ఒంటిపైనే బొమ్మలు.. అసాధారణ చిత్రకళతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్న యువతి

డైన్ యూన్

దక్షిణ కొరియా యువతి ఒకరు తన శరీరాన్నే కాన్వాస్‌గా మార్చి కళకు జీవం పోస్తున్నారు. తన అసాధారణ చిత్రకళతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.

''నన్ను చూడగానే కొంత మంది దూరం జరుగుతారు. మరి కొందరు 'నిన్ను మేం ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతున్నాం' అని చెబుతుంటారు. ఏదేమైనా జనం నన్ను గుర్తుపట్టడం ప్రారంభించారు'' అని దేశ రాజధాని సోల్‌కు చెందిన డైన్ యూన్ బీబీసీతో చెప్పారు.

ఇదివరకు తాను డ్రామాల్లో, సినిమాల్లో పనిచేశానని ఆమె తెలిపారు.

వీడియో క్యాప్షన్, వీడియో: ఈమెకు శరీరమే కాన్వాస్

''మొదట నేను ఇతరుల శరీరాలపై బొమ్మలు వేసేదాన్ని. ఆ అనుభవంతో, 'నా ఒంటిపైనే బొమ్మలు వేసుకోగలనా' అని ఆలోచించాను. ఇలాగైతే నన్ను నేను మరింత బాగా వ్యక్తీకరించుకోగలననిపించింది. అప్పట్నుంచి నా శరీరంపైనే బొమ్మలు గీయడం మొదలుపెట్టాను'' అని డైన్ యూన్ వివరించారు.

తన ముఖాన్ని డైరీలో ఒక పేజీలా భావిస్తానని ఆమె చెప్పారు.

డైన్ యూన్
డైన్ యూన్

''నేను కలిసిన వ్యక్తుల పట్ల నాకు కలిగిన భావాలనే నేను నా శరీరంపై చిత్రీకరిస్తాను. నా చిత్రాలు చాలా వరకు నా భావాలను బట్టే ఉంటాయి'' అని ఆమె వివరించారు.

మనిషి ముఖం ఒక్కటే అయినా వ్యక్తిత్వంలో మాత్రం ఎన్నో పార్శ్వాలుంటాయని డైన్ యూన్ అభిప్రాయపడ్డారు. ఎవరైనా తాము తమలా ఉన్నప్పుడే మరింత అందంగా ఉంటారని చెప్పారు.

తన శరీరంపై బొమ్మలు వేయడం ప్రారంభించాక కొన్ని రోజులు ఎలాంటి భావాలనూ పలికించని ముఖాలనే మళ్లీ మళ్లీ గీశానని ఆమె తెలిపారు.

మనుషులను కలిపేది కళ్లేనని డైన్ యూన్ తెలిపారు. తనకు పెయింటింగ్‌లో కళ్లే చాలా ఆసక్తికరమైనవని చెప్పారు.

డైన్ యూన్
యువతి

తన శరీరంపై కొత్త చిత్రాలు వేసుకున్న తర్వాత సరదాగా ఫోటోలు తీసుకుంటానని, అప్పుడు తనకు ఆత్మవిశ్వాసం పెరుగుతుందని తెలిపారు.

తనకు హారర్ సినిమాలంటే ఇష్టమని, వీటినే ఎక్కువగా చూస్తానని డైన్ యూన్ తెలిపారు. పుస్తకాలూ అలాంటివే చదువుతుంటానని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)