ట్రాన్స్‌జెండర్ విద్యార్థులు ఏడాదికి రూ.13,500 స్కాలర్‌షిప్ పొందడం ఎలా?

ఫొటో సోర్స్, PRAVEEN KUMAR SHUBHAM
- రచయిత, ఎ.కిశోర్‌బాబు
- హోదా, బీబీసీ కోసం
ట్రాన్స్‌జెండర్లపై నేటికీ సమాజంలో వివక్ష కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం వారికి సమాన హక్కులు కల్పిస్తూ చట్టం కూడా తీసుకొచ్చింది.
వారి సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తోంది కూడా. ట్రాన్స్‌జెండర్ విద్యార్థులకు ఏటా రూ.13,500 స్కాలర్‌షిప్ అందజేసే పథకం కూడా వీటిలో ఒకటి.
ట్రాన్స్‌జెండర్ విద్యార్థులకు లేదా ట్రాన్స్‌జెండర్లకు వివి మార్గాలలో పుట్టిన పిల్లలకు 9వ తరగతి నుంచి వారు ఉన్నత విద్య పూర్తయ్యే వరకు కేంద్ర ప్రభుత్వం ఏటా ఈ స్కాలర్‌షిప్ అందజేస్తుంది.
ఈ పథకం ఏమిటి? ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది? దరఖాస్తు చేసుకోవడం ఎలా? స్కాలర్‌షిప్ ఎలా చెల్లిస్తారు? తదితర పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఫొటో సోర్స్, PRAVEEN KUMAR SHUBHAM
ఏమిటీ పథకం?
పౌరులందరూ సమానమే అంటుంది మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 14. అయినప్పటికీ హిజ్రాలు తమతో సమానం కాదు అనే ధోరణి నేటికీ సమాజంలో కనిపిస్తుంటుంది.
జెండర్‌ను కారణంగా చూపిస్తూ ఏ వ్యక్తి పట్లా వివక్ష ప్రదర్శించకూడదని చెబుతూ రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 15(1), 15(2), 16(2) ఈ తరహా వివక్షను నిషేధిస్తున్నాయి.
మన దేశంలోని ట్రాన్స్‌జెండర్లకు కూడా సమాన హక్కులు కల్పిస్తూ వారిని సాధారణ స్రవంతిలో మమేకం చేసేలా కేంద్ర ప్రభుత్వం The Transgender Persons (Protection of Rights) Bill, 2019 చట్టాన్ని 26 వనంబరు 2019లో తీసుకొచ్చింది.
ఈ చట్టం ప్రకారం ట్రాన్స్‌జెండర్లకు ప్రత్యేక హక్కులు, ప్రోత్సాహకాలను ప్రభుత్వం కల్పించింది. వారికి సమాన విద్య, ఉద్యోగావకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంది.
ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ ట్రాన్స్‌జెండర్లు చదువుకోవడానికి ప్రోత్సాహం కల్పిస్తూ “SMILE - Support for Marginalized Individuals for Livelihood and Enterprise”, పథకాన్ని ప్రవేశపెట్టింది.
ఈ పథకం ప్రకారం ట్రాన్స్‌జెండర్లకు లేదా వారికి వివిధ మార్గాల్లో కలిగిన పిల్లలకు 9వ తరగతి నుంచి ఉన్నత విద్య పూర్తయ్యే వరకు ఏటా రూ.13,500 ఉపకార వేతనం చెల్లిస్తుంది.

ఫొటో సోర్స్, PRAVEEN KUMAR SHUBHAM
ఏఏ చదువులకు స్కాలర్‌షిప్ ఇస్తారు?
ట్రాన్స్‌జెండర్ విద్యార్థులు 9వ తరగతికి వచ్చినప్పటి నుంచీ వారి ఉన్నత చదువు పూర్తయ్యే వరకు ఈ స్కాలర్‌షిప్ ఇస్తారు.
ఇంటర్మీడియెట్, డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేట్, యూనివర్సిటీలో చదివే ఉన్నత విద్యా కోర్సులకు ఈ ఉపకార వేతనం ఇస్తారు.
