‘అమ్మానాన్నే నన్ను చంపేయాలనుకున్నారు’

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, దివ్య ఆర్య
- హోదా, బీబీసీ న్యూస్
17 ఏళ్ల మనోజ్ ఆడపిల్లగా జన్మించారు. అయితే, తనను తాను ఎప్పుడూ ఒక అబ్బాయిగానే చూసుకునేవారు. అంతేకాదు, ఓ అమ్మాయినీ ప్రేమించారు.
తల్లిదండ్రులు తన జెండర్‌ను అంగీకరించేందుకు ఇష్టపడలేదని మనోజ్ చెప్పారు. ఒకసారి తన కాళ్లు, చేతులు కట్టేసి తీవ్రంగా కొట్టారు. ఒక గదిలో పెట్టి తాళం వేశారు. అంతేకాదు సొంత తండ్రే తనను చంపేస్తానని బెదిరించారు.
‘‘అంతలా హింసిస్తారని నేనెప్పుడూ ఊహించలేదు’’ అని ఆయన చెప్పారు.
‘‘ఏదేమైనప్పటికీ అది నా కుటుంబం, వారు నన్ను తప్పకుండా అంగీకరిస్తారని అనుకున్నాను. కానీ, ‘పరువు’ కోసం నన్ను హత్య చేసేందుకు నా తల్లిదండ్రులు సిద్ధపడ్డారు’’ అని ఆయన వివరించారు.
భారత దేశంలోని ఓ గ్రామీణ ప్రాంతంలో పెరిగే ఓ అమ్మాయి తనను తాను ఒక ట్రాన్స్ వ్యక్తిగా బయటకు చెబితే, సమాజం నుంచి చాలా వ్యతిరేకత ఎదుర్కోవాల్సి ఉంటుంది.
తన గురించి బయటకు చెప్పిన తర్వాత బిహార్‌లోని తమ గ్రామంలో చదువుకుంటున్న తనను స్కూలు మాన్పించేశారు. అంతేకాదు, తనకు వయసులో రెండింతలు పెద్దవాడైన వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు.
‘‘ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాను. కానీ, నేను ప్రేమించిన అమ్మాయే అండగా నిలిచింది. ఇప్పుడు నేను బతికి ఉన్నానంటే అది ఆమె వల్లే. ఆమె నా విషయంలో ఎప్పుడూ వెనకడుగు వేయలేదు, అందుకే మేం ఇప్పటికీ కలిసే ఉన్నాం’’ అని మనోజ్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రస్తుతం మనోజ్ వయసు 22 ఏళ్లు. ఆయన తన గర్ల్‌ఫ్రెండ్ రష్మితో కలిసి.. స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కల్పించాలని సుప్రీం కోర్టులో దాఖలుచేసిన పిటిషన్‌పై తీర్పు కోసం ఎదురుచూస్తున్నారు.
2018లోనే స్వలింగ సంపర్కుల సెక్స్‌ను భారత్‌లో నేరంకాదని సుప్రీం కోర్టు స్పష్టంచేసింది. అయితే, స్వలింగ సంపర్కుల వివాహాలను ఇంకా చట్టబద్ధం చేయలేదు. దీనిపై దాఖలైన 21 పిటిషన్లపై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. దీనిపై త్వరలోనే తీర్పు వెల్లడించే అవకాశముంది.
చాలా మంది ‘సమానత్వపు హక్కు’లో భాగంగా తమ వివాహాలను చట్టబద్ధం చేయాలని ఈ పిటిషన్లలో కోరారు. అయితే, మనోజ్, రష్మి, మరో రెండు జంటలు, నలుగురు స్వలింగ సంపర్కుల ఉద్యమకారులతో కలిసి దాఖలుచేసిన పిటిషన్‌లో.. సొంత కుటుంబ సభ్యుల నుంచి శారీరక, మానసిక హింస నుంచి బయట పడేందుకు తమ వివాహాలను చట్టబద్ధం చేయడం తప్పనిసరని చెప్పారు.
‘‘భయం నుంచి బయటపడాలంటే మా వివాహాలను చట్టబద్ధం చేయడం ఒక్కటే మార్గం’’ అని మనోజ్ చెప్పారు.
