రఫేల్ డీల్: అంబానీ సంస్థను.. ‘భారత ప్రభుత్వమే ప్రతిపాదించింది. మాకు ఇచ్చిన వారిని తీసుకున్నాం’.. మీడియాపార్ట్ పత్రికతో ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఇంకా ఏం చెప్పారంటే..

ఫొటో సోర్స్, Getty Images
భారత్ - ఫ్రాన్స్ మధ్య జరిగిన రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందంపై మీడియాపార్ట్ ప్రచురించిన కథనం భారత రాజకీయాల్లో కలకలం సృష్టిస్తోంది. భారత ప్రభుత్వం సూచనతో వేరే దారి లేక రిలయన్స్‌ను భాగస్వామిగా ఎంచుకున్నామని ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాన్స్‌వో హోలన్ చెప్పినట్టు ఈ పత్రిక తెలిపింది.
మీడియాపార్ట్ జర్నలిస్ట్ పాల్ జెస్నియెర్ తన కథనంలో ఏం చెప్పారు?
రఫేల్ విమానాల ఒప్పందంలో భారీ కుంభకోణం జరిగిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఫ్రాన్స్‌వో హోలన్ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు ఫ్రాన్స్ నుంచి 36 రఫేల్ ఫైటర్ జెట్ విమానాలు కొనుగోలు ఒప్పందంలో, హోలన్ భాగస్వామి అయిన జూలీ గయెట్ సహ నిర్మాతగా ఉన్న ఒక చిత్రానికి రహస్యంగా నిధులు అందడంలో రిలయెన్స్ పాత్రపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
2016లో జూలీ గయెట్ సహ నిర్మాతగా మార్కో సిఫ్రెడీ అనే ఒక యువ పర్వతారోహకుడి కథతో 'రైట్ ఆన్ ది టాప్' అనే సినిమా తీయాలనుకున్నారు. 2002లో ఎవరెస్టుపై స్నోబోర్డ్ రన్ చేస్తూ చనిపోయిన అతడి పాత్రను నటుడు కెవ్ ఆడమ్స్ చేయాలి. దీనికి 10 మిలియన్ యూరోల బడ్జెట్ అనుకున్నారు. దీనిలో భారతీయుల పెట్టుబడి 3 మిలియన్ యూరోలు. (తర్వాత దానిని 1.6 మిలియన్‌కు తగ్గించారు.)
డీల్‌పై విపక్షాల అనుమానాలు
రఫేల్ కొనుగోళ్ల అంశం ఇప్పుడు దిల్లీలో రాజకీయ అంశంగా మారిపోయింది. విమానాల ధరతోపాటు, రిలయన్స్ గ్రూప్ పాత్రతో ఇందులో భారీ కుంభకోణం ఉందని ప్రతిపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ప్రజాధన దుర్వినియోగం, దేశభద్రతను ప్రమాదంలో పడేయడం, పక్షపాతం, నిబంధనలను ఉల్లంఘించిన అంశాలపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
అనిల్ అంబానీతో ఒప్పందాలు చేసుకోవడంపై ఫ్రాన్స్ సంస్థను విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఇందులో అమ్మకాల మొత్తంలో 50 శాతాన్ని డసాల్ట్ తిరిగి స్థానికంగా పెట్టుబడి పెట్టడానికి ఇస్తుంది. ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నందుకే అంబానీ సంస్థలో ఆ పెట్టుబడులు పెట్టేలా ప్రధాన నరేంద్ర మోదీ వ్యవహరించారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఫైటర్ విమానాల తయారీలో ఏమాత్రం అనుభవం లేని ఒక ప్రైవేటు సంస్థకు, 36 రఫేల్ విమానాల కొనుగోలు ప్రకటనకు 12 రోజుల ముందు ఏర్పడిన రిలయన్స్ డిఫెన్స్ లిమిటెడ్‌కు ప్రధాని డీల్ ఎలా అప్పగిస్తారంటూ ప్రశ్నిస్తున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
వారు చెప్పారు, మేం చేశాం: హోలన్
ఆగస్టు 31న ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వార్తా పత్రిక జూలీ గయెట్ సహ నిర్మాతగా ఉన్న సినిమాకు డసాల్ట్ భాగస్వామిగా ఉందని కథనం ప్రచురించింది. 'రైట్ ఆన్ ది టాప్' టీమ్ దీనిని ఖండించింది. ఇతరులకు రఫేల్ అమ్మకాల వల్ల తమకు నిధులు రావడం అనేది చాలా ఫన్నీగా ఉంటుందని ఈ సినిమా డైరెక్టర్ తెలిపారు.
