ఇరాన్‌కు కీలక క్షణమిది: ఖమేనీ మరణానికి ముందే ఆయన వారసుడి ఎంపిక జరిగిందా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, లైస్ డౌసెట్
- హోదా, బీబీసీ చీఫ్ ఇంటర్నేషనల్ కరస్పాండెంట్
- చదివే సమయం: 3 నిమిషాలు
ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్‌కు ఇది ఒక కీలకమైన క్షణం.
శనివారం ఉదయం నుంచి సుప్రీం లీడర్ పరిస్థితి గురించి చాలా వార్తలు వచ్చాయి. మొదటిసారి చేసిన దాడుల్లోనే ఆయన నివాసాన్ని లక్ష్యంగా చేసుకున్నారని అప్పటికే తెలిసింది.
ఉపగ్రహ చిత్రాల్లో ఆయన ఇల్లు ధ్వంసమైనట్టు కనిపించింది.
ఆయనను సురక్షిత స్థలానికి తీసుకెళ్లారని మొదట ఇరాన్ తెలిపింది.
ఇరాన్ సుప్రీం లీడర్ 86 ఏళ్ల అయతొల్లా అలీ ఖమేనీ కాసేపట్లో టీవీలో ప్రసంగిస్తారని కూడా వార్తలొచ్చాయి. కానీ అవేవీ జరగలేదు.

ఆరోజు సాయత్రం సుప్రీంలీడర్ ఇక లేరన్న సూచనలున్నాయని ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు.
పేరు చెప్పడానికి ఇష్టపడని ఉన్నతాధికారులు ఖమేనీ మరణాన్ని ధృవీకరించారని ఇజ్రాయెల్, అమెరికా మీడియాలో వరుస కథనాలు ప్రసారమయ్యాయి.
ఇరాన్ అధికారులు ఆ వార్తలను నిరాకరించారు.
ట్రంప్ సోషల్ మీడియాలో ప్రకటించిన కొద్ది గంటల తర్వాత, ఆయన మరణవార్తను చెబుతూ ఇరాన్ టీవీ వ్యాఖ్యాత కన్నీళ్లు పెట్టుకున్నారు.
అయితే, రాత్రంతా ఇరాన్‌లోని కొన్ని నగరాల్లో సంబరాల దృశ్యాలు అనేక దేశాల్లోని ఇరానియన్ సమాజాల్లో ఆనందోత్సాహం నిండిన వీడియోలు దర్శనమిచ్చాయి. ఖమేనీ కఠిన పాలన ముగిసిందని, ఇస్లామిక్ ప్రభుత్వానికి ముగింపు కావచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇరాన్ చరిత్రలో ఇవి కీలక క్షణాలు. కానీ మతపెద్దలు, కమాండర్లు ముందే సిద్ధమయ్యారు.
గత జూన్‌లో జరిగిన 12 రోజుల యుద్ధ సమయంలో అందరి దృష్టి కేంద్రీకృతమైంది. మొదటి రాత్రి దాడుల్లోనే ఇజ్రాయెల్ తొమ్మిదిమంది అణు శాస్త్రవేత్తలను, కొంతమంది భద్రతాధిపతులను హతమార్చింది. తరువాతి రోజుల్లో మరికొంతమంది సీనియర్ శాస్త్రవేత్తలు, దాదాపు 30 మంది ప్రముఖ కమాండర్లు చనిపోయారు.
అయతొల్లా కూడా వారి లక్ష్యం కావచ్చని అప్పుడే స్పష్టమైంది.
యుద్ధ సమయంలో బంకర్‌లో ఉన్న ఖమేనీ, వెంటనే బాధ్యతలు చేపట్టగల కొత్త అధికారుల జాబితా తయారు చేశారని వార్తలు వచ్చాయి.
గతేడాది జరిగిన యుద్ధానికి ముందే, ఖమేనీ 'అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్' అంటే సుప్రీం లీడర్‌ను ఎన్నుకునే బాధ్యత కలిగిన 88 మంది నిపుణుల సభను ఏ పరిస్థితికైనా సిద్ధంగా ఉండాలని ఆదేశించినట్టు వార్తలు వచ్చాయి. ఆయన మరణిస్తే, ఆయన స్థానంలోకి రావడానికి ముగ్గురు సీనియర్ మతపెద్దలను ఎంపిక చేశారని న్యూయార్క్ టైమ్స్ పేర్కింది.
ఖమేనీ స్థానంలోకి ఎవరు వస్తారనే ఊహాగానాల్లో ఆయన కుమారుడు మోజ్తబా పేరుకూడా తరచుగా వినిపించింది.
కేవలం సుప్రీం లీడర్ మాత్రమే కాదు, మొదటి రోజు జరిగిన వైమానిక దాడులు, లక్ష్యిత దాడుల్లో మరికొందరు కూడా మరణించారు . కొత్తగా బాధ్యతలు చేపట్టినవారు అధికారం సజావుగా కొనసాగుతుందని ప్రపంచానికి చూపించాలని కోరుకుంటున్నారు.
36 ఏళ్లపాటు సాగిన అయతొల్లా ఖమేనీ పాలన అకస్మాత్తుగా ముగిసిపోవడం ఆయన అనుచరులకు, ముఖ్యంగా ఐఆర్‌జీసీలోని సహాయకులు, మిత్రులకు పెద్ద దెబ్బ అవుతుంది.
అయితే బీబీసీ ధృవీకరించిన వీడియోల్లో తెహ్రాన్, కారజ్ వీధుల్లో ప్రజలు సంబరాలు జరుపుకుంటున్నట్టు కనిపించింది.
అమెరికాపై అనుమానం, ఇజ్రాయెల్‌తో శత్రుత్వం కలిగిన ఖమేనీ, సంస్కరణల పిలుపులను, పదే పదే వ్యక్తమైన నిరసనలను అణచివేశారు. ఇజ్రాయెల్, అమెరికాతో నేరుగా జరిగిన సైనిక ఘర్షణలు, అలాగే తన ప్రజలే మార్పు కావాలంటూ పిలుపునివ్వడం వంటివన్నీ గత కొన్నేళ్లుగా ఖమేనీకి సవాళ్లుగా మారాయి.
ఈ నెల మొదట్లో మేం తెహ్రాన్‌లో ఉన్నప్పుడు భద్రతా దళాల అణచివేత వల్ల వేలాది మంది చనిపోయిన బాధ, కోపం ఇంకా సమసిపోనట్టు కనిపించింది.
ఖమేనీ నాయకత్వం ఆకస్మికంగా ముగియడంతో, ఇప్పుడు ఆయన వారసుడు ఎవరు అన్న ప్రశ్న తలెత్తుతంది. కొత్త నాయకుడు వస్తే, 47 ఏళ్ల ఇస్లామిక్ రిపబ్లిక్ దిశలో మార్పు వస్తుందా అన్నది కూడా చర్చనీయాంశమవుతుంది.
ఎవరు నాయకుడిగా వస్తారన్నది పక్కన పెడితే, వారి ప్రధాన లక్ష్యం మాత్రం ఒకటే. మతపెద్దలు, శక్తివంతమైన భద్రతా దళాలను అధికారంలో ఉంచే వ్యవస్థను కొనసాగించడం.
యుద్ధం ఇంకా ముగియలేదు. ప్రమాదకరంగా, ఊహించని విధంగా కొనసాగుతోంది.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