భారత్‌లో దాదాపు 5 లక్షల మంది ట్రాన్స్‌జెండర్లు ఉంటారని 2011నాటి జనాభా లెక్కల్లో తేలింది. అయితే, వాస్తవానికి ఈ సంఖ్య చాలా ఎక్కువే ఉండొచ్చని స్వలింగ సంపర్కుల ఉద్యమకారులు చెబుతున్నారు.
2014లో ట్రాన్స్ వ్యక్తులను మూడో జెండర్‌గా గుర్తించాలని సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. ఐదేళ్ల తర్వాత విద్య, ఉద్యోగం, ఆరోగ్యంలలో ట్రాన్స్‌జెండర్లపై వివక్షను నిషేధించే చట్టాన్ని భారత్ తీసుకొచ్చింది. వారిపై శారీరక, భావోద్వేగపరంగా హింసించడాన్ని కూడా దీనిలో నేరంగా పరిగణించేలా నిబంధనలు తీసుకొచ్చారు.
అయితే, సొంత కుటుంబం నుంచి హింస అనేది చాలా సంక్లిష్టమైన సమస్య.

కుటుంబమే హింసిస్తే..
భారత్‌లోని చాలా చట్టాలు, సమాజం మనకు సురక్షితమైన ప్రదేశం ఏదంటే ఇల్లేనని చెబుతాయని ముంబయికి చెందిన మహిళా హక్కుల న్యాయవాది వీణా గౌడ్ చెప్పారు.
‘‘అయితే, కుటుంబమే హింసించడం మనకు తెలియనిదేమీ కాదు. భార్య, పిల్లలు, ట్రాన్స్ వ్యక్తులు చాలా హింసకు గురవుతుంటారు. కానీ, దాని గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే ఇక్కడ మనం కుటుంబమనే వ్యవస్థకే వ్యతిరేకంగా మాట్లాడాల్సి ఉంటుంది’’ అని ఆమె అన్నారు.
31 మంది స్వలింగ సంపర్కులు, ట్రాన్‌జెండర్ వ్యక్తులు సొంత కుటుంబం నుంచే ఎలాంటి హింసను ఎదుర్కొంటున్నారనే విషయంపై ఏర్పాటైన కమిటీలో వీణా కూడా ఉన్నారు. ఒక విశ్రాంత న్యాయమూర్తి, న్యాయవాదులు, విద్యావేత్తలు, హక్కుల ఉద్యమకారులు కూడా ఈ కమిటీలో ఉన్నారు.
కమిటీ దర్యాప్తులో వెల్లడైన అంశాలను గత ఏప్రిల్‌లో ‘‘అవర్ ఓన్ హర్ట్ అస్ ద మోస్ట్’’ పేరుతో ఒక నివేదిక విడుదల చేశారు. స్వలింగ సంపర్కులకు తమ ‘కుటుంబాలను ఎంచుకునే హక్కు’ కల్పించాలని దీనిలో సిఫార్సు చేశారు.
‘‘కొందరు స్వలింగ సంపర్కులు చెప్పిన విషయాలను వింటే.. వారిని కుటుంబాలు ఎంత హింసించాయో అర్థమవుతుంది. వారికి నచ్చిన కుటుంబాన్ని ఎంచుకునే హక్కు ఇవ్వకపోతే స్వేచ్ఛగా జీవించే హక్కును వారి నుంచి తీసేసుకున్నట్లే’’ అని వీణ చెప్పారు.
‘‘మరోవైపు వారి పెళ్లిళ్లను చట్టబద్ధం చేయడం ద్వారా కొత్త కుటుంబాలను ఏర్పాటుచేసుకునే అవకాశాన్ని వారికి ఇచ్చినట్లు అవుతుంది’’ అని ఆమె వివరించారు.

ఆ బలవంతపు పెళ్లికి కొన్ని నెలల తర్వాత మళ్లీ రష్మితో ఎలాగైనా కలిసి జీవించాలని మనోజ్ భావించారు. అయితే, బయటకు వెళ్లిపోయిన తనను తన భర్త మళ్లీ వెనక్కి తీసుకొచ్చారు. అంతేకాదు, ఇద్దరిపైనా కలిపి లైంగిక దాడి చేస్తానని బెదిరించారు.