2016, జనవరి 24న రిలయన్స్ సీఈఓ అనిల్ అంబానీ పత్రికా ప్రకటన విడుదల చేసేవరకూ అంతా సాధారణంగానే ఉంది. జూలీ గయెట్ భాగస్వామ్యంతో కెవ్ ఆడమ్స్ హీరోగా సినిమా తీస్తున్నట్టు ఆయన ప్రకటించారు. అదే రోజు హోలన్ మూడు రోజుల పర్యటన కోసం భారత్ వచ్చారు.
అయితే అంబానీతో జరిగిన ఆ డీల్ గురించి తనకు తెలీదని హోలన్ అన్నారు. అప్పట్లో ఆయన ఒప్పందం పూర్తి చేసుకునే విషయంపై భారత్ వచ్చారు.
"మొదట ఇద్దరు మంత్రుల తర్వాత నేను ఇందులో జోక్యం చేసుకున్నా. చెప్పాలంటే నాకు ఈ చర్చల గురించి తక్కువ తెలుసు’’ అని హోలన్ మీడియాపార్ట్‌కు చెప్పారు.
మొదట 126 విమానాల కొనాలనుకున్నారు. అయితే ప్రభుత్వం మారడంతో భారత్ తమ ప్రతిపాదనను మార్చింది. 36 విమానాలు మాత్రమే చాలంది. కానీ తయారీ ఫ్రాన్సులోనే జరగాలంది.
అంతకు ముందు ప్రతిపాదనతో పోలిస్తే, ఒక రకంగా తాము నష్టపోయినా, మరో విధంగా లాభం పొందాం అని హోలన్ అన్నారు.
కానీ కొత్త ఒప్పందంలో డసో ఏవియేషన్, దాని భాగస్వామి రిలయన్స్ మధ్య 'పరిహారం' అంశం కూడా ఉంది. దీనిపైనే ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి.
"వారిని ఎవరు, ఎలా ఎంపిక చేశారు? దానిపై మా దగ్గర మాట్లాడ్డానికేమీ లేదు. ఈ సంస్థను భారత ప్రభుత్వమే ప్రతిపాదించింది. డసో సంస్థ, అంబానీతో చర్చలు జరిపింది. మాకు అక్కడ వేరే అవకాశం లేదు. మాకు ఇచ్చిన వారిని తీసుకున్నాం. దానికి బదులుగా ఆ గ్రూప్ మాకు ఏదీ ఇవ్వలేదు. జూలీ గయెట్ సినిమాకు ఆ డీల్‌తో సంబంధం ఉంటుందనే విషయం అసలు నా ఊహకే అందడంలేదు" అని ఫ్రాన్స్‌వో హోలన్ మీడియాపార్ట్ పత్రికకు చెప్పారు. ఇది భారత అధికారులు చెబుతున్న వాదనలకు విరుద్ధంగా ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
ఫ్రెంచ్ సినిమాకు రిలయన్స్ ఫైనాన్స్
జూలీ గయట్ సినిమాకు అంబానీ సంస్థ నుంచి ఆర్థిక సహకారం అందించే చర్చలు కెవ్ ఆడమ్స్‌తోనే జరిగాయని హోలన్ చెప్పారు. ఇటు మీడియాపార్ట్‌కు ఒక ఈమెయిల్ పంపిన జూలీ గయట్ "రిలయన్స్ భాగస్వామి ద్వారా నా సినిమాకు ఫైనాన్స్‌కు సహకరించమని కోరాం. అనిల్ అంబానీ విషయానికి వస్తే ఆయన మా సినిమాకు నిర్మాత. ఫ్రాన్స్‌లో షూట్ చేస్తున్న సమయంలో ఆయన మాకు సహకారం అందించారు" అని చెప్పారు.
