స్వీడన్ ఎన్నికలు: యూరప్ జాతీయవాద ధోరణులకు అద్దం పట్టిన ఫలితాలు

ఫొటో సోర్స్, AFP
ఉత్తర ఐరోపాలోని స్వీడన్ సార్వత్రిక ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు దాదాపు పూర్తయింది. రెండు ప్రధాన పక్షాలకు చెరి 40 శాతానికి పైగా, దాదాపు సమానంగా ఓట్లు వచ్చాయి. వలస వ్యతిరేక జాతీయవాద పార్టీ అయిన స్వీడన్ డెమోక్రాట్స్(ఎస్‌డీ) గత ఎన్నికల్లో 12.9గా ఉన్న తమ ఓట్ల శాతాన్ని సుమారు 18కి పెంచుకుంది.
స్వీడన్ డెమోక్రాట్స్‌తో కలిసి పనిచేసేందుకు రెండు ప్రధాన పక్షాలూ అయిష్టత వ్యక్తంచేశాయి. స్వీడన్ డెమోక్రాట్స్ నాయకుడు జిమ్మీ అకెస్సన్ మాత్రం తాము అన్ని పక్షాలతో చర్చలు జరుపుతామని పార్టీ ర్యాలీలో చెప్పారు.
ఈ పరిస్థితుల నేపథ్యంలో, సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఆయా పక్షాలు సుదీర్ఘ ప్రయత్నాలు చేయక తప్పదనిపిస్తోంది.

పాలక పక్షానికి తగ్గిన ఓట్లు
మధ్యేవాద-మితవాద ప్రత్యర్థి 'అలయన్స్'తో పోలిస్తే మధ్యేవాద-వామపక్షమైన పాలక కూటమి కాస్త పైచేయి సాధించింది. గతంతో పోలిస్తే మాత్రం పాలక పక్షానికి ఓట్లు తగ్గాయి.
స్వీడన్ నైష్పత్తిక ప్రాతినిధ్య విధానాన్ని అనుసరిస్తుంది. దాదాపు ఓట్ల శాతానికి అనుగుణంగానే పార్టీల సీట్ల సంఖ్యను నిర్ణయిస్తారు.
పార్లమెంటులో సీట్ల సంఖ్యను మెరుగుపరచుకుంటామని, తమ ప్రాబల్యాన్ని పెంచుకుంటామని, దేశంలో రానున్న వారాలు, నెలలు, సంవత్సరాల్లో సంభవించబోయే పరిణామాలను తామే శాసిస్తామని స్వీడన్ డెమోక్రాట్స్ నాయకుడు జిమ్మీ అకెస్సన్ వ్యాఖ్యానించారు.
ప్రస్తుత సంకీర్ణ ప్రభుత్వంలో సోషల్ డెమోక్రాట్స్, గ్రీన్ పార్టీ ఉన్నాయి. పార్లమెంటులో ఈ కూటమికి లెఫ్ట్ పార్టీ మద్దతు ఉంది. సోషల్ డెమోక్రాట్స్‌కు నాయకత్వం వహిస్తున్న ప్రధాని స్టెఫాన్ లోఫ్‌వెన్ ఈ కూటమికి సారథి. దీనికి 40.6 శాతం ఓట్లు వచ్చాయి.
ప్రధాన ప్రతిపక్షం 'అలయన్స్'లో నాలుగు పార్టీలు ఉన్నాయి. 'మాడరేట్స్' సారథి అయిన ఉల్ఫ్ క్రిస్టర్‌సన్ ఈ కూటమి ప్రధాని అభ్యర్థి. ఈ కూటమికి 403. శాతం ఓట్లు పడ్డాయి.
సోషల్ డెమోక్రాట్స్, మాడరేట్స్ రెండు పార్టీలకూ ఈ ఎన్నికల్లో ఓట్లు తగ్గాయి. స్వీడన్ డెమోక్రాట్స్‌తోపాటు చిన్న పార్టీలకు ఓట్లు పెరిగాయి.
వలసలు, వాతావరణ మార్పులు, ఇతర అంశాలు ప్రధానాంశాలుగా ప్రచారం సాగింది.

