చిత్తూరు జిల్లా: రహస్యంగా స్వలింగ సంపర్కంలో పాల్గొనే ఇద్దరు మగవాళ్ల కథలు

- రచయిత, తులసీ ప్రసాద్ రెడ్డి నంగా
- హోదా, బీబీసీ కోసం
ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో స్వలింగ సంపర్కుల జీవితం ఎలా ఉంటుందో పాఠకులకు తెలియజేసే ప్రయత్నంలో భాగంగా బీబీసీ ఈ కథనం అందిస్తోంది.
చిత్తూరు జిల్లాలో గ్రామీణ ప్రాంతంలో నివసించే ఇద్దరు వ్యక్తులతో బీబీసీ మాట్లాడింది.
వీరిలో ఒకరు మహిళతోనూ, పురుషులతోనూ శృంగారంలో పాల్గొంటారు. మరొకరు మగవారితో మాత్రమే సెక్స్ చేస్తారు.
వీరిద్దరిని ఎంఎస్‌ఎం (MSM: Men Who Have Sex With Men)లుగా పిలుస్తారు.
వీరిలో ఒకరు భాస్కర్ (పేరు మార్చాం). ఆయనకు పెళ్లై, పిల్లలు కూడా ఉన్నారు.
సెక్స్ విషయానికొచ్చేసరికి భార్యతో ఉన్నప్పుడు మగవాడి పాత్రను, వేరే పురుషుడితో ఉన్నప్పుడు స్త్రీ పాత్రను ఆయన పోషిస్తారు.
బీబీసీ అడిగిన ప్రశ్నలకు భాస్కర్ సమాధానాలు ఇచ్చారు
ప్రశ్న: మగవారి పట్ల మీరు ఆకర్షితులవుతున్నారని మీకు ఎలా తెలిసింది? ఆ భావన ఎలా మొదలైంది?
సమాధానం: ఇంటర్మీడియట్ చదివే సమయంలో ఇది మొదలైంది. ఫ్రెండ్స్ ద్వారా నాకు అలవాటైంది. అప్పట్లో అమ్మాయిలతో అలా వెళ్లడం చాలా సమస్య కదా. మగవాళ్లతో అయితే ఎలాంటి సమస్య ఉండదులే అనే ఉద్దేశంతో కమిట్ అవుతూ వచ్చాను. ఇంటర్‌లో ఉన్నప్పుడు ఒక అబ్బాయి క్లాస్ రూంలో నీ లిప్స్ బాగున్నాయి అన్నాడు. ఆ తర్వాత మేం స్టడీస్ అని చెప్పి బయటకు వచ్చేవాళ్లం. పరీక్షల సమయంలో మేం ఇద్దరమే బయటికెళ్లి చదువుకుంటాం కదా. అక్కడ టెంప్ట్ అవడంతో కమిట్ అయ్యాం. అది అలాగే కంటిన్యూ అయింది. తర్వాత దానికే అడిక్ట్ అయ్యాను. అబ్బాయిలు అలా చేసినప్పుడు నాకు సంతోషంగా అనిపించేది. రాను రాను దానిపైనే ఆసక్తి పెరిగింది.

మీరు మీ భాగస్వామిని ఎలా కలుస్తారు?
మేం కాలేజీలో ఉన్నప్పుడు రెగ్యులర్‌గా కలిసేవాళ్లం. చదువుకోవడానికనో, పని ఉందనో బయటకు వెళ్లిపోతాం. ఇద్దరం అబ్బాయిలమే కాబట్టి ఎవరూ అంత ఇదిగా గమనించరు. మేం లోకల్ కాబట్టి ఈ వైపు ఎవరూ రారు అనుకున్న ప్రాంతాల్లోకి అంటే.. కొండలు, పొలాలు, చెట్లు గుబురుగా ఉన్న ప్రాంతాల్లోకి వెళ్లిపోతాం.
ఇప్పుడు నా జీవితం నాకు ఉంది. తనకు తన వృత్తి ఉంది. ఇద్దరం ఎప్పుడైనా కలవాలని అనుకుంటే, లేదా కచ్చితంగా ఈ రోజు కలవాలి అనుకుంటే.. నేను ఉన్న దగ్గరికి అతను రావడమో లేదా అతను ఉన్న ప్రాంతానికి నేను వెళ్లడమో చేస్తాం.
