అభిలాష్ టోమీ సురక్షితం: హిందూ మహాసముద్రంలో చిక్కుకుపోయిన భారత నౌకాదళ కమాండర్‌ను కాపాడిన రెస్క్యూ టీం

తీవ్రంగా గాయపడ్డ భారత నౌకాదళ కమాండర్ అభిలాష్ టోమీ కదల్లేని స్థితిలో ఉన్నారు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, తీవ్రంగా గాయపడ్డ భారత నౌకాదళ కమాండర్ అభిలాష్ టోమీ కదల్లేని స్థితిలో ఉన్నారు

సముద్రమార్గంలో ప్రపంచాన్ని చుట్టివచ్చే ప్రయత్నంలో తీవ్రంగా గాయపడి ఆస్ట్రేలియా పశ్చిమ తీరానికి 3,200 కిలోమీటర్ల దూరంలో హిందూ మహాసముద్రంలో చిక్కుకుపోయిన భారత నౌకాదళ కమాండర్ అభిలాష్ టోమీని సురక్షితంగా కాపాడగలిగారు. ఈ మేరకు భారత నౌకాదళ అధికార ప్రతినిధి ట్విటర్ ఖాతా వెల్లడించింది.

'గోల్డెన్ గ్లోబ్ రేస్‌(జీజీఆర్)'లో పాల్గొంటూ తీవ్రంగా గాయపడ్డ ఆయన్ను కాపాడేందుకు అంతర్జాతీయ సహాయ బృందాలు రెండు రోజులుగా చేస్తున్న ప్రయత్నాలు ఫలించాయి.

పశ్చిమ ఆస్ట్రేలియా తీరానికి 3,200 కిలోమీటర్ల దూరంలో ఆయన చిక్కుకుపోయారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

ముప్ఫయి తొమ్మిదేళ్ల అభిలాష్‌.. జలమార్గంలో ప్రపంచాన్ని చుట్టి వచ్చిన తొలి భారతీయుడిగా 2013లో రికార్డు నెలకొల్పారు.

గోల్డెన్ గ్లోబ్ రేస్‌లో శాటిలైట్ కమ్యూనికేషన్లు మినహా ఎలాంటి ఆధునిక టెక్నాలజీనీ ఉపయోగించకుండా పోటీదారు 48,280 కిలోమీటర్ల దూరం యాట్‌లో ప్రయాణించి ప్రపంచాన్ని చుట్టేయాల్సి ఉంటుంది.

రేస్ జులై 1న ఫ్రాన్స్‌ నుంచి ప్రారంభమైంది. ఇప్పటివరకు ఏడుగురు పోటీదారులు రేస్ నుంచి విరమించుకున్నారు.

1968 గోల్డెన్ గ్లోబ్ రేస్‌ విజేత రాబిన్ నాక్స్-జాన్‌స్టన్‌కు చెందిన సుహైలీని నమూనాగా తీసుకొని అభిలాష్ యాట్ తూరియాను తయారు చేశారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 1968 గోల్డెన్ గ్లోబ్ రేస్‌ విజేత రాబిన్ నాక్స్-జాన్‌స్టన్‌కు చెందిన సుహైలీని నమూనాగా తీసుకొని అభిలాష్ యాట్ తూరియాను తయారు చేశారు

కదల్లేని స్థితిలో అభిలాష్

శుక్రవారం హిందూ మహాసముద్రంలో వచ్చిన తీవ్రమైన తుపాను కారణంగా అభిలాష్ యాట్(yacht) 'తూరియా'లో తెరచాపకు ఆధారంగా నిలిచే మాస్ట్ దెబ్బతింది.

అభిలాష్ వెన్నుకు తీవ్రమైన గాయం కావడంతో కదల్లేకపోతున్నారు. ఆహారం, నీరు కూడా తీసుకోలేకపోతున్నారు.

ఆయన చిక్కుకుపోయిన ప్రదేశం వద్దకు ఫ్రాన్స్‌ గస్తీ నౌక ఒకటి వెళ్తోంది. ఇది సోమవారంలోగా అక్కడికి చేరుకోవచ్చు.

అభిలాష్ స్థితిని తెలుసుకొనేందుకు ఆదివారం ఒక భారత సైనిక విమానం, ఒక ఆస్ట్రేలియా సైనిక విమానం ఆయన యాట్(పడవ) మీదుగా వెళ్లాయి. అయితే ఆయనతో మాట్లాడటం సాధ్యం కాలేదు.