ఇటు నిర్మాత ఎలిసా సుసాన్ మీడియాపార్ట్ అభ్యర్థనకు స్పందించలేదు. కానీ మై ఫామిలీ విడుదల చేసిన ఒక ప్రకటనలో జూలీ గయట్ సినిమాలో పెట్టుబడులు పెట్టాలని రిలయన్స్‌ను ఒప్పించడానికి తనంతట తాను చొరవ తీసుకున్నారని తెలిపింది. సినిమా పోస్టరుపై రిలయన్స్ ఉన్నంత మాత్రాన, దాని ఫైనాన్సింగ్ ప్లాన్ అంతా సీఎన్‌సీ టేబుల్ పై జరగలేదు అని చెప్పింది. నిజానికి, ఆ నిధులను పారిస్‌లోని రిలయన్స్ మధ్యవర్తి సంస్థ విజ్ వైర్స్ కాపిటల్ నేరుగా చెల్లించింది. ఈ విషయాన్ని ఆ సంస్థ స్థాపకుడు రవి విశ్వనాథన్ ధ్రువీకరించారు. ఈ సంస్థ ఫ్రెంచ్ సినిమాలో ఏడాదికి 12 సినిమాలకు పెట్టుబడులు పెడుతుంటుంది.
2016 నవంబరులో విశ్వనాథన్, అంబానీ అధికారులు విడుదల కాబోతున్న జూలీ గయట్ సినిమా 'రైట్ ఆన్ ది టాప్' సినిమాకు నిధులు అందిస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ ఇంటెలిజెన్స్ ఆన్‌లైన్ లెటర్ తెలిపింది.

ఫొటో సోర్స్, AFP
12 రోజుల ముందు సంస్థ రిజిస్ట్రేషన్
ఇక రఫేల్ డీల్ విషయానికి వస్తే, ప్రధాని మోదీ ప్రకటనకు 12 రోజుల ముందు రిలయన్స్ డిఫెన్స్ బ్రాంచ్ రిజిస్టర్ అయ్యింది, రిలయన్స్ ఏరో స్ట్రక్చర్ లిమిటెడ్ అనే మరో కంపెనీని 14 రోజుల తర్వాత రిజిస్టర్ చేశారు. 2016 సెప్టెంబర్‌లో ఫ్రాన్స్ రక్షణ మంత్రి జా-యీజ్ లి డ్రయన్, భారత రక్షణ మంత్రి మనోహర్ పారికర్‌తో జరిగిన ఒప్పందం గురించి వివరించారు.
2017 ఫిబ్రవరిలో అనిల్ అంబానీ ప్యారిస్ వచ్చినపుడు కూడా అధ్యక్షుడు ఫ్రాన్స్‌వో హోలన్ ఆయన్ను కలిశారు. ఫ్రాన్స్ అధ్యక్షుడుగా ఎమ్మాన్యుయెల్ మాక్రోన్ ఎన్నికయ్యాక.. రక్షణ మంత్రి ఫ్లోరెన్స్ పార్లీ 2017 అక్టోబరులో భారత్ వచ్చారు. డసో-రియలన్స్ ఏరోస్పేస్ లిమిటెడ్ (డీఆర్ఏఎల్) జాయింట్ వెంచర్ పరిశ్రమను ప్రారంభించారు. ఆ సమయంలో రెండు సంస్థలు రఫేల్ విడిభాగాల తయారీకి 100 మిలియన్ యూరోలు పెట్టుబడి పెడుతున్నట్టు ప్రకటించాయి.