ఫొటో సోర్స్, AFP
స్వీడన్ డెమోక్రాట్స్ జాత్యహంకారి: ప్రధాని లోఫ్‌వెన్
వలసలను నిరోధించేలా కఠిన నిబంధనలు అమలు చేయాలని స్వీడన్ డెమోక్రాట్స్ డిమాండ్ చేస్తోంది. ఈ పార్టీని 'జాత్యహంకారి(రేసిస్ట్)' అని ప్రధాని లోఫ్‌వెన్ ఆరోపించారు.
రాజకీయ విధానాలపరంగా స్వీడన్‌లో సంక్లిష్టత ఉన్నప్పటికీ, తలసరి లెక్క ప్రకారం చూస్తే ఐరోపాలోకెల్లా అత్యధికంగా వలసదారులను స్వీకరించిన దేశం స్వీడనే.
సోషల్ డెమోక్రాట్స్ మైనారిటీ అనుకూల విధానాలు అనుసరిస్తారు. బహుళ సంస్కృతుల సమ్మేళనాన్ని స్వీడన్ డెమోక్రాట్స్ ఆహ్వానించరు.
స్వీడన్ డెమోక్రాట్స్ 2010లో పార్లమెంటులో తొలిసారిగా అడుగు పెట్టింది.
యూరోపియన్ యూనియన్ నుంచి స్వీడన్ బయటకు వచ్చేయాలని స్వీడన్ డెమోక్రాట్స్ డిమాండ్ చేస్తోంది. ఈయూ నుంచి స్వీడన్ నిష్క్రమణకు 'స్వెగ్జిట్(Swexit)' రెఫరెండం నిర్వహించాలని ప్రతిపాదిస్తోంది. ఈ ప్రతిపాదనను మధ్యేవాద పార్టీలు గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి.
ఐరోపా: జాతీయవాద పార్టీలకు పెరుగుతున్న ఆదరణ
ఇటీవలి సంవత్సరాల్లో ఐరోపావ్యాప్తంగా జాతీయవాద/మితవాద రాజకీయ పార్టీలు ఎన్నికల్లో కీలక విజయాలు సాధించాయి. కొన్ని దేశాల్లో అధికార పీఠమెక్కాయి. మరికొన్ని దేశాల్లో ప్రధాన ప్రతిపక్షంగా నిలిచాయి. కొన్ని దేశాల్లో రాజకీయ ప్రాబల్యమే లేని పక్షాలు మధ్యేవాద నాయకులను జాతీయవాద విధానాలను అనుసరించాల్సిందిగా ఒత్తిడి చేస్తున్నాయి.
ఆర్థిక సంక్షోభాలు, వలసల సంక్షోభాల నేపథ్యంలో పాలక పక్షాలపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత జాతీయవాద పార్టీల ముందంజకు కొంత వరకు కారణం కాగా, చాలా కాలంగా ప్రపంచీకరణ పట్ల ప్రజల్లో గూడుకట్టుకొన్న భయం, జాతీయ గుర్తింపును కోల్పోతామేమోననే ఆందోళన కూడా ఈ పరిస్థితికి దారితీశాయి.
ఐరోపా దేశాల్లో వేర్వేరు రాజకీయ పార్టీలు వేర్వేరు విధానాలను అనుసరిస్తున్నప్పటికీ, స్థూలంగా చూస్తే అన్ని జాతీయవాద పార్టీల మధ్య కొన్ని సారూప్యాలు కనిపిస్తున్నాయి. ముస్లింల పట్ల వ్యతిరేకత, వలసల పట్ల వ్యతిరేకత, యూరోపియన్ యూనియన్ పట్ల వ్యతిరేకత, ఇతర అంశాలు ఇందులో ఇమిడి ఉన్నాయి.
స్వీడన్ ఎన్నికల్లో జాతీయవాద పార్టీకి ఓట్ల శాతం పెరగడం మరో కీలక పరిణామం. ఈ నేపథ్యంలో, ఐరోపాలోని వివిధ దేశాల్లో జాతీయవాద వ్యాప్తిపై బీబీసీ తెలుగు జూన్‌లో పబ్లిష్ చేసిన కథనంలోని అంశాలు మీ కోసం..
ఇటలీ
ఇటలీలో రాజ్య వ్యవస్థను వ్యతిరేకించే ఫైవ్ స్టార్ మూవ్‌మెంట్, మితవాద లీగ్ కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.