మీ ఇంట్లో వాళ్లకు ఎప్పుడూ మీపై సందేహం రాలేదా?
లేదు. నేను అలా వాళ్ల ముందు ఎప్పుడూ నడుచుకోలేదు. ఎందుకంటే వాళ్ళు బాధపడతారు. ఒకవేళ వాళ్లకు తెలిసినా, నన్ను అడిగితే, నేను మరింత ఓవర్ అయిపోతానని ఆగిపోయారేమో నాకు తెలీదు. ఇప్పటివరకైతే నన్ను అడగలేదు. ఆ అబ్బాయి ఎవరని అడిగితే క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పేవాడిని. అంతే, ఇక ఏం అడిగేవారు కాదు. ఒకరిపై ఆసక్తి ఉండేది. బయట మరో నలుగురైదుగురితో కూడా ఉన్నాను. అంటే తను అందుబాటులో లేనపుడు నాకు ఆ ఫీల్ వస్తే, వేరే ఎవరితో అయినా సెక్స్ చేయాల్సి వస్తే కండోమ్ ఉపయోగిస్తా.
మీ వైవాహిక జీవితంలో కూడా ఎలాంటి సమస్యా రాలేదా?
నాకు పెళ్లయి 12 సంవత్సరాలు అవుతోంది. డిగ్రీ పూర్తి అవ్వగానే పెళ్లి చేసుకున్నా. మ్యారేజ్ లైఫ్ బాగానే ఉంది. నాకేం సమస్య లేదు. నాకు ఆడా, మగా రెండు ఆసక్తులూ ఉన్నాయి. అందుకే నా బాయ్‌ఫ్రెండుతో ఉన్నప్పుడు నన్ను సంతృప్తి పరచడానికి తను ఎలా ఫీల్ అవుతాడో, నా భార్య దగ్గర నేను కూడా అలా చేస్తాను.
గ్రామీణ ప్రాంతంలో మిగతా వాళ్లు మిమ్మల్ని ఎలా చూస్తుంటారు?
అతను తేడారా అన్నట్టుగా మాట్లాడతారు. ఎవరికైనా అమ్మాయి దొరకనప్పుడు, ఆ ఆసక్తి ఏర్పడితే నా గురించి తెలిసి నా దగ్గరకు వస్తారు. గ్రామాల్లో ఇలాంటివి తొందరగా బయటపడతాయి. తాగినపుడు, తన హీరోయిజం చెప్పుకోడానికి అబ్బాయిలు నేను వాడిని అలా చేశానురా అని ఇంకొకరికి చెప్పేస్తారు. ఇంకొకడికి అలాంటి ఇంట్రెస్ట్ ఉంటే వాడు దాన్ని క్యాష్ చేసుకుంటాడు. అలా గ్రామాల్లో ఇది వ్యాపిస్తుంది. అదే పట్టణాల్లో అయితే, టైమ్ స్పెండ్ చేసినా, నువ్వు ఎవరో నాకు తెలియదు అనొచ్చు.

మీ లాంటి వారి జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి?
ఈ విషయం బయటకు పొక్కినప్పుడు నాకు ఇష్టం లేకపోయినా వాళ్లు ఉపయోగించుకుంటారు. బలవంతం చేస్తారు. నాకు నచ్చినవాడు అయితే ఏమైనా చేస్తాను. నచ్చని వాడితో అలా గడపడం కష్టంగా అనిపిస్తుంది. ఇద్దరు ముగ్గురు వచ్చి నన్ను పట్టుకుని అలా చేయడం లాంటివి జరిగాయి. కానీ, అవన్నీ బయటకు చెప్పుకోలేను. మాపై ఏదైనా బలవంతం జరిగి, గాయపడినప్పుడు ఆ గాయం ఎలా అయ్యిందో కూడా డాక్టరుకు చెప్పుకోలేం. గతంలో నేను డాక్టర్లను ప్రైవేటుగా కలిసి ఏం చెప్పలేక ఫీల్ అయ్యేవాడిని. ఇప్పుడు మాకు ఎన్జీవోవారు ఉన్నారు. దాంతో ఏదైనా అయినప్పుడు మేం వాళ్ళకు చెప్తే వాళ్లు చూసి, తగిన చికిత్స అందేలా చూస్తున్నారు.
స్వలింగ సంపర్కులు పెళ్లి చేసుకోవడంపై మీ అభిప్రాయం ఏంటి?