యాట్‌లో అభిలాష్ గాయంతో పడి ఉన్నారని, బయటి ప్రపంచంతో సమాచారాన్ని పంచుకోలేని స్థితిలో ఉన్నారని ఆస్ట్రేలియా సముద్ర భద్రత ప్రాధికార సంస్థ అధికార ప్రతినిధిని ఉటంకిస్తూ ఏఎఫ్‌పీ వార్తాసంస్థ తెలిపింది.

యాట్‌లో అభిలాష్

ఫొటో సోర్స్, Twitter

45 అడుగుల ఎత్తుకు ఎగసిన అలలు

శుక్రవారం వచ్చిన భారీ తుపానుతో గంటకు దాదాపు 130 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. 45 అడుగుల ఎత్తున అలలు ఎగసిపడ్డాయి.

అభిలాష్ ఒక టెక్స్టింగ్ యూనిట్ సాయంతో సమాచారాన్ని పంపించగలిగారు. ఆయన శాటిలైట్ ఫోన్ పగిలిపోయింది.

''బోటులో సురక్షితంగానే ఉన్నాను. నడవడం చాలా కష్టంగా ఉంది. స్ట్రెచర్ అవసరం కావొచ్చు'' అని శనివారం పంపిన సందేశంలో ఆయన చెప్పారు.

అత్యవసర పరిస్థితుల్లో అక్కరకొచ్చే వస్తువులున్న ఒక బ్యాగు అభిలాష్ యాట్‌లో ఉంది. అందులో ఇంకో శాటిలైట్ ఫోన్ ఉంది. కానీ ఆ బ్యాగు వద్దకు ఆయన చేరుకోలేకపోతున్నారు.

1968 గోల్డెన్ గ్లోబ్ రేస్‌ విజేత రాబిన్ నాక్స్-జాన్‌స్టన్‌కు చెందిన సుహైలీని నమూనాగా తీసుకొని అభిలాష్ యాట్ తూరియాను తయారు చేశారు.

ఈ రేసులో పోటీపడుతున్న ఐర్లాండ్ నావికుడు గ్రెగర్ మెక్‌గకిన్, అభిలాష్‌కు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. అభిలాష్ యాట్ దెబ్బతినడానికి కారణమైన తుపానులో గ్రెగర్ యాట్ కూడా దెబ్బతింది. ఆయన దానికి మరమ్మతులు చేసుకున్నారు. అభిలాష్‌ను చేరుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు.

పశ్చిమ ఆస్ట్రేలియా తీరానికి 3,200 కిలోమీటర్ల దూరంలో అభిలాష్ చిక్కుకుపోయి ఉన్నారు.
ఫొటో క్యాప్షన్, పశ్చిమ ఆస్ట్రేలియా తీరానికి 3,200 కిలోమీటర్ల దూరంలో అభిలాష్ చిక్కుకుపోయి ఉన్నారు

ఆ ప్రదేశానికి వెళ్లిన ఆస్ట్రేలియా యుద్ధనౌక

అభిలాష్‌ను కాపాడే ప్రయత్నాలను ముమ్మరం చేసేందుకు హిందూ మహాసముద్రంలోని రీయూనియన్ ఐలాండ్‌కు ఒక విమానాన్ని పంపిస్తున్నట్లు జీజీఆర్ నిర్వాహకులు తెలిపారు.

ఆస్ట్రేలియాకు చెందిన ఒక యుద్ధనౌక కూడా అభిలాష్ చిక్కుకుపోయిన ప్రదేశానికి వెళ్తోంది. ఇందులో ఒక హెలికాప్టర్ ఉంది. ఈ నౌక అభిలాష్‌ను చేరుకోవడానికి కనీసం నాలుగు రోజులు పడుతుందని రేస్ నిర్వాహకులు చెప్పారు.

డచ్ దేశస్థుడైన మార్క్ స్లాట్స్‌ యాట్ కూడా ఈ తుపానుతో రెండుసార్లు దెబ్బతింది.

రేసులో ప్రస్తుతం 11 మంది పోటీదారులు ఉన్నారు. వీరిలో చాలా మంది శుక్రవారం నాటి తుపాను తీవ్ర ప్రభావం నుంచి తప్పించుకోగలిగారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)