దీంతో సమీపంలోని రైల్వే స్టేషన్‌కు వెళ్లి అక్కడకు వచ్చిన మొదటి రైలును ఎక్కేశారు. అయితే, మళ్లీ వారిని వారి కుటుంబం ఇంటికి పట్టుకొచ్చి హింసించింది.
‘‘అతడితో బలవంతంగా ఆత్మహత్య లేఖ రాయించారు. దానిలో అతడి మరణానికి నేనే కారణమని ఆరోపణలు చేశారు’’ అని రష్మి గుర్తుచేసుకున్నారు.
ఈ హింసపై మనోజ్ ఎదురుతిరిగారు. దీంతో మళ్లీ తనను ఇంటిలో బంధించారు. తన మొబైల్ ఫోన్ కూడా తీసేసుకున్నారు.
దీంతో రష్మి స్వలింగ సంపర్కులకు సహాయం చేసే ఒక సంస్థతోపాటు స్థానిక పోలీసుల్లోని మహిళా విభాగాన్ని కలిశారు. వీరే ఆ హింస నుంచి మనోజ్ బయటపడేలా సాయం చేశారు.
ఆ తర్వాత వీరిద్దరినీ స్వలింగ సంపర్కుల ప్రభుత్వ శరణాలయానికి తరలించారు. అయితే, రష్మి ట్రాన్స్‌జెండర్ కాకపోవడంతో ఇక్కడి నుంచి వీరు వెళ్లిపోవాల్సి వచ్చింది.

ఫొటో సోర్స్, Getty Images
విడాకులు..
ఎలాగోలా భర్త నుంచి మనోజ్ విడాకులు తీసుకోగలిగారు. అయితే, ఇలా హింసించే కుటుంబాల నుంచి బయటపడటంలో సాయం చేసేందుకు ప్రస్తుతమున్న సహాయక కేంద్రాలు, మార్గాలు చాలా తక్కువ.
రెండు దశాబ్దాల క్రితం లెస్బియన్, బైసెక్సువల్, ట్రాన్స్ వ్యక్తుల కోసం ఏర్పాటైన ‘సప్పో ఫర్ ఈక్వాలిటీ’ సంస్థకు మేనేజింగ్ ట్రస్టీగా కోయల్ ఘోష్ పనిచేస్తున్నారు. 2020లో ఇంటి నుంచి బయటకు వచ్చి, ఫుట్‌పాత్‌పై ఏడురోజులు గడిపిన ఓ స్వలింగ సంపర్కుల జంట నుంచి వచ్చిన ఫోన్‌కాల్ తనకు ఇప్పటికీ గుర్తుంది.
‘‘ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నాం. అక్కడ మూడు నెలల పాటు వారు ఉండేలా ఏర్పాట్లు చేశాం. అక్కడే వారు ఉంటూ ఉద్యోగాలు సంపాదించి, కొత్త జీవితం గడిపేలా చూశాం’’ అని కోయల్ చెప్పారు.
సమాజం చిన్నచూపు చూడటంతోపాటు ఇంట్లో హింస, చదువుకు ఆటంకాలు, బలవంతంగా పెళ్లిళ్లు.. ఇలాంటి సమస్యల నడుమ ఉద్యోగాలు వెతుక్కోవడం ట్రాన్స్ వ్యక్తులకు కష్టం అవుతోంది.
స్వలింగ సంపర్కుల అక్షరాస్యతా రేటు 49.76 శాతం ఉంటుందని జనాభా లెక్కలు వెల్లడించాయి. దేశ సగటు 74.04 శాతం కంటే ఇది చాలా తక్కువ.
2017లో జాతీయ మానవ హక్కుల కమిషన్ దిల్లీ, ఉత్తర్ ప్రదేశ్‌లలోని 900 మంది ట్రాన్స్ వ్యక్తులపై చేపట్టిన అధ్యయనంలో.. 96 శాతం మంది ట్రాన్స్ వ్యక్తులకు ఎవరూ ఉద్యోగాలు ఇవ్వడంలేదని, దీంతో సెక్స్ వర్కే వారికి తప్పనిసరి అవుతోందని తేలింది.
ఇంటి నుంచి బయటకు వచ్చి కొత్త జీవితం కోసం ప్రయత్నాలు చేస్తున్న స్వలింగ సంపర్కుల జంటల కోసం ‘సప్పో’ ఒక హెల్ప్‌లైన్‌ను ఏర్పాటుచేసింది. గత రెండేళ్లలో 35 జంటలకు సంస్థ ఆశ్రయం ఇచ్చింది.