పూర్తిగా అబ్బాయిల మీద ఆసక్తి ఉన్నప్పుడు పెళ్లి వద్దనే చెబుతాం. అలాంటి వారికి పెళ్లి చేస్తే ఏవైనా మందులు వాడి ఒకటి రెండు నెలలు వైవాహిక జీవితం గడపవచ్చు. కానీ, జీవితాంతం తన భార్యను సంతృప్తి పరచలేడు. ఇద్దరి జీవితాలూ నాశనం అయిపోతాయి. చిన్నప్పటి నుంచి కొందరు అబ్బాయిలకు అమ్మాయిల్లా తయారవ్వాలనే ఫీలింగ్ ఉంటుంది. అలాంటి వాళ్లు ఇంట్లో బలవంతం మీద పెళ్లి చేసుకుంటారు. కానీ, వాళ్లకు దానిపై ఆసక్తి ఉండదు. తమకు పెళ్లయితే వైవాహిక జీవితం గడపగలమా అనేది వారే స్వయంగా తెలుసుకోవాలి. తమలో స్పందనలు ఉన్నాయా లేదా అనేది వారికి తెలుస్తుంది. ఏదో అనుకుంటారని సమాజానికి భయపడి పెళ్లి చేసుకుంటే వాళ్ల జీవితాలు నాశనం అవుతాయి.
తనను స్త్రీలా ఊహించుకునే ఒక స్వలింగ సంపర్కుడికి మీరిచ్చే సలహా ఏంటి?
మనకు ఆసక్తి ఉన్న అబ్బాయితో ఉండిపోవాలి. ఒక మంచి వ్యక్తి దొరికాడు. మనతో జీవితాంతం ఉంటాడు అనుకుంటే అన్నీ వదిలేసి అతడితోనే ఉండిపోవడం మంచిది. తర్వాత ఇంకొకరితో ఉండకూడదు. అతడి పిల్లలనే వారి పిల్లలు అనుకుని సంతోషంగా ఉండాలి.
స్వలింగ సంపర్కుల జంటలకు ఎలాంటి సమస్యలు వస్తుంటాయి?
మామూలుగా ఎంఎస్‌ఎంలు తమ భాగస్వామిని ఫ్రెండ్ అని చెప్పుకుని తిరుగుతుంటారు. కానీ, వాళ్లిద్దరి మధ్య సాన్నిహిత్య సంబంధం ఉంటుంది. చిన్న అభిప్రాయభేదం వచ్చినా ఆ జంటలో ఒకరి జీవితంపై దెబ్బపడుతుంది. సమాజానికి పురుషుడిగా తెలుసు కాబట్టి వారికి బయట నుంచి ఎలాంటి మద్దతు దక్కదు.
భర్త మోసం చేస్తే పెళ్లయిన మహిళలకు సమాజం నుంచి మద్దతు లభించినట్లు ఎంఎస్‌ఎం వ్యక్తులకు కూడా చట్టం మద్దతుగా ఉండాలి. మాకు కూడా అండగా నిలిచే చట్టం ఉంటే బాగుంటుంది.
స్వలింగ సంపర్కులు చట్టాల ద్వారా ఏం ఆశిస్తున్నారు?
మామూలుగా భర్త నుంచి విడాకులు తీసుకున్న మహిళకు భరణం అందుతుంది. అలాగే భాగస్వామి మోసం చేస్తే మాకు కూడా భరణం ఇవ్వాలని మేం అడుగుతున్నాం. అలాగైతే, మహిళలకు ఉన్నట్లే మాకు కూడా ఒక భద్రత ఉంటుంది. ఇంకోసారి, వేరే వాళ్లు అలాంటి పని చేయకుండా ఉంటారు. భాగస్వామి ఫ్రాడ్ అని తేలితే బాధితుడు సూసైడ్ చేసుకోవడం, మానసిక వ్యథను అనుభవించడం జరుగుతుంటుంది. మోసం చేసినవాడు బాగుంటాడు. అలా కాకుండా మ్యారేజ్ అనేది ఉంటే, ధైర్యంగా అడుగుతాం. కోర్టు అందరికీ న్యాయమే చేయాలనుకుంటుంది కాబట్టి మాకు అనుకూలంగా తీర్పు వస్తే బాగుంటుంది.