ఇటలీ ఎన్నికల్లో స్పష్టమైన ఫలితం రాకపోవడంతో కొన్ని నెలలపాటు అనిశ్చితి కొనసాగింది. చివరకు, ప్రజాకర్షక విధానాలను అనుసరించే రెండు పార్టీలు జట్టు కట్టి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. వీటిలో ఫైవ్ స్టార్ మూవ్‌మెంట్, మితవాద లీగ్ ఉన్నాయి.
2008 ఆర్థిక సంక్షోభంతో ఇటలీ బాగా దెబ్బతింది.
ఉత్తర ఆఫ్రికా నుంచి వలసలకు ఇటలీ ప్రధాన గమ్యస్థానంగా మారిపోయింది.
లీగ్ పాత పేరు 'నార్తర్న్ లీగ్'. ఈ పార్టీకి మొదట్లో ఇటలీ ఉత్తర ప్రాంతంతో ప్రత్యేక దేశం ఏర్పాటే లక్ష్యంగా ఉండేది. తర్వాత దృష్టి మారింది. ఒకప్పుడు తాము వేరుపడాలనుకున్న దేశానికే ఇప్పుడు ఈ పార్టీ నాయకత్వం వహిస్తోంది.
ధ్రువపత్రాలు లేని వలసదారులను వారి స్వదేశాల్లో వదిలేసి రావడం లాంటి అంశాలు పాలక సంకీర్ణ కూటమి ఉమ్మడి ప్రణాళికలో ఉన్నాయి.
దక్షిణ ఇటలీలోని సిసిలీ ద్వీపాన్ని సందర్శించిన సందర్భంగా ఇటలీ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి, లీగ్ నాయకుడు మాటియో సాల్విని మాట్లాడుతూ- సిసిలీ ద్వీపం ఇక ఎంత మాత్రం శరణార్థి శిబిరం కాదని వ్యాఖ్యానించారు. ఈ ద్వీపం మధ్యదరా సముద్రంలో ఉంటుంది.
ఇటలీలోని రెండు అధికార పార్టీలూ యూరో కరెన్సీని వ్యతిరేకించేవే.

ఫొటో సోర్స్, Getty Images
జర్మనీ
జర్మనీలో మితవాద పార్టీ 'ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీ' ఐదేళ్ల క్రితం పుట్టింది. నిరుడు ఫెడరల్ పార్లమెంట్‌లో తొలిసారి అడుగు పెట్టింది. ఆది నుంచి యూరో వ్యతిరేక పార్టీగా ఉన్న ఈ పార్టీ, వలసలకు వ్యతిరేకంగా కఠిన విధానాలు అమల్లోకి వచ్చేలా ప్రయత్నిస్తోంది. ఇస్లాం ప్రభావంపై కొందరు ప్రజల్లో ఉన్న ఆందోళనలను ఈ పార్టీ తనకు అనుకూలంగా మలచుకొంది. నాజీల దురాగతాల తీవ్రతను తగ్గించి చూపేందుకు యత్నిస్తున్నారనే ఆరోపణలు ఈ పార్టీల నాయకులపై ఉన్నాయి.
శరణార్థుల పట్ల జర్మనీ ఛాన్సలర్ ఏంగెలా మెర్కెల్ చాలా సానుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఆమె వలస విధానాల పట్ల ప్రజల్లో అసంతృప్తి వల్లే ఈ పార్టీ విజయం సాధించిందనే విశ్లేషణలు ఉన్నాయి.
వలసల సంక్షోభం తారస్థాయిలో ఉన్నప్పుడు మెర్కెల్ సరిహద్దు నియంత్రణలను తొలగించారు. 2015లో సుమారు 10 లక్షల మంది శరణార్థులు జర్మనీలోకి ప్రవేశించారు. వీరిలో ఎక్కువ మంది సిరియా, ఇరాక్, అఫ్గానిస్థాన్‌ల నుంచి వచ్చిన ముస్లింలు.
మెర్కెల్ నాయకత్వంలోని సీడీయూ/సీఎస్‌యూ కూటమికి దాదాపు గత 70 ఏళ్లలో ఎన్నడూ ఎదురుకాని ఫలితాలు గత ఏడాది ఎదురయ్యాయి. అయినప్పటికీ ఆమె నాలుగోసారి ఛాన్సలర్ అయ్యారు. ఆమె ఎస్‌పీడీ పార్టీ మద్దతు తీసుకున్నారు.
