కోళ్ల ఫారం పెట్టేందుకు 50 శాతం సబ్సిడీపై రూ.50 లక్షల వరకు రుణం పొందడం ఎలా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఎ. కిశోర్‌బాబు
- హోదా, బీబీసీ కోసం
గ్రామీణ ప్రాంతాల్లో కోళ్ల పరిశ్రమలు ఏర్పాటు చేయాలనుకొనేవారికి కేంద్ర ప్రభుత్వం 50 శాతం రాయితీపై రూ.50 లక్షల వరకు రుణ సదుపాయం కల్పిస్తోంది.
ఈ పథకం ఏమిటి? రుణం తీసుకోవాలంటే ఎలా? ఎవర్ని సంప్రదించాలి? విధి విధానాలేమిటి? అర్హులు ఎవరు? ఇలాంటి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ఫొటో సోర్స్, Getty Images
ఏమిటీ పథకం?
కేంద్ర ‘పశు సంవర్థక, పాడి పరిశ్రమ అభివృద్ధి శాఖ’ నేషనల్ లైవ్‌స్టాక్ మిషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.
ఈ పథకం కింద దేశంలో మాంసం, పాలు, గుడ్డు ఉత్పత్తిని గణనీయంగా పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.
2022-23 ఆర్థిక సంవత్సరంలో దేశంలో గుడ్ల ఉత్పత్తి 129 బిలియన్లు. దీన్ని మరింత పెంచాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.
ఎంత రుణమిస్తారు?
గ్రామీణ ప్రాంతాల్లో కోళ్ల ఫారాలు ఏర్పాటు చేసుకోవడానికి గరిష్ఠంగా రూ.50 లక్షల వరకు రుణం ఇస్తారు.
రాయితీ ఎంత ఇస్తారు?
తీసుకున్న రుణంలో కేంద్ర ప్రభుత్వం 50 శాతం రాయితీ ఇస్తుంది.
ఉదాహరణకు మీరు రూ.50 లక్షలు రుణం తీసుకుంటే, అందులో మీరు తిరిగి చెల్లించాల్సింది రూ.25 లక్షలే.
ఆ రూ.25 లక్షలను కేంద్ర ప్రభుత్వం రాయితీ రూపంలో సంబంధిత బ్యాంకుకు రెండు విడతలుగా చెల్లిస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
ఎవరికి రుణమిస్తారు?
ఈ పథకం కింద ఎవరైనా సరే రుణం పొందవచ్చు. వ్యక్తిగతంగా లేదా స్వయం సహాయ సంఘాలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ (ఎఫ్‌పీవో), రైతు సహకార సంఘాలు (ఎఫ్‌సీవో), జాయింట్ లయబిలిటీ గ్రూపులు (జేఎల్‌జీ), సెక్షన్ 8 కిందకు వచ్చే కంపెనీలు, అంటే హేచరీస్, కోడి తల్లి, పిల్లల పెంపక కేంద్రాలు.. ఇలా ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు.
రుణాలు ఎవరు ఇస్తారు?
జాతీయ బ్యాంకులు ఏవైనా సరే ఈ పథకం కింద రుణాలు మంజూరు చేస్తాయి.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
ఈ పథకం కింద ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దీని కోసం కేంద్ర ప్రభుత్వం నేషన్ లైవ్‌స్టాక్ మిషన్ పోర్టల్ నిర్వహిస్తోంది.
భూమి ఎంతుండాలి?
రుణం పొందాలనుకునే వారి పేరిట కనీసం ఒక ఎకరం భూమి ఉండాలి. దానికి సంబంధించిన పత్రాలు కూడా పొందుపరచాలి. సొంతంగా భూమి లేకపోతే కౌలుకు తీసుకున్న భూమిపైన కూడా రుణం పొందవచ్చు. అయితే భూమి యజమానులు, మీరు కలిసి జాయింటుగా ఈ రుణం తీసుకునే వీలుంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
ప్రాజెక్టు రిపోర్టు అవసరమా?
