూరం అనుకోకండి. బహిరంగంగా అధరాలతో పలకరించుకున్నందుకు ఒక జంట ఇప్పుడు ఊచలు లెక్కిస్తోంది.
భారత్‌లో కాదులెండి. టూనీషియాలో. ఈ పేరు ఎక్కడో విన్నట్లు ఉంది కదా. గుర్తు కొచ్చిందా.. కొద్ది సంవత్సరాల క్రితం అరబ్బు దేశాలను ఊపేసిన 'జాస్మిన్ విప్లవం' పుట్టింది ఇక్కడే.
అలాంటి దేశంలో ఇలాంటి విడ్డూరం ఎలా చోటు చేసుకుందని ముక్కున వేలేసుకోకండి. ఆ దేశపు చట్టాలు అంతే మరి. అందుకే వారికి మూడు నెలలు కారాగార శిక్ష విధించింది.
అతనికి 33 ఆమెకు 44
అతని పేరు నసీం అవాది. ఆయన వయసు 33 ఏళ్లు. ఆయనకు ఓ ప్రియురాలుంది.
ఆమె వయసు 44 ఏళ్లు. ఆమెది టూనీషియానే. కానీ నసీంది కాదు.
నసీం తరఫు న్యాయవాది చెబుతున్న ప్రకారం.. ఒక రోజు క్లబ్‌లో సరదాగా గడిపిన ఈ జంట కారులో బయలుదేరారు.
ఎక్కడికో మనకు మాత్రం ఏం తెలుసు..? బయలుదేరే ముందు కొంచెం మద్యం తాగారు. ఆ తరువాత కారులో ముద్దులాడుకోవడం ప్రారంభించారు.

ఫొటో సోర్స్, FACEBOOK OLIVIER POIVRE D'ARVOR
ఇంతలో ఓ పోలీసు వచ్చాడు. బహిరంగంగా ఇదేం పనని ప్రశ్నించాడు. అయితే ఆ ప్రేమ పక్షులు రక్షక భటుడితో కయ్యానికి దిగారు.
దీంతో ఇద్దర్నీ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. కేసు విచారించిన కోర్టు బహిరంగంగా అశ్లీల చర్యలకు పాల్పడినందుకు, పోలీసు విధులను అడ్డుకున్నందుకు ఆ జంటకు జైలు శిక్ష విధించింది.
తన కొడుకు కటకటాల వెనుక ఉన్నాడన్న విషయం తెలుసుకున్న నసీం తల్లి ఆగమేఘాల మీద టూనీషియాకు వచ్చారు.
ఎలాగైనా తన కుమారునికి శిక్ష తప్పించేలా అక్కడి ఫ్రాన్స్ రాయబార కార్యాలయ సహాయాన్ని అర్థించారు.
న్యాయ సహాయం అందించనున్నట్లు రాయబారి ఫేస్‌బుక్ ద్వారా తెలిపారు.
మా దేశంలో ఇంతే!
బహిరంగంగా ముద్దులు పెట్టుకోవడం విలువలకు సంబంధించిన విషయమని కోర్టు ప్రతినిధి అన్నారు.
పైగా ఆ జంట ఒక ప్రభుత్వ అధికారి విధులను అడ్డుకున్నారని చెప్పారు. ఈ రెండూ వారు చేసిన నేరాలని పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
విమర్శల వెల్లువ
సాధారణంగా అరబ్బు దేశాల్లో ఆధునికంగా ఆలోచిస్తుందనే పేరు టూనీషియాకు ఉంది. ఆ దేశ అధ్యక్షుడు కూడా తరచూ స్ర్తీ పురుషుల సమానత్వం గురించి మాట్లాడుతుంటారు.
అలాంటి దేశంలో నలుగురిలో ముద్దుపెట్టుకున్నారన్న నెపంతో ఓ జంటకు జైలు శిక్ష విధించడంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
'ప్రేమికులు తమ ప్రేమను వ్యక్తం చేసినా జైలుకు పంపుతున్నార'ని ఒకరు అనగా.. 'ముద్దు పెట్టుకున్నందుకే నాలుగు నెలలు జైల్లో వేశారు. మరి కొడితే శిక్షలు ఏమీ లేవా..?' అని మరొకరు విరుచుకుపడ్డారు.
మరికొందరు మరో అడుగు ముందుకేసి వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలపాలని పిలుపునిస్తున్నారు.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్ లోనూ ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)








