దళిత విద్యార్థులు పైలెట్ కావాలనుకుంటే రూ.3.72 లక్షల స్కాలర్ షిప్, నెలకు రూ.22 వేలు ఉపకారవేతనం ఇచ్చే ప్రభుత్వ పథకం

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఎ. కిశోర్‌బాబు
- హోదా, బీబీసీ కోసం
గగన వీధుల్లో విమానమెక్కి అలా ఎగిరిపోతే ఎంత బాగుంటుంది అని ఆశపడని మనసు ఉండదు. అలాంటి విమానం నడిపే పైలెట్ కావాలని కలలు కనే కుర్రకారు తక్కువేం కాదు.
కాకుంటే అది అంత ఆషామాషీ వ్యవహారం కాదు. నిరుపేదలకు అందునా మారుమూల గ్రామాల్లో ఉండే నిరుపేద దళిత యువతకు అది అందని కలే.
పేద దళిత యువతీయువకులు ఒక ప్రైవేటు ప్లయింగ్ క్లబ్‌లో చేరి లక్షలకు లక్షలు ఫీజు కట్టి కమర్షియల్ పైలెట్‌గా శిక్షణ పొందడం అంటే మాటలా? అసాధ్యమే అనుకుంటాం. కానీ సుసాధ్యమే అంటోంది కేంద్ర ప్రభుత్వం.
అనడం మాత్రమే కాదు, అలాంటి విద్యార్థులు తమ కలలు సాకారం చేసుకోవడానికి వీలుగా కమర్షియల్ పైలెట్‌గా శిక్షణ తీసుకోవడం కోసం ప్రతి సంవత్సరం రూ. 3.72లక్షల ఉపకార వేతనంతో పాటు, విద్యార్థి వ్యక్తి గత ఖర్చుల కోసం ప్రతి నెలా అదనంగా రూ. 22,000 ఉపకార వేతనం కల్పించే పథకాన్ని అమలు చేస్తోంది.
ఇంటర్మీడియెట్/ ప్లస్ టూ తరువాత ఉన్నత చదువులు చదవాలని ఆరాటపడే ఎస్సీ, ఎస్టీ ( SC, ST) విద్యార్థులకు తగిన ప్రోత్సాహం అందించాలనే ఆశయంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకమే Top Class Education Scheme for SC, ST Students పథకం.
ఈ పథకం ఏమిటి? పొందాలంటే అర్హతలు ఏమిటి? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? విద్యార్థికి ఉండాల్సిన ప్రతిభ ఏమిటి? పైలెట్‌గా శిక్షణ తీసుకోవడానికి ఏం చేయాలి? విధి విధానాలు, తదితర అంశాల గురించి పూర్తిగా తెలుసుకుందాం.

ఫొటో సోర్స్, Getty Images
ఏమిటీ పథకం?
పేదరికంలో ఉన్న షెడ్యూలు కులాలు, షెడ్యూలు తరగతులకు చెందిన యువతీ యువకులు ఇంటర్మీడియెట్/ ప్లస్ టూ మాద్యమిక విద్య తరువాత ఉన్నత విద్య చదవాలంటే చాలా వ్యవ ప్రయాసలు పడాల్సి వస్తోంది. తగిన ప్రోత్సాహం లేక చాలా మంది దళిత యువత ఉన్నత చదువులకు దూరమవుతున్నారు.
దీన్ని దృష్టిలో ఉంచుకున్న కేంద్ర ప్రభుత్వం ఇంటర్ తరువాత కూడా దళిత విద్యార్థులు ఇంజినీరింగ్, మెడిసిన్, ఐఐటీ, కమర్షియల్ పైలెట్ తదితర కోర్సులు చదవడానికి ప్రత్యేకంగా ఉపకార వేతనాలు అందించాలని నిర్ణయించి Top Class Education Scheme for SC, ST Students పథకాన్ని 2007-08 సంవత్సరం నుంచీ అమలు చేస్తోంది.
ఉపయోగం ఏమిటి?
ఆర్థిక స్తోమత వల్ల లేక కమర్షియల్ పైలెట్ లేదా ఇంజినీరింగ్, మెడిసిన్ లేదా ఐఐటీ తదితర ఉన్నత విద్యా సంస్థల్లో చేరి చదువుకునే అవకాశం లేని విద్యార్థులకు ఈ స్కాలర్‌షిప్పు ఎంతో ఊతమిస్తుంది.
విద్యార్థుల విద్యకయ్యే ఫీజు పూర్తిగా చెల్లించడమే కాకుండా వారి భోజనం, వసతి సదుపాయాలు కూడా ఈ పథకంలో భాగమే.
ఎంత చెల్లిస్తారు?
కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిన విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులకు ఆయా విద్యా సంస్థలు నిర్ణయించిన కళాశాలలో ట్యూషన్ ఫీజు, నాన్ రీఫండ్‌బుల్ ఫీజులన్నీ కేంద్ర ప్రభుత్వమే పూర్తిగా చెల్లిస్తుంది.
ఒక వేళ విద్యార్థి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విద్యా సంస్థల్లో ప్రవేశం పొందితే, ఆ కళాశాల నిర్దేశించిన ట్యూషన్ ఫీజు, నాన్ రీఫండ్‌బుల్ ఫీజులన్నీ ప్రభుత్వమే చెల్లిస్తుంది.
ప్రైవేటు కళాశాలల్లో చదువుతుంటే?
ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ప్రవేటు కళాశాలల్లో చదువుతుంటే వారికి కూడా ట్యూషన్ ఫీజు, నాన్ రీఫండ్‌బుల్ ఫీజులన్నీ ప్రభుత్వం చెల్లిస్తుంది.
అయితే ఈ ఫీజు పరిమితిని రూ.2 లక్షలకు నిర్ణయించారు.
అంతకుమించి ట్యూషన్, నాన్ రీఫండబుల్ ఫీజులుంటే వాటిని విద్యార్థి భరించాల్సి ఉంటుంది.

అకడమిక్ అలవెన్సులు కూడా ఇస్తారా?
ఇస్తారు. ఈ పథకం విశిష్టత కూడా అదే.
కోర్సులో చేరిన మొదటి సంవత్సరం విద్యార్థికి అకడమిక్ అలవెన్సుల కింద రూ. 86,000 చెల్లిస్తారు.
తరువాత కోర్సు పూర్తయ్యే వరకు ప్రతి ఏటా రూ. 41,000 చెల్లిస్తారు.
ఎందుకీ అకడమిక్ అలవెన్సు?
అకడమిక్ అలవెన్సు కింద ఇచ్చే డబ్బుతో విద్యార్థి తన కోర్సు సంబంధిత పుస్తకాలు, కంప్యూటర్, దాని సామగ్రి తదితరాలు కొనుగోలు చేసుకోవడానికి ఈ డబ్బులు ఇస్తారు.
పైలెట్ కోర్సుకు స్కాలర్ షిప్ ఇస్తారా?
ఇస్తారు. నిరుపేద దళిత విద్యార్థులు పైలట్ కోర్సులో చేరితే వారికి ఆ కోర్సు పూర్తయ్యే వరకు ప్రతి సంవత్సరం రూ. 3.72 లక్షలు ఉపకార వేతనం ఇస్తారు.
ఇంతే కాకుండా, ఆ విద్యార్థి living expenses కోసం ప్రతి నెలా రూ. 22 వేల రూపాయలు చెల్లిస్తారు.
ఇవి కాకుండా పుస్తకాలు తదితర విద్యా సంబంధిత సామగ్రి కొనుగోలు కోసం సంవత్సరానికి రూ.3 వేలు చెల్లిస్తారు.

ఫొటో సోర్స్, Getty Images
పైలెట్ కోర్సులో చేరాలంటే ఏం చేయాలి?
కమర్షియల్ పైలెట్‌గా శిక్షణ తీసుకోవాలనుకునే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ముందుగా Director General of Civil Aviation వారిచే గుర్తింపు పొందిన లేదా వారిచే నోటిఫై చేయబడిన శిక్షణా సంస్థలో ప్రవేశం పొందాలి.
సివిల్ ఏవియేషన్ గుర్తింపు పొందిన సంస్థలు ఉన్నాయి?
దాదాపు 12 వరకు ఉన్నాయి. వీటిలో గత ఏడాది దాదాపు 55 మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ప్రవేశం పొంది ఉపకార వేతనం పొందారు.
ఈ సంస్థల్లో ప్రవేశం పొందడమెలా?
విమానయాన శిక్షణా సంస్థల్లో ప్రవేశానికి ఆయా సంస్థలు ప్రత్యేకంగా ప్రవేశ పరీక్ష పెడతాయి. అందులో విద్యార్థులు తమ ప్రతిభను చాటుకుని సీటు సంపాదించాలి.
ప్రవేశ పరీక్ష ద్వారా సీటు పొందిన విద్యార్థులకు వెంటనే ఈ ఉపకార వేతనం మంజూరు చేసి, వారి ఖాతాలో వేస్తారు.
ప్రవేశ పరీక్ష ఎప్పుడు జరుగుతుంది?
ఆయా సంస్థలు తమకు సంబంధించి ఒక నిర్ణీత కాల వ్యవధిలో ఏటా ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తాయి.
ఆసక్తి ఉన్న విద్యార్థులు వాటిని గమనించి ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలి.

