పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా అమెరికా చర్యలతో భారత్‌కు మేలెంత?

మోదీ, ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

తీవ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్న నేపథ్యంలో పాకిస్తాన్‌కు చేస్తున్న ఆర్థిక సాయం ఎంత వరకు సబబు? అని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు.

పాకిస్తాన్‌ తమను మోసం చేస్తోందని, వంచిస్తోందని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

15 సంవత్సరాలుగా అమెరికా చేస్తున్న ఆర్థిక సాయానికి బదులుగా నమ్మక ద్రోహం తప్ప పాకిస్తాన్ తమకేం ఇవ్వలేదని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.

"అమెరికా గత 15 యేళ్ళలో 33 అరబ్ డాలర్ల కంటే ఎక్కువే పాకిస్తాన్‌కి సహాయం చేసింది. ప్రతిఫలంగా వంచన, అబద్ధాలు మినహా పాకిస్తాన్ తమకేమీ ఇవ్వలేదు. అమెరికా అధ్యక్షుడు ఓ మూర్ఖుడని వాళ్లనుకుంటున్నారు. అఫ్ఘానిస్తాన్‌లో మేం వెతుకుతున్న తీవ్రవాదులకు పాకిస్తాన్ ఆశ్రయం ఇస్తోంది. ఇక ఉపేక్షించేది లేదు" అని ట్రంప్ ట్వీట్ చేశారు.

అమెరికా అధ్యక్షుడు చేసిన ట్వీట్‌పై పాక్ స్పందించింది. త్వరలోనే ట్రంప్ చేసిన ట్వీట్‌కు జవాబు లభిస్తుందని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

"మేము ప్రపంచానికి నిజం చెబుతాం. వాస్తవాలకు, కల్పనలకు మధ్య ఉన్న వ్యత్యాసం తప్పకుండా తెలియజేస్తాము" అని అన్నారు.

పాకిస్తాన్ పట్ల అమెరికా వైఖరి భారత్‌కు ఎంతవరకు లాభిస్తుంది? ఏవిధంగా లాభిస్తుంది?

ఈ ప్రశ్నలకు సమాధానాల కోసం బీబీసీ ప్రతినిధి బ్రజేష్ మిశ్రా, కీలక/వ్యూహాత్మక వ్యవహారాల నిపుణుడు సుశాంత్ సరీన్తో మాట్లాడారు.

మోదీ, ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

వారి సంభాషణల సారాంశం

అఫ్ఘానిస్తాన్‌లో తీవ్రవాదం పట్ల అమెరికా ఆందోళన చెందుతోంది. ఈ కారణాలతో తీవ్రవాదాన్ని నియంత్రించేలా పాకిస్తాన్‌పై ఒత్తిడి పెరుగుతుంది.

తీవ్రవాదాన్ని నిరోధించడానికి పాకిస్తాన్‌పై పెరుగుతున్న ఒత్తిడి వల్ల భారత్‌కు కచ్చితంగా ఉపయోగం ఉంటుంది.

అఫ్ఘానిస్తాన్‌లో తీవ్రవాదుల ఏరివేతలో అమెరికా సంపూర్ణ విజయం సాధించలేకపోతోందని.. ఆ తీవ్రవాదులకు పాకిస్తాన్ పరోక్షంగా సహాయం చేస్తోందని అమెరికా చెబుతోంది.

కానీ "గుడ్-బ్యాడ్ టెర్రరిస్టులు" అంటూ తమను తాము సమర్థించుకుంటున్న పాకిస్తాన్ వ్యూహం ఇకపై చెల్లదు.

అఫ్ఘానిస్తాన్‌లో జరుగుతున్న తీవ్రవాద కార్యకలాపాలకు పాకిస్తాన్ తమ మద్దతును ఉపసంహరించుకుని, వారిపై చర్యలు తీసుకోవాలి.

అలాగైతేనే.. భారత్‌, కాశ్మీర్‌లో జరిగే తీవ్రవాద కార్యకలాపాలను పాక్.. బహిరంగంగా సమర్థించలేదు.

పాకిస్తాన్ మద్దతు ఇస్తున్న తీవ్రవాద సంస్థలు, తమ దేశంలో అరాచకాలు సృష్టిస్తున్నాయని భారత్ చెబుతూనే ఉంది. తీవ్రవాద సంస్థలకు ఆశ్రయం కల్పించరాదంటూ.. ఇరు దేశాల చర్చల సందర్భంగా భారత్ చెబుతూనే ఉంది.

మోదీ, ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

ఇప్పటికైనా పాకిస్తాన్ సానుకూలంగా స్పందిస్తే.. భారత్-పాకిస్తాన్‌ల మధ్య సంబంధాలు మెరుగుపడే అవకాశం ఉంది.

ఈ సందర్భంలో పాకిస్తాన్ ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి. తీవ్రవాద సంస్థలకు ఆర్థిక సాయాన్ని నిలిపేయడం మాత్రమే.. పాకిస్తాన్ ముందున్న కర్తవ్యం కాదు.

తనపై వస్తున్న ఆరోపణలను సవాలు చేస్తూనే.. అమెరికా సాయం లేకుండా తాము మనగలుగుతామని నిరూపించుకోవాలి.

పాకిస్తాన్ విషయంలో ఇది మొదటి హెచ్చరిక అని నా అభిప్రాయం. ఈ పరిణామాలు పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపవచ్చు.

పాకిస్తాన్ ఆత్మావలోకనం చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. తాలిబన్లు, తీవ్రవాదుల విషయంలో పాకిస్తాన్ తమ విధివిధానాలను పునరాలోచించుకోవాల్సిన సమయం వచ్చింది.

మోదీ, ట్రంప్

ఫొటో సోర్స్, EPA

ప్రపంచ దేశాలతో సత్సంబంధాలు ముఖ్యమా లేక తీవ్రవాదులతో స్నేహం ముఖ్యమా? అన్న విషయం తేల్చుకోవడం పాకిస్తాన్‌పై ఆధారపడి ఉంది.

ఈ విషయంలో పాకిస్తాన్ కచ్చితమైన నిర్ణయాలు తీసుకోవాలంటే.. అమెరికా ఇంకా రెండు మూడు తీవ్రమైన హెచ్చరికలు చేయాల్సి ఉంటుంది.

తాము చేస్తున్న ఆర్థిక సహాయానికి ప్రతిగా పాకిస్తాన్.. తీవ్రవాద సంస్థలకు మద్దతును ఉపసంహరించుకుంటుందని అమెరికా భావించింది. కానీ అలా జరగలేదు.

అమెరికా.. తన స్వలాభం కోసమే ఆలోచిస్తుంది. తన విధానాల వల్ల భారత్ లాభపడిందంటే అది యాధృచ్ఛికమే!

భారత్ అమెరికాల మధ్య సత్సంబంధాలు ఉన్నంతవరకు ఈ పరిణామాలు భారత్‌కు మేలు చేస్తాయి.

మా ఇతర కథనాలు

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.