ఈ పథకం కింద రుణం పొందాలంటే ముందుగా మనం ఏర్పాటు చేయదలచుకున్న కోళ్ల ఫారానికి సంబంధించిన డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు(డీపీఆర్)ను సిద్ధం చేసుకుని, దాన్ని నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ అధికారులకు ఆన్‌లైన్‌లో సమర్పించాల్సి ఉంటుంది.
రుణానికి ఏమేం పత్రాలు సమర్పించాలి?
- డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు
- ఆధార్ కార్డు
- కోళ్ల ఫారం ఏర్పాటు చేయదలచుకున్న భూమి ఫొటో
- భూమికి సంబంధించిన పత్రాలు
- పాన్ కార్డు
- ఓటర్ కార్డు
- రుణం తీసుకోబోయే బ్యాంకులో మీ ఖాతాకు చెందిన రెండు క్యాన్సిల్డ్ చెక్కులు
- మ్యాండేటరీ ఫామ్
- చిరునామా ధ్రువీకరణ పత్రం
- కుల ధ్రువీకరణపత్రం (అవసరమైతే)
- విద్యార్హతల పత్రాలు
- శిక్షణ పొంది ఉంటే ఆ సర్టిఫికేట్
- స్కాన్ చేసిన మీ సంతకం
నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ నుంచి..
ముందు నేషనల్ లైవ్‌స్టాక్ మిషన్ పోర్టల్‌కు వెళ్లి యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ క్రియేట్ చేసుకోవాలి.
దీని కోసం https://nlm.udyamimitra.in/ పోర్టల్‌కు వెళ్లాలి.
దరఖాస్తు ఏ దశలో ఉందో తెలుసుకోవడం ఎలా?
అది ఈ పోర్టల్లోనే తెలుసుకోవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
దరఖాస్తు చేసే సమయంలో ఏ జాగ్రత్తలు పాటించాలి?
మీరు లాగిన్ కోసం ప్రయత్నించినప్పుడు మొబైల్ నంబరుకు ఓటీపీ వస్తుంది. దాన్ని నమోదు చేసిన తరువాతే మీరు లాగిన్ అవ్వగలరు.
దరఖాస్తు చేసే సమయంలోనే మీరు దేని కోసం రుణం తీసుకోవాలని అనుకుంటున్నారో కూడా స్పష్టంచేయాలి.
అందులోనే డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు, ఇతర పత్రాలన్నీ కూడా అప్‌లోడ్ చేయాలి.
డీపీఆర్ సిద్ధం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
నిజాయతీ.. ఇదే అన్నిటికంటే ముఖ్యం.
డీపీఆర్‌లో మీరు ఎన్ని కోళ్లతో ఫారం ప్రారంభించాలనుకుంటున్నారు? ఒక్కో బ్రీడ్ కొనడానికి ఎంత ఖర్చు అవుతుంది? దాని పోషణకు ఎంత ఖర్చు అవుతుంది? - ఇలాంటి వివరాలన్నీ నిజాయతీగా పొందుపరచాలి.
ఊహా జనితంగా అంచనాలు వేస్తే ప్రారంభ దశలోనే బ్యాంకర్లు దరఖాస్తును తిరస్కరిస్తారు.
సిబిల్ స్కోరు బాగా ఉండాలా?
అవును. మీరు రుణం తీసుకోవాలంటే సిబిల్ స్కోరు కూడా బలంగా ఉండేలా చూసుకోండి.
ఎందుకంటే సిబిల్ స్కోరు బలంగా లేకపోతే ఏ బ్యాంకు కూడా రుణాలు ఇవ్వడానికి ముందుకు రాదు.

ఫొటో సోర్స్, Getty Images
శిక్షణ అవసరమా?
కోళ్ల పరిశ్రమ ఒడిదొడుకులతో కూడుకున్నది. అందువల్ల తగిన శిక్షణ తీసుకుని ఈ రంగంలోకి ప్రవేశిస్తే మంచిదని అనుభవజ్ఞులు సూచిస్తుంటారు.
