లాగరిథమిక్ అంటే ఏమిటో తెలుసా... ఎంత డబ్బుకు ఎంత ఆనందం వస్తుందో చెప్పే గణిత సూత్రం

డబ్బు

ఫొటో సోర్స్, Getty Images

ఎక్కువ డబ్బు అంటే ఎక్కువ ఆనందం అనుకుంటారు. అయితే ప్రాథమిక అవసరాలు తీరిన తర్వాత ఆ భావన మరో మలుపు తీసుకుంటుంది.

ఆదాయం, నష్టం, అప్పులతో మన భావోద్వేగ సంబంధాలు చాలా సంక్లిష్టమైనవి.

వాస్తవానికి డబ్బుకు గొప్ప శక్తి ఉంటుందని, ప్రజల నిర్ణయాలు, చర్యలను ప్రభావితం చేయగలదని, సమస్యలను పరిష్కరించడానికి ఇది ఒక ప్రభావవంతమైన మార్గం అని చెప్పడంలో సందేహం లేదు.

ముఖ్యంగా సంక్షోభ సమయాల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంటుంది.

"ప్రజలు మర్యాదపూర్వకమైన జీవితాన్ని గడపడానికి డబ్బు ఉపయోగపడుతుంది" అని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్రం, ప్రవర్తనా శాస్త్రాల (బిహేవియర్ సైన్స్) ప్రొఫెసర్ జాన్-ఇమ్మాన్యుయేల్ డి నెవ్ పేర్కొన్నారు.

అయితే మీరు ధనవంతులు అవుతున్న కొద్దీ మీ ఆనందంలో తేడా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

అధిక ఆదాయం, మరింత ఆనందం మధ్య సంబంధమే 'లాగరిథమిక్' అని డి నెవ్ అంటున్నారు.

మీ వార్షిక ఆదాయం రూ. 16 లక్షల నుంచి నుంచి రూ. 32 లక్షలకు (రెట్టింపు) పెరిగితే మీరు సంతోషంగా ఉంటారు.

ఆ తర్వాత ఆశ్చర్యం కలగదు. మీరు అదే స్థాయి అనుభూతిని మళ్లీ అనుభవించాలంటే ఆదాయంలో ఇక రూ. 16 లక్షల పెరుగుదల సరిపోదు. ఇది మిమ్మల్ని సంతోషపరుస్తుంది, కానీ ఎక్కువైతే కాదు.

అదే స్థాయి భావోద్వేగాన్ని మళ్లీ అనుభవించడానికి, మీ ఆదాయం మళ్లీ రెట్టింపు కావాలి.దీంతో మరో రూ.32 లక్షల ఆదాయం పెరుగుదల మీకు అలాంటి సంతోషాన్ని కలిగిస్తుంది. అదే స్థాయి ఆనందాన్ని మళ్లీ అనుభవించడానికి మీ ఆదాయం మరో రూ. 64 లక్షలు పెరగాలి. ఆపై మళ్లీ ఆనందం పొందాలంటే మళ్లీ ఆదాయం రెట్టింపు కావాలి.

ఒక పరిమితి దాటిన తర్వాత ( ఉదాహరణకు వార్షిక ఆదాయం రూ. కోటి) మీ జీతం రెట్టింపు చేయడానికి నిరంతరం ప్రయత్నిస్తూ మీరు సమయాన్ని వృథా చేసుకుంటారని పరిశోధనలో తేలింది.

ఈ ప్రాసెస్‌లో చాలా మంది ఆ స్థాయి ఆదాయాన్ని చేరుకోకపోవచ్చు.

అయితే చేరుకున్నవారు ఎక్కువ డబ్బు, జీవిత సంతృప్తి మధ్య సంఖ్యాపరంగా ఉన్న ముఖ్యమైన సంబంధాన్ని ఇకపై గుర్తించలేరని ప్రొఫెసర్ డి నెవ్ అంటున్నారు.

ఇది ఆనందాన్ని కొనడం అంత సులభం కాదని నిరూపిస్తోందని ఆయన స్పష్టంచేశారు.

గణితం

ఫొటో సోర్స్, Getty Images

శ్రేయస్సు అంటే ఆదాయమేనా?

ప్రజలు తమ ప్రాథమిక అవసరాలను (ఆహారం, నివాసం, ఆరోగ్యం) తీర్చుకోవాల్సిన అవసరం కాదనలేనిది. అయితే, ఆదాయంతోనే కాకుండా శ్రేయస్సుకు గణనీయంగా దోహదపడే అనేక అంశాలు ఉన్నాయి.

యాక్షన్ ఫర్ హ్యాపీనెస్ ఛారిటీ డైరెక్టర్ మార్క్ విలియమ్సన్ వాటిలో కొన్నింటిని గుర్తించారు.

  • సమాజంలో మంచి సంబంధాలను పెంపొందించుకోవడం (కుటుంబం, స్నేహితులు, సహోద్యోగులు)
  • మనకంటే ఎక్కువైన (పెద్దవైన) వాటిలో భాగస్వామ్యం కావడం
  • ఊహించని సంఘటనలను సవాలుగా స్వీకరించడం
  • స్వయం ప్రతిపత్తి (జీవితంలో ఎంచుకునే వాటిపై నియంత్రణ).

కొన్ని దేశాలలో వీటిని జనాభా శ్రేయస్సు స్థాయిని లెక్కించడానికి ఉపయోగిస్తారు. జీడీపీ (స్థూల దేశీయోత్పత్తి) నుంచి దానిని పొందేందుకు ప్రయత్నిస్తారు.

ఐక్యరాజ్య సమితి రిపోర్ట్ అయిన హ్యాపీనెస్ ఇన్ ది వరల్డ్ రచయితలలో ఒకరు డి నెవ్ .

ఈ రిపోర్టు ప్రకారం ప్రజలు జీవితంలో సంతృప్తి పొందాలంటే సమాజంలో సమానత్వం కీలకం.

నార్డిక్ (నార్వే, ఫిన్లాండ్, ఐఎస్‌లాండ్ తదితర) దేశాలు ఈ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉంటున్నాయి. ఆయా రాష్ట్రాలు ప్రజలకు మానసిక భద్రత అందించడం, ప్రభుత్వ ఆర్థిక ప్రణాళికలపై విశ్వాసం ఉండటం దీనికి కారణమని ప్రొఫెసర్ అభిప్రాయం వ్యక్తంచేశారు.

డబ్బు గురించిన మరో ఆసక్తికరమైన విచిత్రం ఏమిటంటే మనం సంపాదించడంలో పొందే ఆనందం కంటే డబ్బును పోగొట్టుకున్నపుడు పొందే బాధే ఎక్కువ.

అంటే మనం ఎక్కువ డబ్బు సంపాదించినపుడు కలిగే ఆనందం, మనం డబ్బును పోగొట్టుకున్నప్పుడు దీనికి విరుద్ధంగా ఉంటుంది. ఇది డిమినిషింగ్ ఎమోషనల్ రిటర్న్స్ ఫార్ములాను రుజువు చేస్తుంది.

బిహేవియరల్ ఎకనామిక్స్‌లో దీనిపై పలు అధ్యయనాలు జరిగాయి.

డి నెవ్ మాట్లాడుతూ సమానమైన లాభంతో పోలిస్తే ఆదాయంలో తగ్గుదల లేదా కొనుగోలు శక్తి నష్టం అనేది రెండు రెట్లు ఎక్కువ సెన్సిటివ్‌గా ఉంటుందని స్పష్టంచేశారు.

బీబీసీ ఐస్వోటీ

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)