మరోవైపు, డసో సంస్థ అసలు యుద్ధ విమానాలేవీ తయారు చేయని సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవడంపై ఫ్రెంచ్ రక్షణ నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. భారత్‌కు అందే రఫేల్ విమానాలు అణు కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంటుంది. స్కాల్ప్ మిసైళ్లను తీసుకెళ్లాల్సి ఉంటుంది. శత్రు స్థావరాలపై అత్యంత వేగంగా దాడులు చేయాల్సి ఉంటుంది. అలాంటప్పుడు టెక్నాలజీని బదిలీ చేయాలంటే స్థానిక పరిశ్రమ సామర్థ్యం గురించి తప్పకుండా తెలుసుకోవాల్సి ఉంటుందని వారు తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
హోలన్ ఆరోపణలపై ఫ్రాన్స్ ఏం చెప్పింది?
రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందంపై ఫ్రాన్స్ విదేశాంగ శాఖ ఒక ప్రకటన జారీ చేసింది.
భారతీయ భాగస్వాముల ఎంపికలో ఫ్రాన్స్ ప్రభుత్వానికి ఎలాంటి ప్రమేయం లేదని తమ ఈ ప్రకటనలో తెలిపింది.
భారతీయ పారిశ్రామిక భాగస్వాముల ఎంపిక ఒప్పందాల్లో ఫ్రాన్స్ ఎలాంటి జోక్యం చేసుకోదని, వారిని ఫ్రాన్స్ కంపెనీలే ఎంపిక చేసుకోవాలని వివరించింది. భారత కొనుగోళ్ల ప్రక్రియ ప్రకారం తమకు తగిన సంస్థలను ఎంచుకోడానికి ఫ్రాన్స్ కంపెనీలకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. తర్వాత వారు తాము భారత భాగస్వాముల ద్వారా పూర్తి చేసిన విదేశీ ప్రాజెక్టులను భారత ప్రభుత్వం ఆమోదం కోసం సమర్పించాల్సి ఉంటుందని వివరించింది.
హోలన్ ఆరోపణలపై భారత్ ఏం చెప్పింది?
హోలన్ ఆరోపణలపై భారత రక్షణ శాఖ "భారత ప్రభుత్వం ఒక ప్రత్యేక కంపెనీతో రఫేల్ ఒప్పందం చేసుకోవాలని ఒత్తిడి తెచ్చినట్లు ఫ్రాన్స్‌వో హొలాన్ చెప్పడంపై దర్యాప్తు జరుగుతోంది. ఈ వాణిజ్య ఒప్పందంలో భారత ప్రభుత్వానికి కానీ, ఫ్రాన్స్ ప్రభుత్వానికి గానీ ఎలాంటి ప్రమేయం లేదని మేం మరోసారి స్పష్టం చేస్తున్నాం" అని తెలిపింది.
ఇవి కూడా చూడండి:
- రఫేల్ విమానాల విషయంలో ఎవరి మాటల్లో నిజముంది?
- రఫేల్ యుద్ధ విమానాల వివాదం: అసలు ఒప్పందం ఏంటి? వివాదం ఎక్కడ? తప్పక తెలుసుకోవాల్సిన 7 విషయాలు
- భారత వాయుసేన వార్ గేమ్: ఏమిటీ ’గగన్‌శక్తి 2018‘?
- ‘తిలక్ ఇంకొన్నాళ్లు బతికుంటే భారత్-పాకిస్తాన్‌లు విడిపోయేవి కాదు’
- ఇద్దరమ్మాయిలు.. ఒక చిన్న విమానం.. లక్ష్యం 23దేశాలు.. గడువు 100 రోజులు
- పాకిస్తాన్‌లోని అత్యంత కట్టుదిట్టమైన జైలు నుంచి భారత పైలట్లు ఎలా తప్పించుకున్నారు?
- కొత్త రాజధానిలో జనాలు కరవు
- బొమ్మ కాదు బాంబు: పిల్లలను చంపేస్తున్న క్లస్టర్ బాంబులు
- పాకిస్తాన్ అణుకేంద్రం గుట్టు ‘రా’ ఎలా కనిపెట్టింది?
- దక్షిణ కొరియా జేమ్స్ బాండ్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








