కండోమ్ వాడకంపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో పురుషులు ఏమంటున్నారు?

కుటుంబ నియంత్రణ మీద అవగాహన కల్పిస్తున్న ఆశా వర్కర్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, గీతా పాండే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

'పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుందాం.' తన భర్తను అడిగింది 27 ఏళ్ల రంజనీ శర్మ.

'వద్దు. ఆపరేషన్ చేయించుకుంటే ఆరోగ్యం పాడవుతుంది.' అని ఆమె భర్త వారించారు.

ఉత్తర్ ప్రదేశ్‌లోని లఖనవూకు చెందిన రంజనీ శర్మ దంపతులకు ముగ్గురు పిల్లలు. ఇకపై పిల్లలు వద్దకున్న వారు, చాలా కాలంగా కండోమ్ వాడుతున్నారు. కానీ అప్పుడప్పుడు కండోమ్ ఫెయిల్ అవుతూ వస్తోంది. ఫలితంగా రెండు సార్లు రంజనీ శర్మ గర్భవతి అయ్యారు. అబార్షన్ కోసం పిల్స్ వేసుకోవాల్సి వచ్చింది.

'పిల్స్ వేసుకోవడం వల్ల చాలా రక్తం పోయేది. తలంతా తిరిగినట్లు ఉండేది. అలసటతో ఒంట్లో అసలు ఓపికే ఉండేది కాదు. ఇక నేను విసిగిపోయా. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకోవడమే ఈ సమస్యకు మార్గమని ఆయనతో చెప్పా.' అని రంజనీ నాతో ఫోనులో మాట్లాడుతూ అన్నారు

కుటుంబ నియంత్రణ అవగాహన సదస్సు

ఫొటో సోర్స్, Getty Images

పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకోవాలని నిర్ణయించుకున్నాక ఎవరు చేయించుకోవాలనే ప్రశ్న వచ్చింది. ఆపరేషన్ చేయించుకునేందుకు రంజనీ శర్మ భర్త ముందుకు వచ్చారు. కానీ అందుకు ఆమె ఒప్పుకోలేదు.

‘‘నేను మా ఆయనకు వద్దని చెప్పా. మా ఇంట్లో సంపాదించేది ఆయన ఒక్కరే. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుంటే ఆయన బలహీన పడిపోతారు. ఎక్కువ బరువులు ఎత్తలేరు’’ అని రంజనీ అన్నారు.

పిల్లలు పుట్టకుండా ఆపరేషన్(వేసక్టమీ) చేయించుకుంటే మగవారి శక్తి తగ్గిపోతుందని రంజనీ వంటి ఎంతో మంది ఈ దేశంలో నమ్ముతుంటారు. వారి శారీరక సామర్థ్యంతో పాటు లైంగిక సామర్థ్యం కూడా తగ్గుతుందని భావిస్తారు.

'వేసక్టమీ చేయించుకుంటే మగవాళ్ల లైంగిక కోరికలు, సామర్థ్యం తగ్గుతుందనేది అపోహ మాత్రమే. దీనివల్లే పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకునేందుకు మగవారు ముందుకు రావడం లేదు. ఫలితంగా ఆ భారం ఆడవారి మీద పడుతోంది.' అని ఫెడరేషన్ ఆఫ్ ఆబ్‌స్టెట్రిక్ అండ్ గైనకలాజికల్ సొసైటీస్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ డాక్టర్ ఎస్.శాంతా కుమారి అన్నారు.

'భారత్‌లో కుటుంబ నియంత్రణ అవగాహన కోసం చేపట్టే కార్యక్రమాలన్నీ ఆడవారి మీదనే ఎక్కువ ఫోకస్ పెడతాయి. ప్రభుత్వాలైనా స్వచ్ఛంద సంస్థలైనా తీరు ఒక్కటే. కుటుంబ నియంత్రణలో ఆడవాళ్లకే కాదు మగవాళ్లకు కూడా బాధ్యత ఉంటుంది. కానీ వాస్తవంలో జరుగుతుంది మాత్రం వేరు' అని శాంతా కుమారి చెప్పారు.

కండోమ్ వినియోగంపై అవగాహన కల్పిస్తున్న ఆరోగ్య కార్యకర్తలు

ఫొటో సోర్స్, Getty Images

పెరిగిన 'కండోమ్స్'వాడకం

2019-2021 మధ్య నిర్వహించిన అయిదో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం, కుటుంబ నియంత్రణ పద్ధతుల గురించి పెళ్లి అయిన 99శాతం మగవారు, ఆడవారికి అవగాహన ఉంది. 15 నుంచి 49 ఏళ్ల మధ్య వయసున్న వీరికి కండోమ్‌లు, పిల్స్, కాపర్-టి వంటి వాటి గురించి తెలుసు. వాటి వినియోగం 2015-16 నుంచి 2019-2021 మధ్య 47.8శాతం నుంచి 56.5శాతానికి పెరిగింది.

