ట్రాన్స్‌విజన్: ట్రాన్స్‌జండర్ల కోసం యూట్యూబ్ చానల్
- రచయిత, బళ్ల సతీశ్
- హోదా, బీబీసీ తెలుగు, హైదరాబాద్
మనం హిజ్రాలు అని పిలిచే ట్రాన్స్‌జండర్ల గురించి సమాజంలో ఎన్నో అపోహలున్నాయి. వారి గురించి చాలా అవాస్తవిక, విచిత్ర విషయాలు ప్రచారంలో ఉన్నాయి.
ఆ అపోహలను తొలగించి, ట్రాన్స్‌జండర్ల గురించి స్పష్టమైన అవగాహన కల్పించడం కోసం ట్రాన్స్‌విజన్ యూట్యూబ్ చానల్ ఏర్పాటు చేసామంటున్నారు రచన ముద్రబోయిన.
ఈ యూట్యూబ్ చానల్ మూడు భాషల్లో మొదలైంది. తెలుగులో 'అఆ ఇఈ అంజలి', కన్నడలో 'అక్షర జాహ్నవి', ఉర్దూలో 'అలీఫ్ సోనియా' పేరుతో ఈ చానల్స్ నడుస్తాయి.
ట్రాన్స్‌జండర్ గురించి ప్రాథమిక విషయాలు చెప్తున్నారు కాబట్టి వర్ణమాలతో మొదలయ్యే పేర్లు పెట్టారు నిర్వాహకులు.

ఇప్పటికే తెలుగులో రెండు ఎపిసోడ్లూ, కన్నడ, ఉర్దూల్లో టీజర్స్ విడుదలయ్యాయి. ట్రాన్స్‌జండర్లే రచన, దర్శకత్వం, వ్యాఖ్యానం చేసే ఏకైక చానల్ తమదేనని వారు చెప్తున్నారు.
''నేను చాలా యూట్యూబ్ వీడియోలు చూశా. వాటిలో చాలా వరకూ తప్పుదారి పట్టించే సమాచారం ఇస్తున్నారు. మూఢ నమ్మకాలు వ్యాప్తి చేస్తున్నారు. ట్రాన్స్‌జండర్ల గురించి సమాజానికి సరైన సమాచారం అందివ్వడం నా బాధ్యతని భావించా. అందుకే ఈ చానల్ మొదలుపెట్టా.'' - రచన ముద్రబోయిన, ట్రాన్స్ విజన్ రైటర్, డైరెక్టర్

ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు
ఈ ట్రాన్స్ విజన్ యూట్యూబ్ చానల్ ద్వారా ట్రాన్స్‌జండర్లు ఎవరు? వారు అలా ఎందుకున్నారు? వాళ్లతో ఏం మాట్లాడవచ్చు? ఏం మాట్లాడితే వారు బాధ పడతారు? ట్రాన్స్‌జండర్లకు ఉన్న న్యాయ, చట్టపరమైన రక్షణలు ఏంటి? హిందూ పురాణాలు ట్రాన్స్‌జండర్ల గురించి ఏమంటున్నాయి? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నారు.
ట్రాన్స్‌విజన్ ప్రారంభించిన రచన ముద్రబోయిన డబుల్ పీజీ చేశారు. హెచ్‌సీయూ కోసం కొన్ని రీసెర్చ్ ప్రాజెక్టులు చేశారు. గతంలో అనేక ఎన్‌జీఓలలో పనిచేశారు. కానీ, ట్రాన్స్‌జండర్ల విషయంలో చాలా ఎన్‌జీఓలు సైతం సున్నితంగా వ్యవహరించే పరిస్థితి లేదు. తాను గతంలో పనిచేసిన చోట బాస్ చూపించే వివక్ష తట్టుకోలేక ఉద్యోగం మానేసారు. రీసెర్చ్ ప్రాజెక్టులు, ట్రాన్స్‌జండర్ల గురించి ఇచ్చే ప్రసంగాల ద్వారా వచ్చే ఆదాయంతో ఆమె జీవిస్తున్నారు. ట్రాన్స్‌జండర్లు చదువుకుని, ఉద్యోగం చేసుకుంటూ సాధారణంగా బతుకుదాం అనుకున్నా.. ఎక్కడా వారికి అనుకూలమైన వాతావరణమే లేదంటారు రచన.

