స్పేస్‌ఎక్స్: జపాన్ వ్యాపారి యుసాకు మేజావాను చంద్రమండల యాత్రకు పంపిస్తున్న ఎలాన్ మస్క్

జపాన్ కుబేరుడు యుసాకు మేజావా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జపాన్ కుబేరుడు యుసాకు మేజావా

అమెరికా ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్‌కు చెందిన 'స్పేస్‌ఎక్స్' సంస్థ వ్యోమనౌకలో తొలిసారిగా చంద్ర మండల యాత్రకు వెళ్లే పర్యటకుడు ఎవరో వెల్లడైంది. ఆయనో జపాన్ వ్యాపారవేత్త.

''నేను చంద్ర మండల యాత్రకు వెళ్తున్నా'' అని జపాన్ కుబేరుడు, ఆన్‌లైన్ ఫ్యాషన్ వ్యాపార దిగ్గజం యుసాకు మేజావా చెప్పారు.

మంగళవారం అమెరికా కాలిఫోర్నియాలోని హాతోర్న్‌లో ఉన్న స్పేస్‌ఎక్స్ ప్రధాన కార్యాలయంలో ఈ మేరకు ప్రకటన వెలువడింది.

2023లో ఈ యాత్రను చేపట్టేందుకు స్పేస్‌ఎక్స్ సన్నాహాలు చేస్తోంది. 1972 తర్వాత తొలి మానవ సహిత చంద్ర మండల యాత్ర ఇదే.

2023 చంద్ర మండల యాత్రపై ప్రకటనకు ముందు యుసాకు మేజావాను భుజాలపైకి ఎత్తుకున్న ఎలాన్ మస్క్

ఫొటో సోర్స్, twitter/elonmusk

ఫొటో క్యాప్షన్, 2023 చంద్ర మండల యాత్రపై ప్రకటనకు ముందు యుసాకు మేజావాను భుజాలపైకి ఎత్తుకున్న ఎలాన్ మస్క్

బీఎఫ్‌ఆర్‌తో యాత్ర

యాత్ర కోసం 'బిగ్ ఫాల్కన్ రాకెట్(బీఎఫ్‌ఆర్)' పేరుతో స్పేస్‌ఎక్స్ ఒక రాకెట్ తయారు చేస్తోంది.

ఈ రాకెట్‌తో యాత్ర చేయగలమని నూటికి నూరు శాతం కచ్చితంగా చెప్పలేమని ఎలాన్ మస్క్ వ్యాఖ్యానించారు.

బీఎఫ్‌ఆర్‌తో యాత్ర సాధ్యమైతే, అంతరిక్షంలోకి వెళ్లి రావాలనుకొనే ఎంతో మంది కల సాకారం దిశగా పెద్ద ముందడుగు పడినట్లేనని స్పేస్‌ఎక్స్ వ్యాఖ్యానించింది.

బీఎఫ్‌ఆర్ వ్యవస్థను ఎలాన్ మస్క్ 2016లో తెర పైకి తెచ్చారు.

ఊహాచిత్రం

ఫొటో సోర్స్, SPACEX

ఫొటో క్యాప్షన్, ఊహాచిత్రం

కళాకారులను ఆహ్వానిస్తా: యుసాకా మేజావా

యుసాకు మేజావాకు కళాఖండాలను సేకరించే అలవాటు ఉంది. అమెరికా కళాకారుడు జీన్-మైకేల్ బస్‌క్వియాట్ వేసిన ఓ పెయింటింగ్‌ను నిరుడు అమెరికాలోని న్యూయార్క్‌లో జరిగిన ఒక వేలంలో 11.05 కోట్ల డాలర్లు చెల్లించి ఆయన కొన్నారు.

తనతోపాటు చంద్ర మండల యాత్రకు రావాలని ప్రపంచవ్యాప్తంగా ఆరుగురు నుంచి ఎనిమిది మంది కళాకారులను ఆహ్వానిస్తానని యుసాకు మేజావా చెప్పారు.

యాత్ర నుంచి భూమికి తిరిగి వచ్చిన తర్వాత ఏదైనా కళాసృష్టి చేయాలని ఈ కళాకారులను అడుగుతానని ఆయన తెలిపారు. వారు సృష్టించే కళాఖండాలు మనందరిలో దాగివున్న స్వాప్నికులకు ప్రేరణ అందిస్తాయని వ్యాఖ్యానించారు.

ఇప్పటివరకు కేవలం 24 మంది మాత్రమే చంద్ర మండల యాత్ర చేపట్టారు. వీరంతా అమెరికన్లే. వీరిలో 12 మంది చంద్రుడిపై అడుగు పెట్టారు.

మనిషి చంద్రుడిపై అడుగు పెట్టడం లేదా భూ సమీప కక్ష్యను దాటి వెళ్లడం చివరిసారిగా 1972 డిసెంబరులో జరిగింది. అప్పుడు అమెరికా అంతరిక్ష సంస్థ(నాసా) అపోలో 17 వ్యోమనౌకతో చంద్ర మండల యాత్ర చేపట్టింది.

యుసాకు మేజావా చంద్రుడిపై అడుగుపెట్టరు. 'ఫ్రీ రిటర్న్ ట్రాజెక్టరీ'గా పిలిచే ట్రాజెక్టరీపై బీఎఫ్‌ఆర్ వ్యోమనౌకలో చంద్రుడి చుట్టూ తిరుగుతారు. ఈ ట్రాజెక్టరీ చంద్రుడి ఆవలి వైపునకు వెళ్లిన తర్వాత వ్యోమనౌక తిరిగి భూమి మీదకు వస్తుంది.

ఊహాచిత్రం

ఫొటో సోర్స్, twitter/elonmusk

ఇద్దరు పర్యటకులను తమ వ్యోమనౌకతో చంద్ర మండల యాత్రకు పంపిస్తామని ఎలాన్ మస్క్ 2017లో ప్రకటించారు. నాటి ప్రకటన ప్రకారమైతే ఈ యాత్ర ఈ ఏడాదే జరగాల్సి ఉంది.

ఫాల్కన్ హెవీ రాకెట్‌, సిబ్బందితో కూడిన డ్రాగన్ క్యాప్సూల్‌తో ఈ యాత్ర చేపట్టాలని అనుకున్నారు. తర్వాత ఈ విషయంలో మార్పు వచ్చింది.

సిబ్బందితో కూడిన యాత్రలకు బీఎఫ్‌ఆర్ వాడటంపై దృష్టి కేంద్రీకరిస్తామని ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎలాన్ మస్క్ ప్రకటించారు.

2023లో చేపట్టే యాత్రకు వాడే బీఎఫ్‌ఆర్ ఇంకా తయారీ దశలోనే ఉంది.

ఇది తొమ్మిది మీటర్ల వ్యాసంతో 118 మీటర్ల ఎత్తు ఉండొచ్చని అంచనా. ఫాల్కన్ హెవీ రాకెట్‌ ఎత్తు 70 మీటర్లే. భూ దిగువ కక్ష్యలోకి 150 టన్నుల బరువును తీసుకెళ్లగల సామర్థ్యం బీఎఫ్‌ఆర్‌కు ఉంటుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)