స్వలింగ సంపర్కుల వివాహాలను చట్టబద్ధం చేస్తే మీకేంటి ప్రయోజనం?
స్వలింగ సంపర్కుల పెళ్లిళ్లను చట్టబద్ధం చేస్తే వాళ్ళకు అన్ని హక్కులూ ఉంటాయి. అప్పుడు తమను తక్కువగా చూస్తున్నారనే సమస్య, బాధ ఉండవు. అప్పుడు వారు ఓపెన్ అవుతారు.
మీకు మరో పురుషుడితో ఇలాంటి బంధం ఉందనే విషయం మీ భార్యకు తెలుసా?
తనకు విషయం తెలిస్తే, ఆ పరిస్థితిని బట్టి మేనేజ్ చేస్తా.
మీకు భార్యతో విభేదాలు వస్తే, ఇద్దరిలో ఎవరినైనా ఒకరినే ఎంచుకోవాలని చెబితే మీరేం చేస్తారు?
ఇలాంటి పరిస్థితి ఎదురైతే మామూలుగా భార్య కాకుండా భాగస్వామి వైపే మొగ్గుతారు. భాగస్వామిపై ఆసక్తి ఉంది కాబట్టే భార్య ఉన్నప్పటికీ భాగస్వామితో బంధం కొనసాగిస్తారు. ఒక వేళ నాకు అలాంటి పరిస్థితి ఎదురైతే నేను బ్యాలెన్స్ చేసుకోగలను. ఇద్దరినీ బ్యాలెన్స్ చేయగలను.
నిజాన్ని దాచి పెట్టి పెళ్లి చేసుకోవడం తప్పుగా అనిపించలేదా?
నాకు పెళ్లిపై ఆసక్తి ఉంది కాబట్టి అలాంటి ఆలోచన రాలేదు. వైవాహిక జీవితానికి న్యాయం చేయగలను అనే నమ్మకం నాకు ఉంది. నాకు నా గురించి తెలుసు. నేను రెండు బ్యాలెన్స్ చేసుకోగలను. కాబట్టే పెళ్లి చేసుకున్నాను. పెళ్లికి ముందు నాకు ప్రియురాలు కూడా ఉండేది. తనతో శృంగారంలో కూడా పాల్గొన్నా. ఆమె హఠాత్తుగా చనిపోవడంతో నేను వేరే పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది.

ఫొటో సోర్స్, Getty Images
మరొకరి అనుభవాలు ఇవీ
ప్రారంభంలో చెప్పుకున్న ఇద్దరు వ్యక్తుల్లో భాస్కర్ ఒకరు కాగా, మరొకరు అలీ(పేరు మార్చాం).
అలీకి 22 ఏళ్లు. ఆయనకు అబ్బాయిలంటేనే ఇష్టం.
అలీ ఇప్పుడు మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నారు. అతడికి ట్రాన్స్ జెండర్ కావడం ఇష్టం లేదు. కానీ, అమ్మాయిలను కన్నెత్తి కూడా చూడనని చెబుతున్నారు. అబ్బాయిలు అంటే ఆసక్తి ఉన్న అలీకి ఒక బాయ్‌ఫ్రెండ్ కూడా ఉన్నారు. బీబీసీ ప్రశ్నలకు ఆయన ఇచ్చిన సమాధానాలు ఇవి.
మీకు ఈ ఆసక్తి ఎలా మొదలైంది?
నేను పదో తరగతి చదువుతున్నప్పుడు సెక్స్ గురించి ఒక టాపిక్ ఉండేది. నాకు అప్పటికే మా బావతో పరిచయం ఉంది. అతను నాకు కొన్ని వీడియోలు చూపించేవాడు. అవి చూస్తుండటంతో నాకు కూడా అలాంటి వాటిపై ఆసక్తి కలిగింది. ఇలా చేస్తే ఎలా ఉంటుందని అనిపించింది. అలా మా బావతో ఇది మొదలైంది.
అబ్బాయిలంటేనే ఆసక్తి ఎందుకు కలిగింది?