క్రౌడ్ సోర్సింగ్‌తో నిధులు
ట్రాన్స్‌విజన్ యూట్యూబ్ చానల్‌లో ఒక్కో ఎపిసోడ్ తయారు చేయడానికి 12-13 వేల రూపాయలు ఖర్చవుతోందని రచన తెలిపారు. ’’ఇప్పటి వరకూ మా దగ్గరున్న కొద్దిపాటి వనరులతోనే చేశాం. నాకు, మా ప్రజెంటర్లు ఎవరికీ ఉద్యోగాల్లేవు. ప్రొడక్షన్ విషయంలో మోజెస్ సహాయం చేశారు. మిగిలిన 8 ఎపిసోడ్ల కోసం క్రౌడ్ సోర్సింగ్‌కు వెళ్లాం. విష్ బెర్రీ అనే వెబ్‌సైట్ ద్వారా నిధులు సేకరించాం. నెల రోజుల్లోపు లక్ష్యానికి మించి లక్ష రూపాయలకన్నా ఎక్కువే విరాళాలు వచ్చాయి. ఇప్పుడు మిగిలిన ఎపిసోడ్ల ప్రొడక్షన్ చురుగ్గా సాగుతోంది'' అని ఆమె వివరించారు.

ఈ యూట్యూబ్ చానల్ విషయంలో రచన ముద్రబోయినకు మోజెస్ అనే ఫిలిం మేకర్, పావన అనే పౌర హక్కుల కార్యకర్త సహాయపడుతున్నారు. మోజెస్ ఈ షోకి ప్రొడ్యూసర్‌గా వ్యవహరించడమే కాదు, హైదరాబాద్ కేంద్రంగా జరిగే ట్రాన్స్‌జండర్ హక్కుల పోరాటంలో చురుగ్గా పాల్గొంటున్నారు.
''స్థానిక భాషల్లోనే ఈ ప్రసారాలు ఉంటాయి. ప్రజలకు వారి సొంత భాషలో చెబితే విషయం వాళ్ల మనసులకు తాకి, మార్పు వస్తుందని ఆశిస్తున్నాం.'' - మోజెస్, ఫిలిమ్ మేకర్

కొంతైనా మార్పువస్తుందని...
ట్రాన్స్‌జండర్లపై హింస ఎక్కువగా ఉంది. హైదరాబాద్ వంటి నగరాల్లో ప్రతి రెండు రోజులకొకసారి ఒక ట్రాన్స్‌జండర్‌పై దాడి జరుగుతోందని వారి సంఘాలు చెప్తున్నాయి. యాసిడ్ పోయడం, బీర్ బాటిల్‌తో కొట్టడం, కళ్ళల్లో కారం చల్లడం వంటివి చేస్తున్నారు. ఈ మానసిక ప్రవృత్తికి కారణం తెలీదు. అయితే, ట్రాన్స్‌జండర్లపై సమాజానికి ఉన్న అభిప్రాయాలు, ఆలోచణా ధోరణే ఈ హింసకు కారణం అని రచన అభిప్రాయం. అందుకే, అందరికీ ట్రాన్స్‌జండర్ల గురించి సరైన సమాచారం ఇస్తే, పరిస్థితిలో కొంతైనా మార్పు వస్తుందని ఈ యూట్యూబ్ చానల్ ద్వారా ప్రయత్నిస్తున్నామని అంటున్నారు రచన.

''ట్రాన్స్‌జండర్ల గురించి ముందుగా ఫొటో డాక్యుమెంటింగ్ సిరీస్ మొదలుపెట్టాం. తరువాత క్రౌడ్ సోర్సింగ్ పద్ధతిలో విష్ బెర్రీ వేదికగా నిధులు సంపాదించాం. వివిధ వర్గాల వారు తమ తమ హక్కుల కోసం పోరాడుతున్నారు. కానీ, ట్రాన్స్‌జండర్ల హక్కులు భిన్నమైనవి.'' - పావన, పౌర హక్కుల కార్యకర్త
మా వెబ్‌సైట్‌పై మరి కొన్ని తాజా కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









