డెన్మార్క్‌లో ఐవీఎఫ్‌కు ఎందుకంత ఆదరణ?

క్రిస్టెన్‌సెన్ కూతురు సారా ఐవీఎఫ్ ద్వారా జన్మించింది
ఫొటో క్యాప్షన్, క్రిస్టెన్‌సెన్ కూతురు సారా ఐవీఎఫ్ ద్వారా జన్మించింది
    • రచయిత, లూసీ ప్రాక్టర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

డెన్మార్క్‌లోని ఏ పార్కుకు వెళ్లినా అక్కడ ఐవీఎఫ్ లేదా దాతల వీర్యం ద్వారా జన్మించిన పిల్లలు అనేక మంది కనిపిస్తారు. ప్రపంచంలోనే సాధారణంగా జన్మించిన పిల్లలతో పోలిస్తే 'అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ'(ఏఆర్‌టీ) ద్వారా జన్మించిన పిల్లల సంఖ్య డెన్మార్క్‌లోనే ఎక్కువ. ఇక్కడ సుమారు 10 శాతం మంది పిల్లలు అలాంటి సాంకేతిక పరిజ్ఞానం ద్వారానే పుడుతున్నారు.

పియా క్రోన్ క్రిస్టెన్సెన్ రెండేళ్ల కూతురు సారా కూడా ఐవీఎఫ్, దాతల వీర్యం సహాయంతో జన్మించింది. డెన్మార్క్ ప్రభుత్వ ఉదారమైన ఐవీఎఫ్ నిబంధనలను ఉపయోగించుకున్న అనేకమంది ఒంటరి తల్లుల్లో క్రిస్టెన్సన్ ఒకరు. తనకు తగిన భాగస్వామి దొరక్కపోవడంతో ఆమె 39 ఏళ్ల వయసులో ఈ నిర్ణయం తీసుకున్నారు.

''ఈ విషయంలో మేం స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోగలిగే అవకాశం ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. సమస్య మేం పురుషులను వద్దనుకోవడం కాదు. చాలా మంది పురుషులు పిల్లలు కావాలనుకోవడం లేదు. అందువల్ల మేం ఒంటరిగానే పిల్లలను కనాలి. లేదా పిల్లలు లేకుండా గడపాలి'' అని క్రిస్టెన్సన్ తెలిపారు.

''నాకు మొదటిసారే ఐవీఎఫ్ ద్వారా పాప పుట్టడం చాలా అదృష్టం. నేటి డెన్మార్క్ సమాజం కూడా దీనిని అంగీకరిస్తోంది. అందరూ దీని గురించి చాలా మామూలుగా మాట్లాడుకుంటున్నారు'' అని ఆమె అన్నారు.

ఆ దేశంలో ఇప్పుడు చర్చిలలో కూడా ఐవీఎఫ్ గురించి మాట్లాడడం సర్వసాధారణంగా మారింది.

ప్రొఫెసర్ క్లాస్ యిడింగ్ ఆండర్సన్ అంటారు
ఫొటో క్యాప్షన్, ప్రభుత్వ ఉదారత వల్లే డెన్మార్క్‌లో ఐవీఎఫ్ ఎక్కువ అని ప్రొఫెసర్ క్లాస్ యిడింగ్ ఆండర్సన్ అంటారు

ఎన్ని పన్నులు చెల్లించడానికైనా సిద్ధమే

1983 నుంచి డెన్మార్క్‌లో ఐవీఎఫ్ ద్వారా గర్భధారణ ప్రారంభమైంది.

డెన్మార్క్‌కు ఐవీఎఫ్ సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకువచ్చిన టీమ్‌లో కోపెన్‌హేగెనన్‌లోని యూనివర్సిటీ హాస్పిటల్‌కు చెందిన ప్రొఫెసర్ క్లాస్ యిడింగ్ ఆండర్సన్ ఒకరు. ప్రభుత్వ ఉదారంగా ఇస్తున్న నిధులే ఆ దేశంలో ఐవీఎఫ్‌కు ఆదరణ పెరగడానికి కారణమని ఆయన అభిప్రాయపడారు.

డెన్మార్‌లో జరిగే అన్ని చికిత్సలూ ఉచితమే. అందుకే ప్రజలు కూడా ఎన్ని పన్నులైనా చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వ సహాయమే కాకుండా ఐవీఎఫ్ ప్రభుత్వ నియంత్రణలో ఉండడం కూడా ఇలాంటి జననాలు ఎక్కువ కావడానికి కారణం.

ఐవీఎఫ్

ఫొటో సోర్స్, Science Photo Library

1980, 90లలో డెన్మార్క్‌లో ఐవీఎఫ్, ఇతర పునరుత్పాదక సాంకేతిక పరిజ్ఞానంపై ప్రభుత్వ నియంత్రణ ఉండేది కాదు. ప్రైవేట్ ఆసుపత్రులు ఎవరికైనా ఐవీఎఫ్ చేసే అవకాశం ఉండేది. అదే సమయంలో సరోగసీకి కూడా అనుమతిచ్చారు. లెస్బియన్ మహిళలు కూడా ఐవీఎఫ్ పొందే అవకాశం కల్పించారు.

దీంతో ఐవీఎఫ్ వివాదాస్పదంగా మారింది. రాడికల్ ఫెమినిస్టులు మహిళల శరీరాలను ముడిసరుకులుగా మారుస్తున్నారని ఆరోపించారు.

దీంతో 1997లో ప్రభుత్వ కృత్రిమ గర్భధారణపై చట్టం తీసుకువచ్చింది. దీని కింద ఒంటరి మహిళలు, లెస్బియన్లకు ఐవీఎఫ్‌ను నిషేధించారు. ఈ కొత్త చట్టంతో మహిళలందరి విషయంలో ఒకేలా వ్యవహరించాలన్న వాదన ముందుకు వచ్చింది.

2007లో ప్రస్తుత ఏఆర్‌టీ చట్టం అమలులోకి వచ్చింది. దానిలో మహిళలకు వివాహం అయినా, కాకున్నా ఐవీఎఫ్ సదుపాయం కల్పించారు.

ప్రస్తుతం డెన్మార్క్‌లో ప్రపంచంలోనే అతి పెద్ద వీర్యకణ నిధి ఉంది
ఫొటో క్యాప్షన్, ప్రస్తుతం డెన్మార్క్‌లో ప్రపంచంలోనే అతి పెద్ద వీర్యకణ నిధి ఉంది

పరిశ్రమగా ఫెర్టిలిటీ

ప్రస్తుతం ప్రపంచంలోనే అతి పెద్ద వీర్య కణ బ్యాంక్ 'సైరోస్ ఇంటర్నేషనల్' డెన్మార్క్‌లో ఉంది. అక్కడ ఫెర్టిలిటీ ఒక పరిశ్రమగా కూడా మారి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కస్టమర్లతో డీల్ చేస్తున్నారు.

ప్రస్తుతం డెన్మార్‌లో దాతల వీర్యం సాయంతో పిల్లలను కంటున్న ఒంటరి మహిళల సంఖ్య పెరుగుతోంది. డెన్మార్క్‌లోని మొత్తం జననాల సంఖ్యలో కృత్రిమ గర్భధారణ ద్వారా పుడుతున్న పిల్లల సంఖ్యే ఎక్కువగా ఉంది.

దేశంలో గర్భధారణ రేటు తక్కువగా ఉన్న నేపథ్యంలో, జనాభా పెరుగుదల కోసం ఐవీఎఫ్‌కు ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయం ఇప్పట్లో ఆగే అవకాశం లేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)