కోళ్లు ఎలా పెంచాలి, వాటికి జబ్బులు రాకుండా ఎలా నివారించాలి, వాటి పోషణ ఎలా, బ్రీడ్స్ ఎక్కడ దొరుకుతాయి, మార్కెటింగ్ ఎక్కడ చేసుకోవాలి, ఇతర అంశాలపై ముందస్తు అవగాహన అవసరం.
ఈ రుణాల కోసం స్థానికంగా ఎవర్ని సంప్రదించాలి?
ఈ పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం నోడల్ ఏజెన్సీగా ఉంటుంది. మీరు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఆయా రాష్ట్రాల నోడల్ ఏజెన్సీల ద్వారా మీ ప్రాంతంలోని బ్యాంకులకు ఈ దరఖాస్తులు వెళతాయి.
మీ ప్రాంతంలో జిల్లా పశు సంవర్థక శాఖ అధికారిని లేదా వారి కార్యాలయాన్ని సంప్రదించి ఈ పథకం గురించి వివరాలు తెలుసుకోవచ్చు. వారి సహకారంతోనే దరఖాస్తు కూడా చేసుకోవచ్చు.

‘పూచీకత్తు నిబంధనతోనే కొంత సమస్య ఉంది’
ఇది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారికి చాలా మంచి పథకమని, ఆంధ్రప్రదేశ్‌లో ఎంతోమంది గ్రామీణ యువత, రైతులు ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్ పశుసంవర్థక శాఖ డైరెక్టర్ డాక్టర్ అమరేంద్ర కుమార్ చెప్పారు.
అయితే రుణాల మంజూరులో బ్యాంకర్ల నుంచి కొంత ఇబ్బంది ఉందని, రుణం మంజూరుకు పూచీకత్తు ఇవ్వాలనే నిబంధన ఉందని.. ఈ పూచీకత్తు తేలేక కొంతమంది దరఖాస్తుదారులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన చెప్పారు.
సాధారణ పౌల్ట్రీ ఫారాల కంటే కూడా ఎక్కువగా బ్యాక్‌యార్డ్ పౌల్ట్రీ ఫారాలకు రుణాలు ఇవ్వడానికి ఎక్కువగా బ్యాంకర్లు ఆసక్తి చూపుతున్నారని.. నాటుకోళ్లు పెంపకం లాంటి వాటిని కూడా ప్రోత్సహిస్తున్నారని చెప్పారు.
‘ఏపీలో ఇప్పటి వరకు నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ కింద వెయ్యి దరఖాస్తులు స్వీకరించాం. అందులో 70 మందికి రుణాలు కూడా మంజూరయ్యాయి. మరికొన్ని దరఖాస్తులు వివిధ దశల్లో ఉన్నాయి. ఈ పథకాన్ని గ్రామీణ యువత ఉపయోగించుకుంటే మంచి ఫలితాలు సాధించొచ్చు’ అని అమరేంద్ర కుమార్ చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- ట్రినిటైట్: అణుబాంబు బద్దలై రంగు రాళ్లు బయటపడ్డాయి
- అస్పర్టేమ్ : టూత్‌పేస్ట్ నుంచి కోక్ వరకు... అనేక పదార్ధాల్లో ఉండే ఈ చక్కెరతో క్యాన్సర్ వస్తుందా, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం తేల్చింది?
- లాగరిథమిక్ అంటే ఏమిటో తెలుసా... ఎంత డబ్బుకు ఎంత ఆనందం వస్తుందో చెప్పే గణిత సూత్రం
- పర్సనల్ ఫైనాన్స్: ఒక ఏడాదిలో ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా ఉండాలి?
- కామెరూన్: ఈ దేశంలో శవపేటికలు అమ్ముకోవడం మంచి వ్యాపారం, ఎందుకంటే....
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















