ఏలియన్స్ ఉన్నాయా? లేవా?: అన్వేషణకు నాసా భారీ టెలిస్కోప్

ఫొటో సోర్స్, NASA
గ్రహాంతర జీవుల అన్వేషణలో విప్లవాత్మక మార్పులను తీసుకురాగల ఒక భారీ ఇన్‌ఫ్రారెడ్ టెలిస్కోప్‌ను అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా) అంతరిక్షంలోకి పంపనుంది. భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఈ టెలిస్కోప్ పని చేస్తుంది.
దీని పేరు- 'జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్(జేడబ్ల్యూఎస్‌టీ)'. దీనిని నాసా 2021లో ప్రయోగించనుంది.
విశ్వం తొలి దశలో ఏర్పడిన పాలపుంతలను(గెలాక్సీలను) కూడా పరిశీలించగల సామర్థ్యం దీనికి ఉందని నాసా చెబుతోంది.
విశ్వం పరిణామక్రమంలోని ప్రతి దశను ఈ టెలిస్కోప్ అధ్యయనం చేస్తుంది. ప్రాణుల మనుగడకు అనువైన భూమి లాంటి గ్రహాలతో కూడిన సౌరవ్యవస్థల ఆవిర్భావం, మన సౌరవ్యవస్థ పరిణామక్రమంపై ఇది అధ్యయనం జరుపుతుంది.
ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన హబుల్ టెలిస్కోప్ స్థానంలో నాసా ఈ టెలిస్కోప్‌ను వినియోగించనుంది.

శక్తిమంతమైన కెమెరాలు
జేడబ్ల్యూఎస్‌టీలో 6.5 మీటర్ల ప్రైమరీ మిర్రర్, అత్యంత శక్తిమంతమైన కెమెరాలు ఉంటాయి.
విశ్వంలో గ్రహాంతర జీవుల ఆనవాళ్లు ఏవైనా ఉంటే ఇది పసిగట్టగలదని పరిశోధకులు చెబుతున్నారు.
సూర్యుడికి సమీపంలోని ఇతర నక్షత్రాల చుట్టూ పరిభ్రమించే గ్రహాల్లో వాతావరణం(అట్మాస్పియర్) ఏవైనా జీవుల ఉనికి వల్ల ప్రభావితమవుతోందా అనేది ఈ టెలిస్కోప్ గుర్తిస్తుంది.
సమీప నక్షత్రాల చుట్టూ తిరిగే గ్రహాల్లో జీవం ఆనవాళ్ల(బయోసిగ్నేచర్స్)ను ఈ టెలిస్కోప్ గుర్తించగలదా, లేదా అన్నది యూనివర్శిటీ ఆఫ్ వాషింగ్టన్‌కు చెందిన ఖగోళ శాస్త్రవేత్త జాషువా క్రిషన్‌సెన్-టాటన్, ఆయన బృందం సభ్యులు అధ్యయనం చేశారు.
జీవం ఆనవాళ్లను గుర్తించే పనిని రానున్న కొన్నేళ్లలో చేపట్టగలమని జాషువా క్రిషన్‌సెన్-టాటన్ చెప్పారు.

గ్రహం వాతావరణంలో మార్పులే ప్రాతిపదిక
ఏదైనా గ్రహంపై జీవం ఉంటే అక్కడి వాతావరణంలో రసాయనిక మార్పులు ఉంటాయనే ప్రాతిపదికపై ఈ ప్రయోగం ఆధారపడి ఉంది. ఈ అసమతౌల్యాన్ని గుర్తించగల సామర్థ్యం ఈ అధునాతన టెలిస్కోప్‌కు ఉందని పరిశోధకులు చెబుతున్నారు.
జీవం ఉనికి వల్ల గ్రహాల వాతావరణంలో మార్పులు సంభవిస్తాయనే సూత్రీకరణను ప్రఖ్యాత శాస్త్రవేత్తలు జేమ్స్ లవ్‌లాక్, కార్ల్ సాగన్ విస్త్రృత ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు.
ఉదాహరణకు భూమినే తీసుకుందాం. భూమిపై ఉన్న సకల జీవరాశి నశించిపోతే, ఇక్కడ ఉండే వాయువులు సహజమైన రసాయనిక చర్యలకు లోనవుతాయి. క్రమంగా భూ వాతావరణంలో మరో భిన్నమైన రసాయన సమ్మేళనం ఏర్పడుతుంది. అంటే- భూవాతావరణం జీవం ఉంటే ఒకలా, లేకపోతే మరోలా ఉంటుంది.
గ్రహాంతర జీవుల అన్వేషణలో ఆక్సిజన్ లేదా ఓజోన్ ఆనవాళ్ల గుర్తింపును చక్కటి మార్గంగా పరిశోధకులు చాలా కాలంగా భావిస్తూ వస్తున్నారు. భూమి మీదున్న ప్రాణులకు వర్తించే జీవశాస్త్ర నియమాలే ఇతర గ్రహాల్లోని జీవులకూ వర్తిస్తాయనే భావన ప్రాతిపదికగా ఈ అంశంపై పరిశోధనలు జరుగుతూ వస్తున్నాయి. అయితే ఈ నియమాలకు అనుగుణంగానే గ్రహాంతర జీవులు ఉండాలనేమీ లేదు. అందువల్ల ఏదైనా గ్రహం సాధారణ వాతావరణంలో రసాయనిక అసమతౌల్యం ఏర్పడిందా, దీనిని చూపించే ఆనవాళ్లేమైనా ఉన్నాయా అన్నది గుర్తించడం గ్రహాంతర జీవుల అన్వేషణలో కీలకం అవుతుంది. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఈ పని చేసిపెడుతుంది.