ఫెడరల్ పార్లమెంటులో 'ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీ' అతిపెద్ద ప్రతిపక్షంగా ఉంది. ఈ పార్టీ విజయం తర్వాత మెర్కెల్ స్వరంలో మార్పు వచ్చింది. 2015లో మానవీయ కోణంలో ఆలోచించి పెద్దయెత్తున వలసలను అనుమతించామని, అలాంటి మినహాయింపు ఇకపై ఇవ్వబోమని నాలుగోసారి ఛాన్సలర్ అయిన తర్వాత మెర్కెల్ వ్యాఖ్యానించారు. సరిహద్దు భద్రత పెంచుతామని చెప్పారు. దేశంలోకి నిబంధనలకు విరుద్ధంగా వచ్చేవారిని తిప్పి పంపుతామని, ఈ విషయంలో మరింత కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు.
ఆస్ట్రియా
జర్మనీ పొరుగు దేశం ఆస్ట్రియాలో మితవాద 'ఫ్రీడం పార్టీ', ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీ కన్నా గొప్ప విజయాన్ని సాధించింది. కన్జర్వేటివ్ నాయకుడైన ఛాన్సలర్ సెబాస్టియన్ కుర్జ్ సంకీర్ణ ప్రభుత్వంలో ఫ్రీడం పార్టీ జూనియర్ భాగస్వామి అయ్యింది.
ఇంతకుముందు వరకు ఆస్ట్రియా రాజకీయాల్లో వామపక్ష మధ్యేవాద సోషల్ డెమోక్రాట్లు, కన్జర్వేటివ్‌లే బలంగా ఉంటూ వచ్చారు.
అధ్యక్ష ఎన్నికల్లో ఫ్రీడం పార్టీకి తృటిలో విజయం చేజారింది. ఈ ఎన్నికల్లో రెండు ప్రధాన మధ్యేవాద పార్టీలు ఎన్నికల్లో రెండో దశకు కూడా వెళ్లలేకపోయాయి.
ఆస్ట్రియాలోనూ వలసల సమస్యే ఫ్రీడం పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించింది.
వలసలపై కఠిన వైఖరి అవలంబిస్తామని ఛాన్సలర్ కుర్జ్ ప్రకటించారు. తమ విధానాలను ఆయన కాపీ కొడుతున్నారని ఫ్రీడం పార్టీ ఎన్నికల ప్రచారంలో ఆరోపించింది.
పాఠశాలల్లో పదేళ్లలోపు బాలికలు తలకు స్కార్ఫ్‌లు కట్టుకోవడాన్ని నిషేధించాలని, వలసదారుల ఫోన్లు తీసేసుకోవాలనే ప్రతిపాదనలు ఆస్ట్రియాలో ఉన్నాయి.

ఫొటో సోర్స్, AFP/Getty Images
ఫ్రాన్స్
మితవాద 'నేషనల్ ఫ్రంట్'ను ఫ్రాన్స్ ప్రధాన స్రవంతికి దగ్గర చేసేందుకు పార్టీ నాయకురాలు మరీన్ లీపెన్ శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. అయితే 2017 మేలో అధ్యక్ష ఎన్నికల్లో ఎమాన్యుయెల్ మేక్రాన్ చేతిలో ఆమె ఘోరంగా ఓడిపోయారు.
ఐరోపా యూనియన్(ఈయూ)కు లీపెన్ బద్ధ వ్యతిరేకి. యూరో కరెన్సీని ఆమె వ్యతిరేకిస్తారు. భారీ వలసలకు ఈయూనే కారణమని ఆమె ఆరోపిస్తుంటారు.
2010లో ఒక సందర్భంలో నేషనల్ ఫ్రంట్ మద్దతుదారులను ఉద్దేశించి లీపెన్ మాట్లాడుతూ- వీధుల్లో ముస్లింలు ప్రార్థన చేసే దృశ్యం రెండో ప్రపంచ యుద్ధంలో నాజీల దురాక్రమణను తలపిస్తుందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
అధ్యక్ష ఎన్నికల్లో పరాజయం తర్వాత పార్లమెంటరీ ఎన్నికల్లోనూ నేషనల్ ఫ్రంట్‌కు ఓటమి తప్పలేదు. పార్లమెంటరీ ఎన్నికల్లో మేక్రాన్ ప్రాతినిధ్యం వహించే పార్టీ ఘన విజయం సాధించగా, నేషనల్ ఫ్రంట్ కొన్ని సీట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
నేషనల్ ఫ్రంట్ పేరును పార్టీ నాయకత్వం ఇటీవలే 'నేషనల్ ర్యాలీ'గా మార్చింది. ఇతర పార్టీలతో సంకీర్ణ కూటముల ఏర్పాటు చేసుకొని, అధికారంలోకి వస్తామని ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, Reuters
హంగేరీ
ఏప్రిల్‌లో జరిగిన ఎన్నికల్లో ప్రధానమంత్రి విక్టర్ ఓర్బాన్ ఘన విజయం సాధించి మూడోసారి అధికార పీఠాన్ని దక్కించుకున్నారు. వలసలే ఈ ఎన్నికల్లో ప్రధానాంశం. హంగేరియన్లకు తమను తాము రక్షించుకునేందుకు, హంగేరీని రక్షించేందుకు తన విజయంతో ఒక అవకాశం లభించిందని ఆయన వ్యాఖ్యానించారు.
