అభిప్రాయం: కాంగ్రెస్‌ను ‘పీపీపీ’గా మార్చేసిన మోదీ-షా

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రాజేశ్ ప్రియదర్శి
- హోదా, డిజిటల్ ఎడిటర్, బీబీసీ హిందీ
విజయానికి ప్రత్యామ్నాయం లేదు. ప్రజాస్వామ్యంలో విజేతకే అన్నీ దక్కుతాయి. విజేత అన్నీ సక్రమంగా చేశాడనీ, పరాజితుడు ఏదీ సరిగా చేయలేదని భావిస్తారు.
ప్రస్తుతం అంకెలను, విశ్లేషణలను ఎవరూ పట్టించుకోవడం లేదు. ప్రతి వ్యూహం, ప్రతి వాదన వెనుకా మోదీ కరిష్మా పని చేస్తోంది. కన్నడనాట ఫలితాలను బట్టి చూస్తే కర్ణాటక ప్రజలు నెహ్రూ నిజంగానే జనరల్ తిమ్మయ్య, ఫీల్డ్ మార్షల్ కరియప్పలను అవమానించారని భావించి ఉండవచ్చు.
కొన్ని నెలల క్రితమే చాలా మంది గుజరాత్‌లో మంచి పోటీ ఇచ్చారని రాహుల్ గాంధీని ప్రశంసించారు. అయితే ప్రస్తుతం కర్ణాటకలో మోదీ-షాల ముందు రాహుల్ ప్రదర్శన సరిపోలేదేమో అనిపిస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
ఉచ్ఛదశలో మోదీ పాపులారిటీ
కర్ణాటకలో కాంగ్రెస్ పట్ల ప్రజలకు వ్యతిరేకత పెరగడానికి, బీజేపీ వైపు మొగ్గు చూపడానికి కారణాలను అర్థం చేసుకోవాలంటే పరిస్థితులను లోతుగా విశ్లేషించాలి.
ప్రస్తుతం మోదీ పాపులారిటీ ఉచ్ఛదశలో ఉన్నది అన్నది స్పష్టం. ఆయన పేరు మీదనే ఎన్నికల్లో పోటీ చేయడం, గెలుపు సాధించడం జరుగుతోంది.
అంతే కాకుండా బీజేపీ ప్రచార వ్యవస్థ.. ఎన్నికల సిబ్బంది, కాంగ్రెస్ కన్నా బాగా పని చేశాయి. ప్రజలు ఇంకా దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని విశ్వసిస్తున్నారు.
అందువల్ల మోదీ పాపులారిటీ తగ్గుతోంది, దక్షిణాది ఉత్తరాదిలా కాదు అన్నవారంతా పునరాలోచించుకోవాలి.

ఫొటో సోర్స్, Getty Images
‘పీపీపీ’గా కాంగ్రెస్
మోదీ కర్ణాటకలో 20కి పైగా ర్యాలీలలో పాల్గొన్నారు. నెహ్రూ కార్డును ప్లే చేశారు. అన్ని పాచికలనూ ఉపయోగించారు.
కర్ణాటక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ 'పీపీపీ'గా, అంటే పంజాబ్, పుదుచ్చేరి పరివార్‌గా మారిపోతుందని మోదీ అన్నారు.
ఈ ఎన్నికలతో ఒక విషయం స్పష్టమైంది. ఏ త్రిముఖ పోటీలోనైనా మోదీ-షా ద్వయం ముందంజలో ఉంటారు. బీజేపీతో ఎవరు పోటీ పడాలన్నా వారు ఏకం కాక తప్పదు.

ఫొటో సోర్స్, Getty Images
రాహుల్ నాయకత్వాన్ని అంగీకరిస్తారా?
ఈ ఫలితాలు కాంగ్రెస్ మితిమీరిన ఆత్మవిశ్వాసానికి గట్టి ఎదురుదెబ్బ. చిన్న చిన్న రాజకీయ పార్టీలు తమ తమ స్వార్థం కారణంగా దూరంగా ఉన్నంత కాలం, బీజేపీకి ఎదురు ఉండదు. ఇప్పుడు దేశంలోని రాజకీయ పక్షాలన్నీ బీజేపీ ముందు చిన్నవే.
కర్ణాటకలో కాంగ్రెస్ సీట్లు తగ్గిపోవడం రాహుల్ గాంధీకి ఎదురుదెబ్బే. దీంతో 2019 ఎన్నికలలో విపక్షాలకు నేతృత్వం వహించే సామర్థ్యం రాహుల్‌కు ఉందా అని సందేహాలు తలెత్తే అవకాశం ఉంది. మమతా బెనర్జీ, శరద్ పవార్ లాంటి వారు రాహుల్ నాయకత్వాన్ని అంగీకరిస్తారా?

ఫొటో సోర్స్, Getty Images
కర్ణాటకలో ఎక్కువ సీట్లు సాధించడం ద్వారా రాజస్థాన్, మధ్యప్రదేశ్ , ఛత్తీస్‌గఢ్‌లను బీజేపీ నుంచి లాక్కోవాలని భావించిన కాంగ్రెస్ ఆత్మవిశ్వాసాన్ని మోదీ-షా ద్వయం దెబ్బ తీసింది.
ఈ ఫలితాలను పరిశీలిస్తే, రాజకీయాల్లో దేనినీ ఖచ్చితంగా చెప్పలేం. క్రికెట్ లాగే ఇక్కడ కూడా సమీకరణలు ఎప్పుడైనా మారొచ్చు. 2019 ఎంతో దూరంలో లేదు.
కర్ణాటక ఫలితాలు ఎన్నో పాఠాలను చెబుతున్నాయి. కానీ వాటిని స్వీకరిస్తారా లేదా అనేదే ప్రశ్న.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