ఫొటో సోర్స్, HIMAWARI/JMA/@SIMON_SAT
ఈ టెలిస్కోప్ అందించే సమాచారం ప్రపంచవ్యాప్తంగా వేల మంది ఖగోళ శాస్త్రవేత్తలకు పరిశోధనల్లో ఉపయోగపడుతుంది.
ఎలా గుర్తిస్తుంది?
నక్షత్రం, టెలిస్కోప్ మధ్య ఏదైనా గ్రహం వెళ్లినప్పుడు దానిపై పడే కాంతి ఆధారంగా గ్రహం వాతావరణంలో వాయువుల తీరును టెలిస్కోప్ అంచనా వేస్తుంది. అక్కడ ఉండే వాయువులను, వాటి మిశ్రమాన్ని బట్టి కాంతి రంగు, తరంగదైర్ఘ్యం(వేవ్‌లెంగ్త్)లలో మార్పులు ఉంటాయి. ఈ మార్పులే ప్రాతిపదికగా గ్రహంలో ఏ రసాయనం ఎంత మోతాదులో ఉందో టెలిస్కోప్ అంచనా వేస్తుంది.
మార్పులకు జీవులే కారణమని ఎలా చెబుతారు?
అగ్నిపర్వతాలు బద్దలవ్వడం లాంటి ఘటనల వల్ల కూడా గ్రహం వాతావరణంలో అసమతౌల్యం ఏర్పడొచ్చు. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అందించే సమాచారాన్ని శాస్త్రవేత్తలు పూర్తిగా విశ్లేషించి, గ్రహం వాతావరణ మార్పులకు కారణాలను గుర్తిస్తారు. అవి జీవుల ఉనికి వల్ల సంభవించిన మార్పులా, లేక ఇతర కారణాల వల్ల ఏర్పడిన మార్పులా అన్నది నిర్ధరిస్తారు.
జీవుల వల్లే అసమతౌల్యం ఏర్పడినట్లు తేలితేనే వాటి ఉనికి గురించి ప్రకటన చేస్తారని ఖగోళ శాస్త్రవేత్త జాషువా క్రిషన్‌సెన్-టాటన్ తెలిపారు.
ఈ ప్రాజెక్టుపై నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ(ఈఎస్‌ఏ), కెనడియన్ స్పేస్ ఏజెన్సీ(సీఎస్‌ఏ) కలిసి పనిచేస్తున్నాయి.
వెయ్యి కోట్ల డాలర్లు
ముందుగా అనుకున్న ప్రకారమైతే 2007లోనే జేడబ్ల్యూఎస్‌టీ ప్రయోగం జరగాల్సి ఉంది. 2011లో ప్రాజెక్టును అమెరికా ప్రభుత్వం దాదాపు రద్దు చేసే పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ రద్దు కాలేదు. ప్రాజెక్టు వ్యయం వెయ్యి కోట్ల డాలర్లని అంచనా. వ్యయాన్ని మొదట్లో వంద కోట్లుగా అంచనా వేయగా, తర్వాత అది పదింతలు అయ్యింది.
ఇవి కూడా చదవండి:
- స్వీడన్ ఎన్నికలు: యూరప్ జాతీయవాద ధోరణులకు అద్దం పట్టిన ఫలితాలు
- ‘పక్షులకు గూళ్లు కట్టాల్సిన బాధ్యత మనదే’
- C/o కంచరపాలెం: తెలుగు సినిమా ఎదుగుతోంది
- ఆరోగ్యం: ప్రజలంతా స్మార్ట్ డ్రగ్స్ తీసుకుంటే ఏమవుతుంది?
- పెట్రోల్ జీఎస్టీ పరిధిలోకి వస్తే ధర పెరుగుతుందా? తగ్గుతుందా?
- కొత్తగా పుట్టిన గ్రహం.. ఫొటోకి చిక్కింది
- ఓషో వల్లనే రాజీవ్ రాజకీయాల్లోకి వచ్చారా?
- అభిప్రాయం: కాంగ్రెస్‌ను ‘పీపీపీ’గా మార్చేసిన మోదీ-షా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