నాకు అమ్మాయిలను చూస్తే అక్క, చెల్లెలు, అమ్మలాగా అనిపిస్తారు. పదో తరగతిలో ఉన్నప్పుడు నేను మొదటిసారి ఆ అనుభవం చవిచూశాను. ఇంటర్మీడియట్‌కు వచ్చాక ఆ కోరికలు ఇంకా ఎక్కువయ్యాయి. నేను ఇక అబ్బాయిలతోనే కలిసి ఉండాలి అనుకున్నాను. మొదట్లో ఇంట్లో వాళ్లకి తెలీదు. నేను ఎప్పటికీ చెప్పాలని అనుకోలేదు. ఒకవేళ తెలిస్తే సమాజంలో ఏమనుకుంటారు, అమ్మా నాన్నకు విలువ ఉండదు అనే ఉద్దేశంతో నేను చెప్పేవాడిని కాదు.

మీ భాగస్వామితో మీ బంధం ఎలా ఉంటుంది?
నా పార్ట్‌నర్ విప్రోలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. అతన్ని రెగ్యులర్‌గా కలవడానికి కుదరదు. అందుకే తను సెలవుల్లో వచ్చినప్పుడు రూమ్ తీసుకుని తనతోపాటూ కలిసి ఉంటాను. మిగతా రోజుల్లో అందరితో కలిసి మామూలుగా ఉంటాను.
మీకు వేరే అబ్బాయిలపై కూడా ఆసక్తి కలుగుతుందా?
నాకు వేరే అబ్బాయిలను చూసినప్పుడు ఆసక్తి కలుగుతుంది. ఒకరి మీదే కాదు, వేరే వాళ్ళపై కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. జాగ్రత్తలు పాటించి వాళ్లనూ కలుస్తుంటాను. ఉదాహరణకు ఒక అబ్బాయిని చూడగానే అరే అందంగా ఉన్నాడు అనిపించగానే, అతడితో రెస్టారెంట్‌కు వెళ్లాలి, కుదిరితే సినిమాకు వెళ్దాం, లేదా పబ్‌కు వెళ్దాం అనిపిస్తుంది. వీలైతే రూమ్‌కు తీసుకెళ్లి ఒకసారి లైంగికంగా కలిస్తే బాగుంటుంది అని కూడా అనిపిస్తుంది.
గ్రామీణ ప్రాంతాల్లో మీ జీవితం ఎలా ఉంటుంది?
గ్రామాల్లో కంటే పట్టణాల్లో ఇలా కలవడం చాలా ఈజీ. ఎవరికీ తెలియని ఏరియాలు చాలా ఉంటాయి. నువ్వు పలానా చోటుకు వస్తే రూమ్ తీసుకుందాం, హాయిగా ఎంజాయ్ చేయవచ్చు అనుకుంటాం. నేను పదో తరగతి వరకూ మా ఊళ్లోనే చదువుకున్నా. మా బావ నన్ను రోజు స్కూల్లో డ్రాప్ చేయడానికి తీసుకెళ్తుండేవాడు. అలా ఊరికి కొంచెం దూరంలో చెట్లు ఉండే ప్రదేశానికి తీసుకెళ్లి నాతో సన్నిహితంగా ఉండేవాడు, సెక్స్ చేయడం లాంటివి చేసేవాడు.
పల్లెల్లో స్వలింగ సంపర్కులకు ఎదురయ్యే సమస్యలు ఏంటి?
స్వలింగ సంపర్కులు అంటే వాళ్లు చెప్పింది మేం చేయాలి. మేం వాళ్ళ నుంచి సుఖం కోరుకుంటాం. అందుకే వాళ్లు కొట్టినా తిట్టినా భరించక తప్పదు. నేను మాత్రం నాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అనుకున్న వారితోనే గడుపుతాను. అందుకే నా జీవితంలో ఇప్పటివరకూ నేను ఎలాంటి సమస్యలూ ఎదుర్కోలేదు.
మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మిమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తారు?
ఎన్జీవో సపోర్ట్ ఉంది కాబట్టి మేం హాస్పిటల్‌కు వెళ్ళినప్పుడు మమ్మల్ని గౌరవంగా చూస్తారు. ఎక్కడా వీళ్లు ఈ గ్రూప్ నుంచి వచ్చారు అని వారు అనుకోరు. అందర్నీ ఎలా ట్రీట్ చేస్తారో అలాగే మమ్మల్నీ ట్రీట్ చేస్తారు. మీరు ఇంకా జాగ్రత్తగా ఉండాలి, రాబోయే రోజుల్లో మీరు పెళ్లి కూడా చేసుకోవచ్చు లేదంటే, ఇలాగే ఉండొచ్చు అని వాళ్లు కౌన్సెలింగ్ కూడా ఇస్తారు. అవసరమైతే మీరు ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవాలి అని మాకు జాగ్రత్తలు చెబుతారు.