ప్రైవేటు విద్యా సంస్థల్లో చదువుకునే విద్యార్థులకు ఇస్తారా?
ఇస్తారు. అయితే ఆయా ప్రైవేటు విద్యా సంస్థలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు లేదా కేంద్ర ప్రభుత్వంచే గుర్తింపు పొందినవై ఉండాలి.
వొకేషనల్ కోర్సులకు స్కాలర్‌షిప్ ఇస్తారా?
ఇస్తారు. ట్రాన్స్‌జెండర్ విద్యార్థి 9వ తరగతి వచ్చినప్పటి నుంచి ఆ విద్యార్థి తాను చదివే ప్రతి చదువుకూ కేంద్రం ఈ ఉపకారవేతనం ఇస్తుంది.
ఐటీఐ (Industrial Training Institutes/ Industrial Training Centres affiliated with the National Council for Vocational Training (NCVT)), పాలిటెక్నిక్ కోర్సులు తదితర కోర్సులకు కూడా ఈ ఉపకార వేతనం చెల్లిస్తారు.

ఫొటో సోర్స్, PRAVEEN KUMAR SHUBHAM
డిప్లమా కోర్సులు చదివే విద్యార్థులకు ఇస్తారా?
ఇస్తారు. అయితే ఆ డిప్లమా కోర్సులకు ఆయా యూనివర్సిటీలు/ యూజీసీ/ ఏఐసీటీఈ గుర్తింపు ఉండాలి.
అర్హతలు ఏమిటీ?
- భారతీయ పౌరుడై ఉండాలి
- కేవలం ట్రాన్స్‌జెండర్‌లకు లేదా వారికి పుట్టిన పిల్లలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.
- విద్యార్థి తప్పనిసరిగా Ministry of Social Justice & Empowerment ఆన్‌లైన్ ద్వారా జారీ చేసిన ట్రాన్స్‌జెండర్ సర్టిఫికెట్‌ను కలిగి ఉండాలి.
- విద్యార్థి కేంద్ర ప్రభుత్వం లేదా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ఏ ఇతరత్రా ఉపకారవేతనాలు పొందుతూ ఉండకూడదు.
- విద్యార్థి తప్పనిసరిగా ప్రభుత్వ పాఠశాల లేదా రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం చేత గుర్తింపు పొందిన పాఠశాలలో చదువుతూ ఉండాలి.
- విద్యార్థి రెగ్యులర్ లేదా పార్ట్ టైమ్ కోర్సు చదువుతున్నా ఫరవాలేదు.
కరస్పాండెంట్ కోర్సు చదువుతుంటే?
కరస్పాండెంట్ లేదా దూర విద్యా విధానం ద్వారా చదువుకునే ట్రాన్స్‌జెండర్ విద్యార్థులకు కూడా ఈ పథకం వర్తిస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
రెండు డిగ్రీలు చదివితే ఇస్తారా?
ఇవ్వరు. ఉదాహరణకు విద్యార్థి ఇప్పుడు ఈ ఉపకార వేతనం తీసుకుంటూ బీఏ చదివారు అనుకుందాం. బీఏ తరువాత ఆ విద్యార్థి మళ్లీ బీకాం చదవాలనుకుంటే మాత్రం ఈ స్కాలర్‌షిప్ రాదు.
ఒక ఏడాదికి మాత్రమే ఇస్తారా?
విద్యార్థికి ఆ విద్యా సంవత్సరానికి మాత్రమే ఈ స్కాలర్‌షిప్ ఇస్తారు. ఉదాహరణకు 9వ తరగతి చదువుతూ పై తరగతి ప్రమోషన్ కాకుండా మళ్లీ మరుసటి సంవత్సరం కూడా 9వ తరగతిలో ఉండిపోతే.. అలాంటి విద్యార్థికి ఆ సంవత్సరం ఉపకార వేతనం ఇవ్వరు.
ఎంపిక ఎలా ఉంటుంది?
ఏడాదికి ఎంతమందికి ఈ ఉపకార వేతనాలు ఇవ్వాలనుకునేది కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది.
వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఉపకార వేతనాలు మంజూరు చేస్తుంది.
ఎక్కువ దరఖాస్తులు వస్తే అప్పుడు ఆయా విద్యార్థులు ముందు సంవత్సరం సాధించిన మార్కుల ప్రాతిపదికన మంజూరు చేస్తుంది.
ఇద్దరు విద్యార్థులకు సమాన మార్కులు వస్తే అప్పుడు ఆ విద్యార్థుల పుట్టిన తేదీల ప్రాతిపదికన ఎంపిక చేస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
ఎప్పుడు చెల్లిస్తారు?
ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపికైన విద్యార్థులకు ప్రతి సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీన లేదా ఆ విద్యా సంవత్సరం ప్రవేశాలు మొదలయ్యే నెలలోగానీ ఒకేసారి రూ.13,500 చెల్లిస్తారు.
ఎలా చెల్లిస్తారు?
ఈ ఉపకార వేతనం చెల్లింపు పూర్తిగా నగదు బదిలీ పథకం విధానంలో ఉంటుంది. విద్యార్థి బ్యాంకు ఖాతాలకు కానీ లేదా విద్యార్థి తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాలకు గానీ నేరుగా జమ చేస్తారు.
రద్దు చేస్తారా?
కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో విద్యార్థికి ఇచ్చే స్కాలర్‌షిప్‌ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేస్తుంది.
విద్యార్థి తాను చదువుతున్న బడిలో లేదా కళాశాలలో సత్ప్రవర్తన కలిగి ఉండకపోయినట్లయితే ఇది రద్దవుతుంది.
విద్యా సంస్థ ఉన్నతాధికారుల అనుమతి లేకుండా విద్యార్థి తరగతులకు సక్రమంగా హాజరు కాకపోయినా సమ్మెల్లో, ఆందోళనల్లో పాల్గొన్నా కూడా ఈ స్కాలర్‌షిప్ రద్దవుతుంది.
విద్యార్థి తాను చదువుతున్న బడి లేదా కళాశాల, యూనివర్సిటీలో ఆ సంస్థల నిబంధనావళి, క్రమశిక్షణను పాటించక పోయినట్లయినా కూడా రద్దు చేస్తారు.

ఫొటో సోర్స్, Getty Images
తప్పుడు సమాచారం ఇస్తే?
విద్యార్థి తనకు సంబంధించి తప్పుడు సమాచారం ఇచ్చి అధికారులను తప్పుదోవ పట్టించి స్కాలర్‌షిప్ పొందుతున్నట్లు తేలిస్తే ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుంది.
అలాంటి విద్యార్థి పట్ల కఠినవంగా వ్యవహరించి క్రిమినల్ కేసులు దాఖలు చేస్తుంది. అప్పటి వరకు పొందిన ఉపకార వేతనాన్ని వడ్డీతో కలిపి వసూలు చేస్తుంది.
విద్యార్థి తదుపరి ప్రభుత్వం నుంచి ఎలాంటి పథకాలు పొందకుండా అతడి పేరు బ్లాక్ లిస్టులో పెడుతుంది.
ఆ ఏడాది చదువు మధ్యలో ఆపేస్తే?
ఆ విద్యా సంవత్సరం చదువు మధ్యలో ఆపేస్తే అప్పుడు ఆ విద్యార్థి తాను ఆ ఏడాది పొందిన స్కాలర్‌షిప్ సొమ్మును తిరిగి ఇచ్చేయాల్సి ఉంటుంది.
దరఖాస్తు చేసుకోవడం ఎలా?
ఈ స్కాలర్‌షిప్‌లకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ నుంచి ఎంపిక ప్రక్రియ వరకు అంతా ఆన్‌లైన్‌లోనే జరుగుతుంది. ఇందుకోసం విద్యార్థులు కేంద్ర ప్రభుత్వంలోని సామాజిక న్యాయం సాధికారిత మంత్రిత్వ శాఖ ట్రాన్స్‌జెండర్ల కొరకు నిర్వహిస్తున్న National Portal for Transgender Person వెబ్‌సైటు ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. https://transgender.dosje.gov.in/Applicant/HomeN/Index
ఈ వెబ్‌సైటుకు వెళ్లి ముందుగా విద్యార్థి అందులో తనకు ప్రత్యేకించి ఒక యూజర్ ఐడీ పాస్‌వర్డ్ క్రియేట్ చేసుకోవాలి.