బిడ్డను కనాలా వద్దా అనే విషయంలో మహిళల నిర్ణయాలకు ప్రాధాన్యం లభించడం లేదు.

ఫొటో సోర్స్, ARINDAM DEY

ఫ్యామిలీ ప్లానింగ్ అనేది ఆడవాళ్ల బాధ్యత అంటున్న ఏపీ, తెలంగాణ పురుషులు

దేశంలో కుటుంబ నియంత్రణ పద్ధతుల వినియోగం పెరిగింది కానీ వాటిని ఎక్కువగా వాడుతోంది మాత్రం ఆడవారే. 9.5శాతం మగవారు మాత్రమే కండోమ్స్ వాడుతున్నారు. అంటే ప్రతి పదిమందిలో ఒకరు. కానీ గత అయిదేళ్లలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకునే ఆడవారి సంఖ్య 36శాతం నుంచి 37.9శాతానికి పెరిగింది. కానీ చాలా సులభంగా అయిపోయే వేసక్టమీ ఆపరేషన్ చేయించుకునే మగవారి సంఖ్య మాత్రం 2015 నాటికి నేటికీ 0.3శాతంగానే ఉంది.

తెలంగాణ, ఉత్తర్ ప్రదేశ్, బిహార్ రాష్ట్రాల్లోని 50శాతం మగవారు... 'కుటుంబ నియంత్రణ అనేది ఆడవాళ్ల బాధ్యతే కానీ మగవాళ్లది కాదు.' అని సర్వేలో చెప్పారు. ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, వెస్ట్ బెంగాల్‌లో ప్రతి ముగ్గురి మగవారిలో ఒకరు ఇలాగే భావిస్తున్నారు. కర్నాటకలో అయితే 45శాతం మంది మగవారు కుటుంబ నియంత్రణ తమ పని కాదని చెప్పారు.

వీడియో క్యాప్షన్, పాక్ ఫ్యామిలీ ప్లానింగ్

'కండోమ్ వాడితే లైంగిక సుఖం ఉండదు'

ఈ పరిస్థితి మారాలంటే మగవారి దృక్పథంలో మార్పు రావాలని కుటుంబ నియంత్రణ మీద పరిశోధనలు చేస్తున్న అభినవ్ పాండే అన్నారు.

‘‘2017-19 మధ్య ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో మేం పరిశోధనలు చేపట్టాం. అన్ని రాష్ట్రాల్లోనూ కుటుంబ నియంత్రణకు మగవారు దూరంగా ఉంటున్నారు. వారిలో చాలా భయాలు, అపోహలున్నాయి. వేసక్టమీ చేయించుకుంటే పని చేసే సామర్థ్యం తగ్గుతుందనేది ఒక భయం. సెక్స్ చేసే సామర్థ్యం పోతుందనేది మరొక అపోహ’’ అన్నారు పాండే.

‘‘చాలా మంది కండోమ్స్ వాడటానికి సుముఖంగానే ఉన్నారు. కానీ కండోమ్ వల్ల సెక్స్ అసౌకర్యంగా ఉంటుందని, లైంగిక సుఖం అంతగా ఉండదని వాటిని దూరం పెడుతున్నారు’’ అని అభినవ్ పాండే వివరించారు.

కండోమ్స్

ఫొటో సోర్స్, Getty Images

'కండోమ్ వాడుతున్నా గర్భం'

భారత్‌లోని గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో పేదల ప్రజలకు ప్రభుత్వం ఉచితంగా కండోమ్స్ పంచుతోంది. కుటుంబ నియంత్రణ, అవాంఛిత గర్భాలు, లైంగికంగా సంక్రమించే వ్యాధుల నుంచి రక్షణ కల్పించడం కోసం కండోమ్స్ ఉపయోగపడతాయి.

‘‘కండోమ్స్ వాడుతున్నా ఒక్కోసారి గర్భవతులవుతున్నారు. కండోమ్ క్వాలిటీ సరిగ్గా లేకపోవడం లేదా దాన్ని సరైన రీతిలో వాడకపోవడం ఇందుకు కారణం. ఇక భర్తలు ఒకోసారి ఇంటికి తాగి వస్తారు. అప్పుడు కండోమ్ వాడటానికి వారు ఒప్పుకోరు’’ అని అబార్షన్లపై గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కల్పిస్తున్న ఆకాంక్ష యాదవ్ అన్నారు.