మీరు పెళ్లి గురించి ఎప్పుడైనా ఆలోచించారా?
ఆలోచించాను. ఎంఎస్ఎంగా యాక్టివిటీస్ అన్ని చేస్తున్నాను. కానీ, నాకు ఒక వయసు వచ్చిన తర్వాత వీటన్నిటికీ దూరంగా ఉండి నాకంటూ సమాజంలో గుర్తింపు తెచ్చుకోవాలి. నేను పెళ్లి చేసుకోగలను అనుకున్నప్పుడు మాత్రమే పెళ్లి చేసుకుంటాను. ఇప్పటివరకు నాకు అమ్మాయిలపై ఎలాంటి ఫీలింగ్స్ లేవు. ఇంట్లో వాళ్ళు పెళ్లి చేయడానికి చూస్తున్నారు. అంటే, నేను ఇక వీటన్నిటికీ దూరంగా ఉండి, ఆ అమ్మాయినే ఇష్టపడాలి, తనతోనే ఉండాలి అనే భావన వస్తుంది. పెళ్లి జరిగే తేదీ లోపు ఆ అమ్మాయితో నా ఫీలింగ్స్ అంతా షేర్ చేసుకొని ఆ తర్వాత పెళ్లి చేసుకోవడమే మంచిది అని నేను అనుకుంటున్నాను.
మీకు అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ ఉందా?
నేను ఇప్పటివరకూ ఏ అమ్మాయితోనూ తిరగలేదు. ఆ ఆలోచన కూడా రాలేదు. అమ్మాయిలతో గడపాలనే ఆలోచన అసలు నా మనసులోనే లేదు.
మీరు బాధపడిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా?
నేను అత్యంత బాధపడిన సంఘటన ఒకటి ఉంది. అప్పుడు నేను ఇంటర్ సెకండియర్ చదువుతున్నాను. నాకు బైపీసీ అంటే ఇష్టం లేనప్పటికీ ఇంట్లో వాళ్ళు చెప్పారని బైపీసీ తీసుకున్నా. సెకండియర్‌లో పరీక్షల టైంలో నన్నుకాలేజీకి వెళ్లకుండా మా వాళ్లు అడ్డుకున్నారు. నువ్వు వేరే అబ్బాయిలతో తిరుగుతున్నావు, సెక్స్ చేస్తున్నావు అని మా వాళ్లు కొట్టారు. ఇంట్లో ఉండొద్దు అని వెళ్ళిపో అని చెప్పిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి.
మీ ఇంట్లో ఈ విషయం ఎలా తెలిసింది?
మా ఇంట్లో వాళ్లకి ఎంఎస్‌ఎం అంటే వాళ్లు ఇలా చేస్తుంటారు అని తెలీదు. నేను అబ్బాయిలతో ఉండటం అమ్మ వాళ్ళు చూశారు. ఇలాంటివన్నీ చేయకూడదు, తప్పు అని గట్టిగా చెప్పారు. నేను పూర్తిగా అలా చేస్తున్నానని వాళ్లకు తెలీదు. కానీ, ఇంట్లోవాళ్లకు సందేహం అయితే ఉంది. నేను పదో తరగతి వరకూ ఊళ్లో చదువుకున్నా. తర్వాత తిరిగి ఆ ఊరికి వెళ్లలేదు. నా వయసు ఇప్పుడు 22. నాలాంటి స్నేహితులు కూడా నాకు ఉన్నారు. వాళ్లు తమ పార్టనర్స్ కొట్టారని, బలవంతంగా మందు తాగించారని నాకు చెబుతుంటారు. వారికి నేను నాకు తోచిన సలహాలు ఇస్తుంటా.
ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారు?
ప్రభుత్వం మాకు ఏదైనా చేయాలి అనుకుంటే ఎవరికి నచ్చిన వారితో వాళ్లు ఉండొచ్చు అని చెబితే బాగుంటుందని అనిపిస్తోంది. సమాజంలో మాక్కూడా ఒక గుర్తింపు ఇచ్చి, ఇద్దరు మగవాళ్ళు కలిసి జీవించేలా కోర్టు కూడా సపోర్ట్ చేయాలి. సమాజం కూడా మాకు అండగా నిలవాలి.