ఫొటో సోర్స్, Getty Images
ఐఐటీ/ఐఐఎం/ ఎయిమ్స్ లాంటి సంస్థల్లో చదవాలనుకుంటే?
తప్పకుండా ఈ సంస్థల్లో చదివే విద్యార్థులకు కూడా ఉపకార వేతనం ఇస్తారు.
IIMs / IITs/ IIITs / AIIMSs/ NITs/NIFTs/ NIDs/ Indian Institutes of Hotel, Management, National Law Universities, Central Government Institutions నిర్వహిస్తున్న కోర్సుల్లో ప్రవేశం పొందిన విద్యార్థులందరూ ఈ ఉపకారవేతనం పొందవచ్చు.
విద్యార్థులను ఎలా ఎంపిక చేస్తారు?
ఈ స్కాలర్ షిప్పు పొందడానికి విద్యార్థులను కేవలం ఆయా కోర్సులకు సంబంధించి నిర్వహించే ప్రవేశపరీక్షల ద్వారానే ఎంపిక చేయడం జరుగుతుంది.
ఉదాహరణకు మెడిసిన్‌లో స్కాలర్‌షిప్పు పొందాలంటే నీట్ ప్రవేశపరీక్ష రాసి మెడిసిన్లో సీటు సంపాదించాల్సి ఉంటుంది. ఇంజినీరింగ్ కోర్సు చేరాలంటే ఎంసెట్ రాయాల్సి ఉంటుంది.
ఐఐటీల్లో చేరదలచుకునే విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్, జేఈఈ మెయిన్స్ లాంటి పరీక్షలు రాసి ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది.
ప్రతి విద్యార్థికీ ఈ స్కాలర్‌షిప్పు వస్తుందా?
అందరికీ అంటే రాదు. ప్రతి సంవత్సరం ఈ పథకం కింద ఇంతమంది విద్యార్థులకు స్కాలర్ షిప్పు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది.
ఆ రేషియో ప్రకారం విద్యార్థులను ఈ స్కాలర్‌షిప్పుల కొరకు ఎంపిక చేస్తారు.
ఈ ఏడాది 21,500 మంది SC విద్యార్థులను ఈ పథకం కింద ఎంపిక చేస్తారు. 1,000 మంది ST విద్యార్థులను తీసుకుంటారు.
వీటిలో 30 శాతం సీట్లు మహిళలకు కేటాయించారు. ఒక వేళ వారు అంత సంఖ్యలో లేకపోతే ఆ సీట్లను అబ్బాయిలకు కేటాయిస్తారు.
ఒక విద్యా సంస్థకు ఎన్ని స్కాలర్ షిప్పులు మంజూరు చేస్తారు?
కేంద్ర ప్రభుత్వం ఆయా విద్యా సంస్థలకు సంబంధించి ఇన్ని స్లాట్లు అని కేటాయిస్తుంది. వాటికి అర్హులైన విద్యార్థులుంటే వారిని ఎంపిక చేస్తుంది.
ఒకవేళ ఉన్నవాటికంటే ఎక్కువ మంది విద్యార్థులుంటే, అప్పుడు మార్కుల ప్రాతిపదికన ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులను ఎంపిక చేస్తారు.
స్కాలర్ షిప్పు ఏ సందర్భంలో రద్దు చేస్తారు?
స్కాలర్ షిప్పుకు ఎంపికైన విద్యార్థి ఆ విద్యా సంవత్సరం బాగా చదవకపోయినా, లేదా తదుపరి పై తరగతికి ప్రమోట్ కాకపోతే ఆ విద్యార్థికి ఈ స్కాలర్‌షిప్పు రద్దు అవుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
ఈ పథకాన్ని అమలు ఎలా చేస్తారు?
ఎస్సీ, ఎస్టీ కుటుంబాల్లో ఇంటర్మీడియెట్ పూర్తి చేసిన విద్యార్థులు ఈ పథకం పొందడానికి అర్హులు.
ఒక కుటుంబంలో గరిష్టంగా ఇద్దరు విద్యార్థులకు మాత్రమే ఈ పథకం వరిస్తుంది.
కుటుంబ ఆదాయ పరిమితి ఎంత ఉండాలి?
SC విద్యార్థులకైతే కుటుంబ వార్షికాదాయం రూ. 8 లక్షల లోపు ఉండాలి
ST విద్యార్థులకు కుటుంబ వార్షికాదాయం రూ. 6 లక్షల లోపు ఉండాలి.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
ముందుగా SC, ST విద్యార్థులు నేషనల్ స్కాలర్ షిప్ పోర్టల్‌కు వెళ్లి నమోదు చేసుకోవాలి.
అందులో విద్యార్థులకు ఒక లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్ క్రియేట్ చేసుకోవాలి.