‘‘దేశంలో అబార్షన్ చేయించుకోవడానికి చట్టాలు అనుమతిస్తున్నాయనే విషయం చాలా కొద్ది మంది ఆడవారికి మాత్రమే తెలుసు. అందువల్లే ఎక్కువ మంది పిల్స్ తీసుకోవడమో లేదా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోవడమో చేస్తుంటారు’’ అని ఆకాంక్ష యాదవ్ వివరించారు.

'దీర్ఘకాలిక కుటుంబ నియంత్రణ పద్ధతులే మేలు'

శాశ్వతంగా పిల్లలు పుట్టకుండా ఉండేలా ఆపరేషన్ చేయించుకోవడం కంటే దీర్ఘ కాలం పాటు గర్భం దాల్చకుండా ఉండే కాపర్-టి వంటి పద్ధతులను పాటించాలని డాక్టర్ శాంతా కుమారి సూచిస్తున్నారు.

‘‘ఇద్దరు పిల్లలు పుట్టిన లాంగ్ టర్మ్ స్టెరిలైజేషన్ పద్ధతులను దంపతులు ఎంచుకోవడం మంచిది. శాశ్వతంగా గర్భం దాల్చకుండా ఆపరేషన్ చేయించుకోవాలా లేదా అనే విషయాన్ని కొద్ది సంవత్సరాల తరువాత నిర్ణయించుకోవచ్చు’’ అని శాంతా కుమారి వివరించారు.

ఆడవారికి దీర్ఘ కాలం పాటు వాడే గర్భ నిరోధక పద్ధతులు అందుబాటులో ఉన్నాయని, కాని మగవారికి అలాంటివి లేవని శాంతా కుమారి చెబుతున్నారు.

‘‘యోనిలో ఉంచే డివైస్‌లు, పిల్స్ వంటివి ఆడవారికి అందుబాటులో ఉన్నాయి. కానీ లాంగ్ టర్మ్ స్టెరిలైజేషన్ కోసం మగవారికి ఎటువంటి సాధనాలు అందుబాటులో లేవు. దీని మీద ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి’’ అని ఆమె అన్నారు.

కండోమ్స్, ప్రకటనలు, నిరోధ్

ఫొటో సోర్స్, Getty Images

'మగవాళ్లు సెక్స్ గురించి ఓపెన్‌గా మాట్లాడరు'

గ్రామీణ ప్రాంతాల్లో మగవాళ్లు సెక్స్ గురించి ఓపెన్‌గా మాట్లాడటానికి ఇష్టపడకపోవడం కూడా కుటుంబ నియంత్రణకు అవరోధంగా ఉందని అభివన్ పాండే అంటున్నారు.

‘‘గ్రామాల్లో సెక్స్ గురించి ఓపెన్‌గా మాట్లాడటానికి మగవారు ఇబ్బంది పడుతున్నారు. ఆరోగ్య కార్యకర్తలందరూ మహిళలే. ఆడవారికి మాత్రమే వారు కుటుంబ నియంత్రణ మీద అవగాహన కల్పిస్తున్నారు. కానీ మగవారికి ఆ అవగాహన ఉండటం లేదు. అందుకే మగారిని కూడా ఆరోగ్యకార్యకర్తలుగా నియమించాలని మేం కోరుతున్నాం. తద్వారా కుటుంబ నియంత్రణ గురించి మగవారికి అవగాహన కల్పించొచ్చు’’ అని పాండే అభిప్రాయపడ్డారు.

దేశవ్యాప్తంగా 148 జిల్లాల్లో 2016లో ఒక పైలట్ ప్రాజెక్ట్‌ను చేపట్టారు. ఇందులో భాగంగా కుటుంబ నియంత్రణ మీద ఏర్పాటు చేసే అవగాహన సమావేశాలకు అత్తలు, కోడళ్లు కలిసి రావాల్సి ఉంటుంది. 2019 నుంచి ఈ సమావేశాలకు భర్తలను కూడా పిలవడం ప్రారంభించింది రాజస్థాన్. 2020లో ఉత్తర్‌ప్రదేశ్ కూడా ఇదే నిర్ణయం తీసుకుంది.

వేసక్టమీ మీద ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని డాక్టర్ శాంతా కుమారి అన్నారు. మగవాళ్లకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయడం చాలా సులభమని, అది సురక్షితమని అర్థమయ్యేలా ప్రభుత్వం, మీడియా, వైద్యులు కలిసి అవగాహన కల్పించాలని ఆమె సూచించారు. అప్పుడే ఆడవారి మీద ఉండే కుటుంబ నియంత్రణ భారం తగ్గుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

వీడియో క్యాప్షన్, ద్రౌపది ముర్ము: రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము.. బీజేపీ వ్యూహమేమిటి

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)