భాస్కర్, అలీ ఇద్దరూ తమలాంటి వారికి స్వచ్ఛంద సంస్థలు(ఎన్‌జీవోలు) అండగా ఉంటున్నాయని చెప్పారు.

స్వలింగ సంపర్కులకు అండగా ఎన్జీవోలు
గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్న ఎల్జీబీటీక్యూల సంక్షేమం కోసం మదనపల్లె రూరల్ రీ కన్‌స్ట్రక్షన్ సొసైటీ అనే ఒక వాలంటరీ ఆర్గనైజేషన్ పనిచేస్తోంది.
రూరల్ రీ కన్‌స్ట్రక్షన్ సొసైటీ తాము గుర్తించిన స్వలింగ సంపర్కులకు తరచూ వైద్య పరీక్షలు చేయిస్తుంటుంది. సాధారణంగా ఒక వ్యక్తి ఆరు నెలలకు ఒకసారి ఈ వైద్య పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది.
స్వలింగ సంపర్కుల మధ్య సురక్షిత లైంగిక సంబంధాలు ఉండేలా వారికి జెల్స్, సెల్ఫ్ కండోమ్స్ లాంటివి పంపిణీ చేస్తుంది.
వీరి మధ్య సంబంధాలు ఎలా ఏర్పడతాయో, వీరికి తమ సంస్థ ఎలాంటి సేవలు అందిస్తుందో సంస్థ డైరెక్టర్ జయన్న బీబీసీకి వివరించారు.
‘‘2004 నుంచి ఈ సంస్థలో పనిచేస్తున్నా. ఈ 20 ఏళ్లలో మేం దాదాపు 3400 మంది ఎంఎస్ఎంలను గుర్తించాం. ఇప్పుడు వాళ్లకు మేం అవసరమైన సేవలు అందిస్తున్నాం.
మేం గుర్తించిన వారిలో హెచ్ఐవీ పాజిటివ్ వారు కూడా ఉన్నారు. వారికి యాంటీ రిట్రోవైరల్ మెడిసిన్ ఇవ్వడం చేస్తుంటాం. దీనిని నాన్ కమ్యూనిటీ పీపుల్ గుర్తించడం చాలా కష్టం. అదే కమ్యూనిటీలో అంటే ఎంఎస్ఎం కమ్యూనిటీలో ఉండే వారికి అది తెలుస్తుంది.
వాళ్లు ఆర్గనైజేషన్‌లో తమ కమ్యూనిటీ వారితో బంధం ఏర్పరచుకోవడం చేస్తుంటారు. మేం వారికి కండోమ్స్ సప్లై చేస్తాం. అవసరమైతే వీరికి హెచ్‌ఐవీ పరీక్షలు చేయించి, పాజిటివ్ వస్తే వెంటనే మందులు ప్రారంభిస్తాం’’ అని ఆయన చెప్పారు.
ఒకసారి స్వలింగ సంపర్కానికి అలవాటు పడిన పురుషులకు దాని నుంచి బయటపడడం అంత సులభం కాదని జయన్న తెలిపారు. కానీ దాని నుంచి బయటపడిన వ్యక్తులు కూడా ఉన్నారని చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- రామ్ చరణ్ – ఉపాసన: బొడ్డు తాడు రక్తాన్ని ఎందుకు ప్రిజర్వ్ చేస్తున్నారు? ఎంత ఖర్చవుతుంది
- ‘ద కోవెనంట్’: తనకు సాయం చేసి ప్రాణాల మీదకు తెచ్చుకున్న అఫ్గాన్ గైడ్‌ను కాపాడటానికి ప్రయత్నించే అమెరికా సైనికుడి కథ
- ఆదిపురుష్ - అవతార్ : ‘మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ’ అంటే ఏంటి, ఇది ఎలా పనిచేస్తుంది?
- ఆదిపురుష్: సీత ‘భారత పుత్రిక’ అనే డైలాగ్పై నేపాల్‌లో వివాదం ఏంటి?
- ‘అహింస’ రివ్యూ: డైరెక్టర్ తేజ మార్క్ కనిపించిందా? రామానాయుడి మనవడు అభిరామ్ నటన ఎలా ఉంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














