‘నన్ను ఇలా వేధించారు!’ అంటున్న బీబీసీ ఉద్యోగి రజనీ వైద్యనాథన్

#MeToo - అంటూ ట్విటర్లో ప్రముఖ హాలీవుడ్ నటి అలిసా మిలానో చేసిన ఓ ట్వీట్ ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అయింది. హాలీవుడ్ హీరోయిన్లపై హార్వే వైన్‌స్టీన్ లైంగిక వేధింపులని వ్యతిరేకించడంతో పాటు, ప్రపంచవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై గళమెత్తాలని ఇచ్చిన పిలుపునకు సెలెబ్రిటీల నుంచి సామాన్యుల వరకూ అందరూ స్పందించారు.
బీబీసీకి చెందిన రజనీ వైద్యనాథన్ కూడా తన వ్యక్తిగత అనుభవాన్ని పంచుకున్నారు.
నాకు అప్పుడు 25 సంవత్సరాలు. పని పూర్తి చేసుకుని న్యూయార్క్‌లోని ఓ ఇటాలియన్ రెస్టారెంట్‌కి చేరుకున్నాం. నేనూ, నాతోపాటు కొంతమంది సహోద్యోగులు ఉన్నారు. జార్జిబుష్, జాన్ కెర్రీల గురించి మాట్లాడుకుంటున్నాం.
ఉన్నట్టుండి మాలో ఒకరు "నాకు నీపై ఆకర్షణ కలుగుతోంది. నీ గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నా" అని అన్నారు.
ఒక్కసారిగా ఉలిక్కిపడ్డా
అతని వయసు నాకు రెట్టింపు ఉంటుంది. ఇంతకుముందు కూడా కొన్ని వేధింపులు చూశాం కానీ మరీ ఇంత ఓపెన్‌గా కాదు.
అప్పుడు నేనేం చెప్పానో నాకు సరిగా గుర్తు లేదు కానీ ఆ టాపిక్‌ని పక్కదారి పట్టించా. ఇదైతే బాగా గుర్తుంది.
అతను అలా మాట్లాడినందుకు నేను చాలా ఇబ్బంది పడ్డా.
ఆఫీసుల్లో మహిళలను తమ అధికారంతో, బలంతో ఏ రకంగా వేధింపులకు గురిచేస్తారనేదానికి ఇదో ఉదాహరణ. దీన్ని నేనెప్పటికీ మర్చిపోలేను.
ఇలాంటిదే మరో అనుభవం.
మా కొలీగ్ ఒకరు "అలాంటి" అర్థమే వచ్చే మెసేజ్ ఒకటి పంపారు. ఆ రోజు రాత్రి అతను నా హోటల్ గది తలుపుతట్టాడు.
నేను భయంతో బాత్రూమ్‌లోకి పరిగెత్తి మా స్నేహితుడికి ఫోన్ చేశా.
"మరోసారి తలుపు తడితే మా స్నేహితుడిని పిలుస్తా" అని చెప్పమని అతను సలహా ఇచ్చాడు.
అబ్బాయిల్లో కూడా సహాయం చేసేవాళ్లుంటారని అప్పుడు ఓ నమ్మకం కలిగింది.
భారత్‌లోనూ ఎంతోమంది మహిళలు తాము ఎదుర్కొన్న వేధింపులను ట్విటర్ వేదికగా పంచుకున్నారు. తమ చిన్నతనంలో, పనిచేసేచోట, రోడ్లపై, రద్దీగా ఉన్న ప్రదేశాల్లో... ఇలా అనేక సందర్భాల్లో తాము అనుభవించిన చెప్పుకోలేని బాధను ట్విటర్ ద్వారా వెలిబుచ్చారు.
ఈ సమాజంలో మార్పు వస్తే తప్ప దీనికి పరిష్కారం దొరకదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆచారాలు, సంప్రదాయాల మాటున పెరిగే భారతీయ మహిళలు ఇలాంటి సమస్యల గురించి కనీసం బయటకు చెప్పుకోలేని దుస్థితి మారాలని వారు కోరుకుంటున్నారు.

ఫొటో సోర్స్, Twitter
ఆలోచింపచేసే కొంతమంది స్పందనలు
"నేను అందంగా తయారైనప్పుడు మా తాతయ్య నాపై అత్యాచారం చేశాడు. అప్పుడు నా వయసు 4, ఆయన వయసు 56."