కోయల్‌కు రోజుకు మూడు నుంచి ఐదు ఫోన్‌కాల్స్ వస్తుంటాయి. వీరి సమస్యలకు పరిష్కారం చూపేందుకు లాయర్లతో తరచూ ఆమె మాట్లాడుతుంటారు.
‘‘నన్ను కూడా చంపేస్తానని బెదిరించారు. గ్రామంలో మాపై మూకలు కూడా దాడికి ప్రయత్నించాయి. పోలీసులు కూడా ఒక్కోసారి కఠినంగా ఉంటారు’’ అని ఆమె చెప్పారు.
ట్రాన్స్‌మేన్ ఆసిఫ్, అతడి గర్ల్‌ఫ్రెండ్ సమీనా తూర్పు భారత్‌లోని ఒక గ్రామంలో పోలీస్ స్టేషన్‌లో ఉన్నప్పుడు కోయల్‌కు ఫోన్ వచ్చింది.
కానిస్టేబుల్ తనను నపుంసకుడని తిట్టారని, ఇలా బయట తిరిగేబదులు చచ్చిపోవాలని అన్నారని సమీనా చెప్పారు.
ఆసిఫ్, సమీనా బాల్యమిత్రులు. వీరు పెద్దయ్యాక ప్రేమికులుగా మారారు. రెండుసార్లు వీరు ఇల్లు వదిలి వచ్చేశారు. అయితే, కుటుంబాలు మళ్లీ వీరిని వెనక్కి తీసుకొచ్చాయి. ఆ నరకం నుంచి బయటపడేందుకు ఇదే వారికి చివరి అవకాశం. అందుకే వీరు హెల్ప్‌లైన్‌ను ఆశ్రయించారు.
‘‘కోయల్ వచ్చిన తర్వాతే, పోలీసుల ప్రవర్తన మారింది. మాతో దురుసుగా ప్రవర్తించినందుకు ఆ కానిస్టేబుల్స్‌ను సీనియర్ అధికారి మందలించారు’’ అని సమీనా చెప్పారు.
ప్రస్తుతం ఒక పెద్ద నగరంలో వీరు జీవిస్తున్నారు. సుప్రీం కోర్టులో మనోజ్, రష్మిలతోపాటు వీరు కూడా పిటిషన్ వేశారు.
‘‘ఇప్పుడు మేం సంతోషంగా ఉన్నాం. కానీ, మాకు కూడా వివాహ ధ్రువీకరణ పత్రం కావాలి. అప్పుడే మాపై దాడులు చేయడానికి మా కుటుంబాలు, సమాజం భయపడుతుంది’’ అని ఆసిఫ్ చెప్పారు.
‘‘సుప్రీం కోర్టు సాయం చేయకపోతే మరణమే మాకు దిక్కు. మమ్మల్ని ఎవరూ అంగీకరించరు. జీవితాంతం పరిగెడుతూనే ఉండాలి. విడదీసేస్తారేమోననే భయంతోనే నిత్యం బతకాలి’’ అని ఆయన అన్నారు.
(గోప్యత కోసం పిటిషనర్ల పేర్లను మార్చాం)
ఇవి కూడా చదవండి:
- కడప స్టీల్ ప్లాంట్: కేంద్రం లాభం లేదంటోంది.. జగన్ సొంత జిల్లాలో ఉక్కు కర్మాగారం భవిష్యత్తేమిటి
- పాము ఇంట్లో దూరితే ఏం చేయాలి?
- ప్రోడ్రగ్స్: పోలీసులను బురిడీ కొట్టిస్తున్న ఈ డ్రగ్స్ ఏమిటి
- అబ్దుల్ కలాం: చనిపోవడానికి ముందు ఆ చివరి ఐదు గంటల్లో ఏం జరిగింది
- రేటింగ్, రివ్యూ, లైక్ ఫ్రాడ్స్: భారతీయుల నుంచి రూ.712 కోట్లు దోచుకున్న చైనా ముఠా, ఆ డబ్బు మిలిటెంట్ సంస్థ హిజ్బొల్లాకు ఎలా చేరింది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