తరువాత స్కాలర్‌షిప్‌ల విండో ఓపెన్ చేసి అందులో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఏఏ పత్రాలు పొందుపరచాలి?
దరఖాస్తు చేస్తున్నప్పుడు ట్రాన్స్‌జెండర్లు ఈ కింద పేర్కొన్న ధ్రువపత్రాలు పొందుపరచాలి.
కొత్తగా స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థులు
- సెల్ప్ అటెస్టెడ్ పాస్‌పోర్టు సైజు ఫొటో
- National portal for transgender person of the Ministry of Social Justice & Empowerment జారీ చేసిన ట్రాన్స్‌జెండర్ సర్టిఫికేట్
- కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ విద్యార్థి మరే ఇతర స్కాలర్‌షిప్ పొందడం లేదని తెలియజేస్తూ ఆ విద్యార్థి తల్లిదండ్రులచే డిక్లరేషన్ పత్రం
- ముందు సంవత్సరంలో వచ్చిన మార్కుల జాబితా
- విద్యార్థి సెల్ఫ్ అటెస్ట్ చేసిన ఆధార్ కార్డు
- టీసీ (ఒక వేళ విద్యార్థి ఒక బడి నుంచీ ఇంకో బడికి బదిలీ అయిన సందర్భంలో)
- విద్యార్థి చదువుతున్న విద్యా సంస్థ అటెస్ట్ చేసిన పత్రాలు
స్కాలర్‌షిప్ రెన్యువల్ కోసం
- విద్యార్థి ముందు సంవత్సరం సాధించిన మార్కుల జాబితా
- దాన్ని ఆయా విద్యా సంస్థ హెడ్ అటెస్ట్ చేయాలి
వివరాలకు ఎవరిని సంప్రదించాలి?
దరఖాస్తు విధానానికి సంబంధించి లేదా ధ్రువపత్రాల సమర్పణకు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా తీర్చడానికి ట్రాన్స్‌జెండర్ల కోసం ఒక హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు.
Helpline No: 8882133897
వివరాలకు ఎవరిని సంప్రదించాలి?
దరఖాస్తు విధానానికి సంబంధించి లేదా ధ్రువపత్రాల సమర్పణకు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా తీర్చడానికి ట్రాన్స్‌జెండర్ల కోసం ఒక హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు.
Helpline No: 8882133897
సాధారణ సందేహాల నివృత్తి కోసం సంప్రదించాల్సిన చిరునామా
011-20893988, [email protected]
సాంకేతికపరమైన సందేహాల నివృత్తి కోసం సంప్రదించాల్సిన చిరునామా
+91 79 23268299, [email protected]
ఏఏ సమయాల్లో సంప్రదించాలి
సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ చిరునామాలను సంప్రదించవచ్చు.
ఇవి కూడా చదవండి:
- ప్రభుత్వ 'ఫ్యాక్ట్ చెక్ టీమ్' కూడా ఫేక్ వార్తలను వ్యాప్తి చేస్తోందా? ఇవిగో ఉదాహరణలు...
- ఇండియా vs న్యూజీలాండ్: నెంబర్1 ర్యాంకుకు మరో అడుగు దూరంలో టీమ్ ఇండియా
- మొగల్లను ఓడించిన ముస్లిం యోధుడు 'బాఘ్ హజారికా'ను కల్పిత పాత్రగా బీజేపీ చిత్రీకరిస్తోందా?
- అటుకులు, పూలతో చేసిన హైబ్రిడ్ బీరుతో పోలాండ్‌లో హిట్ కొట్టిన ఇద్దరు ఇండియన్స్
- 'రూ. 5 కోట్ల లాటరీ తగిలాక అందరూ వచ్చి పలకరిస్తున్నారు'
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