ఫొటో సోర్స్, Twitter
"మా ఆంటీ భర్త నన్ను వేధించేనాటికి నేనింకా చిన్నపిల్లనే. నాకు చెప్పగలిగే ధైర్యం వచ్చేనాటికి దీన్ని ఎవరూ నమ్మలేదు.

ఫొటో సోర్స్, Twitter
"నాకు ఎప్పట్నుంచో తెలిసిన వ్యక్తే నాపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బయటివాళ్లే ఇలా చేస్తారనుకోవడానికి లేదు. అందరితోనూ జాగ్రత్తగానే ఉండాలి. మెట్రోలు, షాపింగ్ మాల్స్, అన్నిచోట్లా ఈ పరిస్థితే. ఇవన్నీ చూసిన తర్వాతైనా మార్పు వస్తుందేమో చూడాలి."

ఫొటో సోర్స్, Anil Kumar
"ఈరోజు ఉదయం మెట్రోలో ఓ అమ్మాయి #MeToo అని పోస్ట్ చెయ్యాలా వద్దా అనే సంశయంలో ఉండడం గమనించాను. చివరికి పోస్ట్ చేసింది."

ఫొటో సోర్స్, Twitter
"సోషల్ మీడియాలో #MeToo హ్యాష్ ట్యాగ్‌తో పోస్ట్ పెట్టలేదంటే అర్థం ఇప్పటి వరకూ ఎలాంటి వేధింపులూ లేవని కాదు... దీనిపై ఎవరూ మాట్లాడట్లేదని."

ఫొటో సోర్స్, Twitter
#MeToo పై ఫేస్‌బుక్‌లో దాదాపు కోటికి పైగా పోస్టులు నమోదుకాగా, ట్విటర్లో 6 లక్షల పైగా ట్వీట్లు వచ్చాయి.
భారత్ నుంచి కూడా అధిక సంఖ్యలో పోస్టులు కావడం మన దేశంలోని పరిస్థితికి అద్దం పడుతోంది.
మరోవైపు, థామ్సన్ రాయ్‌టర్స్ ఫౌండేషన్ ప్రపంచవ్యాప్తంగా మహిళలపై వేధింపులకి సంబంధించి ఓ పోల్ నిర్వహించింది. భద్రత, ఆరోగ్యం, బాల్య వివాహాలు, ఆర్థిక స్వాతంత్య్రం అనే నాలుగు అంశాలపై అభిప్రాయాలను సేకరించారు.
ఈ నివేదిక ప్రకారం.. 'అత్యాచారాల రాజధాని'గా పేర్కొనే దిల్లీ ప్రపంచవ్యాప్త ప్రమాదకరమైన నగరాల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచింది.

ఫొటో సోర్స్, Getty Images
- లైంగిక వేధింపుల్లో దిల్లీ మొదటి స్థానంలో ఉండగా, జపాన్ రాజధాని టోక్యో మహిళలకు భద్రమైన నగరం అని తెలిపింది.
- మహిళల ఆరోగ్యం, ఆరోగ్య పరిరక్షణ, సురక్షిత గర్భధారణ వంటి అంశాల్లో దిల్లీది అట్టడుగు నుంచి ఐదో స్థానం కాగా లండన్ సురక్షిత ప్రదేశాల్లో ప్రథమ స్థానంలో నిలిచింది.
- భ్రూణహత్యలు, బాల్య/బలవంతపు వివాహాల్లాంటివాటిలో దిల్లీది జాబితాలో కింద నుంచి ఆరో స్థానం కాగా, మాస్కో నగరానిది సురక్షిత నగరాల్లో ప్రథమ స్థానం.
- మహిళల ఆర్థిక స్వాతంత్య్రం విషయంలో అత్యంత వెనకబడిన నగరాల్లో కాంగో రాజధాని కిన్హాసా, ఈజిప్ట్ రాజధాని కైరోల తర్వాత స్థానం మన దేశ రాజధాని దిల్లీదే. ఆర్థికంగా మహిళలు ముందున్న నగరాల జాబితాలో లండన్ ప్రథమ స్థానంలో ఉంది.
తర్వాతేంటి?
ఏం చేస్తే ఈ దుస్థితిలో మార్పు తీసుకువచ్చి, మహిళలకు భద్రమైన సమాజాన్ని అందించగలమో అభిప్రాయాలను బీబీసీ న్యూస్ ఫేస్‌బుక్, ట్విటర్ పేజీల్లో #HowWillIChange హ్యాష్ ట్యాగ్ ద్వారా పంచుకోండి.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