ముస్లిం వలసదారుల నుంచి హంగేరీకి, ఐరోపాకు తానే రక్షకుడినని ఓర్బాన్ చాలా కాలంగా చెప్పకొంటున్నారు. భిన్న రకాల జనాభా కారణంగా ఐరోపాకు ఒక గుర్తింపు అంటూ లేకుండా పోయే ముప్పుందని ఆయన 'హెచ్చరించారు'.
కోటా విధానం ప్రకారం అన్ని దేశాలూ వలసదారులను స్వీకరించేలా చూసేందుకు ఈయూ సన్నాహాలు చేస్తోంది. వీటిని మధ్య ఐరోపాలోని హంగేరీ, పోలండ్, చెక్ రిపబ్లిక్, స్లొవేకియా వ్యతిరేకిస్తున్నాయి. ఈ నాలుగు దేశాల నాయకుల్లో ఈ వ్యతిరేకతను ఓర్బాన్ అత్యంత తీవ్రస్థాయిలో వ్యక్తంచేస్తున్నారు.
స్లొవేనియా
స్లొవేనియాలో ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వలసదారుల వ్యతిరేక 'స్లొవేనియన్ డెమొక్రటిక్ పార్టీ(ఎస్‌డీఎస్)' సొంతంగా మెజారిటీ తెచ్చుకోలేకపోయినప్పటికీ అతిపెద్ద పార్టీగా అవతరించింది.
మాజీ ప్రధాని జనేజ్ జాన్సా సారథ్యంలోని ఈ పార్టీ, వలసదారుల స్వీకరణకు కోటా విధానాన్ని వ్యతిరేకిస్తోంది. స్లొవేకియాకు స్లొవేకియన్ల శ్రేయస్సు, భద్రతే ప్రధానమని ఆయన చెబుతున్నారు.
ఎన్నికల ప్రచార సమయంలో వలసలకు వ్యతిరేకంగా ఆయన హంగేరీ నాయకుడు ఓర్బాన్‌తో జట్టు కట్టారు. వలసదారుల గురించి స్థానిక ప్రజల్లో భయాందోళన కలిగేలా మాట్లాడారు.
నిరుడు ఆశ్రయం కోరుతూ వచ్చిన దరఖాస్తుల్లో కేవలం 150 దరఖాస్తులనే స్లొవేనియా ఆమోదించింది. వలసల సంక్షోభ సమయంలో వలసదారులు ఎక్కువ మంది ఆగ్నేయ ఐరోపాలోని బాల్కన్ ద్వీపకల్ప ప్రాంతం, మధ్య ఐరోపా మీదుగా పాశ్చాత్య దేశాల వైపు వెళ్లారు.
పోలండ్
వలసల సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో ఈయూ తీరును తప్పుబట్టిన కన్జర్వేటివ్ రాజకీయ పక్షం 'లా అండ్ జస్టిస్ పార్టీ' 2015 ఎన్నికల్లో భారీ విజయాన్ని సాధించింది.
ఈ పార్టీ విధానాలు కొన్ని ఈయూను ఆందోళనకు గురిచేశాయి.
ప్రభుత్వ మీడియాను పూర్తిగా నియంత్రణలోకి తీసుకోవడం, జడ్జిల తొలగింపు, నియామకానికి ప్రభుత్వానికి తిరుగులేని అధికారాన్ని కల్పించేలా న్యాయ సంస్కరణలు తీసుకురావడం, ఇతర అంశాలు ఈ విధానాల్లో ఉన్నాయి.
