గే జంటల ముద్దుల పోటీ: పార్కులో ముద్దు పెట్టుకుంటే తిట్టారు... అందుకే

కొలంబియా

ఫొటో సోర్స్, Reuters

కొలంబియాలో బహిరంగంగా ముద్దు పెట్టుకున్న ఓ గే జంటపై దూషణలకు నిరసనగా ఓ పార్కులో ఆదివారం ముద్దుల పోటీ (కిస్సథాన్) నిర్వహించారు. దీనిలో వందల మంది పాలుపంచుకొన్నారు.

రాజధాని బొగోటాలో ఈ ముద్దుల పోటీ జరిగింది. ఇక్కడే గత శుక్రవారం ఆ గే జంటను దూషించారు.

2016లోనే స్వలింగ సంపర్కుల వివాహాలను చట్టబద్ధంచేస్తూ కొలంబియా నిర్ణయం తీసుకుంది. అయినప్పటికీ హోమోఫొబిక్ దాడులు ఇక్కడ సర్వసాధారణం.

''ముద్దులు ప్రేమకు ప్రతీక. ఇదేమీ నేరం కాదు''అని తాజాగా పార్క్‌లో కొన్ని ప్లకార్డులు కూడా ఏర్పాటుచేశారు.

సంగీతం వెనుక వినిపిస్తుంటే జంటలు ముద్దులు పెట్టుకుంటూ, జెండాలు ఎగరేస్తూ కార్యక్రమాన్ని వేడుకలా నిర్వహించారు.

కొలంబియా

ఫొటో సోర్స్, Reuters

అసలేం జరిగింది?

బొగోటాలోని ఓ పార్క్‌లో గత శుక్రవారం ఒక గే జంట బహిరంగంగా ముద్దుపెట్టుకొనేందుకు ప్రయత్నించింది. అయితే, వారిని కొందరు మహిళలు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అలా వచ్చిన ఓ మహిళ చేతిలో వెదురుకర్రలు కూడా కనిపించాయి.

ఇద్దరు స్వలింగ సంపర్కులనూ పార్క్ నుంచి బయటకు వెళ్లిపోవాలని స్థానికులు ఒత్తిడిచేసినట్లు కనిపిస్తున్న ఒక వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది.

''ఇక్కడ అలాంటి పనులకు మేం అనుమతించం. పార్క్‌లో సెక్స్ చేస్తారా? అదీ పిల్లల ముందు?''అని ఒక మహిళ అరుస్తూ వీడియోలో కనిపిస్తున్నారు.

వీడియో క్యాప్షన్, ప్రేమలో పడ్డారా, కామంలో కూరుకుపోయారా... ఎలా తెలుస్తుంది?

''సెక్స్ ఏమిటి. మేం కేవలం ముద్దు పెట్టుకున్నాం''అని అక్కడున్న అబ్బాయి చెబుతున్నట్లు వీడియోలో కనిపిస్తోంది.

''మీరు ఇక్కడి నుంచి వెళ్లకపోతే.. మేం కొట్టికొట్టి చంపేస్తాం''అని మరో మహిళ కూడా బెదిరిస్తున్నారు.

మరోవైపు స్వలింగ సంపర్కుల జంట ఈ విషయాన్ని సెక్యువల్ డైవర్సిటీ విభాగం ఇన్‌చార్జికి ఫిర్యాదు చేశారు. దీనిపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది.

ప్రస్తుతం ఆ జంటకు మద్దతుగా ముద్దుల పోటీ నిర్వహించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)