వెబ్‌సైటు చిరునామా ఏమిటి?
https://scholarships.gov.in/ ఈ లింకును ఓపెన్ చేస్తే ఆ పోర్టల్ ఓపెన్ అవుతుంది.
ఏమేమి పత్రాలు పొందుపరచాలి?
- విద్యార్థి పాస్‌పోర్టు సైజు ఫోటో
- ప్రవేశ పరీక్షలో పొందిన మార్కుల జాబితా పత్రం
- జనన ధ్రువీకరణ పత్రం
- కుల ధ్రువీకరణ పత్రం
- ఆదాయ ధ్రువీకరణ పత్రం
- ముందు చదివిన చదువుకు సంబంధించిన మార్కుల జాబితా
- ప్రస్తుతం చదువుతున్న కోర్సులకు సంబంధించి ఫీజు రశీదు
- విద్యార్థి పేరు మీద ఉన్న బ్యాంకు సేవింగ్స్ అకౌంట్ పాసు పుస్తకం
విద్యార్థి చదువుపైన పర్యవేక్షణ ఉంటుందా?
ప్రతి విద్యా సంస్థలోనూ ఈ తరహా స్కాలర్‌షిప్పులు తీసుకునే విద్యార్థుల ప్రతిభ పైన పర్యవేక్షణ నిరంతరం కొనసాగుతుంది.
దీని పైన ఆయా విద్యా సంస్థ ఎప్పటికప్పుడు ఆ విద్యార్థి ప్రతిభకు సంబంధించి నివేదికలను కేంద్ర ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖకు నివేదించాల్సి ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
క్రమశిక్షణ చర్యలు ఉంటాయా?
తప్పకుండా ఉంటాయి. ఏదైనా విద్యా సంస్థ కేంద్ర ప్రభుత్వ నిర్దేశిత నియమావళిని సరిగ్గా అమలు చేయని పక్షంలో ఆ విద్యా సంస్థను కేంద్ర ప్రభుత్వ నోటిఫైడ్ విద్యా సంస్థల జాబితా నుంచి తొలగిస్తారు.
వరుసగా మూడు సంవత్సరాలు ఈ స్కాలర్‌షిప్పు కోసం దరఖాస్తు చేసుకోని విద్యా సంస్థలను కూడా ఈ జాబితా నుంచి తొలగిస్తారు.
విద్యార్థి తప్పుడు ధ్రువపత్రాలు లేదా సమాచారం చెప్పి స్కాలర్‌షిప్పులు పొందితే విద్యార్థిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు.
ఈ స్కాలర్‌షిప్పు పొందుతూ విద్యార్థులు ఇతర స్కాలర్‌షిప్పులు పొందవచ్చా?
ఒకసారి ఈ స్కాలర్‌షిప్పుకు విద్యార్థి ఎంపికైతే ఈ కోర్సు పూర్తయ్యే వరకు ఆ విద్యార్థి మరే ఇతర స్కాలర్‌షిప్పులు పొందడానికి అర్హుడు కాదు.
పార్ట్-టైమ్ కోర్సులకు ఈ స్కాలర్‌షిప్పు వర్తించదు. కేవలం ఫుల్-టైమ్ కోర్సులకు మాత్రమే వర్తిస్తుంది.
సందేహాలుంటే ఎవరిని సంప్రదించాలి?
విద్యార్థుల కోసం ప్రత్యేకించి హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు.
HELP DESK NUMBER : 0120-6619540
ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 8 గంటల మధ్య, ఒక్క సెలవు రోజుల్లో మినహా మిగిలిన అన్ని రోజుల్లోనూ సంప్రదించవచ్చు.
లేదా
[email protected] చిరునామాకు మెయిల్ ద్వారానైనా సంప్రదించవచ్చు.

ఇవి కూడా చదవండి:
- షార్ట్ సెల్లింగ్- కొనకుండానే షేర్లను ఎలా అమ్ముతారు... లాభాలు ఎలా వస్తాయ్
- అఫ్గానిస్తాన్- బాలికల విద్య కోసం పోరాడుతున్న ప్రొఫెసర్ అరెస్ట్
- డీజిల్ ఇంజిన్-ను హైడ్రోజన్ ఇంజిన్-గా మార్చే కొత్త టెక్నాలజీ... - BBC News తెలుగు
- భారత్-లో ఇంటర్నెట్ వృద్ధి రేటు ఎందుకు తగ్గిపోయింది- - BBC News తెలుగు
- పడయప్ప- పర్యటకులతో సరదాగా ఫోటోలకు పోజులిచ్చే ఈ ఏనుగుకు ఇప్పుడు ఎందుకు చెడ్డపేరు వస్తోంది-
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