శరణార్థుల కోటాలు లాంటి అంశాల్లో పోలండ్, హంగేరీ పరస్పరం మద్దతు తెలుపుకున్నాయి.
ఐరోపాలోని మరికొన్ని దేశాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే..
డెన్మార్క్: ఐరోపాలో అత్యంత కఠినమైన వలస నిబంధనలను అమలు చేస్తున్న దేశాల్లో డెన్మార్క్ ఒకటి. పార్లమెంటులో రెండో అతిపెద్ద పార్టీ అయిన మితవాద 'డానిష్ పీపుల్స్ పార్టీ' ప్రభావం ఏ స్థాయిలో ఉందో ఈ నిబంధనలు సూచిస్తున్నాయి.
భవిష్యత్తులో తమ దేశంపై వలసల ఒత్తిడి తగ్గాలంటే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో జనాభా నియంత్రణను బాగా పాటించాల్సి ఉందని, ఇందుకు ఆర్థిక సాయాన్ని పెంచుతామని డెన్మార్క్ ప్రకటించింది. దీనిని బట్టి వలసలపై డెన్మార్క్ వైఖరి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
చెక్ రిపబ్లిక్: వలసలపై తాము అనుసరిస్తున్న విధానాలే ఐరోపాలోని ఇతర దేశాల్లోనూ ప్రజాదరణ పొందుతున్నాయని ఇటీవల చెక్ రిపబ్లక్ ప్రధానిగా ఎన్నికైన ఆండ్రెజ్ బాబిస్ చెబుతున్నారు. వలసలపై మధ్య ఐరోపా దేశాలైన చెక్ రిపబ్లిక్, పోలండ్, హంగేరీ, స్లొవేకియా అనుసరిస్తున్న విధానాలు ఇతర దేశాల్లో వ్యాప్తి చెందుతున్నాయనేందుకు ఇటీవల ఇటలీ, స్లొవేనియాల్లో జరిగిన ఎన్నికలే నిదర్శనమని వ్యాఖ్యానిస్తున్నారు.
ఫిన్‌లాండ్: 2015 ఎన్నికల్లో మితవాద 'ఫిన్స్ పార్టీ' రెండో స్థానంలో నిలిచింది. అయితే ఈ ఏడాది అధ్యక్ష ఎన్నికల్లో పార్టీ అభ్యర్థికి కేవలం 6.9 శాతం ఓట్లే పడ్డాయి.
నెదర్లాండ్స్: నిరుడు నెదర్లాండ్స్‌లో జరిగిన ఎన్నికల్లో గీర్ట్ వైల్డర్స్ నాయకత్వంలోని వలసల వ్యతిరేక 'ఫ్రీడమ్ పార్టీ' విజయం సాధిస్తుందని పోలింగ్‌కు ముందు భావించారు. అయితే ఆ పార్టీ రెండో స్థానంలో నిలిచింది. గతంతో పోలిస్తే ఈ పార్టీ సీట్ల సంఖ్యను పెంచుకున్నప్పటికీ, మొదటి స్థానంలో నిలిచిన రాజకీయ పక్షానికి ఈ పార్టీకీ మధ్య అంతరం చాలా ఉంది.
ఇవి కూడా చదవండి:
- మహిళల ఆరోగ్యం: ఇంటిపని చేయడం వ్యాయామం కిందకు వస్తుందా?
- BBC SPECIAL: ఆత్మహత్యకు పాల్పడిన రైతుల పిల్లలకు తల్లి ఒడి లాంటి బడి 'శాంతివన్'
- C/o కంచరపాలెం: తెలుగు సినిమా ఎదుగుతోంది
- ఆరోగ్యం: ఉదయాన్నే ఓ కప్పు స్మార్ట్ డ్రగ్ తీసుకుంటున్నారా?
- తెలంగాణ అసెంబ్లీ రద్దు వెనుక ఉన్నదేమిటి :ఎడిటర్స్ కామెంట్
- శారీరక వ్యాయామం చేయని ప్రతి నలుగురిలో ఒకరికి ముప్పు
- మహిళల ఆరోగ్యం: ఇంటిపని చేయడం వ్యాయామం కిందకు వస్తుందా?
- స్వలింగ సంపర్కం - సెక్షన్ 377: ఈ దేశాల్లో స్వలింగ సంపర్కానికి పాల్పడితే మరణశిక్షే
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








