మీ జాబ్‌ను రోబో మింగేస్తుందా?

ఫొటో సోర్స్, Reuters
ఒకటీ రెండేళ్లు కాదు.. కొన్ని దశాబ్దాల పాటు చాలా ఉద్యోగాలు ఎక్కడకూ పోవని చెబుతున్నారు పరిశోధకులు. మరో 120 ఏళ్ల దాకా అన్ని ఉద్యోగాలనూ రోబోలు చేయలేవని.. ఆ అవకాశాలూ అంతంత మాత్రమేనని విశ్లేషిస్తున్నారు. ఆలోచనలు, నిర్ణయాలు, విశ్లేషణలు, అనుభవం అవసరమైన కొలువులను ఇప్పటికిప్పుడు రోబోలు చేయలేవని వెల్లడించారు.
ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకుడు కట్జా గ్రేస్.. రోబోల వల్ల ఉద్యోగాలు ఎలా పోతాయో అధ్యయనం చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 352 మంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శాస్ర్తవేత్తల వద్ద అభిప్రాయాలు సేకరించారు. వీటి ఆధారంగా ఉద్యోగులపై రోబోల ప్రభావాన్ని వివరించారు.
గ్రేస్ సేకరించిన అభిప్రాయాల్లో ఫేస్‌బుక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డైరక్టర్ యాన్ లీకన్, గూగుల్‌లో పని చేస్తున్న ముస్తఫా సులేమాన్ తదితరులవి కూడా ఉన్నాయి. వీరు చెబుతున్న ప్రకారం ఇప్పటికిప్పుడు ఐటీయేతర ఉద్యోగాలకు ముప్పు ఉండదు. అలాగే 120 ఏళ్లు దాటినా.. ఈ ఉద్యోగాలన్నీ రోబోలే చేసేందుకు 50 శాతమే అవకాశముంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
మీ ఉద్యోగం క్షేమమా?
2021కి .. దుస్తులు ఉతికే అవసరం రాకపోవచ్చు. ఆ పని మొత్తం.. రోబోలు.. లేదా మెషీన్లు చేస్తాయి అనుకున్నారు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా అయితే దుస్తులను ఉతికి చక్కగా మడతపెట్టే.. రోబోనూ సృష్టించేసింది. కానీ.. ఇది జీన్స్, టీషర్టులు, టవల్స్‌ను మడతపెట్టేందుకు మనుషులతో పోల్చితే ఎక్కువ సమయం తీసుకుంటోంది. దీంతో ఇప్పటికీ బట్టలుతికేవారే అవసరమవుతున్నారు.
ఇతర ఉద్యోగుల అవసరం కూడా ఇప్పటికీ అలాగే ఉంది. అయితే డ్రైవర్లెస్ కార్ల వల్ల రెండు దశాబ్దాలలో ట్రక్కు డ్రైవర్లు.. రిటైలర్లు మాత్రం తమ ఉద్యోగాలను కోల్పోవాల్సి ఉంటుంది. 2027కి ట్రక్కు డ్రైవర్లు. 2031కి రిటైలర్లు కొలువులు కోల్పోయే ప్రమాదముంది. 2031కి.. రోబోలు దుకాణంలో వస్తువులను కొనడానికి సహకరిస్తాయి.

ఫొటో సోర్స్, Getty Images
రొమాంటిక్ రచనలు కూడా
భవిష్యత్తులో రోబోలే నవలలు కూడా రాస్తాయట. నవలలు, వార్తలను మరింత సృజనాత్మకంగా, రొమాంటిక్‌గా రాయడానికి వీలుగా గూగుల్ .. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కి శిక్షణ ఇస్తోంది. అయితే ఇది అందుబాటులోకి రావడానికి 30 ఏళ్లు పట్టవచ్చు. రాయిటర్స్, అసోసియేటెడ్ ప్రెస్ వంటి వార్తా సంస్థలైతే ఇప్పటికే చాలా ఆర్థిక, క్రీడలకు సంబంధించిన వార్తలను బోట్లతో చేయిస్తున్నాయి.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ లోనూ ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేసుకోండి.)




